సంసారీసుఖీ

మన తెలుగు కథలూ డాట్ కామ్ • 👁 28 views
మన తెలుగు .కామ్ లో బహుమతి పొందిన కథ......
                  *సంసారీ సుఖీ*

*నదేవో విద్యతే కాష్ఠే పాషాణే*
*మృణ్మయే పిచ*
*భావోహి విద్యతే దేవ:*
*తస్మాత్ భావోహి కారణం*
"దేవుడు చెక్కలోనూ లేడు,రాతిలోనూ లేడు మట్టిలోనూ లేడు. మన భావనలోనే ఉన్నాడు... దేవుడు అనే మంచి భావనకు
మనసే కారణం కాబట్టి... భావనలు  సక్రమంగా చేయండి.మంచి భావనలు మంచి ఫలితాలనే ఇస్తాయి.
ఈరోజు కి స్వస్తి... " అంటూ ప్రవచనం ముగించి లేచాడు ...త్రిలోచన బ్రహ్మచారి.
"నేను ఐ. ఎ. యస్ కి ప్రిపేర్ అవుతున్నాను నన్ను ఆశీర్వదించండి అయ్యగారూ?! "
అంటూ వచ్చిన ఆమెను తేరిపార చూసి
'విజయీభవ'అని ఆశీర్వదించాడు. త్రిలోచన బ్రహ్మచారి.
ఆయన చూసిన చూపుకు ఆమెకు భయంవేసి.. మరోసారి నమస్కరించి వడివడిగా వెళ్ళిపోయింది.
ఆవయసు ఆడపిల్లలు ఎవరుకనిపించినా త్రిలోచన బ్రహ్మచారికి మనసు కకావికలం ఐపోతుంది.కారణం తెలీనివారికి భయమేగా!
ప్రతి ఊరూ తిరుగుతూ ప్రవచనాలు ఇచ్చే త్రిలోచన బ్రహ్మచారి... బ్రహ్మచారేం కాదు.
"సద్గుణా నీకు ఆడపిల్లరా ...ఆడపిల్ల పుడితే అమ్మ పుట్టినట్లే.... మహాలక్ష్మి పుట్టింద"ని....ఇంట్లో అందరూ ముచ్చట పడిపోయారు,....
మరుసటి ఏడు "సద్గుణా నీకు మళ్ళీ ఆడపిల్లేరా...." అనగానే,
"ఇక ఆపుదాం" అన్నాడు.
"ఈ సారి మగపిల్లాడు కావచ్చుగా "
మగ పిల్లాడి మీద ఆశతో ,ఇంట్లోవాళ్ళ ఉవాచ.
రెండేళ్ళ తర్వాత ....
"గుణా!కవలపిల్లలురా! ఇద్దరూ ఆడపిల్లలే "
చెప్పారు సద్గుణకి.
"నా జీవితం సర్వనాశనం...
ఈ కవలపిల్లలను ఎవరికైనా ,
పిల్లలు లేనివాళ్ళకు ఇచ్చేసి,
మనం మగపిల్లవాడికోసం ప్రయత్నించుదాం .....చుట్టాలంతా నలుగురు ఆడపిల్లల తండ్రి అని గేలిచేసి నవ్వుతారేమో" బాధ పడిపోతూ అన్నాడు.
"ఏమండీ మనకు నిజమైన శత్రువులు మనఆలోచనలేనండీ ! నేనూ ఏదోకపని చేసి కష్టపడతాను. మీరెలాగూ వ్యవసాయమేగా చక్కని పంటలు పండించుదాం" అందిభార్య.
"కానీ ఇంత సంసారాన్ని ఎలానెట్టుకురావాలీ? నా వల్లకాదు..." మానసికంగా కుంగిపోయాడు సద్గుణ.
ఆ రోజుల్లో పల్లెటూళ్ళలో హరికథలూ, బుర్రకథలూ చెప్పటానికి...కళాకారులు వచ్చేవారు.
ఓ హరికథా పితామహుడు వచ్చి... కథచెబుతూ...
"పెక్కుసంతానం పెక్కుదుఖం...అందులో ఆడపిల్లలయితే మరీనూ,ఆబాధ. వర్ణనాతీతం... " అంటూ మెుదలుపెట్టాడు.
ఆమాటలు సద్గుణ మీద చాలా ప్రభావం చూపినాయ్ ....కథలన్నీ ఐపోయాక..
"అయ్యా! మీరు సన్యాసం స్వీకరించారా? "
అనిఅడిగారు..అంతా... ఆ పితామహుణ్ణి.
ఆ హరికథా పితామహుడు... విషయం దాటేస్తూ.... "అట్టే.. అట్టే.. పుచ్చుకున్నట్టే
సంసారీ దు:ఖ్ఖీ,సన్యాసీ సుఖీ " ..అంటూ వెళ్ళిపోయాడు.
ఇంకేం.. అసలే (మనసు) కోతి .అందులో కల్లు తాగింది. మళ్ళీ నిప్పులు తొక్కింది.
ఇంతలో యజమాని వచ్చి చెవులుమెలేసాడు... ఇక ఈ కోతి
మర్నాడే ఎవరికీ చెప్పకుండా పలాయనం చిత్తగించి, త్రిలోచన బ్రహ్మచారి గా మారాడు
సద్గుణపేరుమారింది... వేషం మారింది... మరిమనసూ?
కానీ తర్వాత తెలిసింది సన్యాసం కూడా అనుకున్నంత ఈజీ కాదని,చాలా కష్టమని
వేళకి కూడుండదు. సత్రం భోజనం మఠంనిద్ర.
ఎవరైనా పిలిస్తే భోజనం, లేదంటే?... ప్రవచనాలు అలవాటుచేసుకుని, భక్తులిచ్చే కానుకలతోనే కడుపు నింపుకోవటం...
వానాకాలంవాన... శీతాకాలం చలి...
ఇంట్లో అయితే రోజల్లా పనిచేసినా ... సాయంత్రం రెస్ట్... భార్యసేవలూ..
మళ్ళీ ఇంటికి వచ్చేద్దామన్నా, తనను చేరదీసిన గురువుగారు వదల్లా...
ఇల్లు వదిలి ఇప్పటికి పాతికేళ్ళు.ప్రపంచంలో అన్నిరంగాలలో చాలామార్పులు వచ్చాయ్
ముఖ్యంగా ఆడపిల్లలలో..
పేర్లు తెలీవుగానీ.. ఆమెఎవరో బరువులెత్తి పతకంసాధించింది... పరుగులరాణిఒకామె.
తుపాకీ పేల్చటంలో ఓ ఆమె. చదరంగం పోటీల్లో ఆమె ఎవరో... ప్రపంచ అందాల పోటీ లో కిరీటం...అందరూ ఆడపిల్లలే
భరతదేశం కీర్తికిరీటంలో వజ్రాల్లా మెరుస్తున్నారు..పోలీసులుగానూ .. లాయర్లుగానూ ,కలెక్టర్లుగానూ ఇంకా అన్నింటా ...మరి నాపిల్లలు ఏమయ్యారో?!
ఏమండీ! అసలైన శత్రువులు మనఆలోచనలేనండీ ...అని భార్య మాటలు చెవిలో మోగుతున్నాయ్.
ఇప్పుడు ప్రవచనాలకు తిరిగే ఓపిక తగ్గింది.
విశ్రాంతి కి గూడేదీ? మరి తిండి ఎట్లా?
అందుకే స్వగ్రామం వచ్చాడు. పాతికేళ్ళవయసున్న ఆడపిల్లలను, వాళ్ళు భయపడేటట్లుగా.. పట్టిపట్టి చూస్తున్నాడు,
పోల్చుకుందామని...
బంధానికైనా మోక్షానికైనా మనసేగా కారణం...
పాతికేళ్ళలో ఊరు చాలామారింది. గుళ్ళో ప్రవచనాలు చెబుతూ, మధ్యమధ్య తన ఇంటివైపు వెడుతున్నాడు.వచ్చేస్తున్నాడు.
ఎవరూ గుర్తుపట్టకుండా... కానీ ఆ దూరంగా చూస్తుంటే యింటి తలుపులు ఎప్పుడూ మూసే ఉంటున్నాయ్.ఏంచేయాలి?ఎవరినడగాలీ? రెండు రోజులాగి
ఆ ఇంటి ముంగిట తచ్చాడాడు. ఇల్లు తాళంవేసి ఉంది. మరివీళ్ళూ?
పక్కింట్లోంచి యజమాని బయటికివచ్చి, సన్యాసిని చూసి వినయంగా నమస్కరిస్తూ
"అయ్యా! రాత్రి మీ ప్రవచనంవిన్నాను. మీలాంటి వారు నా ఊరురావటం మా
అదృష్టం...గుళ్ళో మీకు సౌకర్యంగా లేదా?
ఇల్లుకావలెనా ?" అడిగాడు.
"అదీ.... ఈ "...ఆ ఇంటికేసి చూస్తూ నసిగాడు
"ఆ యిల్లు.... మాళవికమ్మది. అబ్బో మా దొడ్డ యిల్లాలు. భర్త ఎటోపోయాక నలుగురు ఆడపిల్లలలనూ, తనే కష్టపడి సాదింది. పిల్లలూ మహా బుద్దిమంతురాళ్ళు
తల్లిచెప్పినట్లే విన్నారు. ఎంత ప్రయోజకులయ్యానుకుంటున్నారూ?!
పెద్దమ్మాయికి ఢిల్లీ  గవర్నమెంట్ లో.. ప్రధానమంత్రి ముఖ్య సలహాదారుగానో...
ఏదో ఉద్యోగంట. అందరూ
రెండేళ్ళ క్రితమే ఢిల్లీ కి వెళ్ళిపోయారు.
మిగతా ముగ్గురూ కూడా కలెక్టర్ స్థాయి ఉద్యోగాలే అనుకుంటున్నారు.
అందరూ పెద్దపెద్ద ఉద్యోగాలేట. ఆ తల్లి కడుపు చలవ. అందరూ ఆడపిల్లలే అని ఆతండ్రి వదిలేసి పోయాట్ట. వాడికిఅదృష్టం లేదు. "అని నుదుటిమీద బొటనవ్రేలితో అడ్డంగా రాసాడు. నుదిటిగీత అన్నట్లుగా.
"మరి!" నసిగాడు త్రిలోచన బ్రహ్మచారి ఉరఫ్
సద్గుణ.
"కావాలంటే మీరు ఇందులో ఉండవచ్చు ఎవరికైనా అద్దెకు ఇమ్మన్నారు తాళంచెవి నాదగ్గరే ఉంది. కావాలంటే మనిషిని మాట్లాడి దుమ్ము ధూళి దులిపిస్తా... వస్తున్నా ఉండండి. " అంటూ తాళంచెవిని తెచ్చిచ్చాడు. "కావాలంటే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తా.. మీ లాంటి వారు తమఇంట్లో దిగారని తెలిస్తే వాళ్ళూ సంతోషిస్తారు"
అన్నాడు.
ఎక్కడనుండి బయలుదేరానో మళ్ళీ అక్కడికే వచ్చాగా!? శత్రువులు బయటఎక్కడినుండో రారు. నా ఆలోచనలే నాశత్రువులై...బాధ్యతలనుండి తప్పించి నన్ను పరుగెత్తించి ...మళ్ళీ ఇక్కడికే
పరుగెత్తించినాయ్....హృదయభారంతో
తాళంతీసుకుని లోపలికి వెళ్ళాడు సద్గుణ ఉరఫ్ త్రిలోచన బ్రహ్మచారి .
భార్యాబిడ్డల ఫొటోలు... పెద్దయ్యాక దిగినవేననుకుంటా?!
ఓ ఆప్యాయతల కుంచెతో మమతల రంగులద్దిన సప్తవర్ణాల వాసంత సమీరాల గాలి, శరీరాన్ని తాకి, ఈ గాలి చెప్పిందినాకు, నేనెెవ్వరో ఏమిటో ఇన్నాళ్ళ లోటేమిటో ...మనసు బాధతో మూలిగింది.
ఢిల్లీకి?!సామానేం తీసుకుపోలా! ముఖ్యంగా దుమ్ము కొట్టుకుపోయిన ఆమంచంపై వ్రాలి ...
సంసారీ సుఖీ.. సన్యాసీ దు:ఖ్ఖీ ..
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి
నా వాళ్ళు కన్నతల్లి లాంటి, ఈఊరికి, నాలాగానే ఏదో ఓరోజు తప్పకుండా వస్తారు. అప్పటివరకూ....నలుగురు పిల్లల తల్లి ఒడిలాంటి ఈ ఇంట్లోనే సేదతీరాలీ!
ఓ క్షణం కళ్ళుమూసుకున్నాడు సద్గుణ, తన్మయత్వంతో .

                 $$$$$$$$$$