గజదోషం

ఆంధ్రభూమి • 21 Oct 2010 • 👁 17 views
గజదోషం

"మత్తేభ ఇంకా రాలేదా మార్నింగ్ వాక్ నుండి అంటూ భార్యని పలకరిం చాడు భాస్కర్. "

"అదిగో! అదే వద్దన్నది. ఏదో పిల్ల కొంచెం పుష్టిగా ఉంటే, అసలు పేరు మృదుల వదిలేసి 'మత్తేభ' అని పిల వడం నాకు నచ్చలేదు” జవా బిచ్చింది భాస్కర్ భార్య రంగ వల్లి.

భాస్కర్, రంగవల్లిల ఏకైక కూతురు మృదుల. చిన్నప్పుడు మల్లెతీగలా ఉండేది. ఏమైందో ఏమో కానీ పదవ తరగతి దాటాక 'మర్రిమాను'లా తయా రయింది. నాలుగు లీటర్ల పాలు, ఇరవై చపాతీ, పాతిక ఇడ్లీ లేక డజను దోసా, ఇదీ మెనూ మృదు లది. అందరూ లావుగా ఉన్నావని తిడుతున్నారని మార్నింగ్ వాక్ మొదలుపెట్టింది. మార్నింగ్ వాక్ నుండి తిరిగి వచ్చి 'అమ్మా ఆకలే' అంటూ మత్తేభఅలియాస్ మృదుల వచ్చి ఫ్రిజ్లో ఉన్న ఇరవై యాపిల్స్ లాగించింది.

"దీన్ని పెళ్లి చేసుకోవాలంటే ఏ టాటో, బిర్లో రావాలి. మామూలువాడి వల్ల కాదు" అంటూ నిట్టూర్చాడు భాస్కర్.

పార్కులో...

"ఏమండీ భాస్కర్ గారూ, మీ అమ్మాయికి సంబంధాలు కుదరడం లేదంటున్నారు. కొంపదీసి జాతకంలో కుజదోషం ఉందా?" అడిగాడు భాస్కర్ కి ఈమధ్యే పరిచయమైన వామనరావు,

"జాతకంలో కుజదోషం లేదు. ఒంట్లో 'గజ దోషం' ఉంది."

"అంటే? "

"అర్థం కాలేదా? గజం ఎలా ఉంటుంది? ఏనుగు లాగే లావుగా ఉంది. ఈ పిల్లకి పెళ్లి ఎలా అవుతుందో? నేను ఉండగా దాని పెళ్లి చూస్తానో చూడనో" అంటూ విచారంగా అన్నాడు భాస్కర్.


"కాలమే కొన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంది! నథింగ్ టు వర్రీ" అన్నాడు వామనరావు.

****

రాజమండ్రి శంభునగర్ లో... రాజారావు కొడుకుని తిడుతున్నాడు.

"ఏమిటిరా తిండి? బకాసురుడు చచ్చి నా కడు పున పుట్టాడా? పది కోళ్లు అవలీలగా లాగించాడు. రెండు వందల గుడ్లు మూడు రోజుల్లో ఖాళీ చేశాడు. నిన్న కోళ్లఫారం యజమాని మా విలువైన కస్టమర్ అని వాచీ ప్రెజెంట్ పంపాడు. ఇలా అయితే వీడి తిండికి నేను బ్యాంక్ లోన్ తీసుకో వాలి" అంటూ వాపోయాడు.

"దిష్టి కొట్టకండి. వెర్రినాగన్న ఎంత ఆకలి అయితే పది కోళ్లతో నర్దుకుంటాడు. పండగలు, పబ్బాలు వస్తే కనీసం పాతిక కోళ్ల పీకలు తెగు తాయి" అంటూ లేక లేక పుట్టిన తన గారాల పట్టి గవర్రాజుని ముద్దు చేసింది సుందరాంబ.

"సర్లే ఆ మార్నింగ్ వాక్ చేసి ఏడవమను రోజూ! డాక్టర్ గారు మార్పు వస్తుందన్నారు. పెళ్లో పెళ్లో అని గోల చేస్తున్నాడు. ఈలోగా లావు తగ్గితే 'వధువు' వస్తుంది. లేకపోతే తాగడానికి 'మధువే మిగులుతుంది" అని గోల పెట్టాడు రాజారావు.

గవర్రాజు మార్నింగ్ వాక్ కి వెడుతూ "అమ్మా తిరిగొచ్చేసరికి పది లీటర్ల పాలు కాచి ఉంచు" అన్నాడు.

ఆ మాట విని మూర్చపోయాడు రాజారావు.

*********

కొవ్వూరులో...

"నాన్నా నాకు స్కూటీ కావాలి కొను?" అంది గారంగా మృదుల.

"వద్దు అమ్మా! నీకు అలాంటి సున్నితమైన బళ్లు కుదరవు. శుభ్రంగా మెటీరియల్ వాన్ కొంటాను. అదీ తీసుకెళ్లు" అన్నాడు విసుగ్గా భాస్కర్.

"ఆ భద్రంగాడి సంబంధం ఏమైంది? పెళ్లి చూపులకి వస్తానని రాలేదు" అడిగింది రంగవల్లి.

"ఆ వచ్చారు. దూరం నుండి చూసి దడుసుకొని వెళ్లిపోయారు."

"అదే మరి! పిల్ల బొద్దుగా ఉంటే చూసి ఓర్వలేక దిష్టి కొట్టారు. ప్రియాంకా చోప్రాలా ఉండాలా పెళ్లి కూతురు?"

“అలా అక్కరలేదు. చూడగానే ఒడ్డూ, పొడుగూ సరిపోయిందనుకోవాలిగా" అన్నాడు భాస్కర్.

"దాన్ని చేసుకునేవాడు దాన్ని వెతుక్కుంటూ వస్తాడు" అంది రంగవల్లి.

"చూద్దాం" అన్నాడు భాస్కర్.

***

పార్క్ కలిశాడు వామనరావు భాస్కర్ని.

"భాస్కర్ గారూ, మీరు వర్రీ కాకండి. కుజ దోషం ఉన్న పిల్లకి కుజదోషం ఉన్న అబ్బాయితో వివాహం చెయ్యమని జాతకం చెబుతోంది కదా. అలాగే 'గజదోషం' ఉన్న అమ్మాయికి 'గజదోషం' ఉన్న అబ్బాయినిచ్చి చేయాలి" అని వామనరావు సలహా పారేశాడు. ఆ మాటలు విని భాస్కర్ కళ్లు మెరిశాయి.

"కానీ గజదోషం ఉన్న పిల్లవాడు ఎక్కడ ఉన్నాడు?"

"మీరు ఊ అనండి. పక్కన రాజమండ్రిలో ఉన్న రాజారావు కొడుకిని మీ అమ్మాయికి చెప్తాం. అన్నీ సవ్యంగా జరిగిపోతాయి. ఈలోగా ఖర్చులకి ఓ వెయ్యి ఇస్తే.." అంటూ నసిగాడు వామనరావు.

"అలాగే పెళ్లి కుదురుతుందంటే వెయ్యి కోసం తడుముకోము కదా" అంటూ రెండు ఐదువందల నోట్లు ఇచ్చాడు.

రెండు 'గాంధీ'ల్నీ జేబులో ఉంచుకొని హుషా
రుగా ఈల వేసుకుంటూ రాజమండ్రి వెళ్లాడు వామన రావు.

********

గవర్రాజు, మృదులల పెళ్లి వైభవంగా జరిగింది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని పొగిడారు.

పల్లకీ ఎక్కుతానని గొడవ చేసింది మృదుల.

"వద్దమ్మా! నువ్వు, అల్లుడు గారు పల్లకీ ఎక్కితే నలుగురి దుర్మరణానికి కారణం అయ్యామని ఐ.పి.సి. 302 సెక్షన్ కింద యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. ఎందుకమ్మా నాన్నని జైలులో చూడటం" అని బుజ్జగించి మాన్పించాడు భాస్కర్.

*********

రాజమండ్రిలో కొత్తగా కాపురం పెట్టాడు గవ ర్రాజు. వాళ్లకి లోటు లేకుండా రెండు వర్గాల వారు అన్ని సదుపాయాలు చేశారు. పెళ్లయిన నాలుగు నెలల తరువాత అత్తవారింటికి వచ్చాడు గవర్రాజు తన భార్యతో సహా.

నాలుగు నెలల్లో అనూహ్యమైన మార్పు వచ్చింది వారిద్దరిలో.

గవర్రాజు సన్నగా రివటలా ఉన్నాడు. చొక్కా లూజుగా ఉంది. మృదులా సన్నగా తీగలా ఉంది.

ఇది కలా, నిజమా అని గిల్లుకున్నాడు భాస్కర్. నిజమే అని భార్య కూడా గిల్లి నిర్ధారించింది. బ్రహ్మంగారు చెప్పినట్లు ఏమన్నా వింతలు జరుగు తున్నాయా?

"ఏమిటీ మార్పుకి కారణం? నా కళ్లను నేనే నమ్మలేకపోతున్నా?" అడిగాడు భాస్కర్.

"ఏముంది నాన్నా! మన ప్రభుత్వం చేసిన నిర్వాకం! అన్ని రేట్లు పెరిగాయి. కందిపప్పు కిలో 500 రూపాయలు, కేజీ వంకాయలు 200 రూపా యలు, కేజీ టమాటా 300 రూపాయలు, కేజీ చికెన్ వెయ్యి రూపాయలు... ఈ రేట్లతో ఏదీ కొన లేక అవి చూస్తూ, కేవలం టీ, నీళ్లు తాగుతూ గడిపాం. అంతే... ఒంట్లో ఉన్న కొవ్వు కరిగి ఇలా అయ్యాం" అంది మృదుల.

"అధిక ధరల వల్ల అధిక 'కాయం' తగ్గు తుందా? ఏ డైటింగ్ చెయ్యలేని పని ప్రభుత్వం చేసింది. ఆ!" అంటూ ఆలోచనలో పడ్డాడు భాస్కర్.

సమాప్తం