5. బ్రేక్ ది సైలెన్స్
జ్వాల, క్రిష్ కిందకి వెళ్లి చూడగానే హాల్లో విశ్వనాథ్ కింద పడి వున్నాడు. అతని మొహం నిండా రక్తం. మోకాలికి దెబ్బ తగిలి నడవలేక కుంటుతున్నాడు. సర్వెంట్ కాటన్ తో అతని మొహాన్ని తుడుస్తోంది.
“వాట్ హ్యాపెండ్, ఎలా జరిగింది?” సర్వెంట్స్ ని కంగారుగా అడిగింది జ్వాల.
“తాతగారు నడుస్తూ హల్లోకి వస్తున్నారు. వాకింగ్ స్టిక్ విరిగిపోయింది. ఆ ఊపుకి కింద పడిపోయారు. మొహానికి దెబ్బతగిలింది”చెప్పారు వాళ్ళు.
డాక్టర్ కి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పింది జ్వాల. “తాతయ్యా, నొప్పిగా ఉందా?” అని అతన్ని మెల్లిగా లేపి సోఫాలో కూర్చోబెట్టింది డాక్టర్ వచ్చాక హాట్ వాటర్ తెచ్చి పెట్టింది సర్వెంట్. దెబ్బతగిలిన చోట డ్రెస్సింగ్ చేసి ఇంజెక్షన్ చేశాక “ఎలా తగిలించుకున్నారు ఇంత దెబ్బ?” అడిగాడు డాక్టర్.
విరిగిన స్టిక్ చూపించాడు విశ్వనాథ్. “వాకింగ్ స్టిక్స్ అంత తొందరగా విరగవే”అంటూ దాన్ని చేతిలోకి తీసుకొని పరిశీలించాడు డాక్టర్.
అది చాలా పాతగా వుంది. “ఇదేనా తాతగారూ మీరు రోజూ ఉపయోగించే కర్ర?” అడిగాడు క్రిష్ కర్రను చూపిస్తూ. “ఎప్పటినుంచో దీన్ని వాడుతున్నాగా. కొత్తదే” అన్నాడు విశ్వనాథ్. “ఇంట్లో వేరే స్టిక్స్ ఉంటే తీసుకురా” అన్నాడు క్రిష్ నొరాతి తో. ఆమె నాలుగు స్టిక్స్ లోపల్నుంచి తెచ్చి ఇచ్చింది. “ మీరు రెగ్యులర్గా వాడే స్టిక్ ఇది కదా తాతయ్యా” అని నొరాతి అందులోంచి ఒక స్టిక్ తీసి చూపించింది.
“ నిజమే, ఇదే నేను రోజు వాడేది. ఈరోజు పొరపాటున ఆ మూలనున్న పాత స్టిక్ తీసుకొని నడుస్తూ వచ్చాను .అందుకే అది విరిగిపోయింది అనుకుంటా .ఈ మధ్య నాకు మతిమరుపు వస్తోంది. ఏది గుర్తు ఉండట్లేదు . మిమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టాను సారీ”అన్నాడు నొచ్చుకుంటూ.
డాక్టర్ మందులు ఇచ్చి వెళ్ళిపోయాక విశ్వనాథ్ ని తీసికెళ్ళి రూంలో పడుకోబెట్టి వచ్చింది జ్వాల.
“తాతయ్యకు వరసగా గండాలు వస్తున్నాయి. ఒకసారి ఆస్ట్రాలజర్ కి జాతకం చూపిద్దామా?” అంది క్రిష్ తో.
“రెండు పడవలమీద కాళ్ళు పెట్టొద్దు. డిటెక్టివ్ నియమించాం. ఇన్వెస్టిగేషన్ రైట్ వే లో వెళుతోంది.
ఇవన్నీ అనుకోకుండా జరుగుతున్న సంఘటనలా లేక ఎవరైనా కావాలని చేస్తున్నారో త్వరలో తెలిసిపోతుంది. కొద్దిగా ఓపిక పట్టు. లేఖ్ చెప్పినట్టు గోపీచంద్ గారిని అడిగి చూద్దాం. వెయిట్ అండ్ సీ. ” అన్నాడు
క్రిష్.
ఇద్దరూ స్నాక్స్ తిన్నాక మాట్లాడుకుంటూ కూర్చున్నారు.
“ఒకసారలా బయటకు వెళదామా?” అన్నాడు క్రిష్
“యా, అలాగే” అని లేచికెళ్లి డ్రెస్ మార్చుకుని వచ్చింది జ్వాల.
ఇద్దరూ రోడ్డుమీద కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ వెళుతున్నారు .
రోడ్డుపక్కనున్న చిన్న రెస్టారెంట్ ముందు ఏదో గలాటా జరుగుతోంది. ఇద్దరూ పక్కగా ఆగి అటువైపు చూసారు.
ఒక మహిళ ఒక యువకుడ్ని కొడుతోంది. అందరూ చూస్తుండగానే. అతను పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటే ఆమె అతన్ని వదలకుండా చొక్కా పట్టుకుని లాగి కొడుతోంది. జ్వాల ఆమె దగ్గరకెళ్ళి
“ఎందుకలా కొడుతున్నారు? ఏం చేశాడు?” అని అనడిగింది.
“వీడు నా నడుం గిల్లాడు.పైగా నాకేం తెలీదంటున్నాడు.”అని మరో రెండు దెబ్బలు వేసింది. అతన్ని చూస్తే పోకిరీలా లేడు. దెబ్బలు తింటూనే “ సిస్టర్, నా మాట వినండి సిస్టర్”అని ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఎవరూ అతని మాట వినే స్థితిలో లేరు. అతన్ని తలోదెబ్బా వేశారు. జ్వాల చుట్టూ చూసింది. ఒకమ్మాయి చున్ని మొహానికి చుట్టుకుని షాపు వైపు చూస్తోంది. చున్నీ కట్టుకోవడం వల్ల
కళ్ళు మాత్రమే కనపడుతున్నాయి. మొహం తెలియట్లేదు. జ్వాల ఆమె వైపు పరిశీలనగా చూసింది. ఆ అమ్మాయి ఒడ్డు పొడుగు ఆ కళ్ళు ఎక్కడో చూసినట్టుగా అనిపించాయిం “క్రిష్, ఆ అమ్మాయిని చూడు”అంది అతనికి మాత్రమే వినపడేలా.
క్రిష్ చూశాడు. “ ఏదో కొనడానికి షాపుకు వస్తోంది. అందులో ఏముంది.” అన్నాడు క్యాజువల్ గా. “కాదు క్రిష్, ఆ కళ్ళని నేను ఎక్కడో చూశాను. కానీ గుర్తు రావటం లేదు. చాలా దగ్గరగా చూసినట్టుగా అనిపిస్తోంది.” అంది.
“నువ్వు ఇండియాకి వచ్చిందే మొన్న. ఇంతలోనే ఎవరిని కలిసావని? అదంతా నీ భ్రమ” అన్నాడు.
“కాదు క్రిష్, ఆ అమ్మాయి దగ్గరకి వెళ్లి అడుగుదాం పద.”
“ఏం అడుగుతావ్?”
“నిన్ను నేను ఎక్కడో చూశాను. చాలా దగ్గరగా చూశాను. నన్ను ఎప్పుడైనా చూసావా అని అడుగుతానుండు” అని రెండు అడుగులు ముందుకు వేసింది.
“నువ్వు తొందర పడకు జ్వాలా, ఆ అమ్మాయిని ఫాలో అవుదాం కామ్ గా ఉండు ఎటో చూస్తున్నట్టుగా ఈ షాపులోకి వెళ్దాం పద” అన్నాడు . ఇద్దరూ రోడ్డుకి అటువైపుకు వెళ్లారు. ఆమె వెళ్లిన షాపులోకి వెళ్లి ఏదో కొంటున్నట్టుగా ఆమెను గమనించారు. ఆమె షాపు దగ్గర నిలబడింది కానీ అటు ఇటు చూస్తూ ఏమీ కొనకుండానే బయటికి వచ్చేసింది. అంతవరకూ జరిగిన గొడవ సద్దుమణిగింది .ఎటు వాళ్ళ అటు వెళ్లిపోయారు. ఆమె మెల్లిగా తన చున్నీ తీసి సరిగ్గా వేసుకుని రోడ్డుకి అవతలి పక్కకి వెళ్ళిపోయింది. “ఆ అమ్మాయి వెళ్ళిపోతోంది పద” అంటూ తొందర చేసింది జ్వాల.
ఆకస్మికంగా కనిపించిన ఆ అమ్మాయిని జ్వాల ఎందుకు అనుమానిస్తోందని క్రిష్ అడుగుదామన్నా చెప్పేంత టైం లేదు. వడివడిగా నడిచి వెళుతున్న ఆమెను ఇద్దరూ అనుసరించారు. ఆమె ఒక సందులోంచి మరో సందులోకి తిరుగుతూ వాళ్ళకి అందకుండా, వెహికల్స్ చాటు చేసుకుంటూ చాలా దూరం వెళ్లి చెట్ల గుబురుల్లో కలిసిపోయింది. ఇద్దరూ సందు చివరకు వచ్చి చూసేసరికి ఆమె కనిపించలేదు
కాసేపు అక్కడే నిలబడి చూశారు .ఎంతసేపు చూసినా ఆమె కనపడలేదు.
ఇద్దరూ వెనక్కి వచ్చారు. “ చున్నీ తీసాక ఆమె ఫేస్ మోస్ట్ ఫెమిలియర్ గా వుంది క్రిష్. ఇంకొక్కసారి సరిగా చూస్తే గుర్తుపడతానేమో జస్ట్ మిస్” అంది. జ్వాల .
ఇద్దరూ షాపింగ్ పని చేసుకుని ఇంటికి వచ్చారు.
సోఫాలో కూలబడింది జ్వాల.
“ఏమైంది ? ఎందుకలా వున్నావ్?ఇంకా ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తున్నావా?” అడిగాడు క్రిష్.
“నేను తాతయ్య గురించి ఆలోచిస్తున్నాను. నాకు ఎవర్ని చూసినా వీళ్ళే మా తాతయ్యను కొట్టాలని చూస్తున్నారేమో అనే అనుమానం వేధిస్తోంది. ఏం చేయను” అంది.
“అయ్యో జ్వాలా, ఈ ఇంట్లో మహారాణిలా వుండాల్సిన దానివి. ఆ అమ్మాయి వెనకాల అలా తుప్పలవెంట పరిగెత్తడం ఏం బాలేదు.”అన్నాడు క్రిష్
“కొన్ని జీవితాలు పైకి కనిపించినంత ప్రశాంతంగా వుండవు క్రిష్. డాడ్ యాక్సిడెంట్ లో చనిపోయినప్పటినుంచి అమ్మ దిగులుకి అంతులేదు. తాతయ్య దుఃఖాన్ని దిగమింగి ఈ ఇంటిని నడిపించారు. అమ్మ అలా గదిలో గడిపేస్తుంటే తాతయ్య నాకు అమ్మా నాన్న అయ్యారు. నా పెంపకం, చదువుకోసం అన్నిటికీ ఆయన ఎంతో కష్టపడ్డారు. నా స్కూల్ చదువులో ప్రతి ఒక్క విషయాన్నీ తాతయ్యే పట్టించుకున్నారు. నన్ను దింపి తీసుకురావడం , డ్రెసెస్ కొనిపెట్టడం , బర్త్ డే సెలబ్రేషన్ అన్నీ ఆయనే చూసుకున్నారు. కాలేజ్ లో చేరాక కూడా నాకు అన్ని విషయాల్లో అండగా వున్నారు. పీజీ ఫారిన్ లో చేయమని ఆయనే సలహా ఇచ్చారు. మిమ్మల్ని వదిలి వెళ్ళలేను, మీతోనే వుంటాను అని మారాం చేస్తే ఈ లైఫ్ నీది. పెద్ద చదువుల కోసం ఫారేన్ వెళ్ళమనట్లేదు . నువ్వేంటి అనేది నీకు తెలియాలి. నీ బలాబలాలపై నీకొక అంచనా వుండాలి. ఇన్నాళ్ళూ నా వేలు పట్టుకుని నడిచావు. ఇక నీ స్వయం శక్తితో ఎదగాలి. ఏ వ్యక్తికైనా జీవితంలో తోడు ఆ వ్యక్తి మాత్రమే. చివరిదాకా మనతోడు మనమే. ఇవన్నీ నేను చెబితే నీకర్థం కావు. ప్రాక్టికల్ గా నేర్చుకోవాలి. విశ్వనాథ్ మనవరాలిగా కాకుండా జ్వాలగా బతికి, నువ్వంటే ఏవిటో చూపించు. అని నచ్చచెప్పి నాలో ధైర్యం నింపి పంపారు. ఆయన చెప్పింది అక్షరాలా నిజం. లైఫ్ లో కష్టం వచ్చినప్పుడే ఎదుర్కునే శక్తి వస్తుంది. ఎదురుదెబ్బ తిన్నప్పుడే జాగ్రత్తగా నడవడం తెలుస్తుంది. నా మాస్టర్స్ డిగ్రీతో పాటు నేను నేర్చుకున్న పాఠాలు ఇవే. నీకు మరో విషయం తెలుసా క్రిష్?
నేను ఫారిన్ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్, అక్కడ రూమ్ చూసుకుని రెంట్ కట్టడానికి సరిపడ డబ్బులు మాత్రమే మా తాతయ్య నాకు ఇచ్చి పంపారు. నేను పార్ట్ టైం జాబ్ చేసుకుని సంపాదించుకున్న డబ్బుతోనే నేను ఈ రెండేళ్ళు సర్వైవ్ అయ్యాను. కొన్ని రోజులు నా ఫ్రెండ్స్ తో పాటు కేవలం బ్రెడ్ మాత్రమే తిని బతికాను.ఆ పరిస్థితులే నాకు గురువులా జీవిత పాఠాలు నేర్పాయి.ఇప్పుడు నేను ఎలాగైనా బతకగలను అనే ధైర్యం వచ్చింది.” జ్వాల చెబుతున్నదంతా విన్న క్రిష్ క్లాప్స్ కొట్టాడు
“గోల్డెన్ స్పూన్ తో పుట్టిన రాజకుమారి సేవకురాలిగా జీవించి చూపించింది. వెరీ నైస్” అన్నాడు మెచ్చుకుంటూ
“నా జీవితానికి తాతయ్య అవసరం చాలా వుంది. ఆయన్ని మైనస్ చేసి నన్ను నేను చూసుకుంటే ఏముంది? బిగ్ జీరో”అంది
సన్నగా ఒణుకుతున్న ఆమె గొంతులోని బాధని అర్ధం చేసుకున్నట్లు ఆమె చేతిపై సున్నితంగా నొక్కాడు క్రిష్
“ప్లీజ్ కంట్రోల్. తాతయ్యకు ఏం కాదు జ్వాలా. ఎట్టిపరిస్థితుల్లో ఆయన్ని మనం కాపాడుకుందాం. నువ్వు చూసిన ఆ అమ్మాయి ఆ ప్రాంతానికి చెందినదే అయ్యుంటుంది. మనకి మళ్ళీ తప్పకుండా కనపడుతుంది. ఈ విషయాన్ని డిటెక్టివ్ లేఖ్ కి చెబుదాం. అన్నీ అతనే చూసుకుంటాడు. ఈ చేజింగులు రన్నింగులు చేయాల్సిన అవసరం మనకుండదు” అన్నాడు.
“ట్రూ, ఆపని చేద్దాం. కానీ క్రిష్ , మనం ఒక డైరీ మెయింటెయిన్ చెయ్యాలి. అందులో ప్రతి చిన్న విషయాన్నీ రాసుకోవాలి. మనకి కూడా కొంత క్లారిటీ వస్తుంది కదా”
“ఏస్, జ్వాలా, దట్స్ ఎ గుడ్ ఐడియా.”
వాళ్ళు మాటల్లో పడి డాక్టర్ గోపీ చంద్ రాకను గమనించలేదు. “హై, డిస్టర్బ్ చేసానా?” అంటూ వచ్చి వాళ్ళముందున్న సోఫాలో కూర్చున్నాడు.
జ్వాల ఎలర్ట్ అయింది. ఆ క్షణం నుంచి ప్రతి విషయాన్నీ గమనించాలి అనుకుంది. అతని గొంతు వినగానే నొరాతి కాఫీ తెచ్చి ఇచ్చింది. పై అంతస్తు వరకూ అతని మాట వినపడుతుందా? నొరాతి కాఫీ
స్వయంగా తెచ్చిందా, లేక ఇవ్వమని మామ్ చెప్పిందా? గతంలో కూడా వస్తూ వెళుతూ వుండేవాడా? ఆ సందేహాలకు సమాధానాల దిశగా జ్వాల ఆలోచనలు సాగుతున్నాయి.
“వాట్ బేబీ, అంతలా నన్నే చూస్తున్నావ్?” గోపీచంద్ నవ్వుతూ అడిగేసరి కంగారుగా సర్దుకుని
“అంకుల్, మీకు పెళ్లైందా?” అంది. జ్వాల హఠాత్తుగా అడిగేసరికి డాక్టర్ గోపీ చంద్ కి పొలమారినట్టైంది.
“అయ్యో, ప్లీజ్ కేర్ఫుల్ అంకుల్. నేను జస్ట్ క్యాజువల్ గా అడిగాను”అంది మళ్ళీ.
“నో ప్రాబ్లం. ఐ యాం ఓకే. నీకెందుకా సందేహం వచ్చింది?”అని చిరునవ్వుతో అడిగాడు.
“జస్ట్ క్యాజువల్ అంతే” అంది గోపీ చంద్ ని నిశితంగా పరిశీలిస్తూ.
సాల్ట్ అండ్ పెప్పర్ హెయిర్, ఛార్మింగ్ స్మైల్. స్టిఫ్ బాడీ. యాభై ఏళ్ల వయసులో కూడా చాలా హ్యాండ్సమ్ గా కనిపించాడు. ఇలా ఎలా మైంటైన్ చేస్తున్నాడో అనుకుంది అతన్నే చూస్తూ
“ఏంటలా చూస్తున్నావ్?” అన్నాడు కళ్ళజోడు లోంచి చూసి నవ్వుతూ. “ యూ ఆర్ లుకింగ్ స్మార్ట్ అంకుల్. మీ పిల్లలు అదృష్టవంతులు. యామై రైట్”అంది. అతను గంభీరంగా మారాడు. “నో బేబీ, నాకు పెళ్లి కాలేదు”అన్నాడు.
“సారీ అంకుల్. మీరు సింగిల్ గా వుంటున్నారా? మీకు ఎవరూ లేరా?” అనడిగింది ఎలాగైనా అతని నుంచి అసలు విషయాన్ని రాబట్టాలని.
“లేరమ్మా, మా ఇంట్లో ప్రస్తుతం నేను మా మెయిడ్ ఉంటున్నాం. మీ తాతయ్య నాకు ఆత్మీయులు.మంచి మిత్రులు కూడా. మీ డాడీ కూడా నాకు బాగా తెలుసు. నీ తాతయ్య యోగక్షేమాలు తెలుసుకునేందుకు అప్పుడప్పుడూ వస్తుంటాను. ఆయన బాగుండాలని మనసారా కోరుకునేవాళ్లలో నేనూ ఒకడిని. బై ది వే, నువ్వు తిరిగి లండన్ వెళ్ళేలోపు మనం ఒక జాలీ ట్రిప్ వేయాలి.”అన్నాడు.
“ఎక్కడికి వెళదాం అంకుల్”అంది జ్వాల.
“ప్రపంచం మొత్తం డబ్బు వెనక పరిగెడుతుంటే, ఒకే ఒక్క సిటీ దానికి మినహాయింపుగా వుంది. అక్కడికి వెళ్ళాలి మనం”
“రియల్లీ, అలాంటి ప్లేస్ ఒకటి వుందా?”
“ఉందమ్మా, చెన్నై కి నూట యాభై కిలోమీటర్ల దూరంలో వున్న విల్లుపురం డిస్ట్రిక్ట్ యూనివర్సల్ సిటీ గా గుర్తింపు పొందిన యారో విల్లీ సిటీ”
“వావ్, ఇంట్రెస్టింగ్. దాని వివరాలు చెప్పండంకుల్. తప్పకుండా వెళదాం.” అంది.
“ఎస్, చెప్తాను. 1968 మిర్రా ఆల్ఫెస్సా గారిచే
ఒక ఎక్స్పరిమెంటల్ టౌన్షిప్ గా ఏర్పడింది. అక్కడ లా, రెలిజిన్, రేసిజం, మనీ, గవర్నమెంట్ రూల్స్ లాంటివి ఏవీ వుండవు. ఈ సిటీనీ డెవలప్ చేయడానికి కారణం సమాజంలో కుల మత వివక్ష లేకుండా అందరూ సమానంగా నివసించడానికి ఈ సిటీని నిర్మించారు. అక్కడ నివశించాలంటే ఓకే ఒక్క కండిషన్”
“ఏంటది?”
“అక్కడ వుండాలంటే ఎవరైనా సరే ఒక సర్వెంట్ లా జీవించాలి. ఎప్పుడూ వర్క్ చేస్తూనే వుండాలి. ప్రపంచంలో యాభై వేలమంది మాత్రమే నివశించేలా ఆ సిటీని నిర్మించారు. ప్రస్తుతం అరవై దేశాలకు చెందిన మూడు వేల మూడు వందల మంది చాలా సంతోషంగా అక్కడ నివసిస్తున్నారు. అక్కడ జీరో క్రైమ్ రేట్. అలాంటి సుందర ప్రదేశం ఒకటుందని చాలా మందికి తెలీదు.”
“ఓ, నైస్ అంకుల్. వింటుంటేనే చాలా హ్యాపీ గా వుంది.అక్కడికి మనకి ఎంట్రీ వుంటుందా?”
“నాకు తెలిసిన ఒక ఇండస్ట్రియలిస్ట్ కోట్లు గడించాక మనశ్శాంతి కోల్పోయాడు. తను నమ్మినవాళ్లే మోసం చేయడంతో విరక్తి చెందాడు. తన ఆస్తిపాస్తులను అనాధలకు పంచిపెట్టి అక్కడికి వెళ్లిపోయాడు. మొన్న ఆ మధ్య హైదరాబాద్ పని మీద వచ్చినప్పుడు నన్ను కలిసాడు .నేను కూడా నా జీవితంలోని నిరాశను అతనితో పంచుకున్నప్పుడు నువ్వు కూడా అక్కడికి రా. ఏ చీకూ చింతా నీకు అంటదు. ఆ ప్రాంతం స్వర్గ సమానం అని చెప్పాడు. చూడాలని కుతూహలం కలిగింది. నాకు ఇంకా కొన్ని బాధ్యతలు ఉన్నాయి అవన్నీ తీర్చుకున్నాక తప్పకుండా వచ్చి ఒకసారి విజిట్ చేస్తానని చెప్పాను. అతను నువ్వు ఎప్పుడొచ్చినా వెల్కమ్ . వచ్చేముందు ఒక్క కబురు పంపు అన్నాడు”
“వావ్, ఇంకేం . మనం ఒకసారి వెళ్లి చూసొద్దాం. మనిషికి మనశ్శాంతి వున్న చోటే స్వర్గం కదంకుల్”అంది జ్వాల.
“ఇలా మనశ్శాంతి లేనివాళ్ళందరు అక్కడకి వెళ్లి అక్కడి వాళ్ళ మనశ్శాంతి పాడు చెయ్యరు కదా?” అన్నాడు క్రిష్ .
గోపీ చంద్ నవ్వి, “ మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు. అహం రెండక్షరాల చిన్నమాటే. కానీ ప్రపంచ యుద్ధాలను చేయిస్తుంది. సామ్రాజ్యాలు కూలుస్తుంది. అది లేకపోతే మిగిలేదంతా విశ్వశాంతి” అన్నాడు గోపీచంద్.
“ఏంటంకుల్ , మీ ప్రతి మాటలో వేదాంతం ధ్వనిస్తుంది. పెళ్లి కాలేదు, ఇక భార్యతో గొడవల్లేవు. పిల్లలు లేకపోవడంవల్ల వాళ్ళ బాధ్యతలు మోయక్కర్లేదు.. ఇంకా వయసుంది మీకు. హాయిగా ఎంజాయ్ చెయ్యకుండా ఎందుకీ నిరాశ?” క్రిష్ అలా అడగ్గానే సోఫాలో అసహనంగా కదిలాడు గోపీచంద్.
మొహంలో విచారం చోటుచేసుకుంది. సోఫా మీద చెయ్యి వేసి తల వెనక్కి వాల్చాడు.
“ఆల్ ద గ్లిట్టర్స్ ఆర్ నాట్ గోల్డ్. ప్రతి మనిషి జీవితంలోనూ ఎవరికీ కనిపించని ఒక షేడ్ వుంటుంది. అది ఆ మనిషిలోనే కలిసిపోతుంది” అంటున్నప్పుడు గోపీ చంద్ గొంతు ఒణికింది.
“అలాంటి కోణం ఒకటి మీ లైఫ్ లో వుందా అంకుల్?” అడిగింది జ్వాల.
గోపీ చంద్ కళ్ళు అతని ఆవేదనను దాచలేక పోయాయి. కళ్ళజోడు తీసి కర్చీఫ్ తో తుడుచుకున్నాడు.
అతనేదో వేదన పడుతున్నట్టుగా గ్రహించిన జ్వాల, క్రిష్ మొహమొహాలు చూసుకున్నారు.
గోపీచంద్ అంతలోనే నవ్వుతూ “ఈ తెల్లకోటు వెనక ఎర్రటి గుండె వుంది. అది ఎప్పుడూ ఎవరికోసమో తపిస్తూ లబ్ డబ్ అని కొట్టుకుంటూ వుంటుంది. ఇది ఆగేదెప్పుడో”అన్నాడు విరక్తిగా నవ్వుతూ.
“అవేం మాటలంకుల్. మీరు బాగుండాలి. ఇంతకీ మీ గుండె లయ ఎవరంకుల్?” జ్వాల కళ్ళు పెద్దవి చేసి అడిగింది. అతను ఉద్విగ్నతకు లోనయినట్టు అతని శ్వాసలో తెలుస్తోంది. “జ్వాలా, ఆ వ్యక్తి నాకెంతో ప్రత్యేకం. నా ప్రాణం. నా సర్వస్వం. నా బతుకంతా”
అతని మాట పూర్తి కాలేదు. పై అంతస్తునుంచి
నొరాతి “మేం సాబ్”అంటూ గావు కేక పెట్టింది.
ఒక్కసారి అందరూ పై అంతస్తువైపు చూసారు.
“మేడం స్పృహ తప్పి పడిపోయారు. త్వరగా రండి”అంది. ముగ్గురూ పై అంతస్తుకు పరిగెత్తారు.
సౌదామిని స్పృహ లేకుండా నేల మీద పడి వుంది.
“మై గాడ్, మమ్మీ! ఏవైంది” అంటూ పరుగున వచ్చి తల్లిని లేవదీసే ప్రయత్నం చేసింది జ్వాల. ఆమె ఒళ్ళు కాలిపోతోంది. “మమ్మీకి ఫీవర్ వచ్చింది. నాకెందుకు చెప్పలేదు నొరాతి?” అంది.
“మేడం పొద్దున దేవుడి గదిలోకి వెళ్ళేటప్పుడు బాగానే వున్నారు. ఇంతకుముందే బయటకు రావడం నేను చూశాను. కాఫీ తెస్తానని చెప్పాను. కాదు ఓట్స్ ఉడకబెట్టి బెల్లం వేసి తీసుకురమ్మన్నారు. ఓట్స్ ఉడకపెట్టేందుకు నేను కిచెన్ లోకి వెళ్లాను. ప్రిపేర్ చేసి తీసుకొచ్చేలోపు ఇలా పడిపోయారు” అని చెప్పింది నొరాతి.
“అంకుల్, ముందు మమ్మీని చూడండి.” అంది జ్వాల కంగారుగా. “ మీ ఫ్యామిలీ డాక్టర్ కి కాల్ చేద్దాం. ఆయనకు మీ మదర్ కండిషన్ తెలుసు. ఆవిడ రెగ్యులర్ గా వాడే మెడిసిన్స్ ఆయనకే తెలుస్తాయి. ప్లీజ్ కాల్ హిమ్ ఇమ్మిడియాట్లీ” అన్నాడు.
జ్వాల విశ్వనాథ్ దగ్గర నెంబర్ తీసుకుని ఫోన్ చేసింది. పదినిమిషాల్లో వచ్చాడు డాక్టర్. పల్స్,ఆక్సిజన్, బిపి చెక్ చేశాడు. “ఆవిడకు బీ పీ పెరిగింది. ఈ మెడిసిన్స్ వేయండి. కంట్రోల్ అవుతుంది. డోంట్ వర్రీ. ఆవిడ టెన్షన్ పడకుండా చూడండి. రాత్రికి మళ్ళీ ఇదే టాబ్లెట్ వేయండి. నైట్ వచ్చి మళ్ళీ చెక్ చేస్తాను” అని చెప్పి మందులు ఇచ్చి వెళ్ళాడు. జ్వాల డాక్టర్ ఇచ్చిన మందు వేసిన కాసేపటికి సౌదామిని కళ్ళు తెరిచింది. లేపి కూర్చోపెట్టి కొద్దిగా ఓట్స్ తినిపించింది జ్వాల. “ఇక చాలమ్మా. మిమ్మల్ని కంగారు పెట్టాను సారీ” అంది. “అదేం లేదమ్మా, నువ్వు చాలా వీక్ గా వున్నావ్. ఇంకొంచెం తిను”అని స్పూన్ తో తినిపించింది. జ్వాలను కౌగలించుకుంది సౌదామిని.
తల్లి జుట్టు సరిచేస్తూ ఆమెను కొంతసేపు అలాగే పట్టుకుని వుండిపోయింది జ్వాల.
కొంచెం తెప్పరిల్లాక మెల్లిగా లేచి “ మిమ్మలందర్నీ ఇబ్బంది పెట్టాను. నేను బాగానే వున్నాను. మీపనులు చూసుకోండి ప్లీజ్. నేను కాసేపు ధ్యానం చేసుకుంటాను” అని మెల్లగా లేచి దేవుడి గదిలోకి వెళ్ళిపోయింది సౌదామిని. ఆమె మామూలు మనిషి అవడంతో
ముగ్గురూ ఊపిరి పీల్చుకున్నారు.
“నేను వెళ్తాను. వీలైతే రాత్రికి వస్తాను. జాగ్రత్తగా చూసుకో”అనిచెప్పి గోపీచంద్ అక్కడినుంచి వెళ్ళిపోయాడు. జ్వాల క్రిష్ ని తన గదిలోకి తీసుకెళ్ళింది. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు.
“ఏంటి క్రిష్, అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? ఒక్క రోజులో ఇన్ని చిక్కు ప్రశ్నలు మనముందుకు వచ్చాయి చూడు?” అంది టెన్షన్ లో గోళ్ళు కొరుకుతూ. “నిజమే. మనం ఎక్కువ ఆలోచిస్తున్నామా, లేక థింగ్స్ క్రిటికల్ గా వున్నాయా అర్థం కావట్లేదు. మార్నింగ్ తాతయ్య కోట్ కి పెట్టిన పెన్ కెమెరాతో ఈ గోపీ చంద్ కనిపించడం ఏంటి? అసలు ఇంకెవరూ తాతయ్య జోలికి కూడా రాలేదు చూడు. నువ్వు ఆయన్ని అడగన్నవి అడగలేదు ఎందుకని. అది తప్ప అన్నీ అడిగావు. ఆ పెన్ వీడియో లో ఆయన ఫేస్ ఎలా రికార్డు అయిందో లేఖ్ కనుక్కుని చెప్పమన్నాడు కదా. ఆ పాయింట్ వదిలేశావెందుకు?”అన్నాడు క్రిష్.
“నువ్వూ చూసావు కదా. మెల్లగా మాటల్లో పెట్టి, తర్వాత ఆ విషయమే అడుగుదామనుకున్నాను. టాపిక్ మెల్లిగా ఆయన లైఫ్ స్టోరీ మీదకి మళ్లింది. ఎంత బాధపడ్డాడో నువ్వూ చూశావుగా”
“అవునులే, ఆయన చెప్పినదంతా నిజమేనా? ఆయన లైఫ్ లో అంతులేని విషాదం వుందా? వుంటే ఏవిటి? అది చెప్పకుండా దాటేశాడు.”
“అది తెలుసుకునేలోపు మమ్మీ కళ్ళు తిరిగి పడిపోవడం. డాక్టర్ రావడం . నాకెంత భయం వేసిందో. అటు తాతయ్య, ఇటు మమ్మీ ఇద్దరూ సమస్యల్లోనే వున్నారు. మధ్యలో గోపీచంద్ అంకుల్. ఏవిటో ఈ సమాధానం లేని ప్రశ్నలు”అని నిట్టూర్చింది జ్వాల.
“గోపీ చంద్ అంకుల్ మనతో మాట్లాడుతున్నంత సేపూ మీ మమ్మీ అక్కడే వుండి వింటున్నట్టున్నారు. అతని ప్రాణం ఎవరూ అని నువ్వు అడిగినప్పుడు ఆయన ఏం చెబుతారో వినాలనుకునే లోపు మీ మమ్మీ కళ్ళుతిరిగి పడిపోవడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. వీటికి సమాధానం ఎవరు చెప్పాలి?” అన్నాడు క్రిష్.
“నాకు నడిసముద్రంలో వున్నట్టుగా వుంది క్రిష్.
మమ్మీ ఏదో విషయం నాతో చెప్పకుండా దాస్తోంది. ఒక్కసారిగా బట్టబయలైతే నేను తట్టుకోగాలనా?” అంటూ దిగులుగా క్రిష్ భుజాలపై వాలింది.
ఇంకా ఉంది...