బ్రేక్ ద సైలెన్స్. నవల నాల్గవ భాగం

స్వాతి • 08 Jun 2026 • 👁 23 views
బ్రేక్ ద సైలెన్స్. నవల నాల్గవ భాగం
4. బ్రేక్ ది సైలెన్స్

అతను జ్వాల దగ్గరకొచ్చి “నన్ను పరిశీలనగా చూసి చెప్పండి? నేను హంతకుడిలా ఉన్నానా?” అన్నాడు.
“మీరు హంతకుడని నేనన్నానా? పార్క్ లో తాతయ్య మీదకి బాల్ వచ్చి నాకు తగిలినప్పుడు దూరంగా ఒక వ్యక్తిని చూశాను. అది మీరా కాదా అని నా కన్ఫ్యూజన్. మీరక్కడికి వచ్చారా?” అనడిగింది జ్వాల.
“అందర్నీ అనుమానించడం అంత కరెక్ట్ కాదు జ్వాలా”అన్నాడు క్రిష్ మందలిస్తున్నట్టుగా.
“మీరాగండి క్రిష్. ఆవిడ నన్ను చూసినమాట నిజం. నిన్న పార్క్ లో ఫుట్ పాత్ మీద ఆవిడ వాకింగ్ కి వెళుతున్నప్పుడు, ఒక బాల్ వేగంగా వచ్చి పక్కన పడ్డప్పుడు, రెండవ బాల్ వచ్చి ఆమె ముక్కుకి తగలడం నేను చూసారు. ఆవిడ కూడా నన్ను చూసారు. యా మై రైట్?”అన్నాడు.
“కరెక్ట్ గా చెప్పారు. అక్కడొక మనిషి వున్నాడని చెప్పాను కదా. ఇతనో కాదో చెప్పలేనంత గందరగోళంగా వుంది” అంది.
“ అప్పుడు నేనక్కడే వున్నాను. కానీ మీరనుకున్నట్టుగా నేను నేరగాడ్ని కాదు. నేనూ పాదచారిగానే వచ్చాను ”అన్నాడు కాస్త కోపంగా. “ఇతన్ని ఇక్కడికెందుకు తీసుకొచ్చావు క్రిష్?” అతనివైపు అదోలా చూస్తూ.

“అసలు మీరు నన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చారు క్రిష్” అన్నాడతను. లేచి వెళ్ళబోతూ.
“ఇద్దరూ కొంచెంసేపు ఆగండి. ముందు ఒకరినొకరికి పరిచయం చేస్తాను. ఈమె జ్వాల . నా స్నేహితురాలు. ఇతను ప్రైవేట్ డిటెక్టివ్ లేఖ్.” అని చెప్పాడు క్రిష్.
“ఓహ్, నైస్ టు మీట్ యూ మిస్టర్ లేఖ్. సారీ, ఏమనుకోకండి.నేను మిమ్మల్ని పార్క్ లో చూశాననిపించింది. అందుకే మిమ్మల్ని చూడగానే అలా అడిగాను” అంది జ్వాల.
“చెప్పిందే చెప్పకు జ్వాలా,అంతా వివరంగా మాట్లాడుకుందాం. ముందు ఈ డ్రింక్ తాగి చల్లబడండి” అని నొరాతి తీసుకొచ్చిన డ్రింక్ అందించాడు క్రిష్
“బై ది వే, ఇతన్ని ఇక్కడికెందుకు తీసుకొచ్చావు. ఇతని ఆఫీస్ కి వెళ్లి కలిసేవాళ్ళం కదా” అంది జ్వాల.
“మీకు ఒంట్లో బాలేదుకదా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే వస్తానని చెప్పాను. ఇన్ఫాక్ట్ ఇందులో నా స్వార్థం కూడా వుంది. ఐ మీన్ ఈ కేస్ విషయంలో నా ఇంట్రెస్ట్ కూడా వుందని అంటున్నాను” చెప్పాడు లేఖ్.
“మీకు కూడా ఈ కేస్ మీద అంత ఇంట్రెస్ట్ దేనికి?” అడిగింది జ్వాల.
“నేను మూడు రోజుల క్రితం మీ తాతగారు వెళ్ళిన పార్కుకి వెళ్లాను. కాస్త ముందుకు వెళితే అక్కడ ఒక చిన్న గుంట కనపడింది. దానిమీద కొద్దిగా గడ్డి కప్పి వుంది. అటుగా మీ తాతగారు వస్తుండటం నేను గమనించాను. ఆయన ఆ గుంటను చూసి పక్కనుంచి వెళతారనే అనుకున్నాను. కానీ ఆయన చూసుకోకుండా అందులో అడుగు వేయబోతుండగా ఒక ముసుగుకప్పుకున్న వ్యక్తి వచ్చి ఆయన్ని పక్కకు లాగడం వల్ల, ఆయన సేవ్ అయ్యారు. ఆ వ్యక్తి మెరుపులా వచ్చి అంతే వేగంతో చెట్లల్లోకి మాయమవడం ఆశ్చర్యం కలిగించింది.” అని చెప్పాడు లేఖ్.
“తాతయ్య నాతో ఆ విషయం చెప్పనేలేదు. ఆ వ్యక్తి ఎవరో నిన్న కూడా తాతయ్యను సేవ్ చేసేందుకు వచ్చారు. ఆరోజు మీరక్కడికి ఎందుకు వెళ్లారు లేఖ్? ఎనీ స్పెసిఫిక్ రిజన్?” అడిగింది జ్వాల.
“మొన్న నా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన భార్య వల్ల వాళ్ళ నాన్నగారికి ప్రాణ హాని వుందని, ఆవిడ ఆయన్ని మర్డర్ చేయించాలని చూస్తోందని, ఎలాగైనా ఆవిడ్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని కోరాడు.
ఆమే ఆ ఎటెంప్ట్స్ చేయిస్తున్నట్టు రుజువు ఏంటని అడిగాను. అతని తండ్రి విషయంలో భార్య అతనితో రోజూ గొడవపడటం అనుమానాలకు తావిస్తోందని చెప్పాడు. వాళ్ల నాన్నగారికి చాలా సార్లు యాక్సిడెంట్స్ అయ్యాయిట. కానీ కొద్ది దెబ్బలతో తప్పించుకున్నారుట. అందుకే నన్ను రహస్యంగా కనిపెట్టమని అడిగాడు.”
“సో, ఏవిటి మీ కంక్లూజన్?”
“ఎవరో మర్డర్ అటెంప్ట్ చేస్తుంటే, ఎవరో కాపాడాలని చూస్తున్నట్టు అనిపిస్తోంది. అందుకే కొద్దికాలంగా ఆ పార్క్ మీద కన్నేసి వుంచాను”
“హంతకుడు ఆ పార్క్ కే వస్తాడని అంత నమ్మకం ఏంటి?”
“నా క్లైంట్ చెప్పిన డిటైల్స్ బట్టి, వాళ్ళ నాన్న నడిచే ఆ పార్క్ మీద దృష్టి పెట్టాను”
“ఏదైనా క్లూ దొరికిందా?”
“ఇప్పటివరకూ దొరకలేదు. అయితే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు బెంగుళూర్ వెళ్ళిపోయారు. సో, ఆ కేస్ పెండింగ్ లో వుంది. క్రిష్ వచ్చి మీ తాతయ్య గారి గురించి నాతో చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను.సరిగ్గా అలాగే జరగడం వింతగా వుంది ” లేఖ్ చెప్పటం ఆపాడు. వెనక ఏదో చప్పుడైనట్టు అనిపించి వెనక్కి తిరిగారు ముగ్గురూ.
అక్కడ గోపీ చంద్ వున్నాడు.
“ఎప్పుడొచ్చారంకుల్?” అంది జ్వాల.
“జస్ట్, ఇప్పుడే” అని వాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అతను ఒకప్పుడు వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్. గత కొంతకాలంగా ప్రాక్టీసు మానేశాడు. మెడికల్ కళాశాలలో
వారానికి రెండు లెక్చర్స్ ఇస్తున్నాడు. అతనికి నా అనేవాళ్ళు ఎవరూ లేరనిబాధపడుతుంటాడు.విశ్వనాథ్ దగ్గరకు వచ్చిపోతుంటాడు.
“తాతయ్య ఎలా వున్నారు?” అడిగాడు గోపీ చంద్ లోపలికి తొంగి చూస్తూ. “తాతయ్య రూమ్ లోకి వెళ్లి చూడండి. ఆయన లేచి వుంటారు. నొరాతీ, తాతయ్యకీ, అంకుల్ కీ కాఫీ ఇవ్వు”అంది జ్వాల.
“మీరు ఏదో సీరియస్ డిస్కషన్ లో వున్నట్టున్నారు. ప్లీజ్ క్యారీ ఆన్” అని విశ్వనాథ్ రూమ్ లోకి వెళుతుంటే పైనుంచి చూస్తున్న సౌదామిని వంక ఒక్క క్షణం చూసి తలవంచుకుని విశ్వనాథ్ గదిలోకి వెళ్లిపోవడం జ్వాల చూసింది.
భూమి బద్దలవుతున్నా పట్టించుకోని తన తల్లి, గోపీ చంద్ అంకుల్ రాగానే బయటకు వచ్చి చూస్తుంది ఎందుకు? అతనిని అర్ధిస్తున్నట్టుగా వుంటాయి ఆమె కళ్ళు. అతను మన్నించమన్నట్టుగా తలవంచుకుంటాడు. ఏం జరుగుతోంది?
“మిస్ జ్వాలా, మీరొక పనిచేయండి” అన్నాడు లేఖ్.
అతని పిలుపుకి ఈలోకంలోకి వచ్చి
“ఎస్, చెప్పండి ” అని అతనివంక చూసింది.
“రేపు మనం తాతగార్ని తీసుకుని మళ్ళీ అదే పార్క్ కి వెళదాం. మనం దూరం నుంచి అబ్జర్వ్ చేద్దాం. నేను నా బైనాక్యులర్స్ తో దూరం నుంచి చూస్తుంటా. ఆయన మీద ఎటాక్ చేస్తున్న వాళ్ళు మన చేతికి చిక్కక తప్పదు. ఈ విషయం మన ముగ్గురికీ తప్ప ఎవరికీ తెలియకూడదు. ఇంకో విషయం. తాతగారి ఫ్రంట్ పోకెట్ లో పెన్ కెమెరాతో వీడియో ఆప్షన్ ఆన్ చేసి వుంచుతాను. ఆయన నడుస్తూ వెళుతుంటే ఆయన ముందున్న దృశ్యాలు అందులో రికార్డ్ అవుతాయి. రేపటితో మనకి ఈ విషయం గురించి ఒక క్లారిటీ వచ్చేస్తుంది”అన్నాడు. అతను చెప్పింది ఇద్దరికీ నచ్చింది.
“గుడ్ ఐడియా. తాతయ్య వెనకాలే మనం కూడా వెళ్ళాలి. బట్ ఈసారి ఎలర్ట్ గా ఉందాం”
“ఎందుకైనా మంచిది. తాతగారి తలమీద హ్యాట్ కింద తలపాగా చుడదాం.బాల్ లాంటివి దూసుకొచ్చి తగిలినా దెబ్బ తగలకుండా వుండటానికి” అతను చెప్పింది విన్నాక సరే అన్నారు ఇద్దరూ.
విశ్వనాథ్ తో మాట్లాడి బయటకు వచ్చాడు గోపీ చంద్. “ఎవరితను?” లేఖ్ వైపు చూస్తూ అడిగాడు.
“హి ఈజ్ మై ఫ్రెండ్ అంకుల్ ” జ్వాల, క్రిష్ ఒకేసారి అన్నారు .
గోపీ చంద్ ఇద్దరివైపు వింతగా చూసి
“ఇద్దరికీ ఫ్రెండేనా” అనడిగాడు.
“అవునంకుల్”అన్నారు మళ్ళీ.
“ఓకే మీరు మాట్లాడుకోండి. నేను వెళతున్నాను” అని లేఖ్ వైపు చూసి
“నిన్ను ఎక్కడో చూసినట్టుంది. మనకి ఇంతకు ముందు పరిచయం వుందా?” అని గోపీ చంద్ అడగ్గానే ముగ్గురూ ముఖాలు చూసుకున్నారు.
“ఏస్ అంకుల్, డాక్టర్ విజయ గారి అమ్మాయి డాక్టర్ జ్వలిత గారి పెళ్ళిలో కలిసినట్టున్నాం. యామై రైట్?”
“ఏస్, గుర్తొచ్చింది. ఆరోజు ఆమె మెడలో డైమండ్ నెక్లెస్ పోయిందని చాలా హడావిడి జరిగింది. గేట్స్ మూసేసి అందర్నీ సోదా చేసారు. కొంతమంది అలా అడిగినందుకు ఇన్సల్ట్ గా ఫీలయ్యారు. చివరకు ఆ నెక్లెస్ ఆమె వేసుకున్న లాంగ్ ఫ్రాక్ కుచ్చెళ్ల మడతల్లో వుందని గుర్తించింది మీరే అనుకుంటా.
యా మై రైట్”అన్నాడు గోపీచంద్.
“ఏస్ అంకుల్, వచ్చినవాళ్ళను సెర్చ్ చేసినందుకు డాక్టర్ గారు పేరు పేరునా క్షమాపణలు చెప్పారు. నాకు గుర్తుంది”
“ఆ నెక్లెస్ అక్కడే వుందని మీరెలా కనిపెట్టారు?” ఆసక్తిగా అడిగాడు గోపీచంద్.
“ఆమె వేసుకున్న డైమండ్ నెక్లెస్ ఆవిడ వైట్ డ్రెస్ కలర్ లో కలిసిపోయింది. కానీ ఆ నెక్లెస్ హుక్ కి అటూ ఇటూ అమర్చిన రెండు రూబీస్ వైపు దృష్టి పెట్టాను. ఆమె తెలుపు డ్రెస్ పై గులాబి రంగులో ఏదైనా వుంటుందేమో అని చూశాను. అప్పుడు కనిపించింది ఆ నెక్లెస్”
“రెండు రూబీలు వున్నాయని ఎలా తెలుసు మీకు?”
“వాళ్ళ మదర్ పక్కనున్న ఎవరితోనో మాట్లాడుతూ డైమండ్స్ ఇండియాలోనే. కానీ ఆ రెండు రూబీస్ ప్రత్యేకంగా బర్మా నుంచి తెప్పించామని చెబుతుంటే ఉన్న విన్నాను.”
“యువర్ అబ్జెర్వేషన్ ఈజ్ అల్టిమేట్. గ్రేట్. మీరు డిటెక్టివ్ ప్ప్రొఫెషన్ కి బాగా సూట్ అవుతారు. బెస్ట్ ఆఫ్ లక్” అన్నాడు. ముగ్గురూ మళ్ళీ మొహాలు చూసుకున్నారు.
“ఓకే గైస్, క్యారీ ఆన్. తాతయ్య బానే వున్నారు. అవసరం వుంటే కాల్ చేయండి” అని చెబుతూ యాధాలాపంగా తలపైకెత్తి చూశాడు.
అక్కడ సౌదానిని నిలబడి వాళ్ళని చూస్తోంది. అతను వెంటనే తలొంచుకుని వెళ్ళిపోయాడు. జ్వాల వాళ్ళిద్దర్నీ చూసింది. మనసులో ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. అంకుల్ వచ్చినట్టు మమ్మీకి ఎలా తెలిసింది? నొరాతి వెళ్లి చెప్పిందా? అని ఆమె అలా ఆలోచిస్తుంటే క్రిష్ చిటికెలు వేసి జ్వాలను పిలిచాడు
“హలో, మరీ అంతలా వేరేలోకాల్లో వుండిపోకు. రేపు మార్నింగ్ వాకింగ్ లో కలుద్దాం. బీ రెడీ. నౌ టేక్ రెస్ట్”అన్నాడు క్రిష్. ఆమె అతనివైపు చూసి నవ్వుతూ
“ఓకే, రేపు కలుద్దాం” అని చెప్పి వాళ్ళను గేటుదాకా వెళ్ళి వాళ్ళను పంపించి వచ్చింది.
జ్వాల పై అంతస్తులోవున్న తల్లి రూమ్ కి వెళ్ళింది
ఆమె పూజ గదిలో కూర్చుని ఏవో మంత్రాలు చదువుతోంది.
“మామ్, ఇటొస్తావా? ఒకసారి మాట్లాడాలి” అంది మెల్లగా.
కొద్దిసేపటికి బయటకు వచ్చింది సౌదామిని. “తాతయ్యకు ఈ మధ్య ఒంట్లో బాగుండట్లేదా మమ్మీ?! ఎందుకో వీక్ గా కనపడుతున్నారు” అంది జ్వాల తల్లి ముఖాన్ని గమనిస్తూ
“అలాంటిదేం లేదనుకుంటా. ఆయన పనులు ఆయనే చేసుకుంటారు. పెద్దవయసు వచ్చేసింది. ఈమధ్య కాస్త జ్ఞాపకశక్తి తగ్గి తడబడుతున్నారని నొరాతి చెప్పింది. జాగ్రత్తగా చూసుకోమని పనివాళ్ళందరితో చెప్పాను” అంది సౌదామిని. కొద్దిసేపు ఆ మాటా ఈమాటా చెప్పాక
“ మమ్మీ, గోపీ చంద్ అంకుల్ మనింటికి తరచుగా వస్తుంటారా? తాతయ్యకీ ఆయనకీ బాగా పరిచయం వుందా?” అనడిగింది జ్వాల.
“ఆయన మన శ్రేయోభిలాషి. అలాంటి మంచివాళ్ళు అరుదుగా వుంటారు. పాపం ఆయనది ఒక విషాద గాధ”అంది సౌదామిని విచారంగా.
“అవునా, ఏంటది. చెప్పు మమ్మీ”అంది.
“నువ్వు ఇంకా చిన్నపిల్లవి. ఆయనగురించి ఆలోచించకు” అంది.
“సరే మమ్మీ, నువ్వు ఎప్పుడూ అలా ఒంటరిగా ఆ గదిలో కూర్చుని వుండకమ్మా. అప్పుడప్పుడూ కింద హాల్లోకి వస్తూవుండు” అంది. “అలాగే” అని చెప్పి మళ్ళీ పూజ గదిలోకి వెళ్ళిపోయింది సౌదామిని. అసలు ఆ గదిలో ఏముంది? ఎప్పుడూ అందులోకి వెళ్లి ఏం చేస్తోంది? అనుకుంటూ జ్వాల దేవుడి గది వైపు వెళ్ళింది. ఆమె రావటం చూసిన సౌధామిని దేవుడి తలుపులు మూసి బయటికి వచ్చింది. “ఏం తల్లీ, ఇంకేమన్నా కావాలా?” అనడిగింది సౌదామిని కూతురి తలని ప్రేమగా నిమురుతూ. “ఏం లేదమ్మా. నేను కిందకి వెళుతున్నాను” అని చెప్పి వచ్చేసింది జ్వాల.
మర్నాడు తాతయ్యని వాకింగ్ కి ఎలా తీసుకువెళ్లాలి. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి .అని ఆలోచించడం మొదలు పెట్టింది. తను కొన్న పెన్ కెమెరాని తాతయ్య షర్టుకి తగిలించి వీడియో తీయాలి అనుకుంది. దాన్ని ఆన్ చేసి తన షర్ట్ కి పెట్టుకుని వీడియో రికార్డు చేసి చూసుకుంది. బాగానే వచ్చిందని సంతృప్తిగా దాన్ని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టింది. తాతయ్యకి కాస్త దూరంలో వెనకనుంచి జాగ్రత్తగా ఫాలో అవ్వాలి ఎలా అని ఆలోచిస్తూ ఆ రాత్రి నిద్రలోకి జారుకుంది .తెల్లవారుజామున అలారం మోగగానే లేచింది. క్రిష్ నుంచి ఫోన్ వచ్చింది.
“ హలో జ్వాలా, రెడీనా?” అని అడిగాడు “ఎస్ ఐ యాం రెడీ .వాట్ అబౌట్ లేఖ్ ?”
“హి ఈజ్ ఆల్సో రెడీ. తాతయ్య లేచారో లేదో చూడు” అన్నాడు. సరే అని వెళ్లి తాతయ్య రూమ్ లో చూసింది అప్పటికే ఆయన లేచి కాలకృత్యాలు తీర్చుకున్నాడు.
“గుడ్ మార్నింగ్ తాతయ్యా, వాకింగ్ కి వెళదామా?” అంది .
“ఎస్ బేబీ ఐ యామ్ రెడీ” అన్నాడు హుషారుగా. జ్వాల జీన్స్ ప్యాంట్ టీ షర్టు వేసుకుని వచ్చింది. బయట కారు హారన్ మోగటంతో విశ్వనాథ్ ని తీసుకొని బయటికి వచ్చింది జ్వాల. విశ్వనాథ్ చలికి స్వెటర్ వేసుకుని మంకీ క్యాప్ పెట్టుకున్నాడు చేతిలో వాకింగ్ స్టిక్ కూడా లేదు. జ్వాల చెయ్యి పట్టుకుని నడుస్తూ వచ్చి కారెక్కాడు.అందరూ కార్లో పార్క్ కి వెళ్ళారు.
పార్కులో అప్పుడే సందడి మొదలైంది విశ్వనాథ్ ఎప్పుడూ నడిచే చోట,ఫుట్పాత్ వైపు ముందుగానే వెళ్లి సెర్చ్ చేసి వచ్చారు లేఖ్ , క్రిష్
అక్కడ వాళ్ళకి ఎవరూ కనబడలేదు. పెన్ కెమెరా ఆన్ చేసి విశ్వనాథ్ సెట్టర్ కి తగిలించింది జ్వాల. అతను మెల్లిగా నడక ప్రారంభించాడు. ఆ వెనక జ్వాల నడుస్తూ వస్తోంది. క్రిష్ వాళ్ళ వెనక కాస్త దూరంలో నడుస్తూ వచ్చాడు. లేఖ్ బైనాక్యులర్స్ తో జాగ్రత్తగా అంతా చూస్తున్నాడు . విశ్వనాధ్ వాకింగ్ ట్రాక్ మీద చివరిదాకా నడిచి వెళ్లి, మళ్లీ వెనక్కి తిరిగి వచ్చాడు .అలా రావటానికి దాదాపు అరగంట పైనే పట్టింది ఆ అరగంటలో వాళ్ళకి అనుమానించదగ్గ వ్యక్తులు ఎవరూ కనపడలేదు. ఈరోజు తాతయ్య సేఫ్ అనుకుని చాలా సంతోషించింది జ్వాల.సూర్యుడు తూర్పు కొండలపైకి ఎగబాకుతున్నాడు అందరూ కలిసి ఇంటికి వచ్చారు విశ్వనాధ్ తన గదిలోకి వెళ్లిపోయాడు లేఖ్ ,క్రిష్ జ్వాల గదిలోకి వెళ్లారు. జ్వాల విశ్వనాథ్ స్వెట్టర్ కి తగిలించిన పెన్ కెమెరాని ముందే తీసుకుంది. కంప్యూటర్ కి అటాచ్ చేసింది. వీడియో ప్లే అవుతుంటే ముగ్గురూ దానివంక సీరియస్ గా చూస్తున్నారు. రోడ్డు క్లియర్ గా కనపడుతోంది. అక్కడ ఎవరూ లేరు చెట్లు మాత్రమే కనబడుతున్నాయి. “క్రిష్, ఈరోజు వాడు రాలేదంటే మనసు మార్చుకున్నాడంటావా?” అంది జ్వాల.
“వాడు మనసు మార్చుకున్నాడో, చొక్కా మార్చుకున్నాడో చెప్పాల్సింది మనం కాదు. ఈ అపరాధ పరిశోధకుడు” అని లేఖ్ వంక చూసాడు.
మరోసారి వీడియో ప్లే చేశాడు లేఖ్. పొడవాటి రోడ్డు, పచ్చని చెట్లు, ఎగిరే పక్షులు ఇవన్నీ కనపడ్డాయి. రికార్డు పూర్తవుతుండగా చివరి మూడు సెకన్ల ముందు ఒక వ్యక్తి ముఖం కనపడింది. వెంటనే పక్కకు వెళ్ళినట్టుగా అందులో రికార్డు అయింది. దాన్ని మళ్ళీ వెనక్కి ప్లే చేసి చూశారు. కొన్ని సెకన్లు కనపడి మాయమైన మొహం గోపీచంద్ ది.
“ స్టాప్ స్టాప్ ఆపు. గోపీచంద్ అంకుల్ లా వున్నాడు. ఆయన మొహం ఇందులో రికార్డ్ కావడం ఏంటి? ఆయన మనతో రాలేదు. అక్కడికి వస్తున్నట్టు కూడా మనకు చెప్పలేదు. సడన్ గా ఎలా వచ్చారు. నిన్న మనం మాట్లాడుకున్న మాటలు విన్నారేమో? అందుకే మనల్ని ఫాలో అయ్యారేమో” అంది జ్వాల.
“నిన్న మన మాటలు ఆయన వినే వకాశం లేదు. బట్ కొన్ని క్షణాలు కనిపించిన మొహం ఆయనదే అంటావా? పిక్చర్ చాలా లైట్ గా వుంది”
అన్నాడు క్రిష్.
“ఒకపని చేద్దాం. ఆయన ఇక్కడికి వచ్చాక మనం తెలివిగా అడిగి ఆయన నుంచి విషయాలు రాబట్టాలి, మనం ఈ విషయాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు ఆయనకి తెలియకూడదు” అన్నాడు లేఖ్.
“సరే, ఆయన్ని ఎవరడుగుతారు? ఏమని అడగాలి?” అంది జ్వాల.
“మిస్ జ్వాలా, మీరే మెల్లిగా అడిగి ఆయననుంచి వివరాలు రాబట్టాలి.ఆయన చెప్పే సమాధానం చాలా ప్రశ్నల్ని బద్దలు చెయ్యాలి”
“ఆయన్ని అసలు ఏం అడగాలి?”
“ పార్క్ కి మీరు వచ్చారా అంకుల్. మీలాగే ఒకతను కనిపించాడు. అచ్చం మీలా వున్నాడని చెప్పు. ఏమంటారో చూద్దాం”
“సరే, అడుగుతాను. ఇంకా..”
“మేం పార్క్ కి వెళ్ళినప్పుడు తాతయ్య మీద ఎవరో ఎటాక్ చేయబోయారు త్రుటిలో ప్రమాదం తప్పిందని చెప్పు. ఆయన రెస్పాన్స్ చూద్దాం.ఎనీ హౌ ఒక చిన్న క్లూ అయినా ఆయన నుంచి రాబట్టగలిగితే చాలు.” అన్నాడు లేఖ్.
“నాకెందుకో కంగారుగా వుంది. ఎవరో సైలెంట్ గా ఇదంతా వాచ్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది .నా చుట్టూ అదృశ్యమైన ఒక దృష్టి ఉన్నట్టుగా ఫీలింగ్ వస్తోంది. క్రికెట్ మైదానంలో లైట్స్ వెలుతురులో
అందరూ ఒకేసారి దొరికిపోవాలి అనుకుంటున్నాను. అలాంటి వ్యూహం ఆలోచించాలి.” అంది జ్వాల సీరియస్ గా.
“ఈరోజు తాత గారి మీద ఎటువంటి అటెంప్ట్ జరగలేదు. ఇది గుడ్ సైన్.
ఈ విషయం మన ముగ్గురు మధ్య ఉండాలి. నేను వెళతాను. గోపీచంద్ గారు వస్తే తప్పకుండా అతన్ని అడిగి తెలుసుకోండి”అని లేఖ్ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక క్రిష్ జ్వాల దగ్గరికి వచ్చాడు. ఆమె చాలా ఆందోళనగా కనపడింది
“జ్వాలా, నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు . నీ హెల్త్ కి మంచిది కాదు .ప్లీజ్ కొన్ని విషయాలు మర్చిపోవాలి. కొన్నిటిని ప్రస్తుతానికి పక్కన పెట్టాలి. నీ ఏజ్ ఏంటి నీ సీరియస్ నెస్ ఏంటి? హ్యాపీగా ఉండొచ్చుగా. కొద్దిసేపైనా ఆ విషయం పక్కన పెట్టిన, మంచి మూడ్ లోకి రా” అన్నాడు ఆమె జుట్టు సవరిస్తూ. ఆమె బ్రేక్ డౌన్ అయి అతని భుజంపై వాలి ఏడుస్తూ
“క్రిష్, ఇండియా వచ్చి ఎంజాయ్ చేయాలని నాకు మాత్రం వుండదా. కానీ వాటన్నిటినీ ఎంజాయ్ చేసే మూడ్ ప్రస్తుతం నాకు లేదు.
తాతయ్యకి ఏ ప్రమాదం లేదని తెలిస్తే చాలు. నా అంత సంతోషించే వాళ్ళు ఇంకెవరూ ఉండరు. హాయిగా రెక్కలు విప్పుకున్న పక్షిలా ఆకాశంలో ఎగిరిపోతా, నెమలిలా నాట్యం చేస్తా. నాకు తాతయ్య అంటే ప్రాణం. ఆయన లేకపోతే నా లైఫ్ లో ఏమీ లేనట్టే.”
అందిజ్వాల ఉద్వేగంగా.
“ఎస్ ఐ నో జ్వాలా, ప్లీజ్ కంట్రోల్ యువర్సెల్ఫ్ .”అంటూ ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. కొద్దిసేపు ఆమె అతని సన్నిధిలో అలా ఉండిపోయింది.
వెంటనే తేరుకుని అతనికి దూరంగా జరిగింది. “ఏయ్, ఏవైంది?”అన్నాడు.
“ఇలాంటి సమయంలో ఈ పనులేంటి? కాస్త దూరంగా వుండు. ఎవరైనా ఇటుగా వస్తేఏమనుకుంటారు?”అంది సిగ్గు పడుతూ అతని చేతుల్ని సున్నితంగా విడిపించుకుని.
“వై, ఇందులో తప్పేంటి? యు ఆర్ మై ఏంజెల్.నా కాబోయే భార్య. మనం తప్పు చేయట్లేదుగా ” అన్నాడు. ఆమె బుగ్గల్ని రెండు చేతుల్లోకి తీసుకుని కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ. ఆమె అతని చూపుల వేడికి కరిగిపోతూ, అతని స్పర్శకు మైమరిచిపోతూ వుంది. ఆమె శరీరం నిదానంగా రిలాక్స్ అవుతూ, అంతకు ముందు వరకూ పడిన టెన్షన్ మర్చిపోతూ హాయిగా ఫీలైంది.
అరమోడ్పులైన కళ్ళతో అతన్ని చూస్తూ మూగబాసలేవో చెప్పింది. ఆమె చిరునవ్వు అతని సమ్మోహితుడిని చేసింది. ఆతని కళ్ళు కూడా ఆమె తేనె కళ్ళ చుట్టూ తుమ్మెదలా పరిభ్రమించాయి
ఇద్దరు కళ్ళు కలుసుకుని ఇద్దరి మధ్య జరుగుతున్న కెమిస్ట్రీకి నవ్వుకుంటూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఒకరంటే ఒకరికున్న ప్రేమని కళ్ళతో చెప్పుకుంటూ కాసేపు అలానే వుండిపోయారు. అంతలోనే ఒక అరుపు వినిపించేసరికి ఇద్దరూ ఉలిక్కిపడి ఈలోకంలోకి వచ్చారు.
“మేమ్ సాబ్, జల్ది ఆయియే” అని కింద నుంచి మెయిడ్ నొరాతి అరిచి చెప్పింది.
“జ్వాలా, కింద ఎవరో అరుస్తున్నారు. త్వరగా పద”అన్నాడు క్రిష్.
ఇద్దరూ ఒక్కసారిగా కంగారుగా కిందకి పరిగెత్తారు.




ఇంకా ఉంది