అరుదైన వ్యక్తిత్వం ( కథ ) (మే 2024 మాధురి మాసపత్రికలో ప్రచురితం )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
మాధవ్ విశ్వనాధ్ అండ్ కో దగ్గర రిప్రజెంటేటివ్ గా పని చేస్తున్నాడు. కుమార్ పనిచేస్తున్న కంపినీలో ఉత్పత్తి అయ్యే సరుకులను దగ్గరుండి లారీలతో పంపిస్తూ ఉంటాడు. ఈ ప్రహసనం నెలకు కనీసం రెండు మూడు సార్లైనా ఉంటుంది.
అతను తిరిగి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు కుమార్ కూడా అతనితో పాటు వెళుతూండే వాడు. మాధవ్ అతనికి కూడా టికెట్ తీసుకోవడానికి ప్రయత్నం చేసినా కుమార్ ససేమిరా ఒప్పుకునే వాడు కాదు. అతని స్తానంలో ఇంకెవరూ ఉన్నా ఖచ్చితంగా ఆ అవకాశాన్ని వదులుకునే వాళ్ళు కారు. ఇది ఇలా ఉంటే హైదరాబాద్ లోని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ విశ్వనాధ్ అండ్ కో యజమాని విశ్వనాధ్ మటుకు కుమార్ పని చేస్తున్న కంపినీలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రయోజనం లేకపోతే చచ్చినా పని చెయ్యరు అని గ్రహించి ఏదో రూపంలో వాళ్ళకు డబ్బో లేక సేవలో చేస్తూ తమ పబ్బం గడుపుకునే వాడు. పిల్లల పుస్తకాలనుండి రైల్ టిక్కెట్ల వరకు ప్రతి ఒక్కరూ ఆ డిస్ట్రిబ్యూటర్ నుండి ప్రయోజనం పొందని వాళ్లంటూ లేరు. అయితే ఒక్క కుమార్ మాత్రం వాళ్ళకు కొరకరాని కొయ్యలాగా మారాడు. నిజాయితీకి అతను నిలువెత్తు నిదర్శనం అని అందరూ చెప్పుకుంటారు. అక్కడే వచ్చింది విశ్వనాథ అండ్ కో వాళ్ళకు సమస్య. డబ్బుతో ఆ కంపినీలో ప్రతి ఒక్కరినీ కొని తమ పనులు చక్కబెట్టుకోవడం అలవాటైన విశ్వనాధ్ కుమార్ చేత సహాయం పొందడానికి ఇబ్బంది పడే వాడు.
అయితే అంత ముక్కు సూటిగా వెళ్ళే కుమార్కు కూడా ఒకరోజు విశ్వనాధ్ అండ్ కంపినీ వాళ్ళ అవసరం వచ్చింది. ఆ మధ్య అతనికి గుండెకు సంబంధించిన ఏదో సమస్య రావడం, దానికి కనీసం ఐదు సంవత్సరాలైనా విడవకుండా మందులు వాడ వలసి ఉంటుందని డాక్టర్లు చెప్పడంతో దానికి అతనికొచ్చే జీతంలో చాలా శాతం వాటికే ఖర్చు పెట్టాల్సి వస్తోందని ఏదో మాటల సందర్భంలో అతని పై బాస్ రాజేష్ కు చెప్పడంతో అతను కుమార్ వైపు జాలిగా చూస్తూ " నువ్వు నిజాయితీ అంటూ పట్టుకుని వేలాడటం వల్లే చాలా ఇబ్బందులు పడుతున్నావు. నువ్వు ఒప్పుకుంటే హైదరాబాద్ లోని మన డిస్ట్రిబ్యూటర్ విశ్వనాధ్ అండ్ కంపినీ వాళ్ళకు చెపుతాను. వాళ్ళు మొత్తం నీకు అయ్యే డాక్టర్ల ఫీజు, మందులు వాళ్ళే భరిస్తారు. మనం వాళ్ళకు మన కంపినీ నుండి సరుకు పంపిణీ చెయ్యడంలో నువ్వు దగ్గరుండి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నావని అందుకు విశ్వాసంగా ఎంతో కొంత నీకు కూడా ఉపయోగపడాలని అనుకుంటున్నట్టు నాతో చాలా సార్లు అనడం జరిగింది. . ఇందులో తప్పేమీ లేదు. ప్రైవేట్ కంపినీలలో దొరికే అరకొరా జీతాలతో జీవితాలను లాక్కురావడం చాలా కష్టసాధ్యం. . అవకాశం దొరికినప్పుడు ఇటువంటి పై ఆదాయాల మీద, సేవల మీద ఆధారపడాల్సిందే. నువ్వు "ఊ" అంటే ఒకసారి హైదరాబాద్ పంపిస్తాను. . నీ టికెట్ కూడా విశ్వనాధ్ కంపెనీ వాళ్ళే భరిస్తారు. . ఈ అవకాశం ఉపయోగించుకో . ఇక ఆలోచించకు. " అంటూ సలహా ఇవ్వడంతో కుమార్ తన బాసు రాజేష్ తో తీవ్రంగా విబేదించాడు. "ఇటువంటి రక్తపు కూడు నేను తినదల్చుకోలేదు. మనం వాళ్ళ మీద ప్రతి దానికీ ఆధాపడి బ్రతుకుతూ ఉంటే వాళ్ళు మనకు ఇంకా ఏమి విలువ ఇస్తారు ? డబ్బులు పారేస్తున్నాం కాబట్టి చచ్చినట్టు వాళ్ళ పని మనం చేసిపెట్టాలి అని డిమాండ్ చేస్తారు. అందులోనూ మన ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళ నుండి ఫ్రీగా ఒక్క రూపాయి తీసుకున్నా అది మనకు అచ్చిరాక పోగా మన రోగాలు మరింత పెరుగుతాయి. . న్యాయంగా మనకు మన కంపినీ నుండి రావలసిన మెడికల్ రీ- ఎంబర్స్మెంట్ వస్తే చాలు. ఏది ఏమైనా నాకు మీరు ఏదో రకంగా సహాయం అందాలని మీరు చేయబోయే ప్రయత్నానికి కృతజ్ఞుడిని. మరీ అత్యవసర పరిస్తితులలో వాళ్ళ మీద ఆధార్పడాల్సి వస్తే అప్పుడు చూద్దాం " అంటూ బాస్ ప్రపోజల్ కు ఆనకట్ట వేశాడు కుమార్. రాజేష్ కు ఈ విషయంలో కొంత నామోషీగా అనిపించింది. తను చాలా రకాలుగా ఎన్నో విషయాలలో విశ్వనాధం అండ్ కంపినీ వాళ్ళ మీద ఆధార పడటమే కాకుండా ఎన్నో ప్రయోజనాలు పొందాడు. ఆ విషయం ఆ కంపినీలో చాలా మందికి తెలుసు. "తిలా పాపం తలా పిడికెడు" అన్నట్టు ఆ పాపం తనొక్కడే అనుభవించడం కన్నా తన డిపార్ట్మెంట్లో ఉన్న మిగిలిన వాళ్ళకు కూడా ఎంతో కొంత పంచాలని అతని ప్రయత్నం .
తన ఆరోగ్య సమస్యల దృష్ట్యా ఎప్పుడో ఒకప్పుడు హైదరాబాద్ వెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా ఆ టెస్టులేవో పూర్తిగా తన డబ్బుతోనే చేయించుకుని రావాలని అతని మనసులో ఉంది. అయితే ఈ లోపు అతనికి కావలసిన మందులు ఆ ఊళ్ళో స్టాక్ అయిపోవడం వల్ల అనుకోని పరిస్తితిలో విశ్వనాధ్ అండ్ కో వాళ్ళకు చెప్పాల్సి వచ్చింది హైదరాబాద్ లో కొని అర్జెంట్ గా కొరియర్ తో పంపించమని. అంతమంది తమనుండి దొడ్డిదారిలో సహాయం పొందుతున్నా , కుమార్ మాత్రం నోరుతెరిచి ఎప్పుడూ తనకు ఇది కావాలని ఏదీ అడగక పోవడం విశ్వనాధ్ అండ్ కంపినీ వాళ్ళకు తలకొట్టేసినట్టుగా ఉంది. పోనీ అతనేమీ ముఖ్యమైన వ్యక్తి కాదులే అనుకుందాం అంటే ఆ ఆఫీసులో కుమార్ మంచి హార్డ్ వర్కర్. అతను సరుకు ప్లాన్ చేస్తేనే లారీలో ఎక్కుతుంది. ఆ తర్వాత ఏవైనా క్రెడిట్ నోట్లు లాంటివి ఇష్యూ చెయ్యాలంటే అతని చెయ్యి అందులో పడకపోతే నడవదు. అంత ముఖ్యమైన వ్యక్తినుండి తాము లాభం పొందుతున్నా అతనికి ఏ విధంగానూ ఉపయోగపడలేక పోవడం వాళ్ళకు చిన్నతనంగా ఉంది .
ఇప్పుడు కుమార్ ఆ వూళ్ళో తనకు దొరకని అర్జెంట్ మందులు కోసం ఫోన్ చేసి చెప్పడం విశ్వనాధ్ అండ్ కంపినీ వాళ్ళకు తలమీద పాలు పోసినట్టయ్యింది. ఆ తర్వాత రోజే వాళ్ళ మనిషి మాధవ్ మందులు పుచ్చుకుని రెక్కలు కట్టుకుని వాలాడు. అన్నీ సరిగ్గానే ఉన్నాయి అని చూసుకున్నాక డిస్ట్రిబ్యూటర్ కు ఫోనులో ధన్యవాదాలు చెప్పి బిల్లు ప్రకారం రెండు వేల రూపాయలు మాధవ్ కు ఇచ్చి మీ వాళ్ళకు ఈ డబ్బు ఇచ్చేసెయ్యండి " అని చెప్పాడు.
" లేదు సార్. మీ దగ్గర నుండి డబ్బు తీసుకోవద్దని సీరియస్గా చెప్పేశారు మావాళ్లు." అంటూ వెనక్కి ఇచ్చేయబోయాడు మాధవ్ . కుమారుకు బాగా కోపం వచ్చింది. తన విషయం పూర్తిగా తెలిసినా వాళ్ళు ఏదో రకంగా తనని ఇబ్బంది పెట్టాలని చూడటం అతనికి నచ్చలేదు. . వెంటనే ఫోన్ తీసుకుని విశ్వనాధ్ అండ్ కో కు కాల్ చేశాడు. అడగంగానే నా మందులు కొరియర్ తో పంపమన్నా కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకుని మీ మనిషి చేత పంపించినందుకు మీకు ధన్యవాదాలు. కానీ ఈ మందులకు మీరు నా నుండి డబ్బు తీసుకోవద్దని చెప్పడం నాకు నచ్చలేదు. నేను మీకు మా కంపినీ ద్వారా చేస్తున్న నేను చేస్తున్న పనులకు దీనికీ ముడి పెట్టకండి. అందుకు మా వాళ్ళు నాకు నెలనెలా నా పనికి తగ్గ జీతం ఇస్తున్నారు. కాబట్టి ఇంకా ఈ విషయంలో నేను ఎవరినుండి ఆశించాల్సిన అవసరం లేదు. దీనికైన బిల్ అమౌంట్ ఆల్రెడీ మీ వాడికి ఇచ్చేశాను." అని మర్యాదగా చెప్పి ఫోన్ పెట్టేశాడు.
** ** **
కుమార్ బాసు రాజేష్ తన కూతురు పెళ్లి ఉండటంతో గత ఇరవై రోజులుగా సెలవులో ఉన్నాడు. ఏదైనా అర్జెంట్ పని ఉంటే ఇంటినుండే డీల్ చేస్తున్నాడు. అతని పేరు మీద ఎన్నో స్కాములు వున్నా వాటిలో అతని పై వాళ్ళకు కూడా బాగం ఉండటంతో రాజేష్ ను ముట్టుకునే వాళ్ళు లేరు. కంపినీలో ఉత్పత్తి అవుతున్న సరుకును బట్వాడా చెయ్యడంలోనూ, డిస్ట్రిబ్యూటర్లను, ట్రాన్స్పోర్టర్లను అపాయింట్ చెయ్యడంలోనూ అతను లక్షలు ఆర్జించాడని చెప్పుకుంటూ ఉంటారు. అందుకు అతని కింద పనిచేసే కింద స్టాఫ్ ను కూడా వాడుకుని వాళ్ళకు కూడా లాభం చేసినట్టు అందరికీ తెలుసు. అంతకు ముందే రాజేష్ కూతురుకు మెడిసిన్లో సీటు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా డిస్ట్రిబ్యూటర్ సహాయం పొందాడు. ఈ విషయంలో ఒక వైస్ ప్రెసిడెంట్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కు చెప్పి ఆ ఏర్పాటు చేయించాడు. అక్రమార్జనలో ఆయన వాటా కూడా లక్షలు దాటిపోయిందని మేనేజ్మెంట్ కు తెలిసినా అతని వల్ల సంస్థకు కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తూండటంతో ఆ రహస్యాలన్నీ మరుగున పడిపోయాయి.
"కుమార్ గారు .మీ బాసు రాజేష్ గారు సెలవులో ఉన్న సందర్భంగా మీరు మాకు చేస్తున్న సహాయ సహకారాలు మరువలేనివి. మీ మందుల బిల్లు కైన ఖర్చు రెండు వేల రూపాయాలు మీరు మా మనిషికి ఇవ్వబోయినా మా కోరిక మన్నించి దయతో వెనక్కి తీసుకున్నందుకు మేము సర్వదా కృతజ్ఞులం. . మీ బాసు రాజేష్ గారు మీలాగా మొహమాట పడే మనిషి కాదు. వారి అమ్మాయి చదువు దగ్గర నుండి హైదరాబాద్లో వారి కుటుంబానికి అయ్యే ఖర్చు అంతా మేమే భరిస్తున్నాము. ఆయనతో సమానంగా మీరు కూడా మీ కంపినీలో కష్టపడుతున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ప్రస్తావన తీసుకొస్తున్నాం అంటే మీరు ఏ విషయంలోనూ మొహమాట పడకండి. మాకు మీ సహాయం కావాలి. అందుకు మేము మిమ్మల్ని అనుక్షణం చూసుకోవాలి. ఈ రోజుల్లో మడికట్టుకుని కూర్చుంటే లాభం లేదు. అంతవరకు ఎందుకు మీ కంపినీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు కూడా మా నుండి ప్రయోజనం పొందిన వాళ్ళే. ఎవరు అవునన్నా , కాదన్నా ఇది ప్రతి కంపినీలోనూ జరిగే భాగవతమే. ఇకనుండి మీ బాసు రాజేష్ గారికి ముడుతున్న సహాయం మీకు కూడా అందించాలని నిర్ణయించుకున్నాము. అప్పుడే మాకు తృప్తిగా ఉంటుంది. ఇక ఈ విషయంలో మీరు వేరే ఆలోచన పెట్టుకోకుండా మీకు సేవలు పొందాలన్నా మాకు చెప్పండి. క్షణాల్లో అవన్నీ చెయ్యడానికి మేము సిద్దంగా ఉన్నాము " అంటూ డిస్ట్రిబ్యూటర్ కంపినీ ఎండీ విశ్వనాధ్ ఫోనులో ఒక అరగంట సేపు కుమార్కు నచ్చచెప్పాడు.
విశ్వనాధ్ తనకు ప్రత్యేకంగా ఫోన్ చేసినప్పటినుండి కుమార్ చాలా అసహనంగా ఉన్నాడు. అయితే డిస్ట్రిబ్యూటర్ విశ్వనాధ్ చెప్పిన విషయంలో ఏతా వాతా తేలిందేమిటంటే తన బాస్ రాజేష్ సర్వ సౌకర్యాలు అనుభవిస్తున్నాడని మరో సారి రూడి అయ్యింది. . అంత నిర్లజ్జగా డబ్బు కోసం ఎలా గడ్డి తింటున్నాడో అని తెలిసి ఆశ్చర్యపోయాడు. విశ్వనాధ్ తనతో మాట్లాడుతున్నప్పుడు తను మందుల తాలూకు డబ్బు ఇచ్చేయ్యబోతే అది మళ్ళీ వాపసు తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అంటూ చెప్పాడు . అదేమిటి తను మందులకైన డబ్బు మాధవ్ కు ఇచ్చేశాడే ? మరి ఈయన ఇలా అంటున్నాడు .ఈ విషయాన్ని మాధవ్ కు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు కుమార్. .
కుమార్కు మందుల బిల్లు విషయంలో చాలా అవమానంగా అనిపించింది. వాళ్ళ దృష్టిలో తను ఫ్రీగా మందులు తీసుకున్నట్టు ముద్రపడిపోయింది. ఖచ్చితంగా మాధవ్ ఆ డబ్బు వాళ్ళకు ఇచ్చేసి ఉండడు. లేకపోతే విశ్వనాధ్ అలా మాట్లాడటానికి అవకాశం ఉండదు. ఆ విషయం కనుక్కోవడానికే కుమార్ మాధవ్కు ఒకటి రెండు సార్లు ఫోన్ చేసి చూశాడు. కానీ అతని నుండి రెస్పాన్స్ లేదు. . కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఈ మధ్య సరుకు తీసుకెళ్లడానికి మాధవ్ బదులు వేరే వ్యక్తి వస్తున్నాడు. . అంటే రహస్యం తెలిసిపోయి ఉంటుందని మాధవ్ రావడం మానేసి ఉంటాడు. ఎవరో ద్వారా తెలుసుకున్నాడు మాధవ్ ను ఉద్యోగంలోంచి తీసేశారని. కుమార్ మనసు చివ్వుక్కుమంది. ఏ చిన్న తప్పు చేసినా ఈ ప్రైవేట్ కంపినీలలో" పైవేటు" తప్పదని. .
రెండు రోజుల తర్వాత ఎక్కడినుండో మాధవ్ నుండి ఫోన్ వచ్చింది . ఆశ్చర్య పోతూ తీసుకున్నాడు కుమార్.
" సార్ నన్ను మీరు మనస్ఫూర్తిగా క్షమించాలి. మీరు ఆ రోజు మందుల తాలూకా సొమ్ము మా వాళ్ళు వద్దంటున్నా నాకిచ్చేశారు. . నాకు అర్జెంట్గా కొద్దిగా డబ్బు అవసరం రావడం వల్ల మా కంపినీ వాళ్ళకు వెంటనే ఆ డబ్బు ఇవ్వలేకపోయాను. పైగా మీరు ఇవ్వబోయిన డబ్బు మళ్ళీ వెనక్కి ఇచ్చేశాను అని మా వాళ్ళతో ఆపత్కాలంలో అబద్దమాడినందుకు సిగ్గుపడ్తున్నాను. ఈ లోపు మీనుండి వాళ్ళకు ఆ డబ్బు నాకిచ్చేసినట్టు ఫోన్ వచ్చింది. నేను ఆ విషయం కావాలని దాచి పెట్టానని కోపంతో నన్ను వెంటనే ఉద్యోగంలోంచి తీసేశారు. నేను నిజం చెపుతున్నాను సార్ . నేను ఎప్పుడూ ఇటువంటి పనులు చేయలేదు . నా దురదృష్టం కొద్దీ ఇది జరిగింది . ఇప్పటివరకు మీరు నాకు అందించిన సహకారాన్ని మరువలేను. మీరు నేను చేసిన పనిని మనసులో పెట్టుకోవద్దని మీకు ఫోన్ చేసి చెపుతున్నాను . వీలు చూసుకుని మీ డబ్బును తిరిగి మీకు పంపించేస్తాను. ఉంటాను సార్ ఇక సెలవు. " ఉద్వేగానికి లోనవుతూ ఫోన్ పెట్టేశాడు.
కుమార్ మాధవ్ గురించే ఆలోచించసాగాడు. అతనితో పాటు హైదరాబాద్ వరకు ప్రయాణం చేసిన రోజులు గుర్తుకు వచ్చాయి. మంచి తెలివితేటలు ఉన్నాయి. కానీ వేరే ఉద్యోగాలకు ప్రయత్నించలేదు. పెద్దగా కలిగిన కుటుంబం కాదు. విశ్వనాధ్ అండ్ కో లో కూడా అతనికి దొరికే జీతం చాలా తక్కువ అని చెప్తూ ఉండేవాడు. ఉద్యోగం చేసినన్నాళ్లు పగలూ , రాత్రి అనక వాళ్ళు ఎప్పుడు వెళ్లమంటే అప్పుడు ప్రయాణం చేసి సరుకు కోసం తమ కంపినీకి వచ్చేవాడు. ఇప్పుడు ఉద్యోగం కూడా పోయింది. అంత పెద్ద కుటుంబాన్ని సాకే బాధ్యత ఇతనిదే. అతనికి ఏదో విధంగా సహాయం చెయ్యాలి. ఒక్కోసారి అవసరాలు మనుష్యులను తప్పు దారి పట్టించినా మాధవ్ చేసినది తను పని చేస్తున్న కంపినీలో లక్షల కొద్దీ స్కాములుతో అక్రమార్జన చేస్తూ పైకి దొరల్లాగా బ్రతుకుతున్న వాళ్ళతో పోలిస్తే మాధవ్ చేసిన పని తన దృష్టిలో ఏ మాత్రమూ తప్పు పట్టాల్సిన పని లేదు . మాధవ్ ను ఎలాగైనా కాపాడాలి. తిరిగి అతని ఉద్యోగం వెనక్కి వచ్చేటట్టు చెయ్యాలి . ఇదీ కుమార్ ఆలోచన .
వెంటనే విశ్వనాధ్ అండ్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ విశ్వనాధ్ కు ఫోన్ చేశాడు. "సార్ మీరు మీదగ్గర పనిచేసే మాధవ్ను
నా మెడికల్ బిల్లు పేమెంట్ విషయంలో అభియోగంతో అతన్ని ఉద్యోగంలోంచి తీసేసినట్టు తెలిసింది. ఈ విషయంలో నన్ను క్షమించాలి . మాధవ్ ఇక్కడనుండి బయలుదేరినప్పుడు నేను అతనికి ఇచ్చిన డబ్బును తిరిగి నాకు గూగుల్ పే చేసేసినట్టు తర్వాత చూసుకున్నాను. ఇందులో అతని తప్పు ఏమీ లేదు. మీరు నాయందు దయవుంచి ఈ విషయంలో పొరపాటు నాదిగా భావించి అతన్ని తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాను. కేవలం ఇది కన్ఫ్యూజన్ అండ్ కమ్యూనికేషన్ గ్యాప్ . ఇంకోవిషయం మాధవ్ చాలా మంచి వ్యక్తి అటువంటి వ్యక్తులు మీ సంస్థలో పనిచేయడం మీకు చాలా ఉపయోగం అని నా భావన " అంటూ మాధవ్ చేసిన తప్పును తనమీద వేసుకున్నాడు కుమార్.
రెండు రోజుల తర్వాత మాధవ్ నుండి ఫోన్ వచ్చింది .
"సార్ మీది సముద్రమంత పెద్ద మనసు. నేను చేసిన తప్పునుండి నన్ను కాపాడి తిరిగి నా ఉద్యోగం నాకు వచ్చేటట్టు చేశారు. మీ లాంటి నిజాయితీ పరులను నేను ఎక్కడా చూడలేదు. మీకు భగవంతుడు ఎప్పుడూ రక్షగా ఉండాలని కోరుకుంటున్నాను " అన్నాడు పట్టరాని ఆనందంతో .
తన వృత్తిధర్మంలో మరో మంచి పని చేశానన్న సంతృప్తి కుమార్ లో సజీవంగా ఎప్పటికీ మిగిలిపోయింది *******
సమాప్తం