“దిద్దుబాటు “ ( కథ )
(26/5/2024 విశాలాంధ్ర ఆదివారం అనుబంధంలో నా కథ )
రచన :జీడిగుంట నరసింహ మూర్తి
మాధవ్ కు ఎన్నో చోట్ల ఉద్యోగం చేసిన అనుభవం ఉండటంతో తను పని చేస్తున్న ఏ సంస్థలో నైనా తనను ప్రత్యేకంగా చూడాలని కోరుకునే వాడు. ఆ క్రమంలో అతనికి ఎవరైనా సలహాలు ఇవ్వబోతే వాటిని పక్కన పెట్టేసే వాడు. అతనికి కొద్దిగా అహంకారం పాళ్ళు ఎక్కువ అని ఢిల్లీ లోని పై మేనేజ్మెంట్ స్తాయి వరకు తెలిసి పోయింది. అయితే అతని పూర్వానుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత పరిస్తితిలో గోడౌన్ లో ఆర్డర్లు లేకుండా మూలుగుతున్న సరుకును వదల్చాలంటే అతని తలబిరుసు తనాన్ని భరించాల్సిందే అన్న ఒక నిర్ణయానికి వచ్చేసింది. .
“. నాకు ఎన్నో చోట్లనుండి ఆఫర్లు వస్తున్నా నేనే వెళ్ళడం లేదు . మీ అందరూ ఎన్నో ఏళ్లుగా ఇదే కంపినీని వేరే దారి లేక పట్టుకుని వేలాడుతున్నారు. . నా అనుభవానికి ఇంతకు మూడు నాలుగు రెట్ల మంచి జీతంతో తలచుకుంటే ఈ క్షణానికి ఉద్యోగం దొరుకుతుంది . .కాబట్టి మీరెవరూ నాతో పోల్చుకోకండి. .” అంటూ తన దగ్గర పనిచేసే వాళ్ళతో ఎన్నో సార్లు ఆవేశ పడేవాడు మాధవ్ .
ఈ మధ్య కాలంలో ఆ కంపినీకి ఒక టెక్నికల్ ఇంజనీర్ అపాయింట్ అయ్యాడు. అతను వచ్చిన కొద్ది కాలంలోనే మాధవ్ చాలా దూకుడుగా ఉన్నాడని అర్ధం చేసుకుని ఎలాగైనా అతన్ని డౌన్ చెయ్యాలని విశ్వ ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
“ మాధవ్ లో ఏం చూసి అతని మీద అంతగా ఆధారపడిపోతున్నారు ? ఈ కంపినీలో అతనికి మించి ఎంతో తెలివితేటలతో, సామర్ధ్యంతో పని చేయగలిగిన వాళ్ళు నాకు చాలా మంది కనిపిస్తున్నారు. వాళ్ళకు అవకాశం దొరికితే వాళ్ళు ఏమిటో నిరూపించుకోవడానికి సిద్దంగా ఉన్నారు. పైగా ఈ మాధవ్ గతంలో పని చేసిన ఎన్నో కంపినీలలో మేనేజ్మెంట్లలతో గొడవ పడి ఇక్కడికొచ్చాడు అని నాకు ఒక బాగా నమ్మకం ఉన్న వాళ్ళ ద్వారా తెలిసింది. “ అంటూ చనువు తీసుకుని తన అక్కసును బయట పెట్టాడు కృష్ణా రావు ఏదో కాన్ఫరెన్స్ ఉండి ఢిల్లీ నుండి వచ్చిన వైస్ ప్రెసిడెంట్ తో.
దానితో ఆయన అహం దెబ్బతింది.
“నో .. నో .. మాధవ్ గురించి మీ అందరూ ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడటం మంచిది కాదు. దయచేసి అతనికి సహకరించి ఈ కంపినీ అభివృద్దికి పాటు పడండి. ఎవరు ఏమిటో అనేది అందరి రికార్డులు మా దగ్గర ఉన్నాయి . అతని విషయం మేము చూసుకుంటాం ..” అంటూ కృష్ణారావు మీద మండిపడ్డాడు వైస్ ప్రెసిడెంట్ సున్నితంగానే .
పైకి ఆయన అలా అన్నాడు కానీ మాధవ్ గురించి తనూ చాలా విన్నాడు. కానీ అతని మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశాలు లేవు. . పైగా అతను ఈ కంపినీలో మామూలుగా అపాయింట్ కాలేదు. సాక్షాత్తు ఈ కంపినీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రికమండ్ చేస్తేనే ఇందులోకి వచ్చాడు. అతన్ని ఎవరేనా అవమానిస్తే ఆయన్ని ఇబ్బంది పెట్టినట్టే. ఇది సంయమనం పాటించాల్సిన సమయం అని ఆయనకు తెలుసు.
రానూ రానూ తన కింద పనిచేసే వాళ్ళతోనూ , కార్మికులతోనూ మాధవ్ గొడవలు పడుతున్నాడు అనే ఒక వార్త కంపినీ మొత్తం దావానంలా వ్యాపించింది. ఆఖరికి అతని మీద వర్కర్స్ అంతా ఉకుమ్మడిగా దాడి చేయడం మొదలు పెట్టి ఉత్పత్తికి వరసగా రెండు రోజులు అంతరాయం కలిగించడంతో మాధవ్ తను ఇక ఇక్కడ ఉండటం క్షేమ కరం కాదు అని ఒక నిర్ణయానికి వచ్చేశాడు.
.
** ** ** **
ఆ రోజు మాధవ్ భార్య కాలనీలోని అన్ని క్వార్టర్లకు వచ్చి స్టీల్ సామానులు పంచి పెడుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే అతని భర్తకు వేరే చోట మంచి ఉద్యోగం దొరికిందిట
ఈ మధ్య గుట్టు చప్పుడు కాకుండా ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళడం , సీనియర్ మేనేజర్గా సెలెక్ట్ అవ్వడం ప్రస్తుత పరిస్తితిలో అటువంటి మంచి అవకాశం జారవిడుచుకోకూడదని వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోవాలని నిశ్చయించుకున్నాడుట , ఒక పక్క మాధవ్ ఆరేళ్ళ అతని కొడుకు చదువుతున్న స్కూలుకు వెళ్ళి తనకు వచ్చిన అవకాశాన్ని గురించి చెప్పి టీసీ తీసేసుకున్నాడు . ఆ వెనువెంటనే తను పనిచేస్తున్న కంపినీ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ దగ్గరకు వెళ్ళి తన రాజీనామా ఇచ్చేశాడు. మెల్లిగా ఈ విషయం అతన్ని రికమెండ్ చేసిన ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ కు తెలిసినా మాధవ్ మీద ఉన్న అభియోగాలకు ఆయన సైలెంట్ గా ఉండిపోయాడు.
ముందుగా ఎటువంటి నోటీసు ఇవ్వకుండా వెళ్లిపోతున్నందుకు మాధవే కంపినీతో ఒప్పందం ప్రకారం రెండు నెలల జీతం ఇచ్చుకోవాల్సి వచ్చినా మంచి ఛాన్స్ దొరికినందుకు అతను ఎటువంటి బాధ పడలేదు.
ఆ రోజు రాత్రి క్వాలిటి కంట్రోల్ మేనేజర్ సుబ్బారావు ఇంటి తలుపులు దబదబా బాదుతున్నచప్పుళ్ళు వినపడ్డాయి. కంగారు పడుతూ తలుపు తీశాడు సుబ్బారావు ఉరుములాగా ఊడిపడిన మాధవ్ ను చూసి ఆశ్చర్యపోతూ.
ఆఫీసులో చాలా మంది మాధవ్ వ్యక్తిత్వంతో విబేధించినా , సుబ్బారావు మాత్రం అతనితో చనువుగా ఉండేవాడు. వాళ్ళ మధ్య ఎన్నో వ్యక్తిగత విషయాలు కూడా జరిగేవి. సుబ్బా రావు భార్య ఊరికి వెళ్ళినప్పుడు అతని భోజనం మాధవ్ ఇంట్లోనే . ఖాళీ సమయంలో ఇద్దరూ కలిసి మాధవ్ అరుగుమీద కూర్చుని ఎన్నో విషయాలను చర్చించుకునే వాళ్ళు. అదే చనువుతో మాధవ్ అంత రాత్రివేళ సుబ్బారావు ఇంటికి మూడోవాడి కంట పడకుండా వెళ్లగలిగాడు .
వెళ్తూనే కుర్చీలో నీరసంగా కూలబడ్డాడు. వెన్నులో సన్నటి జలదరింపు ప్రారంభమయ్యి మొహం చెమటతో ముద్ద అయ్యింది. కాసేపు చేష్టలుడిగి అలాగే కూర్చుండి పోయాడు.
పరిస్తితి గమనించిన సుబ్బారావు “ఏమయ్యింది మాధవ్ ? ఎనీ ప్రాబ్లం ?” అడిగాడు ఆతృతగా.
“ అవును రావ్ ! నా పరిస్థితి ఏమీ బాగోలేదు. నా ఆవేశం,అతి నమ్మకం నన్ను కొంప ముంచింది. నేను ఇంటర్వ్యూ కు వెళ్ళిన కంపినీ నాకు ఉద్యోగం ఫోన్లో కన్ఫర్మ్ చేయడం వల్ల కనీసం అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం ఎదురు చూడకుండా వాళ్ళను గుడ్డిగా నమ్మి మన కంపినీలో రాజీనామా ఇచ్చేశాను. అది ఇప్పుడు ఫాల్స్ కంపినీ అని తెలిసింది. వాళ్ళెవరూ ఫోన్ ఎత్తడం లేదు. ఇంకోటి కూడా జరిగి ఉంటుంది. నా గురించి ఇక్కడి వాళ్ళు చెడుగా కూడా సమాచారం ఇచ్చి ఉండాలి. జీవితం మనం అనుకున్నట్టుగా జరగదని నాకు అర్ధమయ్యింది , పరిస్తితులు తారుమారయినప్పుడే జీవిత సత్యం బోధపడుతుంది. ఏది ఏమైనా నా అర్ధం లేని అహంకారంతో అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ఇప్పుడు ఉన్న ఉద్యోగాన్ని చేచేతులా పోగొట్టుకోవడమే కాకుండా నా కొడుకు టీసీ కూడా స్కూల్లో తీసేసుకున్నాను. పైపెచ్చు గొప్పలు పోయి మన కాలనీ అంతా స్టీల్ సామానులు పంచి పెట్టాము . ఇప్పుడు నాకంటూ ఇక్కడ ఏమీ లేదు. నేను ఈ కంపినీ దృష్టిలో లేనట్టే లెక్క. ఇక్కడ ఇంకో రోజు ఎక్కువగా ఉన్నా కూడా మానసికంగా ఎంతో చిత్రవధ అనుభవించాల్సి ఉంటుంది. ఈ రహస్యం మన ఇద్దరి మధ్య సమాధి అయిపోవాలి . నేను రేపో ఎల్లుండో మా ఊరు వెళ్లిపోతున్నాను. అక్కడనుండే వేరే జాబ్ ప్రయత్నం చేసుకుంటాను. ఇంత రాత్రివేళ నిన్ను ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించు ..” అంటూ బయటకు వెళ్ళిపోయాడు మాధవ్ తీవ్రమైన అశాంతితో.
“మిత్రమా దీని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు . మన జీవితంలో చాలా సార్లు అనుకున్నది అనుకున్నట్టుగా కాకుండా పరిస్తితులు కుడి ఎడమలు అవుతాయి. అయితే వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళ్లడమే జీవిత లక్ష్యం, నీకు త్వరలోనే మంచి ఉద్యోగం దొరుకుతుంది. కంగారు పడకు ..” అంటూ మాధవ్ భుజంమీద చెయ్యి వేసి ధైర్యాన్ని ఇచ్చాడు సుబ్బా రావు
ఆ తర్వాత కొన్నాళ్ళకు ఎవరో ద్వారా విన్నాడు సుబ్బారావు మాధవ్ ఏదో కంపినీలో మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడని.
“పోనీలే . ఈ జాబ్ లో నైనా మాధవ్ తన గతాన్ని పక్కకు పెట్టి తన పూర్వ అలవాట్లను మానుకుని ఒక మంచి ఉద్యోగిగా మిగిలిపోతే చాలు .ఒక ప్రియ మిత్రుడిగా అతనికి దగ్గరగా సంచరిస్తూ అతని ఇంట్లో భోజనం చేసిన వాడిగా అతని క్షేమాన్ని కోరుకోవడం తన కనీస ధర్మం ..” అని మనసులో అనుకున్నాక సుబ్బారావు మనసు తేలిక పడ్డట్టయి హాయిగా గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు. ******
సమాప్తం