తోడూ -నీడ (కథ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
(1/9/2024 విశాలాంధ్ర ఆదివారం అనుబంధంలో ప్రచురితం )
విరిగిపోయిన మంగళసూత్రం గొలుసు దారం వేసి కట్టుకుంటోంది సుమిత్ర. ఈ మధ్య కాలంలో ఇది మొదటి సారి కాదు . ఎన్నో సార్లు సూత్రం గొలుసు విరిగిపోవడం భర్త ఆర్ధిక పరిస్తితి దృష్ట్యా కొత్త గొలుసు కొనిపించుకునే పరిస్తితి లేదు కనుక దాన్నే మళ్ళీ మళ్ళీ సరి చేసుకుంటోంది.
సుమిత్ర ఒక వారం పది రోజులు పాటు చెన్నై లో ఉన్న కూతురింటికి వెళ్లడానికి ప్రయాణం అవుతోంది. మాధురికి పెళ్ళయ్యి సంవత్సరం అవుతోంది. పెళ్లి కాగానే భార్యా , భర్తలు చెన్నై వెళ్ళి పోయారు. ఈ సంవత్సర కాలంలో మాధురి పుట్టింటికి రావడం ఒక్కసారే జరిగింది. అలా అని ఎప్పుడు పడితే అప్పుడు ఆ పిల్లను చూడటానికి తమ ఆర్ధిక పరిస్తితి కూడా సహకరించడం లేదు. పెళ్లయ్యాక వచ్చే మొదటి శ్రావణ శుక్రవారం నాడు ఆమెకు బంగారం గాజులు చేయించి తొడగాలని ఆమె అత్తగారి వర్గం నుండి అప్పుడే ఒత్తిడి మొదలయ్యి ఇప్పటికీ రెండు మూడు నెలలు అవుతోంది. ఇలాంటి పరిస్తితిలో తన మెడలో సూత్రం గొలుసు గురించి సుమిత్రకు ఆలోచన లేదు. కూతురికి ఏదో విధంగా అప్పో సొప్పో చేసైనా గాజులు పెట్టాలి ఇది ఆమె ఆలోచన . అదే విషయం భర్త విశ్వంతో చెప్పింది.
“ ఆ విషయం గురించి నేను ఆలోచిస్తున్నానులే . ముందు నీ ప్రయాణం ఖాయం చేసుకో. నేను నా తిప్పలు నేను పడతాను కానీ ఒక పదిహేను రోజులైనా నాకు ఇక్కడ పరవాలేదు. అక్కడ ఉండి మాధురికి వంటలో సాయం చెయ్యి. అది కొద్దిగా కొలుకున్నాక వచ్చేద్దువు గానీ. అంతకన్నా ముందు నీ విషయం కూడా ఆలోచిస్తున్నాను. నువ్వు ఆ విరిగిపోయిన మంగళసూత్రం గొలుసుతో ప్రయాణం చేస్తే అది తెగి పడిపోతే దానితో పాటు సూత్రాలు కూడా పోతాయి. ఈ రోజుల్లో ఒక్క గ్రాము కూడా బంగారం కొనలేని పరిస్థితి. అమ్మాయి గాజుల కోసం ఇంకా కొంత సమయం ఉంది ఈ లోపల మా ఆఫీసులో లోన్ పెట్టి ఏదో ఒకటి చేస్తాను. దాని కన్నా విరిగిపోయిన నీ గొలుసు గురించే నా ఆలోచన “ అన్నాడు విశ్వం బరువుగా ఊపిరి పీల్చి వదిలేస్తూ.
గొలుసు అతకడానికి ఎక్కువ డబ్బు తీసుకోరు అనుకుంటా. ఒక రోజు ఆ పనికి ముహూర్తం పెట్టాలి. ఈ విషయం చాలా రోజులనుండి అనుకుంటున్నా ఈ రోజు సులోచన మళ్ళీ తన తెగిన గొలుసును దారంతో బంధిస్తూ ఉంటే విశ్వం మనసు చివుక్కు మంది, పెళ్ళైనప్పటినుండి తను ప్రత్యేకంగా నాకు ఇది కావాలంటూ ఏదీ కోరుకోలేదు. సంసారాన్ని చక్కబెట్టుకోవాలనే తాపత్రయం ఆమె ప్రతి మాటలోనూ, చేష్టలలోనూ కనిపించేదే తప్ప అర్ధం లేని ఆర్భాటాలకు ఎప్పుడూ పోలేదు. తన ఆర్ధిక పరిస్తితి ఆమెకు బాగా తెలుసు. ఒక పక్క పిల్లలను చదివించుకోవాలి. మరో పక్క ఉన్న దానితోనే సంసారాన్ని నెట్టుకుని రావాలి ఇదే ఆమె ఆలోచన. ఈ ధోరణి ఈ రోజుల్లో ఎంతమందికి ఉంటుంది?
విశ్వానికి తన అసమర్ధతకు తన పైనే జాలి కలిగింది.
" నీ వూరు ప్రయాణం రెండు రోజులకు వచ్చింది. ఏదీ ఆ గొలుసు ఇయ్యి. అతుకు వేయించి తీసుకొస్తాను " అన్నాడు విశ్వం ఆ రోజు.
" వద్దులెండి. ఇప్పుడు ఎవరినీ నమ్మలేము. అతుకు వేస్తానని చెప్పి ఈ గొలుసులో కొంత కాజేస్తే అవకాశం ఉంది. పమిట కప్పుకుని ఊరు వెళ్ళి వచ్చే అంతవరకు జాగ్రత్త పడతాను. ఆ తర్వాత మనమిద్దరమూ కలిసి ఏదైనా పెద్ద షాపుకు వెళ్ళి ఆ అతికించే పని చూద్దాం " అంటూ ఎప్పటిలాగానే ఆమె దాని మీద పెద్దగా ఆసక్తి చూపించలేదు.
" లేదు లేదు నిన్న నేనొక షాపు చూశాను. మన ఇంటికి రెండు సందుల అవతల ఉంది. ఇటువంటి విషయంలో అశ్రద్ద చేయకూడదు. " అంటూ ఆమె చేత బలవంతంగా మెడలోంచి గొలుసు బయటకు తీయించి పసుపు కొమ్ము కట్టించాడు విశ్వం.
ఆ షాపు ఓనర్ చాలా బిజీగా బంగారం ఆర్డర్లు తీసుకుంటూ కనిపించింది. ఎదురుగా వేసి ఉన్న కుర్చీలో కూలబడ్డాడు విశ్వం .
విపరీతంగా మొహమాటం పడిపోతూ ఎట్టకేలకు తాళ్ళతో బంధించిన సూత్రం గొలుసును బయటకు తీసి ఆమె ముందు ఉంచాడు.
ఆ ముక్కల గొలుసును అమ్మడానికి వచ్చి ఉంటాడు అనుకుంది షాపు ఓనర్.
" గొలుసు అతికించాలి " అన్నాడు కృష్ణా రావు బలహీనమైన స్వరంతో .
ముక్కలు ముక్కలుగా విడిపోయి ఉన్న ఆ వస్తువును చూడగానే షాపు ఓనర్ విస్తు పోయింది.
“ఏమిటి ఇది గొలుసా ? ఇన్ని ముక్కలు ముక్కలుగా అయ్యే అంత వరకు ఏమి చేస్తున్నారు అండీ బాబూ ? ఒకటి రెండు చోట్ల తెగితే అతుకులు వేయవచ్చు కానీ ఇంత చిరిగి ఛిద్రం అయిపోయిన గొలుసును మేడమ్ గారు ఎలా వేసుకుంటున్నారు సార్ ? . ఒకసారి ఆవిడను తీసుకొస్తే దణ్ణం పెట్టాలని ఉంది ..” అంది షాపు ఓనర్ వ్యంగ్యంగా నవ్వుతూ.
ఈ లోపు మరి కొంతమంది కస్టమర్లు బంగారం కొనడానికి రాగానే ఆ ఓనర్ విశ్వం అభ్యర్ధనను పెద్దగా పట్టించుకోలేదు.
కొద్దిగా కస్టమర్ల హడావిడి తగ్గాక ఆవిడే అంది మళ్ళీ.
“ ఈ గొలుసు ఎన్ని సార్లు అతుకులు పెట్టినా మళ్ళీ కట్ అవుతూనే ఉంటుంది. దానికన్నా పైన కొంత బంగారం వేసి కొత్త గొలుసు చేయించుకుంటే మంచిది. ఇప్పుడు ఆర్డర్ ఇస్తే ఒక వారం రోజుల్లో వస్తువు మీకు అప్పగిస్తాను . ఏ మాత్రం అవకాశం ఉన్నా దీన్ని నేను రిపైర్ చేసి ఇచ్చేదాన్ని. అలా చేసి మిమ్మల్ని మోసం చేయడం నాకు ఇష్టం లేదు . వెంటనే ఏ విషయమో చెప్పండి “ అంది ఓనర్ ఆ తెగిన సూత్రం గొలుసును విశ్వం తెచ్చిన కాయితంలో పెట్టి అతనికి తిరిగి ఇచ్చేస్తూ.
విశ్వం కాసేపు చేష్టలుడికి ఏమీ సమాధానం చెప్పకుండా ఉండిపోయాడు.
“ మేడమ్ మీరు చెప్పింది బాగానే అనిపిస్తోంది. కానీ ప్రస్తుతం మేము ఒక నెల రోజుల పాటు ఊళ్ళో ఉండటం లేదు. ఈసారికి మాకు తాత్కాలికంగా అతుకు వేసి ఇవ్వండి. దాని మీద కొద్దిగా బంగారం పడినా పరవాలేదు. ఊరు నుండి రాగానే మీరు చెప్పిన ప్రకారం కొత్త గొలుసు చేయించుకుంటాము “ అన్నాడు విశ్వం పైకి ఎక్కడా తనని తాను ఎక్కడా తక్కువ చేసుకోకుండా.
అతికించిన గొలుసుతోనే సుమిత్ర చెన్నై కూతురు దగ్గరికి ప్రయాణం అయ్యింది. ట్రైన్ పరిగెడుతోంది . దానితో పాటే సుమిత్రలో ముసురుకుంటున్న ఆలోచనలు కూడా సమాంతరంగా దూసుకు పోతున్నాయి.
కూతురికి పెట్టాల్సిన బంగారం గాజుల భారం అంతా భర్త మీద పెట్టేసింది. పాపం ఆయన మాత్రం ఈ కష్ట కాలంలో ఎంతని భరించగలడు ? రెండు గాజులు అంటే ఎంత లేదన్నా తక్కువ బరువులో తీసుకున్నా అరవై వేల రూపాయలు పైనే అవుతుంది. ఒక పక్క ఇంతకు ముందు ఆఫీసులో తీసుకున్న అప్పు పూర్తిగా తీరనే లేదు. ఇప్పుడు మళ్ళీ కావాలంటే ఇస్తారో లేదో ? కూతురికి తమ పరిస్థితి అంతా తెలుసు. కానీ మాధురి ఈనాటి ఆడ పిల్ల కాదు వాళ్ళ అత్తగారి వైపు వాళ్ళకు ఏదో రకంగా ఒప్పించడానికి . పెళ్ళయి సంవత్సరం కాలేదు. ఈ మధ్య కాలంలో కనీసం రెండు మూడు సార్లయినా ఫోన్ చేయలేక పోయిందంటే దాని మీద ఎంతగా ఆంక్షలు ఉన్నాయో ఏమో ? తల తాకట్టు పెట్టయినా కూతురికి అవమానం జరగకుండా ఆ గాజులు ఎలాగో అలా చేయించి పెడితే కానీ ఎవరికీ మనశ్శాంతి ఉండదు.
మొదటి సారి సుమిత్ర కూతురి దగ్గరకు చెన్నై వెళ్లడంతో బాగుండదని అనుకున్నాడో, మాధురి చెప్పిందో కానీ అల్లుడు భాస్కర్ స్టేషన్ కు వచ్చి తీసుకెళ్ళాడు.
సూత్రం గొలుసు జాగ్రత్త అంటూ విశ్వం చెప్పినదంతా గుర్తుపెట్టుకుని ప్రయాణంలో వీలైనప్పుడల్లా మెడ తడుముకుని చూసుకునేది సుమిత్ర.
కూతురు వాళ్ళు కూడా చెన్నైలో చిన్న ఇంట్లో ఉంటున్నారు. అక్కడ ఇళ్ళు దొరకడం చాలా కష్టమని, దొరికినా అడ్వాన్స్ లక్షల్లో ఉండటంతో పిల్లలు పుట్టే అంతవరకు చిన్న ఇంట్లోనే అడ్జస్ట్ అయిపోవాలని నిర్ణయించుకున్నారు . దానితో అల్లుడి తల్లి తండ్రులు కూడా ఈ సంవత్సర కాలంలో ఎప్పుడూ రాలేదు. మొదటి సారిగా తనే వచ్చింది. భర్త ఒక నెలయినా ఉండి కూతురికి దగ్గరుండి వండిపెట్టమని అంటున్నాడు కానీ అసలే వీళ్లకున్న ఇరుకు గదులలో తను కూడా ఆక్రమించుకోవడం చూస్తూంటే ఒక వారం రోజులు కూడా ఉండటం కష్టం అని సుమిత్రకు అనిపించింది.
తను అక్కడ ఉన్నన్నాళ్ళు కూతురు చాలా సార్లు తల్లి మెడలోకి చూస్తూ కనపడింది. ఆఖరికి అడిగేసింది.
“అమ్మా అప్పుడెప్పుడో నీ గొలుసు బాగు చేయించుకోవాలి అన్నావు కదా . చేయించుకున్నావా ? ఒక నల్ల పూస గొలుసు కూడా పక్కన ఉంటే కొద్దిగా నిండుగా ఉంటుంది. ఇంటికి వెళ్ళగానే నాన్నకు చెప్పి తెప్పించుకో. మరచిపోవద్దు ..” అలా అంటూంటే అప్రయత్నంగా మాధురి కళ్ళల్లో నీళ్ళు ఊరాయి.
“ చూద్దాంలే తల్లీ. ముందు నాన్న నీకు శ్రావణం మాసంలో నీకు పెట్టాల్సిన గాజులు గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు. నాకు కానీ , ఆయనకు గానీ నువ్వు నీ అత్తగారి దగ్గర మాట పడటం ఏ మాత్రమూ ఇష్టం లేదు. అది సరే. నువ్వు చాలా నీరసంగా కనిపిస్తున్నావు. మందులూ అవీ సరిగ్గా వేసుకుంటున్నావా ? ఏదో నేనుండి కొన్నాళ్ళు నీకు వండిపెడదామని అనుకున్నాను కానీ ఒక వారం రోజులలోనే తిరుగు ప్రయాణం పెట్టుకుంటానని అనుకోలేదు. అయినా ఇక్కడ నేనుండి మీకు కాళ్ళకూ, వేళ్ళకూ అడ్డమే కానీ నాకే సంతృప్తిగా అనిపించడం లేదు. .. “ అంది సుమిత్ర తిరుగు ప్రయాణం రోజు.
** ** ** **
“అలా వెళ్ళావు ఇలా వచ్చావు. ఏదో రకంగా అక్కడ ఇబ్బందులున్నా ఇంకో రెండు మూడు రోజులు ఉండి మాధురిని చూసుకుని ఉంటే బాగుండేది. అది సరే కానీ బంగారు గాజుల గురించి మాధురి ఏమైనా కదిపిందా ? ఈ వారం రోజులు దాని గురించే ఆలోచిస్తూ ఉంటే భగవంతుడు మన సమస్యకు ఒక పరిష్కారం చూపించాడు. ..” అన్నాడు విశ్వం మెరుస్తున్న కళ్ళతో. అతని పెడవులమీద విజయ దరహాసం కదలాడటం సుమిత్ర గమనించింది.
“అవును నేను చెప్పింది నిజమే. నేను కూడా ఊహించలేదు అప్పుడెప్పుడో నేను పని చేసిన పాత కంపెనీ క్లోజ్ చేసినప్పుడు తాలూకు కొంత పీఎఫ్ మనం వచ్చేసిన తర్వాత వాళ్ళు జమ చేశారని అది వడ్డీలతో కలుపుకుని ఏభై వేలకు పైగా చూపిస్తోందని అప్పుడు నాతో పని చేస్తున్న ఒకాయన చెపితే క్రితం సంవత్సరం నేను పీ ఎఫ్ ఆఫీసుకు ఎన్నో లెటర్స్ వ్రాయడం జరిగింది. అది అంత తేలిగ్గా వచ్చే విషయం కాదని చాలా మంది చెపితే ఆ విషయం పూర్తిగా మర్చిపోయాను. మన కష్టార్జితం ఎక్కడకూ పోదని ఆ డబ్బు నిన్న బ్యాంకులో నా ఖాతాలో జమ అయినప్పుడు తెలిసింది. అదీ విషయం. ఇదంతా మన అమ్మాయి అదృష్టం అని అనుకోవాలి. ” అన్నాడు విశ్వం ఆనందంతో.
భర్త అంత మంచి శుభవార్త చెప్తూ ఉంటే ఇన్నాళ్లుగా పడుతున్న టెన్షన్ కు పడ్డ బాధంతా కన్నీటి రూపంలో బయటకు వచ్చేసింది. ఆమె కాసేపు కళ్ళు మూసుకుని రిలాక్స్డ్ గా ఫీలయ్యింది.
ఆరోజు భార్యా భర్తలు ఇద్దరూ కలిసి బంగారం షాపుకు బయలుదేరారు.
“ఇంత పెద్ద సమస్య నుండి బయట పడేసిన భగవంతుడు నీ సమస్యకు కూడా త్వరలో పరిష్కారం చూపిస్తాడు అని అనుకుంటున్నాను . త్వరలో నీ మెడలో పాత గొలుసు స్థానంలో కొత్త గొలుసు కొనగలను అనే ధైర్యం వచ్చింది. ..” అన్నాడు విశ్వం మార్గ మధ్యలో.
“ ఏమిటండీ మీరు . మన మీద ఉన్న కొండంత బాధ్యత నెరవేర్చబోతున్నారు. ఇంకా నా సమస్య గురించి ఆలోచించడం మానేయండి. ఎప్పుడూ అదే ఆలోచనలతో మీ ఆరోగ్యం దెబ్బ తింటుంది. మనం కొనుక్కోగలిగినప్పుడే కొత్త గొలుసు కొనుక్కుoదాము . ప్రస్తుతం అతుకు వేసిన గొలుసు బాగానే ఉందిగా . ఒక వేళ మళ్ళీ ఏదైనా సమస్య వస్తే మళ్ళీ అతుకు పెట్టించుకుందాం. నాకు ఇప్పుడు ఏమీ తొందరలేదు. .. మన వియ్యాలవారి ముందు మన పరువు నిలబెడుతున్నారు. ఆ తృప్తి నాకు ఉంది . ఒక ఉత్తమ తండ్రిగా మీరు చేయవలసిందంతా చేస్తున్నారు. అంతే చాలు ..” సుమిత్ర అలా అంటూంటే కొద్దిసేపు రెప్పవాల్చకుండా ఆమె వైపే గర్వంగా చూడసాగాడు విశ్వం.
నిష్కల్మషమైన భార్య మనసును చూస్తున్నాక ఇలా ప్రతి క్షణమూ భర్తలకు తోడూ నీడగా ఉంటూ వారి ప్రతి సమస్యనూ అర్ధం చేసుకుని వారికి మనోధైర్యాన్ని ఇచ్చి మెలిగే భార్యలు ఉండటం ఎంత అదృష్టం ? అని అనుకున్నాడు విశ్వం కృతజ్ఞతాభావం నిండిన మనసుతో. ****
సమాప్తం