“ ఆత్మాభిమానం” (కథ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
21/9/2025 విశాలాంధ్ర ఆదివారం అనుబంధంలో ప్రచురితం )
“అమ్మమ్మా నువ్వు మా ఇంటికి ఎక్కువగా ఎందుకు రావు ?” అడిగింది చిన్నారి అపూర్వ ఫోన్లో అమ్మమ్మను .
“మీ నాన్నకు నేను, తాతయ్య అంటే కోపం . నిన్ను చూడాలని మా ఇద్దరి మనసు తపించి పోతూ ఉంటుంది. కానీ మేమేం చేయగలం చెప్పు తల్లీ ? పాపం మీ అమ్మకు మేము రావాలని ఉంటుంది. కానీ మీ ఇంట్లో మీ అమ్మ నోరు లేవడానికి వీల్లేదు .. “ అని చెపుదామని కామేశ్వరమ్మ అనుకుంది కానీ ఆ మాటలను మనసులోనే దాచుకుంది.
ఈ రోజుల్లో పిల్లలతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కామేశ్వరమ్మకు తెలుసు. వాళ్ళు అమాయకంగా ఉంటారు కాబట్టి ప్రతి విషయం తల్లి తండ్రులకు చెప్పేస్తారు. ఒక వేళ తన మనవరాలితో తండ్రి గురించి ఏ విషయం చెప్పినా “అమ్మమ్మను, తాతయ్యను నువ్వు రానివ్వడం లేదుటగా ?” అని తండ్రికి ఖచ్చితంగా చెప్పేస్తుంది. పిల్లల అమాయకత్వం అంతే. అందుకే ఎటువంటి పరిస్తితిలలో పిల్లలతో పెద్ద పెద్ద విషయాలు మాట్లాడకూడదు. వాళ్ళకు ఇష్టంఉన్నా లేకపోయినా చందమామ కథలు చెప్పాల్సిందే.
కూతురికి ఇప్పుడు మూడవ నెలట. రక్తం బాగా తక్కువగా ఉందని డాక్టర్లు కనీసం ఒక నెల రోజులు మంచి మందులు వాడుతూ రెస్ట్ తీసుకోవాలని అన్నారుట. ఈ విషయం కూతురి నోటి వెంటే వినాల్సి వచ్చింది కామేశ్వరమ్మకు.
విషయం తెలిసిన కామేశ్వరమ్మ , ఆవిడ భర్త చిగురుటాకులా వణికిపోయారు .కనీసం ఈ విషయం కూడా అల్లుడు సుధాకర్ నోటి నుండి రాలేదు. కూతురే రహస్యంగా చెప్పాల్సి వచ్చింది. కూతుర్ని తెచ్చుకుని ఒక పది రోజులు ఇంట్లో ఉంచుకుందాం అంటే అల్లుడు పడనీయడు. అతనికి విపరీతమైన ఆత్మాభిమానం. తను ఎవరికీ లొంగిపోయే స్వభావం కాదు. భేషిజము ఎక్కువ. అలా అని కూతురు బాధ పడుతూ ఉంటే అతని నుండి పిలుపు రాకుండా అక్కడకు వెళ్లకూడదు అని భీష్మించుకు కూర్చుంటే అవతల నష్ట పోయేది కూతురేగా.
మీనమేషాలు లెక్కపెట్టుకుంటూ కూర్చుంటే లాభం లేదని భార్యా , భర్తలిద్దరూ దండెమ్మీద ఉన్న బట్టలను పెట్టెలో కూరుకుని ప్రయాణం అయ్యారు. వాళ్ళు ఇంటికి చేరేసరికి ఇంట్లో అల్లుడు లేడు . కూతురి మొహం మాత్రం చేటంతయ్యింది. తల్లిని ఆనందంగా పెనవేసుకుపోయింది.
మరో పది నిమిషాలకు అల్లుడు సుధాకర్ చేతిలో క్యారియర్ తో లోపలికి వచ్చి అత్తగారిని, మామ గారిని చూసి ఆశ్చర్య పోయాడు సుధాకర్. . మొహంలో ఏ భావమూ కనిపించనీయకుండా లోపలకు వెళ్ళిపోయాడు. తను చెప్పకపోయినా భార్య రమణి తల్లితండ్రులకు విషయం చేరేసి ఉంటుందని ముందే ఊహించాడు.
“ బాగున్నారా అల్లుడు గారు! మీరు హోటల్ నుండి క్యారియర్ తేవద్ధు . వంట విషయం నేను చూసుకుంటాను . ..” అంది కామేశ్వరమ్మ వంట గదిలోంచి .
“లేదు లెండి. ఎందుకో ఈ రోజు హోటళ్లు లేవు . భోజనం తేలేదు ..” అన్నాడు ఖాళీ క్యారియర్ అక్కడ పెట్టి తన గదిలోకి వెళ్ళిపోతూ.
అమ్మమ్మ ఊరినుండి ఏమైనా తినడానికి తెచ్చిందేమో అని మనవరాలు అపూర్వ బ్యాగ్ వెతుకుతోంది.
“హడావిడిగా వచ్చేసాము కదా తల్లీ. ఏమీ తేలేదు ..అన్నట్టు అపూర్వా !అమ్మ నీకు రవ్వ లడ్డూలు బాగా ఇష్టమని చెప్పింది. . ఈ రోజు నీకు నేనే స్వయానా లడ్డూలు చేసి పెడతాను. రేపు అరిసెలు. అంతే కాదు నీకు ఇష్టమైనవన్నీ చెప్పు. రోజుకోకటి చొప్పున తయారు చేస్తాను... ఏ .. “ అంటూ మురిపెంగా దగ్గరకు తీసుకుంది కామేశ్వరమ్మ.
“ లేదు అమ్మమ్మా ! మా నాన్న మాకు అన్ని స్వీట్లు బయట నుండి తెస్తారు “ అంది అపూర్వ .
“పోనీలే. ఇకనుండి మీ నాన్నను బయట నుండి ఏమీ తేవద్దు అని చెప్పు. అసలే బయట కరోనా వుంది అంటున్నారు. పైగా హోటల్ వాళ్ళు ఏ నూనెలు వాడుతున్నారో కూడా ఎవరరికీ తెలియడం లేదు. కొన్నాళ్లలో మీ అమ్మ నీకు బుజ్జి తమ్ముడిని ఇవ్వబోతోంది. తను ఏది పడితే అది తినకూడదు. నేను కూడా మీ నాన్నకు చెపుతానులే.” అంటూ వంట గదిలోకి దూరింది కామేశ్వరమ్మ.
ఒక అరగంట అయ్యేసరికి వంటింటి లోంచి ఏవో వాసనలు రావడంతో పరిగెత్తుకుకుంటూ లోపలికి వెళ్ళింది అపూర్వ .
“ అవును తల్లీ. ఇందాక చెప్పాను కదా . నీ కోసం రవ్వ లడ్డూలు చేస్తున్నాను..మరో పక్క కుక్కర్లో అన్నం కూరలు రెడీ అవుతున్నాయి. అమ్మకు ఒంట్లో బాగోలేదు కదా.లోపల పాపాయికి కూడా ఆకలేస్తూ ఉంటుంది. పెందరాళే తినేయాలి.మీ అమ్మకు సాయంగా నువ్వు కూడా పక్కనే ఉండి నీ బుజ్జి వెండి కంచంలో అన్నం పెట్టుకుని తినేద్దువు గానీ. మీ ఇద్దరి పని అయిపోతే తాతయ్యతో పాటు నేనూ కూర్చుని తినేస్తాను” అంది కామేశ్వరమ్మ. .
రాత్రి ఆఫీసునుండి భర్త వచ్చాక రమణి ఏమండీ “ రేపటి నుండి మీరు క్యాంటీన్ లో భోజనం చేయొద్దు . అమ్మ మీకు క్యారియర్ పెట్టి ఇస్తానంది. ..తనుండే వారం పది రోజులు ఎట్టి పరిస్తితిలోనూ మీరు మొహమాట పడొద్దు. ..” అంటూ అతనికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. .
అత్తగారి మీద పూర్తిగా ఆధార పడి పోవడం సుధాకర్కు ఇష్టం లేదు. అయితే బయట పరిస్తితి ఏమీ బాగోలేదు. కొన్ని ఆఫీసులు చాలామంది ఉద్యోగస్టులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమని పర్మిషన్ ఇచ్చేసినా తను పని చేస్తున్న కంపినీ వాళ్ళు మాత్రం అటువంటివి మా దగ్గర సాగవు అని మొండికేస్తూ ఉండటంతో చేసేది లేక వాళ్ళంతా ఇంటి నుండి భోజనం తెచ్చుకుని చచ్చినట్టు పని చేసుకోవాల్సిన పరిస్తితి వచ్చింది. కానీ తన భార్య ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండటంతో తప్పని సరి పరిస్తితులలో క్యాంటిన్లోనే తినాల్సి వస్తోంది. ఈ రోజు అత్తగారు భోజనం బయట తినొద్దు క్యారియర్ పెడతాను అనడం అతనిలో ఎక్కడో దాగిఉన్న మానవత్వం బయటకు వచ్చింది.
వారం రోజులుగా అత్తగారు ఆప్యాయతగా చేసి పంపిస్తున్న రుచికరమైన భోజనం తింటున్నాక చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న అతనికి అత్తగారిలో తల్లి కనిపించింది.
“ నాన్న! అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు రేపు వెళ్ళి పోతాం అంటున్నారు. వాళ్ళని కొన్నాళ్ళు ఇక్కడే ఉండమని చెప్పవా ? అయినా వాళ్ళు ఒంటరిగానే కదా వాళ్ళ ఊళ్ళో ఉండేది ? వాళ్ళకు మాత్రం అక్కడ ఏం తోస్తుంది ? “ అంది అపూర్వ తండ్రి పక్కన కూర్చుని గారాభ పోతూ.
“ఈ వారం పది రోజుల్లో అమ్మమ్మ చూపించిన వంటల రుచులకు చంటి దానికి తెలివైన మాటలే వచ్చేశాయి” అనుకున్నాడు సుధాకర్ మనసులో నవ్వుకుంటూ. .
అపూర్వ తండ్రితో చెప్పిన మాటలు రమణి కాని చెప్పి ఉంటే సుధాకర్ ఒప్పుకునే వాడు కాదేమో . ఎందుకంటే అతనికి ఆత్మాభిమానం ఎక్కువ కదా. .
“మిమ్మల్ని ఇంకా కొన్నాళ్ళు ఇక్కడే ఉండి తనకిష్టమైన స్వీట్లు చేసి పెట్టమంటోంది మీ మనవరాలు “ అన్నాడు సుధాకర్ బట్టలు సద్దుకుంటున్న అత్తగారితో.
“ అలా అందా వెర్రి పిల్ల. పరవాలేదు లెండి . ఇప్పుడు రమణి కొద్దిగా కోలుకుంది అల్లుడు గారు. ఎప్పుడు పడితే అప్పుడే మళ్ళీ రావచ్చు... “ అంటూ అల్లుడికి మించి తన ఆత్మాభిమానాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసింది కామేశ్వరమ్మ *****
సమాప్తం