జీవితం… ఒక అంతులేని రైలు ప్రయాణం వంటిది.
మనకు తెలియకుండానే, మన అంచనాలకు విరుద్ధంగా మలుపులు తిరుగుతూ ముందుకు సాగుతుంది. ప్రతి మజిలీ కొత్త అనుభవాల్ని అందిస్తుంది—కొన్ని సంతోషాన్ని పంచుతాయి, కొన్ని బాధను మిగులుస్తాయి. ప్రతి స్టేషన్‌లో ఎవరో వస్తారు… గమ్యం చేరగానే వెళ్ళిపోతారు. కానీ ప్రయాణం మాత్రం ఆగదు.
ఈ ప్రయాణంలో టికెట్ మన కర్మ, గమ్యం మన లక్ష్యం, తోటి ప్రయాణికులే మన అనుభవాలు. రైలు ఎలా తన గమ్యాన్ని చేరుతుందో, మనం కూడా అనుభవాలను పాఠాలుగా మార్చుకుంటూ ముందుకు సాగాల్సిందే.
……………..
చిన్నతనంలో రైలుప్రయాణం అంటే అమితమైన ఉత్సాహం. ట్రైన్ కూతపెడుతూ ముందుకు వెళ్తున్నప్పుడు వచ్చే శబ్దం మనసుకు మధురంగా అనిపించేది. గోదావరి, కృష్ణా వంటి నదుల బ్రిడ్జిపై ట్రైన్ వెళ్తుంటే, పడుకున్న వాళ్లం కూడా లేచి, ఆ నది చివరి వరకు చూసేవాళ్లం. అమ్మ దగ్గర నుంచి చిల్లర తీసుకుని నదిలో పడేలా చెల్లెళ్ళు తమ్ముడితో కలిసి పోటాపోటీగా నాణేలు విసరడం అప్పట్లో చాలా ఆనందంగా ఉండేది.
జీవన పయనంలో బంధాలు బంధుత్వాలు ఇరుగుపొరుగువారు మన జీవితాల్లోకి రైలు ప్రయాణికుల వలే వస్తూపోతూనే ఉంటారు. కొందరు మనతో ఎక్కువకాలం ఉంటారు. ఇంకొందరు కేవలం ఒక మజిలీ వరకు మాత్రమే మనతో ఉంటారు.
ఇలా జీవితం–ప్రయాణం మధ్య ఉన్న ఈ అనుబంధం గురించి ఎన్నిసార్లు ఆలోచించినా, కొన్ని అనుభవాలు మాత్రం మనసులో ముద్రగా నిలిచిపోతాయి.
ఆ రోజుల్లో చేసిన రైలు ప్రయాణాలు ఇప్పటికీ నా మనసులో మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. అలాంటి ఒక మజిలీయే… నా జీవితంలో జరిగిన ఒక రైలు ప్రయాణం. ఆ ప్రయాణం నాకు కేవలం ఒక గమ్యం చేరుకోవడం కాదు, మనుషులు, వారి మనసులు, ఆలోచనలు—ఇవన్నీ దగ్గరగా చూపించిన ఒక అనుభవం.
“పెళ్ళయిన కొత్తలో శ్రీవారు రావటం కుదరకపోవడంతో, నేను మొదటిసారి ఒంటరిగా విశాఖపట్నం నుంచి గుజరాత్ వరకు ప్రయాణం చేయాల్సి వచ్చింది. రెండు రోజుల ప్రయాణం ఒంటరిగా ఎలా గడుస్తుందో అనుకుంటూ కొంచెం భయంతోనే ట్రైన్ ఎక్కాను.
త్రీ-టయర్ ఏసీలో క్రింది బర్త్ రావడంతో కొంత ధైర్యం వచ్చింది. గాంధీధామ్ వరకు వచ్చే తెలుగు ప్రయాణికులు కూడా ఉండటంతో, హమ్మయ్య ఎలా అయినా గడిచిపోతుందని ఊపిరి పీల్చుకున్నాను.
“రైలులో కిటికీ దగ్గర కూర్చుని బయటకి చూస్తుంటే… అకస్మాత్తుగా నా చిన్నతనపు రైలు ప్రయాణాలు గుర్తొచ్చాయి. ఎప్పుడు ఏ స్టేషన్ వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూసేవాళ్లం.
అప్పటికి ఇప్పటికీ రైలు ప్రయాణం అంటే నాకు ఎంతో ఇష్టం. నదులపై, కొండలు, గుహల మధ్య మెలికలు తిరుగుతూ సాగుతున్న ట్రైన్‌ని కిటికీ నుంచి చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తుంటే… ఆ ఆనందం వర్ణించలేనిది.
రైలు రాజమండ్రి స్టేషన్లో ఆగింది.
అమలాపురం నుంచి వచ్చిన ఇద్దరు తల్లీ కూతుళ్లు, మరో ఇద్దరు ప్రయాణికులు రాజమండ్రి వద్ద మా కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కారు. వారు బరోడా వరకు వెళ్లాల్సి ఉంది. నా ఎదురు బర్త్ లో కూర్చున్నారు.
వాళ్ళు అందరితో ఇట్టే కలిసిపోయారు, వాళ్ళు రావటంతోనే అప్పటి వరకు ఉన్న నిశబ్దం, నిర్లిప్తత ఎగిరిపోయింది. సందడి మొదలైంది. ఆ పరిసరాల్లో ఒక చలాకీ వాతావరణం నెలకొంది.
కొందరు కష్టాలను బూతద్దంలో చూసి భయపడుతూ బాధపడుతుంటారు. కానీ కొందరు ఎన్ని సమస్యలలో ఉన్నా కానీ వాటిని కాలానికి వదిలేసి ప్రతిక్షణం ఆనందంగా ఉండటానికి ప్రయతిస్తూ ఉంటారు. స్వతహాగా నేను అలా నవ్వుతూ నవ్విస్తూ ఉండే వాళ్ళను చూస్తే తొందరగా ఆకర్షితరాలినవుతాను..
అలా ఆ తల్లికుతుళ్ళు వారి మాటల్లో హాస్యం, చతురత, సహజమైన ఆప్యాయత ఇవి అన్నీ నన్ను ఆకట్టుకున్నాయి. ఆ అమ్మాయి నా వయసే కావటంతో అక్కా చెల్లెళ్లలా కలిసిపోయాము.
ఇటు మూడు బెర్తులు అటు మూడు బెర్తులు పక్కన రెండు బెర్తుల వాళ్ళం, కొద్దిసేపటికే మేమంతా బందువుల్లా కలిసిపోయాము. ఆవిడ తను తెచ్చుకున్న చపాతీ టమాటా కూరా పులిహోర అందరికీ పంచిపెట్టారు. గుజరాత్ గురించి, వారి అనుభవాలు గురించి చెప్పుకుంటూ, నవ్వుతూ ప్రయాణం సాగింది. ఆవిడ మాటల్లో ఉన్న స్నేహ స్వభావం, సేవాగుణం, మనసులోని మంచితనం నాకు ఎంతో స్పూర్తినిచ్చింది.
మా ప్రయాణం ఒక్క రోజే అని తెలిసినా సొంత వాళ్లలాగే కలిసి ఉన్నాము. గంటలు క్షణాల్లా గడిచాయి.
రాత్రి తొమ్మిది గంటలకు బరోడా స్టేషన్ వద్ద వారు దిగేటప్పుడు, సొంత వాళ్లే దూరమవుతున్నట్లు ఒక విచిత్రమైన బాధ మనసులో కలిగింది. వారు కూడా అలాగే పలుమార్లు జాగ్రత్తలు చెప్పి, మనసారా వీడ్కోలు చెప్పారు. మా అమ్మ అమ్మమ్మ నానమ్మలు గుర్తుకొచ్చారు, ఆ రోజులలో ప్రేమలు ఆప్యాయతలు స్వార్థరహితంగా ఉండేవి.
గంటల ప్రయాణమే అనిపించినా, కొన్ని క్షణాలు, జీవితాన్ని మార్చేస్తాయి. ఒక చిన్న పరిచయం, ఒక మాట, ఒక సంఘటన—మన దిశనే మార్చగలవు. రైలు ముందుకు సాగినట్టే, కాలం కూడా ఎవరి కోసం వేచి ఉండదు. వాళ్ళు వెళ్ళిపోయినా ఆ క్షణం మాత్రం ఒక తీపి జ్ఞాపకంగా నా హృదయంలో నిలిచిపోయింది.
అయితే ప్రతి అనుభవం తీపిగానే ఉండదు. అదే ప్రయాణంలో జరిగిన మరో సంఘటన ఒక చేదు అనుభవాన్ని, ఆలోచనను మిగిల్చింది.
వాళ్ళు వెళ్ళిన తర్వాత అదే బెర్తులో భార్యా, భర్త, కూతురు వచ్చారు. వారంతా వయసులో పెద్దవాళ్ళే.
నా పక్కన మరో యువజంట పిల్లలతో కూర్చున్నారు. పిల్లలతో కాస్త సందడిగానే ఉంది. బోజన సమయమయ్యింది. పిల్లలు ఆకలి అని గోల చేయటంతో యువ జంట వాళ్లు తెచ్చుకున్న బాక్స్ లోనుంచి పూరి,చికెన్ కూర బయటికి తీసి తింటున్నారు.
ఎదురు సీటు పెద్దవాళ్ళకు అది నచ్చలేదు వాళ్ళు శాకాహారులు. వాళ్లకు మాంసాహారులను చూస్తే చాలా పాపం చేసినట్లు అనిపించింది, మాంసాహార వాసన తట్టుకోలేక పోయారు.
“ఇక్కడ అలాంటివి తినకూడదు.” అన్నారు.
“ఇది మా భోజనం మా ఇష్టం.” అన్నాడు ఆ కుర్రాడు.
“ మాంసాహారం మహా పాతకం.” అన్నాడు ముక్కుమూసుకుని,
“ఇదిగో పెద్దాయన నీకు నచ్చకపోతే నువ్వు తినకు, అనవసరంగా పాపం అని మాట్లాడకు.” అన్నాడు కోపంగా యువకుడు,
నాన్నా ఎందుకు గొడవ, పదండి పక్క బోగీలో అక్క వాళ్ళ దగ్గరకు వెళ్ళి మనం కూడా భోజనం చేద్దాం అంది.
“ఇది చూసిన తరువాత ఇంకా నాకు భోజనం సహించదు. వాళ్ళని ముందు ఇక్కడ నుంచి అవి తీసేయమను ” అన్నాడు చిరాగ్గా.
“ అది మా ఇష్టం చెప్పటానికి మీరు ఎవరు, ఈ ట్రైన్ మీ సొంతం కాదు.” అని వాదించాడు కుర్రాడు.
“నాన్నా మనం వెళ్దాం పద” అని తీసుకుని వెళ్ళింది ఆ అమ్మాయి.
స్టేషన్ లో ట్రైన్ ఆగినప్పుడు పెద్దాయన కుటుంబం వచ్చి, రైలు సిబ్బందిని పిలిచి వాళ్ళ బెర్త్ ను క్లీన్ చేయించుకున్నారు.
అది ఆ కుర్రాడికి అవమానంగా అనిపించింది.
శాఖాహారులు, మాంసాహారులు మధ్య ఆ చిన్న విషయంపై వాగ్వివాదం తలెత్తింది.
‘ఆహారం విషయంలో ఎవరి అభిరుచులు వారికి ఉండాలి. కానీ ఒకరి ఆలోచనను మరొకరిపై రుద్దే ప్రయత్నం వాదనలకు దారి తీసింది. చివరికి చిన్న విషయమే పెద్దదై, ఒకరినొకరు కించపరచుకునే స్థితికి చేరింది.
మాది కరెక్ట్ అంటే మాదే కరెక్ట్ అని వాదించుకున్నారు.
ఇరు వైపు వారు, తెలివైన వారే,
ఎవరి ఆలోచన వారిది, ఎవరి దృష్టికోణంలో వాళ్ల ఆలోచన సరైనదే.
అప్పుడు నాకు ఒక్క విషయం స్పష్టంగా అర్థమైంది.
మనం నాటే విత్తనాలను బట్టే మొలక వస్తుంది.
అదే విధంగా మన ఆలోచనలు అనే విత్తనాలను కూడా విశ్వాసాలుగా మార్చుకోవచ్చు… లేదా మూఢనమ్మకాలుగా కూడా మారుస్తాం,.
ఎవరి ఆలోచనలు, అభిప్రాయాలు వారివే…
‘మనకు నచ్చని పరిస్థితులు ఎదురైనప్పుడు కోపం, ద్వేషం వెంటనే ఉబికిరావటం సహజం… కానీ పరిస్థితుల ప్రభావానికి లోనవకుండా మనసులోని ప్రశాంతతను కాపాడుకుంటూ, స్వభావం మారకుండా మనం మనలాగే ఉండటం నిజమైన పరిపక్వత.”
పరిస్థితులు మనను మార్చాలని ప్రయత్నిస్తాయి… కానీ మనం ఎలా స్పందించాలో నిర్ణయించుకోవలసింది మనమే.” అని నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.
ఆలోచనలలో వుండగానే నేను దిగవలసిన మజిలీ చేరుకున్నాను. రైలు నెమ్మదిగా ఆగింది, నా సూట్కేసు, బ్యాగ్ తీసుకుని రైలుదిగాను.
“కాలం మారినా, రోజులు మారినా..
అప్పటికి ఇప్పటికీ రైలు ప్రయాణంలో ఎటువంటి మార్పు లేదు. అవే మజిలీలు అవే గమ్యాలు,
కానీ మనిషి మనసు ఆలోచనల్లోనే ఎన్నో మార్పులు.
………………