“ యాత్ర “ (కథ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
(10/11/2024 విశాలాంధ్ర ఆదివారం అనుబంధంలో ప్రచురించిన నా కథ )
దక్షిణ దేశ ఆలయాల యాత్ర స్పెషల్ టూర్ బస్సు కోసం హైదరాబాద్ లకడీకా పూల్ బస్ స్టాండ్ దగ్గర ఎదురుచూస్తున్నారు విశ్వనాధ్, సువర్ణ . బస్సు కెపాసిటీ అరవై మందిట . అది విజయవాడ నుండి బయలు దేరుతుంది. ఎదురు చూడగా చూడగా బస్సు వీళ్ళు నిలబడిన స్టాప్ దగ్గర కొచ్చేసరికి పది దాటింది
అప్పటికే వీళ్ళతో పాటు అదే బస్సుకు మరో ఏడెనిమిది మంది కూడా ఎదురు చూస్తున్నారు. ఎవరి సీటు వాళ్ళకు రిజర్వ్డ్ చేసి ఉంటాయని తెలిసినా కూడా ఇక ఒక్క నిమిషం కూడా నిలబడే ఓపిక లేని వాళ్ళు లా అందరూ ఉకుమ్మడిగా ఎగబడి బస్సులోకి జొరబడ్డారు .
ఎవరికి వారు ఒకసారి వాళ్ళ వాళ్ళ సీట్లలో కూలబడ్డాక ఎంతో సెక్యూర్ గా ఫీల్ అయ్యారు. . . ఇక ప్రయాణం ఖాయం అయినట్టే . బస్సులో సీట్లకు పుల్ అండ్ పుష్ సౌకర్యం ఉండటంతో విశ్వనాధ్, సువర్ణలు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. బస్సు మరో ఐదు నిమిషాల్లో కదులుతుందనగా వెనక సీటులోనుంచి ఎవరో మధ్య వయస్కురాలు ఒకావిడ ముందుకొచ్చి “ఏమండీ వదిన గారు బాగున్నారా ? నన్ను గుర్తు పట్టారా ? మిమ్మల్ని ఇక్కడ చూడటం చాలా ఆశ్చర్యంగా ఉంది “ అంటోంది విస్మయంగా చూస్తూ.
ఇద్దరూ నిశబ్ధంగా కొన్ని క్షణాలు ముఖ ముఖాలు చూసుకున్నారు.
సువర్ణకు ఆవిడెవరో సరిగ్గా గుర్తుకు రాకపోయినా అసంకల్పితంగా చిన్న నవ్వు నవ్వి తల ఊపి “ బాగున్నారా ?” అంటూ పలకరించింది.
అప్పటికీ ఆ పలకరించినావిడ ఎవరో మనసులో పూర్తిగా ఒక పిక్చర్ రాలేదు. ఈ లోపు ఆలోచించుకోవచ్చులే అని సువర్ణ ఆలోచన .
“ చూస్తూంటే నేనెవరో మీరు ఇంకా గుర్తు పట్టి నట్టి లేదు. మనం నాలుగున్నరేళ్ల క్రితం ఒక సారి మా ఊరు పామర్రులో మా ఇంట్లో మా అబ్బాయి పెళ్ళిలో కలుసుకున్నాం. మా వారూ, మీ వారూ కాలేజీలో మిత్రులుట . ఆ రోజు నేను మీకు మా తోడు కోడళ్లనిద్దరినీ కూడా పరిచయం చేశాను. వాళ్ళు కూడా నాతో పాటే ఇదే బస్సులో వస్తున్నారు. ఇప్పుడు గుర్తుకొచ్చిందనుకుంటా ?” అంటూ ప్రశ్నార్ధకంగా చూసింది ఆమె.
“ అవును.. అవును .. ఇప్పుడు గుర్తుకొస్తోంది. మీ పేరు రాధిక కదూ. అలా ఎలా మర్చిపోయానో నాకే అర్ధం కావడం లేదు. చాలా సంతోషంగా ఉందండీ మిమ్మల్ని కూడా ఈ యాత్రా బస్సులో చూస్తున్నందుకు. “ అంది సువర్ణ గట్టిగా ఊపిరి పీల్చి వదిలేస్తూ .
విశ్వనాథ్ వాళ్ళ సంభాషణ మౌనంగా వింటున్నాడు. .
ఈ లోపు ఆమె ఇద్దరు తోడు కోడళ్ళు కూడా సువర్ణ వాళ్ళ సీటు దగ్గరకు వచ్చారు. గుర్తు వుంటుందో లేదో నని రాధిక సువర్ణ గురించి మళ్ళీ వాళ్ళకు పరిచయం చేసింది.
“చాలా సంతోషం రాధిక గారు ! అన్నట్టు మీ మగవాళ్ళు కనిపించడం లేదే ? వెనక సీట్లలో ఉన్నారా ?” అనుమానం వ్యక్తం చేస్తూ అడిగింది సువర్ణ .
“ మాతో ఎవరూ రాలేదు అండీ. మేము ముగ్గురే బయలు దేరాం. అన్ని విషయాలు మనం తర్వాత స్టాప్ లో డిన్నర్ కు ఆపుతారుట . అక్కడ ఏదైనా తింటూ మాట్లాడుకుందాం. ఇలా ఇంత సేపు మధ్యలో నిలబడి ఉంటే బస్సులో ఎక్కే వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది. ..” అంది రాధిక అటూ ఇటూ చూస్తూ.
టూరిస్ట్ బస్ వాళ్ళు ఇచ్చిన పట్టిక ప్రకారం బస్సు ఒక హోటల్ దగ్గర ఆగింది. సువర్ణ వాళ్ళు వేళకు సరిగ్గా బస్సులు రావని గత అనుభవాలు ఉండటంతో ఇంటి దగ్గరే ఏదో ఒకటి కతికి బయలు దేరినా రాధిక గారు సస్పెన్స్ లో వదిలేసిన వాళ్ళ మగ వాళ్ళ విషయం గురించి తెలుసుకోకుండా మనశ్శాంతి గా ప్రయాణం చేయడం కష్టం అని భావించి ఆ తోడు కోడళ్ళు ఇద్దరినీ అనుసరించాల్సి వచ్చింది.
“ అయితే మీ మగవాళ్ళు ఎవరూ రావటం లేదన్న మాట ?” అంటూ తన సందేహాన్ని మళ్ళీ ఒకసారి రాధికకు గుర్తు చేసింది సువర్ణ కాఫీ తాగుతూ.
“ చాలా దురదృష్టం జరిగిపోయింది వదిన గారు . ఈ మధ్య మీ అన్నయ్య గారు కాలం చేశారు. కరోనా టైమ్ లో అందరికీ తెలియచేయడం కూడా కుదరలేదు. కొద్దిగా అటూ ఇటూగా ఎవరూ ఊహించలేని పరిస్థితిలో మా బావగార్లు కూడా కరోనా కాటుకు బలి అయిపోయారు. ఇలా ఒకే కుటుంబంలో ఇంతమంది మగవాళ్ళు పోవడం , ఆ దుర్ఘటనల నుండి కోలుకోవడానికి మాకు రెండేళ్ళు పట్టింది. . ఇది మా పరిస్థితి. “ అంది రాధిక కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ .
“అయ్యో మా ఫ్రెండ్ మోహన్ చనిపోయాడా ? ఎంత ఘోరం జరిగింది ? ఈ కరోనా టైమ్ లో ప్రపంచం అంతా స్తంభించి పోయినట్టయ్యింది. ఎవరి బాగోగులు తెలుసుకునే అవకాశమే లేకపోయింది ..” అంటూ నిట్టూర్చాడు విశ్వనాధ్.
“ అవునండీ. మేము కూడా ఊహించలేదు. మా ఊళ్ళో పెద్ద ఆసుపత్రులు లేవు. ఈయనకు హఠాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చింది. అర్జెంట్ గా ఓపెన్ సర్జరీ చెయ్యాలని అన్నారు. ఇలాంటి రోగాలకు అందరమూ విజయవాడ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే . ఆసుపత్రులలో కూడా ఎవరినీ చేర్చుకునే పరిస్తితి లేదు. అయితే అప్పటికే ఆలస్యం అయిపోయింది. ..” అంటూ రాధిక గారు కొద్ది నిమిషాల సేపు మౌనంగా ఉండిపోయింది.
మళ్ళీ ఆ వెనువెంటనే తేరుకుని” అదృష్టవశాత్తు మా అందరి ఆర్ధిక పరిస్తితి బాగానే ఉంది. పోయిన వాళ్ళు మాకేమీ లోటు చేయలేదు. అందరికీ సొంత ఇళ్ళు ఉన్నాయి. కూరలు కూడా ఇళ్ళల్లోనే పండించుకుంటాం. ఇల్లు కదిలేది లేదు.. . పోయిన భర్తల గురించి ఎన్నాళ్ళు ఏడుస్తూ కూర్చుంటాము చెప్పండి? మా పిల్లలు ధైర్యం చెప్పడంతో ధైర్యం చేసి అందరమూ కలిసి ఎవరో చెపితే ఈ యాత్రలు ప్లాన్ చేసుకున్నాం . . .”.
రాధిక గారు ఈ నాలుగున్నర ఏళ్లల్లో జరిగిన ఘోరమైన సంఘటనలను చెపుతూ ఉంటే సువర్ణ నిర్ఘాంతపోయి నోట మాట రాక ఆమె వైపే చూస్తూండి పోయింది.
“అయ్యో .. . మనం మాటల మధ్యలో బస్సు వాళ్ళ గురించి పట్టించుకోలేదు. డ్రైవరు హారన్ వేస్తున్నట్టున్నాడు. మిగిలిన విషయాలు మిగతా ప్రయాణంలో చెప్పు కుందాం. . .. “ అంటూ కంగారు పెట్టడంతో అందరూ లోపలికి ఎక్కి ఎవరి సీట్లలో వాళ్ళు కూలబడ్డారు.
మిగిలిన రాత్రంతా బస్సు ఎక్కడా ఆగకుండా వెళ్తూనే ఉంది. ఉదయం ఏదో ఊళ్ళో హోటల్ దగ్గర ఆపారు.
“ఇక్కడ మీకు కేటాయించిన రూములలో స్నానాలు ముగించుకోండి. ఈ లోపల మేమే ఈ పక్కన మా ఆఫీసు దగ్గర అల్పాహారం అవీ తయారు చేసి మిమ్మల్ని పిలుస్తాం . ఆ తర్వాత షెడ్యూల్ ప్రకారం బస్సు బయలు దేరుతుంది. “ అన్నాడు సూపర్వైజర్.
రాత్రంతా ప్రయాణంలో అలిసి పోయిన ప్రయాణికులు ఓపిక లేక ఒకరినొకరు అప్పటికప్పుడు పరిచయం కూడా చేసుకోలేదు. ఉదయం కాఫీలు, టిఫిన్ లు అయ్యాక కొంత ఉషారు పెరిగి పైగా సమయం ఉండటంతో పక్క వాళ్ళను పలకరించడం మొదలు పెట్టారు.
వాళ్ళల్లో అందులో కొంతమంది వ్యాపారస్తులు కూడా ఉన్నారు. ఒకాయన అవకాశం దొరికింది కదా అని విజయవాడలో తను నడుపుతున్న నగల దుకాణం గురించి చెప్పసాగాడు.
” మీకు కావలసిన డిజైన్ లలో ఇప్పుడు ఆర్డర్ ఇస్తే మార్కెట్ రేటు కన్నా తక్కువలో వస్తువులు చేయించి పదిహేను రోజుల్లో డెలివరీ ఇస్తానని” అందరికీ మాటిస్తున్నాడు.
చాలా మంది ఆడవాళ్ళు భర్తలను బలవంతం చేసి ఏదో ఒక వస్తువుకు ఆర్డర్లు ఇచ్చేశారు. అ షాపు ఆయన తన లెటర్ హెడ్, ఇతర వివరాలు చూపించి వాళ్ళ దగ్గర కొంత అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు.
ఇంకోకాయన ఎవరో తనది దుప్పట్ల వ్యాపారం అంటూ తన గురించి చెప్పుకుంటూ ఎంతో కొంత ఆర్డర్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరోకాయన “షుగర్ వ్యాధికి దివ్యమైన ఆయుర్వేద మందు తన దగ్గర దొరుకుతుందని , అది వాడాక మెల్లి మెల్లిగా ఇప్పుడు వాడుతున్న మందులు దూరం పెట్టేయచ్చునని . మళ్ళీ వ్యాధి జన్మలో రాదని , . ఇప్పుడు ఆర్డర్ ఇస్తే వారం రోజుల్లో మందు మీ ఇంట్లో ఉంటుంది అని , ఇప్పుడు మనం అంతా యాత్రలో ఉన్నాము కాబట్టి మనం మన ఇళ్లకు చేరుకోగానే అందేటట్టు ఏర్పాటు చేస్తాను” అని నమ్మకంగా వాళ్ళందరికీ చెపుతున్నాడు.
” అన్నట్టు ఇంకో విషయం ముందుగా మీరు డబ్బులు కూడా ఇవ్వొద్దు. అది మీ చేతికి వచ్చాకనే డబ్బు ఫోన్ పే చేయండి. ఈ గోడవంతా ఎందుకు అనుకునే వాళ్ళ కోసం కూడా నేను ఆలోచించాను. నాతో పాటు ఒక పది సీసాల వరకు మెడిసిన్ తీసుకొచ్చాను. మరీ ఇప్పుడే అవసరం అనుకుని ఎవరైనా భావిస్తే ముందు అవి వాళ్ళ కిచ్చేస్తాను. . ..” అంటూ బ్యాగ్ లోంచి కొన్ని బోటిల్స్ తీశాడు ఆ షుగర్ మందు తయారీ దారుడు .
పది నిమిషాల్లో మొత్తం సీసాలు అన్నీ అమ్ముడైపోయాయి.
“కొత్తగా ఆర్డర్ చేసే వాళ్ళు ముందుగా డబ్బు చెల్లించనక్కర లేదు” అని చెప్పడం కూడా ఈరోజుల్లో అదొ మార్కెటింగ్ టెక్నిక్ . దాని వల్ల ఆ వ్యక్తి మీద బాధితులకు బాగా నమ్మకం కలిగి డబ్బులిచ్చి అతని దగ్గరున్న పది సీసాలు వెంటనే కొనేశారు. .
“ టైరు పంచర్ అయ్యింది. ఇంకో అరగంట , ముప్పావు గంట పట్టే టట్టుగా ఉంది. దయచేసి యాత్రికులు సహకరించ వలసిందిగా కోరుకుంటున్నాము “ అన్నాడు బస్ సూపర్వైజర్ హడావిడిగా అక్కడికి వచ్చి.
ఆ మాట వినగానే కొంతమంది ఉసూరుమని వేలాడిపోతే , ఇంకొందరు ఇదే మంచి అవకాశం అని కబుర్లలో పడ్డారు. వాళ్ళల్లో రాధిక గ్రూప్ కూడా ఉంది.
“ ఇలా మధ్యలో అప్పుడప్పుడు రిలాక్స్ అయితే ఎంత దూరం ప్రయాణం అయినా చేసేయొచ్చు . మీరు నమ్ముతారో లేదో కానీ వదిన గారు మా వాళ్ళు బ్రతికున్నంత వరకు మమ్మల్ని ఇళ్ళల్లో కట్టి పడేశారు . ఆ చిన్న వూరు దాటి ఎక్కడికీ వెళ్లలేదు. గుళ్ళు కూడా పక్కనే ఉండటంతో గబ గబా ప్రదక్షిణాలు చేసేసి పూజార్లు ఇచ్చిన ప్రసాదం పట్టుకుని వచ్చేయడం ఇది రోజూ నిత్య కృత్యం అయిపోయింది మా బ్రతుకులికి. పిల్లలు వేరే రాష్ట్రంలో పని చేసుకుంటున్నారు. ఎప్పుడో కానీ రావడానికి కుదిరేది కాదు. ఎప్పుడూ అలవాటు లేకపోవడం వల్ల మేము కూడా పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటున్న చోటుకు వెళ్ళడానికి ధైర్యం చేయలేదు. ఇంట్లో టీవీలు ఉన్నాయి. ఖాళీ ఉన్నప్పుడు వాటిలో నచ్చినా నచ్చకపోయినా ఏవో చచ్చు సీరియల్స్ చూస్తూ సగం రోజు గడిచిపోయేది. మా చుట్టు పక్కల చాలా కుటుంబాలు ఉండటంతో ఎవరో ఒకళ్ళ ఇంట్లో పేరంటాలో , లలిత సహస్ర నామాల కార్యక్రమాలు ఉండటంతో వాటికి వెళ్ళడం, మా ఇళల్లో ఏవైనా ప్రోగ్రామ్స్ ఉంటే వాళ్ళను పిలవడం వీటితో అసలు మేము ఏమి పోగొట్టుకుంటున్నామో తెలుసుకోలేక పోయాం . అనుకుంటే కళ్ళు పోతాయి కానీ ఇదిగో ఇప్పుడే ఈ మూటలు దాటి పోయాక మాకు నిజమైన స్వేచ్ఛ వచ్చింది. మాకు ఇష్టమైన పదార్ధాలు చేసుకుని తింటున్నాం. సినిమాలు చూడగలుగుతున్నాం . ఏ బాదరబందీ లేదు. హాయిగా నిద్ర పడుతోంది. మా పిల్లలు ధైర్యం చెప్పడంతో ఇప్పుడు బయట ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం. ఈ ప్రయాణంలో మీ లాంటి వారి సాహచర్యం దొరకడం మాకు మరింత బలాన్ని , మనోధైర్యాన్ని ఇచ్చింది. ..” అని రాధిక గారు తన ఇన్నాళ్ల అనుభవాన్ని రంగరించి ఒక కథలా చెప్తూ ఉంటే సువర్ణ ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయింది.
రాధిక తొడుకోడళ్లు ఇద్దరూ కూడా రాధిక మాటలతో ఏకీభవించారు.
“ అవును లెండి వదిన గారు. ఇప్పుడున్న మీ పరిస్తితిలో మీరు చెప్పినది ఒక కోణంలో ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక దారి చూపిస్తాడు. మరీ చిన్న పిల్లలు ఉండి వాళ్ళ చదువులు పూర్తికాక అర్ధాంతరంగా భర్తలు గతించినప్పుడు ఎన్నో జీవితాలు కకావికలు అయిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. అదృష్టవశాత్తు మీ పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యారు . వాళ్ళ జీవితాలు వాళ్ళు గడుపుతున్నారు. . ఒక రకంగా మీ భర్తలు మిమ్మల్ని నడిసముద్రంలో ముంచేసి అంతర్ధానం అవ్వలేదు. ఇప్పుడు చాలా కుటుంబాలలో అవేర్నెస్ పెరిగింది. భర్తలు ముందు జాగ్రత్తగా ఇళ్ళు, వాకిళ్ళు, స్థలాలు, పిల్లల పేరు మీద, భార్య పేరు మీద ఇన్స్యూరెన్స్ లాంటి అన్ని అవసరాలు చివర వరకు ఆగకుండా ఏర్పాటు చేసేస్తున్నారు. భర్త పోయినా భార్యకు అతని పెన్షన్ లో కొంత భాగం అనుభవించడానికి ఉద్యోగ సంస్థలు ఆసరా కలిపిస్తున్నాయి . కొంతమంది ఏ బ్యాంకులో ఎంత డబ్బు దాచారో, ఎవరెవరికి అప్పుగా డబ్బు ఇచ్చారో, ఏ ఆస్తి తాకట్టు పెట్టారో లాంటి విషయాలు భార్యలకు పొర పాటున కూడా చెప్పరు . కనీసం ఒక చోట ఏదైనా డైరీలో రాసి పెట్టడం కూడా చేయరు. అటువంటి వాళ్ళతో పోల్చుకుంటే ఈ విషయంలో మీరందరూ చాలా అదృష్టవంతులు. మీ మగవారు మీకు అన్ని విధాలా న్యాయం చేసి వెళ్లారు. అయితే వారు లేని లోటు ఎప్పుడూ ఉంటుంది అనుకోండి. కానీ ఆర్ధిక పరిస్తితులు పరిపూర్ణంగా పుష్టిగా ఉన్నప్పుడు కాలం అన్ని గాయాలను మానిపి అటువంటి లోటు పాటులను మెల్లి మెల్లిగా దూరం చేస్తుంది. .భవిష్యత్తును కాలానికి వదిలేసి అందరూ ధైర్యంగా ఉండటం మంచిది ” అంది సువర్ణ రాధిక గారి భుజంమీద చెయ్యి వేసి దగ్గరకు లాక్కుని ధైర్యం చెపుతూ .
బస్సు రిపేరు పూర్తి అయ్యి బయలు దేరడానికి సిద్దం అవ్వడంతో అప్పటి వరకు అనుకోకుండా రిలాక్స్ అయిన ప్రతి వారూ తిరిగి ఉల్లాసంగా లోపలకు అడుగుబెట్టారు.
** ** ** **
మరో ఐదు సంవత్సరాలు ఎలా గడిచిందో తెలియదు. .
ఇప్పుడు సువర్ణ, విశ్వనాధ్ కుటుంబం ఎక్కడికి యాత్రలు వేసుకున్నా రాధికా అండ్ టీం కూడా పక్కన తప్పకుండా ఉంటుంది. అవును మరి ఆర్ధిక స్వాతంత్ర్యం ఎన్ని అగాధాల నైనా పూడ్చి మనుష్యులందరినీ ఏకం చేసి జీవితాలను నిటారుగా నిలబెడుతుంది అనడంలో సందేహం ఏముంది ? ********
సమాప్తం