" వ్యవస్థ "

విశాలాంధ్ర ఆదివారం అనుబంధం • 29 Dec 2024 • 👁 1 views
" వ్యవస్థ " (కథ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
(29/12/2024 విశాలాంధ్ర ఆదివారం అనుబంధంలో నా కథ )
" ఇదే మా మోహన్ ఇల్లు. ఈ సమయంలో ఇంట్లోనే ఉండి ఉంటాడు. ఇంకో గంట అయితే మనకు దొరకడు. వెయ్యిళ్ళ పూజారి. .." అంటూ తలుపు తట్టాడు రమణ .
మోహన్ తలుపు తెరవగానే రమణతో పాటు ఒక అపరిచిత వ్యక్తి అతనితో నిలబడి ఉన్నాడు.
"లోపలికి రండి " అంటూ నవ్వుతూ ఆహ్వానించాడు మోహన్.
"ఇతను సుబ్రమణ్యం. చెన్నైలోని సేలంలో ఉంటారు. నాకు కొద్దిగా దూరపు చుట్టం కూడా అవుతారు. చాలా కాలం క్రితం సేలంలోనే మొత్తం కుటుంబం అంతా స్తిరపడిపోయింది. . వీళ్ళ అబ్బాయి హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ కంపినీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంకా పెళ్లి కాలేదు. . ప్రస్తుతం తన సహ ఉద్యోగస్టుడితో పాటు రూంలో ఉంటున్నాడు. కొడుకును చూద్దామని వచ్చాడు. మళ్ళీ రేపు వెళ్లిపోతున్నాడు. మా సుబ్రమణ్యాన్ని నీకు పరిచయం చెయ్యాలని తీసుకువచ్చాను. ..” అన్నాడు రమణ
“ ఓహో వెరీ గుడ్. గ్లాడ్ టు మీట్ యు “ అంటూ సుబ్రమణ్యంతో కరచాలనం చేశాడు మోహన్ .
అందరూ ముందు హాల్లో కూర్చున్నారు.
“మీ అబ్బాయి ఈ రాష్ట్రంలో ఉంటే మీరు అంత దూరంలో ఉండటానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా ? ఏమీ లేదు ఆసక్తితో అడుగుతున్నాను ..” అన్నాడు మోహన్ .
“అవును మోహన్ . సుబ్రమణ్యం కుటుంబం చాలా కాలంగా తమిళనాడు సేలంలో స్తిరపడిపోయారు. వీరికి అక్కడ గ్రానేట్ ఇండస్ట్రి ఉంది. అప్పట్లో సుబ్రమణ్యానికి తెలిసిన ఒక మంచి మిత్రుడు తన ఇండస్ట్రి ని కొన్ని కారణాల వల్ల అమ్మేసి విదేశాలలో సెటిల్ అయిపోయారు. . ఆ పరిశ్రమను సుబ్రమణ్యం ఇరవై సంవత్సరాల క్రితమే కొనక్కొవడం , ఈ వ్యాపారం చాలా లాభసాటిగా ఉండటంతో వీళ్ళు అక్కడే స్తిరపడి పోయారు. “..
ఈ లోపల అందరికీ కాఫీలు వచ్చాయి . దానితో పాటు ఒక ట్రేలో కారం జంతికలు . సుబ్రమణ్యం కాఫీ సిప్ చేస్తో ఒక జంతిక ముక్కను నోట్లో వేసుకున్నాడు.
“జంతికలు చాలా కరకర లాడుతున్నాయి అండీ. కాఫీతో పాటు మంచి స్నాక్స్ ఇచ్చారు ..”అన్నాడు మెచ్చుకుంటూ సుబ్రమణ్యం.
“ఓహో అలాగా ! నిజాయితీగా చెప్పాలంటే ఇవి ఇంట్లో చేసినవి కావు . ఎస్ ఆర్ నగర్లో ఆంధ్రా వైపు నుండి వచ్చిన ఒక కుటుంబం రకరకాల ఇటువంటి పదార్ధాలు ప్యూర్ సన్ ఫ్లవర్ ఆయిల్ వాడి చేస్తూ ఉంటారు. నేనూ , రమణ కూడా అక్కడే కొనడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఎందుకో ఎక్కడ తేడా వస్తోందో తెలియడం లేదు. ఇంట్లో ఎన్ని సార్లు ట్రై చేస్తున్న ఇంత గుల్లగా రావడం లేదు . మీరు వెంటనే వెళ్లిపోవల్సిన పరిస్థితి లేకపోతే మీకు ఆ స్నాక్స్ తెప్పించి ఇచ్చే వాడిని .” అన్నాడు మోహన్ .
“అవును నిజమే . ఇదే కాదు అక్కడ మంచి కాఫీ పౌడర్ దొరుకుతుంది. కర్ణాటక నుండి కాఫీ గింజలు తెచ్చి ఫ్రెష్ గా ఆడి ఇస్తారు. ఇప్పుడు మోహన్ ఇంట్లో తాగే కాఫీ ఆ కాఫీ పొడితో చేసినదే ..” అన్నాడు రమణ .
“ ఓ వెరీ నైస్ . మొత్తానికి మీ మిత్రులిద్దరి పరిచయం , అలవాట్లు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి. అసలు మీ పరిచయం ఎలా జరిగిందో అది కూడా వినాలని ఉంది ..” అన్నాడు సుబ్రమణ్యం .
“మోహన్ నాకు పరిచయమయ్యి ఏడెనిమిదేళ్ళయ్యింది. మా మధ్య స్నేహం చాలా గమ్మత్తుగా జరిగిందిలే. ఒక సారి పార్కులో మా పాప ఖరీదైన ఉంగరం పోయి అందరమూ కంగారుగా వెతుక్కుంటూ ఉంటే వీళ్ళ భార్య భర్తలు మా దగ్గరకొచ్చి “ ఇది మీ ఉంగరమేనా మాకు ఆ చెట్టు దగ్గర దొరికింది. అదృష్టవశాత్తు ఎవరూ తీయక ముందే మా కంట పడింది. మీరు అందరూ హడావిడి పడుతూ ఉండటం చూసి ఖచ్చితంగా అది మీదే అయ్యి ఉంటుందని గ్రహించి మీ దగ్గరికి వచ్చాను " అన్నాడు అతను.
“అవును సార్ . మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో అర్ధం కావడం లేదు. మా పాప నిర్లక్ష్యాన్ని చూసి ఇందాకటినుండి ఒకటే తిట్లు తిడుతున్నాం ఎక్కడ పారేసుకొచ్చావంటూ . అది బిక్క మొహం పెట్టుకుని కూర్చుంది. ఈ రోజుల్లో ముఖ్యంగా బంగారు ఆభరణాలు పోతే మళ్ళీ దొరకడం అనేది అసంభవం . అటువంటిది ఆ ఉంగరాన్ని తీసి మాకు అప్పగించడం చూస్తూంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ..అని మా ఆనందాన్ని వ్యక్తపరిచాము. అప్పుడు మొదలయ్యింది మా పరిచయం. ఇంతా చేస్తే వీళ్ళు మా పక్క వీధిలోనే ఉంటున్నట్టు అర్ధమయ్యింది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మోహన్ స్వగ్రామం , మా ఊరు కూడా ఏలూరు కావడం . కొన్ని పరిచయాలు ఇలాగే విచిత్రం గా జరుగుతూ ఉంటాయి. అదే క్షణంలో మా మిసెస్ వీళ్ళ మిసెస్ కూడా బాగా క్లోజ్ అయ్యారు. అప్పటిదీ మా పరిచయం .. అదే పరిచయం మా మధ్య “ఏరా ” అంటూ పిల్చుకునే అంతవరకు రాలేదు కానీ ఒకరి నొకరు “నువ్వు -నువ్వు “ అనే సంబోధించుకుంటాం “ అన్నాడు రమణ .
“ మా ఫ్రెండ్ అప్పటి సంఘటనను బాగానే గుర్తు పెట్టుకున్నాడు. జరిగింది జరిగనట్టు ఒక్క ముక్క కూడా పొల్లు పోకుండా చెప్పేశాడు. ఏది ఏమైతేనేం రమణ ఫామిలీ తో పరిచయం అలా సంతోషంగా కొనసాగుతూనే ఉంది . ముందు కాఫీ తాగండి చల్లారి పోతోంది “ అన్నాడు మోహన్ .
మిత్రులిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే గోడకు తగిలించి ఉన్న ఫోటోలను సుబ్రమణ్యం కళ్ళు చురుకుగా పరిశీలిస్తున్నాయి.
“ అన్నట్టు చెప్పలేదు కదూ . మా మోహన్ ఒక పది పదిహేను తెలుగు సినిమాలలో కూడా నటించాడు. పైగా రెండు మూడు సినిమాలకు అవార్డులు కూడా వచ్చాయి. కొన్ని నాటక పోటీలలో కూడా బహుమతులు సంపాదించాడు. మీరు తమిళనాడులో ఉండటం వల్ల మోహన్ నటించిన సినిమాలు చూసే అవకాశం ఉండి ఉండదు ..” అన్నాడు రమణ తన మిత్రుడి గురించి గొప్పగా చెప్తూ .
సుబ్రమణ్యం టైమ్ చూసుకుంటున్నాడు.
“ ధన్యవాదాలు మోహన్ గారు . మీ అందరితో చాలా బాగా గడిచింది. ఏవేవో చక్కటి విషయాలు మాట్లాడుకున్నాం. పనికి రాని విషయాలు మాట్లాడి ఉంటే క్షమించండి. ఎప్పుడూ మా కంపినీ పనులో మునిగిపోయి జీవితం అంటే ఇలా బిజీగా ఉంటూ డబ్బు సంపాదించడమేనా అనుకునే వాడిని . ఇప్పుడు మిత్రులతో సరదాగా గడపడం లో ఉన్న టేస్ట్ అర్ధమయ్యింది. ఈ రోజు రాత్రి మిగిలిన టైమంతా మా అబ్బాయితో గడిపి నేను రేపు మా ఊరు వెళ్ళి పోతానండీ.మీరు కూడా మా రమణ తో పాటు ఎప్పుడైనా మా ఊరు రండి. మీకు ఆకామిడేషన్ ప్రాబ్లం లేదు. మా ఇండస్ట్రి చూపిస్తాను. చుట్టుపక్కల ప్రదేశాలు చూసే ఏర్పాటు చేస్తాను. ఇదే నా కార్డ్ . ఫోన్ నెంబర్ ఇతర వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి. అన్నట్టు మీ పిల్లలు ఏమి చేస్తున్నారు అని అడగలేదు. వేరే విషయాలలో పడి ఆ సంగతే అడగడం మర్చిపోయాను ..” అడిగాడు సుబ్రమణ్యం ఆసక్తిగా.
“నాకు ఒక అమ్మాయి. ఎంటెక్ చదువుకుని ఈ మధ్య ఒక మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరింది. ఎక్కడో అక్కడ ఒక చోట సెటిల్ అయిపోయి పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది. . .. అన్నాడు మోహన్ ప్రతి ఆడపిల్ల తండ్రిలాగానే .
“అన్నట్టు సుబ్రమణ్యం . నీకు ఏమైనా ఇంటరెస్ట్ ఉంటే చెప్పు , మీ అబ్బాయికి పెళ్లి చేద్దామని అనుకుంటే వేరే సంబంధాల కోసం ఎందుకు వెతకడం ? మోహన్ గారిది చాలా మంచి కుటుంబం. పైగా అనుకోకుండా మీ పరిచయాలు కూడా అయ్యాయి. నీకు ఏదైనా ఆలోచన ఉంటే ఒక రకంగా ఇది నాందీ ప్రస్తావన కింద అవుతుంది. అటువైపు వేరే ఎవరినైనా చూస్తూంటే ఈ ప్రస్తావన వదిలేయి. ఎవరేనా ఒక చోట కలిసినప్పడే కదా ఇటువంటి మాటలు వచ్చేవి . పైగా కొన్నాళ్ళ క్రితం మోహన్ కుటుంబం వాళ్ళ అమ్మాయికి సంబంధాలు ఏవైనా ఉంటే చూడమని అంటే ఇప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది. బలవంతం ఏమీ లేదు. . ఇక వెళ్దాం పద . .. మోహన్ ! సుబ్రమణ్యం చెప్పినట్టు ఈ రోజు బాగా గడిచింది. నాకు మళ్ళీ వీలున్నప్పుడు వచ్చి నిన్ను కలుస్తాను ..” అనడంతో ఇద్దరూ లేచారు
వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన కొంత సమయానికి మోహన్ రమణకి ఫోన్ చేశాడు.
“ మీ సుబ్రమణ్యం గారి పరిచయం అంతా బాగానే ఉంది కానీ నువ్వు తొందరపడి అతని ముందే మా అమ్మాయి వివాహ ప్రస్తావన తీసుకు రాకుండా ఉండాల్సింది. అతను ఏమి అనుకుంటున్నాడో ఏమిటో ? ఆయన ప్రయార్టీస్ ఏమిటో మనకేం తెలుసు ? ఒక పెళ్లి కాని ఆడపిల్ల తండ్రి, ఒక పెళ్లి కాని మగ పిల్లాడి తండ్రి కలుసుకుంటే వాళ్ళ మధ్య పెళ్లి అంశం తప్పని సరా ? ఎందుకో చాలా మంది ఆశలు పెట్టేసుకుంటారు. నాకు మాత్రం ఎందుకో “ షై “ గా ఉంది. పోనీలే నువ్వు మాత్రం ఈ క్షణం నుండి అతన్ని పెళ్లి విషయం మాత్రం కదపకు . అతనంతట అతను ఆసక్తి చూపిస్తే సరే. “ అన్నాడు.
“సరే. అలాగే . ఎలాగైనా నువ్వు కొంచం స్పెషల్ గా కనిపిస్తున్నావు. వేరే వాళ్లయితే “ వాళ్ళను అడిగావా లేదా ? వాళ్ళు ఏమంటున్నారు ?” అంటూ వెంటపడి విసిగించి చంపుతారు. నువ్వు చెప్పింది నాకు సబబుగానే ఉంది. “ అన్నాడు రమణ .
** ** ** **
ఒక రోజు అనుకోకుండా సుబ్రమణ్యం నుండి ఫోన్ వచ్చింది రమణకు .
ఒక ఐదు నిమిషాల సేపు వాళ్ళ మధ్య మామూలుగా మాటలు జరిగాక ఆ తర్వాత సుబ్రమణ్యమే మోహన్ వాళ్ళ టాపిక్ ఎత్తాడు.
“ఏమంటున్నాడు మీ ఫ్రెండ్ ? నా నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాడా ? ఇక నా విషయం చెపుదామనుకుంటున్నాను. నాకూ వారికి గతంలో ఎటువంటి పరిచయాలు లేవు వారు ఎటువంటి వారో, వారి బాక్ గ్రౌండ్ ఏమిటో నువ్వు చెప్తే తప్ప నాకు తెలిసే అవకాశం లేదు . నేను చాలా కాలంగా సేలం లో ఉండటం వల్ల అక్కడి పరిస్తితులు నాకు తెలియవు. ప్రస్తుతం నాకు సేలం చుట్టు పక్కల ప్రాంతాలలో కొంతమంది తెలుసు వారు పెళ్లి సంబంధం గురించి వాకబు చేస్తున్నారు. అయినా కూడా నీ మీద నమ్మకంతో మీ ఫ్రెండ్ మ్యాచ్ గురించి ఆలోచించ దల్చాను. వారికి కూడా ఇష్టమైతే ముందుకు ప్రొసీడ్ అవ్వాలని అనుకుంటున్నాను. ..” అన్నాడు సుబ్రమణ్యం..
** ** ** **
చాలా రోజుల తర్వాత :
చాలా కాలంగా మోహన్, రమణ మధ్య పూర్వంలా సంబంధాలు లేవు. రమణ తన ఉద్యోగంలో మార్పులు దృష్ట్యా ముంబై వెళ్ళిపోయాడు. తమ కనుసన్నల్లో ప్రతి క్షణమూ మెలుగుతుంది అని గర్వంగా చెప్పుకునే మోహన్ కూతురు తల్లి తండ్రులకు అనుమానం రాకుండానే హైదరాబాద్ లో తనతో పాటే పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ ని చాలా కాలంగా ప్రేమిస్తూ చివరకు తల్లి తండ్రులను బలవంత పెట్టి పెళ్లి చేసుకుని వెళ్ళి పోయింది.
తనకు వేల కిలోమీటర్ల దూరంలో ఉండి ఉద్యోగం చేసుకుంటున్న సుబ్రమణ్యం కొడుకు రవి వేరే అమ్మాయితో ప్రేమలో పడ్డాడని వాళ్ళు పెళ్ళికి సిద్దం అవుతున్నారని మోహన్ కు మాట ఇచ్చే అంతవరకు సుబ్రమణ్యానికి తెలియదు.
తన దగ్గర చుట్టం సుబ్రమణ్యానికి , మోహన్ కుటుంబానికి మధ్య “ పెళ్లి “ అనే వారధి వేసి తమ బంధాలను మరింత పటిష్టం చేసుకోవాలనుకున్న రమణ ఇరు వర్గాల వారి పిల్లల అసంబద్ద , స్వార్థ నిర్ణయాలకు తీవ్రంగా భంగపడి అవమానంతో తెర వెనకకు వెళ్ళి పోయాడు .
మరి తల్లి తండ్రుల పాత్ర పిల్లలను చదివించి ప్రయోజకులను చేయడం వరకేనా ? ఆ తర్వాత వారిపై ఎటువంటి హక్కు ఉండదా ? ఈ ప్రశ్నలకు ప్రస్తుత సమాజంలో సమాధానం దొరకడం కష్టమే మరి. ********
సమాప్తం