గండం తప్పింది “ (కథ )
(విశాలాంధ్ర ఆదివారం అనుబంధం 9/2/2025 లో ప్రచురణ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
“నేనమ్మా రమణారావును మాట్లాడుతున్నాను. మా వాడు ఉంటే ఒకసారి ఫోన్ ఇస్తావా ?” అడిగాడు రమణా రావు చాలా రోజుల తరవాత ఫోను చేసి.
“ ఈయన బజారు వెళ్లారు బావగారు. అక్కయ్య, పిల్లలు బాగున్నారా ? ఈయనతో ఏదైనా చెపాల్సింది ఏదైనా ఉంటే చెప్పండి. రాగానే చెప్పి మీకు ఫోన్ చేయమంటాను “ అంది రమణి మర్యాద ధ్వనిస్తున్న గొంతుతో.
“ పర్వాలేదులే అమ్మా . వాడికి నేను మళ్ళీ ఫోన్ చేస్తానులే “ అంటూ ఫోన్ పెట్టేశాడు రమణారావు.
ఒక గంట తర్వాత రెండు చేతుల్లో కూరలు, సరుకుల సంచీలతో నిలువెత్తునా చెమటలు కారిపోతూ లోపలికి వచ్చాడు కామేశం.
వస్తూనే శోష వచ్చినట్టుగా కుర్చీలో కూలబడ్డాడు.
“అన్నన్ని సరుకులు మోసుకు రాకపోతే ఏమొచ్చిందండీ ? ఒకపక్క ఆన్లైన్లో అన్ని సరుకులను తెప్పించుకునే ఏర్పాటు అబ్బాయి చేసి పెట్టాడు కదా. మీరు మాత్రం బజారులో షాపుల వాళ్ళనందరినీ పోషించాలన్న బాధ్యతను నెత్తిమీద వేసుకుని ఇల్లంతా అవసరం లేని సామాన్లతో నింపేస్తున్నారు. ప్రిజ్జులో పెట్టడానికి కొద్దిగా కూడా చోటు లేదు. బయట ఉంటే సరుకులన్నీ పురుగులు పట్టేస్తున్నాయి. మీరు వాకింగ్ చేయడానికి వెళ్తే వెళ్ళండి కానీ వచ్చేటప్పుడు మాత్రం ఈ పనికిమాలిన బరువులు మాత్రం మోసుకు రాకండి ..మీకు కూడా వయసు పెరుగుతోంది. ..” అంటూ కామేశం బయటకు వెళ్ళి వచ్చినప్పుడలా పోరుతూనే ఉంటుంది రమణి .
“ఇదిగో రోజూ చెప్పిందే చెప్పి నన్ను విసిగించకు. ఈ కాలనీలో ఇతర మగాళ్లు లాగా పనీ పాట లేకుండా టీవీలో పనికిమాలిన చెత్తంతా చూస్తూ కూర్చోవడం నా వల్ల కాదు. పైగా ఈ మధ్య డాక్టర్లు రోజుకు పదివేల అడుగులయినా వాకింగ్ చేయకపోతే ఆరోగ్యం మీ చేతుల్లో ఉండదు అని హెచ్చరించడం నువ్వు వినలేదా ? సరే కానీ ఒళ్ళంతా జిడ్డుతో పాకమోడిపోతోంది. ముందు బాత్ రూంలో పంపు తిప్పి బకెట్ నింపు. స్నానం చేయాలి “ అంటూ భార్యకు పురమాయించాడు కామేశం.
“ అన్నట్టు చెప్పడం మరిచాను .హైదరాబాద్ నుండి మీ అన్నయ్య ఫోన్ చేశారు. మీరు బయట నుండి వచ్చాక ఫోన్ చేస్తానని అన్నారు. ఎందుకైనా మంచిది మీరు రెఢీ గా ఉండండి. ఇంకో అసలు ముఖ్యమైన విషయం ఒక గంట నుండి బాత్ రూంలో నీళ్ళు రావడం లేదు. మెట్లు దిగి కింద వాటా వాళ్ళకు చెపుదామంటే నాకు ఈ వెధవ మోకాలి నొప్పులు ఒకటి. మీ కోసం ఎదురు చూస్తున్నాను. ఒకసారి వెళ్ళి వాళ్ళకు చెప్పి రండి. అయినా ఇదెక్కడి గొడవ ? నీళ్ళు అయిపోయినప్పుడు మోటార్ వేయాలని తెలియదా ? రేపు ఒకసారి ఇంటాయనకు ఫోన్ చేసి చెప్పేయండి. ఇలా రోజూ నీళ్ళ కోసం బ్రతిమాలుకోవడం మా వల్ల కాదని , ..” అంటూ మొగుడికి చావు కబురు చల్లగా చెప్పింది రమణి
రమణి మాటలకు కామేశం ఆవేశంతో ఊగిపోయాడు.
అతనిలో తాపం పెరిగిపోతోంది. ఇవాళ తాడో పేడో తేల్చుకోవాలి అనుకున్నాడు. కట్టుకున్న లుంగీని పైకి ఎగలాక్కుని ఆవేశ పడుతూ మెట్లు దిగుకుంటూ కిందకు వెళ్ళాడు. కింద వాటా ఆయన వేసవి కాలం సెగలు భరించలేక మనవడిని ఎత్తుకుని అటూ ఇటూ తిరగడం గమనించాడు. అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తున్న ఆయన్ని చూడగానే కామేశానికి చిర్రెత్తుకొచ్చింది.
“ ఏం సుబ్బా రావు గారు మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్ధం కాదా ? ఈ రోజు నీళ్ళు పైకి ఎక్కించలేదుటగా ? మీరంతా ఇంట్లోనే ఉన్నారుగా ? అసలు ఈ బాధ్యతను మీకు అప్పగించిన ఇంటి ఓనర్ని అనాలి. మీరు మాత్రం కింద వాటాలో ఉండి చక్కగా పూల చెట్లు పెంచుకుంటూ మొత్తం నీళ్ళన్నీ వాటికి వాడేసుకుంటున్నారు. ఇక మా విషయం ఏం గుర్తొస్తుంది తమరికి ? “ అన్నాడు ధుమ ధుమ లాడిపోతూ.
ఊహించకుండా ఉరుములాగా ఊడిపడిన కామేశాన్ని చూసి " అయ్యా కొద్దిగా ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. రోజూ పైకి నీళ్ళు ఎక్కించే విషయంలో మేము కాక మీరు చూసుకుంటున్నారా ? ఈ రోజు మళ్ళీ బోరు చెడిపోయి చచ్చింది. మధ్యాన్నం నుండి ఇంటి ఓనర్ కు ఫోన్ చేస్తున్నాను. ఆయనేమో నా మీద మండిపడుతున్నాడు. ఈ వేసవి కాలం మొదలైనప్పటినుండి ఇప్పటికీ రెండు సార్లు బోరు చెడిపోయిందని , దానికైన ఖర్చు మన మూడు వాటాల వాళ్ళు సమానంగా భరించాలని తెగేసి చెప్పేశాడు. బోర్లు బాగు చేసే వాడు షాపు కట్టేసి ఎక్కడికో పోయాడుట. రేపు ఉదయం పది గంటలకు కానీ రావడం కుదరదని చెప్పాడుట. . ఇక ఈ రోజు రాత్రికి నీళ్ళ విషయం మర్చిపోండి..." అంటూ వెనక్కి చూడకుండా గబ గబా లోపలికి వెళ్ళి పోయాడు సుబ్బారావు . .
కామేశంకు ఎందుకో అనుమానం వచ్చి పక్కకు వెళ్ళి చూస్తే ఆ పెద్ద మనిషి తెలివిగా అప్పటికే రెండు పెద్ద డ్రమ్ముల్లో నీళ్ళు నింపేసి ఉండటం గమనించాడు. .
ప్రతి వేసవిలో జరిగే ఈ తంతు గురించి అసహనంగా అరుస్తూ పైకి మెట్లు ఎక్కుతూంటే కామేశం అన్నగారినుండి ఫోన్ వచ్చింది.
"నువ్వు ఫోన్ చేసినట్టు తను చెప్పిందిరా బాబూ. ఇక్కడ ఒక పక్క బోరులో నీళ్ళు అందరికీ సరిపోక ఈ మండు వేసవికాలంలో అందరమూ మగ్గిన మామిడి పండులా మాగిపోతున్నాం. పైపెచ్చు ఆ వెధవ బోరు ఎప్పుడూ చెడిపోవడమే . అసలు ఈ ఊళ్ళో కొత్తగా ఇళ్ళు కట్టుకునే వాళ్ళకు బోర్లు వేసుకోవడానికి పర్మిషనే ఇవ్వడం లేదుట. మా ఓనర్ మటుకు లంచాలు ఇచ్చేసి ఒక బోరు పెట్టించాడు. పేరుకు బోరు ఉంది కానీ ఎప్పుడూ ట్యాంకర్ల మీద ఆధారపడటమే బాగా డబ్బున్న ఆసాములు పర్మిషన్ ఉన్నా లేకపోయినా ఈ ఊళ్ళో ఎడాపెడా ఐదేసి ఫ్లోరులు కట్టేసి అద్దె కున్న వాళ్ళు ఏమి ఆగచాట్లు పడుతున్నారో పట్టించుకోకుండా వేరే ఊళ్ళల్లో పోయి ఉంటున్నారు. నీళ్ళ సమస్య ఇలా ఉంటే ఇప్పుడు ప్రతి ఇంటికీ మీటర్లు కూడా పెట్టేశారు. బిల్లులు కట్టలేక చస్తున్నాం. ఇలాంటి పరిస్తితిలో ఎవరినైనా ధైర్యం చేసి ఇంటికి రమ్మందాం అంటే భయపడి పోతున్నాం అనుకో ...సరేలే .. మా బాధలు ఎప్పుడూ ఉండేవే కానీ ఏమైనా విశేషాలు ఉన్నాయా ? ఎందుకు ఫోన్ చేశావ్ ?" అన్నాడు భుజమ్మీద టవల్ తో చెమటలు కారిపోతున్న ఒళ్ళు అంతా పరపరా తుడుచుకుంటూ .
"ఏం లేదులే .. ఈ మధ్య చాలా రోజులయ్యింది కదా .. ఒకసారి పలకరిద్దామని . అంతే .. వేరే ప్రత్యేక విశేషాలు ఏమీ లేవులే. నీ పని చూసుకో మళ్ళీ మాట్లాడతాను " అంటూ ఫోన్ పెట్టేశాడు అవతల రమణారావు.
అసలు రమణారావు ఫోన్ చేయాలని అనుకున్నది ఈ సెలవుల్లో కుటుంబంతో సహా తమ్ముడు కామేశం ఊరు వచ్చి వారం రోజులు చుట్టుపక్కల పుణ్య క్షేత్రాలు తిరగాలని. ఇప్పుడు ఒక పక్క తన తమ్ముడు కామేశం ఈ వేసవి కాలం నీళ్ళు లేక నానా ఇబ్బందులు పడుతున్నాం అని తన బాధలన్నీ ఏకరువు పెట్టాక తను అక్కడకు రావాలని ప్లాన్ చేసుకుంటున్నట్టు చెపితే అంతకన్నా అవమానకరమైన ఆత్మహత్యా సదృశ్యం ఇంకోటి ఉండదు అనుకుని ఆ విషయం ఎత్తకుండా గమ్మున ఊరుకున్నాడు. *****
సమాప్తం