“ బాస్ గండం “

విశాలాంధ్ర ఆదివారం అనుబంధం • 06 Apr 2025 • 👁 1 views
“ బాస్ గండం “
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
(6/4/2025 విశాలాంధ్ర ఆదివారం అనుబంధంలో ప్రచురణ )
“ఇదేమిటి నువ్వు ఇక్కడ ఉన్నావా ? అప్పుడెప్పుడో మన పాత కంపినీ లాకౌట్లో ఉన్నప్పుడు ఎక్కడో ఉద్యోగం దొరికింది వెళ్తున్నాను అంటే పోనీలే మళ్ళీ ఎప్పుడు తెరుస్తారో తెలియని వాటిలో పని చేసే కన్నా అవకాశం ఉన్న చోటకు పోవడమే నయం అని సంతోషించా కానీ మరీ ఇంత చిన్న సంస్థలో పని చేస్తున్నావని అనుకోలేదు ..” అంటూంటే ఆశ్చర్యం, జాలి ఆయన మొహంలో ప్రస్పుటంగా కనిపించాయి.
ఆంజనేయులు ఊహల్లో కూడా ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడని ఆ పెద్ద మనిషి అక్కడ కనిపించే సరికి కొన్ని నిమిషాల పాటు దిగ్భ్రాంతితో ఉండిపోవాల్సి వచ్చింది. తనని గుర్తుపట్టి ప్రశ్నించిన ఆయన గతంలో తను పని చేసిన సంస్థలో సీనియర్ మేనేజర్ . పేరు విశ్వనాథం . పాత సంస్థ మూతపడటంతో విశ్వనాథం గారు ఎక్కడో ఏదో పెద్ద సంస్థలో ఉంటున్నాడు అని తెలుసు కానీ ఇన్నేళ్ల తర్వాత ఇలా ఊహించకుండా కనపడతాడని కలలో కూడా అనుకోలేదు.
రెండు నిమిషాల అనంతరం ఆశ్చర్యం నుండి తేరుకున్నాక "అవును సర్ . ఈ మధ్య కాలంలో ఒకటి రెండు చోట్ల పని చేశాను కానీ ఎక్కడా సంతృప్తిగా అనిపించలేదు. ఈ పదేళ్ళల్లో ఇది మూడవది. ..." అని ఇబ్బంది పడుతూ చెప్పాడు ఆంజనేయులు .
" నా ఉద్దేశ్యం అది కాదు. నువ్వు చాలా తెలివైన వాడివి . ప్రతి సంవత్సరం ప్రమోషన్ లిస్టులో నీ పేరు ఖచ్చితంగా ఉండేది. ఒక కంపినీ మూసేసినంత మాత్రాన ఇంకో మంచి ఉద్యోగం దొరక్కుండా ఎలా పోతుంది ? నీ టాలెంట్ కు తగ్గ ఉద్యోగం నువ్వు ఎన్నుకోలేదని నాకనిపిస్తోంది. " అంటూ ఆంజనేయులిని విశ్వనాథం గారు పక్కకు పిలిచి " ఇంతకీ ఇక్కడ జీతం ఎంత ఇస్తున్నారు ?" అని అడిగాడు ఎవరికీ వినపడకుండా .
ఆంజనేయులు మరోసారి ఇబ్బందిలో పడ్డాడు .
"పర్వాలేదు. చెప్పు. ఒకనాడు నాదగ్గర పని చేసిన నీకు సరైన అవకాశం కలిపించాలని నా తాపత్రయం. " అన్నాడు మళ్ళీ ఆయన.
ముసుగులో గుద్దులాట ఎందుకని " ప్రస్తుతం పదిహేను వేలు వస్తుంది సర్ . రాత్రి పది గంటల వరకు వీళ్ళు సప్లయ్ చేస్తున్న ఎన్నో సంస్థలకు తిరిగి డబ్బులు వసూలు చెయ్యాలి. పీఎఫ్ లాంటివి ఏమీ లేవు. పిల్లలు ఈ వూళ్లోనే చదువుకుంటున్నారు. వాళ్ళ చదువు డిస్ట్రబ్ చెయ్యడం ఇష్టం లేక ఇంకెటూ వెళ్లలేక ఇక్కడే వేలాడిపోతున్నాను ..." అన్నాడు ఆంజనేయులు తల దించుకుని .
"ఓకే ఓకే.. నేను అర్ధం చేసుకోగలను. అయితే ప్రైవేట్ సంస్థలలో ఒకేచోట పాతుకుపోయి ఉంటే భవిష్యత్తు ఉండదు. నువ్వు కొద్దిగా ధైర్యం చేస్తే మా కంపినీలో నీకు నీకు తగిన ఉద్యోగం కలిపిస్తాను . ...ఏ విషయమో ఆలోచించి ఒకటి రెండు రోజుల్లో నీ అప్లికేషన్ నాకు మెయిల్ లో పంపించు. ...ఇంతకీ నేను ఇక్కడకు ఎందుకొచ్చాననేగా నీ అనుమానం ? మీ కంపినీ వాళ్ళకు గుజరాత్లో పెద్ద టెక్స్టైల్ మిల్ ఉంది. దాన్ని తీసుకోవాలని మా మేనేజ్మెంట్ అనుకుంటోంది. దానికి సంబంధించిన వ్యవహారాలు మీ మేనేజ్మెంట్ తో వ్యక్తిగతంగా మాట్లాడాలని వచ్చాను. నేనెవరో , నువ్వు ఇంతకుముందు నాకు తెలిసినట్టుగా పొరపాటున కూడా ఎవరికీ తెలియనియ్యకు.. నువ్వు కానీ ఇక్కడ ఉంటే నీ పరిస్తితి ఎక్కడ వేసిన గొంగళీ అక్కడే అన్నట్టుగా ఉంటుంది. పైగా నువ్వు తెలివితక్కువగా వీళ్ళ రహస్య వ్యాపారాలలో ఇరుక్కునే ప్రమాదం కూడా ఉంది . ....నేను వస్తాను. నువ్వేమీ ఆందోళన పడకు. ఒక రకంగా నేను ఇక్కడ కనపడటం నీ అదృష్టం అనుకో. మన పాత కంపినీలో నా దగ్గర పనిచేసిన వాళ్ళకు ఏదో విధంగా సహాయం చేయాలని నా సంకల్పం. ఇప్పటికే మన వాళ్ళు నలుగురైదుగురు ఆల్రెడీ పనిచేస్తున్నారు. ...." అంటూ ఆంజనేయులు భుజం తట్టి ధైర్యం చెపుతూ తిరిగి తన కారు ఎక్కి వెళ్ళి పోయాడు విశ్వనాథం గారు. .
ఆంజనేయులు డోలాయమాన స్తితిలో పడ్డాడు. మళ్ళీ ఫ్యాక్టరీ జీవితం అంటే ఒక రకంగా నరకమే. అందులో తనలాంటి వాడికి పగలూ లేదు రాత్రీ లేదు. ఇరవై నాలుగు గంటలూ డ్యూటీనే. పోనీ అందుకు తగ్గట్టు ప్రతిఫలం ఉంటుంది అంటే ఏ కంపినీలో చూసినా వెట్టి చాకిరీయే తప్ప కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి సరిపోయేది కాదు. జీతం తక్కువైనా ఏదో విధంగా సిటీలో జీవితం గడిచిపోతోంది. పైగా తను జీతం పెంచమని ఏనాడూ నోరు తెరిచి ఆడగక పోవడంతో ఇన్నాళ్లుగా అందులో కొనసాగుతున్నాడనేది సత్యం. ఈ మధ్య కాలంలో ఒకటి రెండు సార్లు ఏవో సంస్థలలో ఫ్యాక్టరీ సైట్లలో పని చేయడానికి అవకాశం వచ్చినా తనకు ఫ్యాక్టరీ జీవితం అంటే విరక్తి పుట్టడంతో వాటి పై ఏ మాత్రం ఆసక్తి చూపే వాడు కాదు. ఇక్కడ కన్నా మూడు నాలుగొందల జీతం విశ్వనాథం గారు పని చేస్తున్న చోట ఎక్కువ వస్తుందని ఏదో సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టాల్లోకి నెట్టివేయడం అవసరమా ? అని ఆ క్షణంలో అనిపించింది .
విశ్వనాథం గారికి తనని ఇక్కడ చూశాక తను పని చేస్తున్న సంస్థలో అవకాశం కలిపించాలని అనిపించడం యాదృచ్ఛికం అయినా , ఆయనకు అక్కడ తన మనుషులు ఉంటేనే ఎంతో ఉపయోగం. అందుకనే పాత కంపినీలలో వాళ్లందరిని పిలిచి తన దగ్గరకు చేర్చుకుంటున్నాడు అనుకుంటా. ఇది ఆంజనేయులి మనసులోని భావన.
పరివిధాలుగా పోతున్నాయ్ ఆంజనేయుల ఆలోచనలు .
** ** ** “ఏమండీ గీజర్ వేసినా నీళ్ళు వేడెక్కడం లేదు. చాలా సేపు అయ్యింది. ఇండికేషన్ లైట్ కూడా వెలగడం లేదు. ఒకసారి ఇంటాయనతో చెప్పి రిపేరు చేయించమని చెప్పండి ..” అంది ఆంజనేయుల భార్య పిల్లల్ని కాలేజీకి ,స్కూలుకు పంపించడానికి తయారవుతూ .
“ మళ్ళీ చెడి పోయిందా ? . ఎప్పుడూ ఏదో ఒక రిపేరే. ఇప్పటికే ఈ ఇంటిమీద చాలా ఖర్చు పెట్టాం. క్రితం సారి ఓనర్కు ఇంట్లో సమస్యల గురించి చెపితే” ఒకసారి ఇల్లు అద్దెకిచ్చాక ఓనర్ కు ఏ బాధ్యతా ఉండదు . ఎటువంటి మరమ్మత్తులు వచ్చినా అద్దెకున్న వాళ్ళే భరించాలి “ అని నిర్మొహమాటంగా చెప్పేశాక ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని అడగాలి ?” అంటూ చిరాకు పడుతూ ఒక కిలోమీటర్ దూరంలో ఉంటున్న ఎలక్ట్రీషియన్ని పిలిపించి అతను అడిగింది సమర్పించుకోవాల్సి వచ్చింది.
ఇలా అడపా దడపా ఇంటిమీద ఊహించని ఖర్చులు రావడం, మరో పక్క ఏదో ఒక శుభకార్యం పేరిట పిలవడానికి బంధువులు రావడం ,తప్పని సరి పరిస్తితులలో వాటికి వెళ్లాల్సి రావడం ఎంతో కొంత చదివించుకోవడం నిజం చెప్పొద్దూ ఆర్ధిక భారం బాగానే పెరిగింది. . .
ఆ రోజు రాత్రి ఆంజనేయులు అతని భార్య దాదాపు పది గంటలవరకు అనేక విషయాల మీద చర్చలు సీరియస్గా జరిపిన అనంతరం ఇలాంటి క్లిష్ట పరిస్తితులలో చాలీచాలని జీతాలతో బండి లాక్కు రావడం కన్నా విశ్వనాధం గారు ఇచ్చిన ఆఫర్ను వాడుకోవడం చాలా మంచిది అన్న ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చేశారు. ఆ ఆఫర్లో వాళ్ళకు బాగా నచ్చిన అంశం ఏమిటంటే ఫ్రీ క్వార్టర్. దాని వల్ల కరెంట్ , రెంట్ ఖర్చు ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి.
ఆ తర్వాత పరిణామ క్రమంలో ఆంజనేయులు విశ్వనాథం గారికి మెయిల్ పంపడం పది రోజులు గడవక ముందే ఉద్యోగంలో చేరిపోవడం చెకచెకా జరిగిపోయాయి. అతని కోసం కొత్త క్వార్టర్ తయారవుతోందని చెప్పడంతో ఆంజనేయులు కుటుంబాన్ని హైదరాబాద్లోనే ఉంచి ముందుగా తను జాయిన్ అయ్యిపోయి కంపినీ గెస్ట్ హౌస్లో టెంపరరీగా ఉంటున్నాడు. .
కొత్త సంస్థలో విశ్వనాథం గారు సీనియర్ జనరల్ మేనేజర్ పోస్టులో ఉన్నారు. ఆంజనేయులు ఆయన ద్వారా ఉద్యోగం సంపాదించాడు అన్న విషయం దాదాపు అందరికీ తెలిసి పోయింది.
ఉద్యోగంలో భాగంగా ఆంజనేయులు విశ్వనాథం గారిని తరచుగా కలుస్తూ ఉండటం అతని సహ ఉద్యోగస్తులు గ్రహిస్తూనే ఉన్నారు. ఆంజనేయులు వాళ్ళ నోటా , వీళ్ళ నోటా విన్నది ఏమిటంటే విశ్వనాధం గారు తన మనుష్యులను ఉపయోగించుకుంటూ చాలా స్కాములు చేస్తూ ఉంటాడు అని. తద్వారా ఎన్నో లక్షల రూపాయలు అక్రమార్జన చేశాడని, అయితే కేవలం ఆయన తెలివి తేటల వల్ల కంపినీకి ఎన్నో కొత్త ఆర్డర్లు వచ్చేవని, ఎన్నోసార్లు నష్టాలలో ఉన్న సంస్థను లాభాల బాటలో నడిపించాడని యాజమాన్యం ఆయన్ని చూసీ చూడనట్టు ఉంటుందని అని కూడా అనుకుంటూ ఉంటారు.
సహజంగా ఆంజనేయులు భయస్తుడు నిజాయితీ పరుడు అవడంతో ఆక్రమార్జనలకు ఆమడ దూరంలో ఉంటాడు. అయితే ఆయాచితంగా డబ్బు సంపాదించే అవకాశం వచ్చినప్పుడు అటువైపు ఆకర్షితులు అవ్వడానికి ఎవరూ మినహాయింపు కాదు. ఆంజనేయులు విషయంలో ఏదో సామెత చెప్పినట్టుగా తాటి చెట్టు కింద పాలు తాగుతున్నా వేరే విధంగా అనుకునే అవకాశం ఉన్నట్టు స్కాముల విశ్వనాధం అండ్ కో తో తరచుగా సంచరిస్తూ ఉండటంతో వాటిలో అతనికి కూడా భాగం ఉంది అని అందరూ బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. .
ఆ రోజు విశ్వనాధం గారు ఆంజనేయులని తన ఛాంబర్ లోకి పిలిపించుకున్నాడు. నిజానికి ఆంజనేయులు విశ్వనాధం గారి దగ్గర పని చేయడం లేదు. అతని డిపార్ట్మెంట్ వేరు. పని వేరు. కానీ అతన్ని రికమెండ్ చేసి తీసుకుని రావడం వల్ల తన స్కాముల్లో భాగస్టుడిని చేసి తను లాభపడటమే కాకుండా కొంత భాగాన్ని ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఆంజనేయులికి కూడా వర్తింప చేయాలన్న ఆలోచన విశ్వనాథం గారికి ఉంది. అది స్వార్ధం కావచ్చు. తన పనులు సులువుగా నెరవేర్చుకోవడానికి వేస్తున్న పథకం కావచ్చు.
అనుకున్నంత పని అయ్యింది. కొత్త స్కాములో అంజనేయులిని పావుగా వాడుకోవాలని చూస్తున్నాడు విశ్వనాథం.
నిజం, నిప్పూ దాచాలన్నా దాగదు. ఎలా తెలిసిందో కానీ విశ్వనాథం పని చేస్తున్న సంస్థలో జరుగుతున్న అక్రమాల పుట్టను చేజించటానికి ప్రత్యేకంగా ఒక నిఘా విభాగం చేసిన తనిఖీలలో భాగంగా విశ్వనాథం చాలా రోజులుగా కొనసాగిస్తున్న అవినీతి గుట్టు బట్ట బయలవడం అతని మీద సివిల్, క్రిమినల్ చర్యలకు పూనుకోవడం గంటల వ్యవధిలో జరిగిపోయింది.
నిజానికి ఈ అవినీతి గుట్టు పై వాళ్ళ ద్వారా బయట పడటానికి ఒక్క రోజు ముందు తను అమాయకంగా గానీ, విశ్వనాథం బలవంత ప్రేరేపణ వల్ల కానీ ఆ కొత్త స్కాములో చేయి కలిపి ఉంటే విశ్వనాథానికి పట్టిన గతే తనకు కూడా పట్టేదని ఆంజనేయులు అనుకోని క్షణం లేదు. ఏ అద్భుత శక్తులు తనని ఆదుకున్నాయో కానీ ఇన్నాళ్లుగా తను నమ్ముకున్న నిజాయితీ తనని భయంకరమైన ఊబిలోకి కూరుకుపోకుండా అడ్డుకుంది. అప్పటివరకు జరిగిన స్కాముల చిట్టాలో విశ్వనాథం గారు కావాలని తెచ్చుకున్న తన మనుషుల లిష్టులో ఆంజనేయుల పేరు లేదు.
** ** ** **
ఆంజనేయులు పది రోజులు తను హైదరాబాద్లో ఇంతకు ముందు పని చేస్తున్న సంస్థలో తెలివిగా సెలవు పెట్టి వెళ్ళడం వల్ల తిరిగి తన ఉద్యోగంలోకి గుట్టు చప్పుడు కాకుండా ప్రవేశించి ఎప్పటిలాగానే తన పనులు నిజాయితీగా చేసుకుంటూ పోతున్నాడు. ********
సమాప్తం