“మాష్టారి బాకీ “(

విశాలాంధ్ర ఆదివారం అనుబంధం • 27 Apr 2025 • 👁 1 views
“మాష్టారి బాకీ “(కథ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
(27/4/2025 విశాలాంధ్ర ఆదివారం అనుబంధంలో ప్రచురణ )
మాధవరావు గారు తన ఆర్ధిక పరిస్థితి అంతగా బాగోలేక పోయినా పిల్లల చదువు విషయంలో రాజీ పడలేదు. తనకు ఆస్తులు అంటూ ఏమీ లేకపోయినా పిల్లల చదువులే ఒక పెద్ద ఆస్తి అని చెప్పుకునే వాడు.
ఆ కాలంలో స్కూలులో పని చేసే ఏ ప్రభుత్వ ఉపాధ్యాయుడైనా ఇంట్లో విడిగా ట్యూషన్లు నడుపుకుంటూ ఉండటం తప్పు కాదు. . ఇంకో పక్క డిగ్రీ మధ్యలో ఆపేసిన వాళ్ళు , కొంతమంది మహిళలు కూడా తమ శక్తికి తగ్గట్టు వీధి అరుగుల మీదో, ఖాళీ స్థలాలలో పిల్లలకు ప్రైవేట్లు చెప్పుకుంటూ తమ ఆర్ధిక పరిస్తితిని మెరుగు పర్చుకునే వాళ్ళు.
మాధవ రావు గారి కొడుకుల్లో ఒకరైన బ్రహ్మం స్కూల్లో చదువుకుంటున్నా ఎప్పుడూ మందకొడిగా ఉంటూ పరీక్షల్లో తక్కువ మార్కులు తెచ్చుకుంటూ ఉండేవాడు. పిల్లలను దగ్గరుండి చదివించడం విషయంలో ఎప్పుడూ మాధవ రావు గారి భార్య రుక్మిణమ్మే నెత్తిమీద వేసుకోవడంతో బ్రహ్మం చదువులో వెనకబడి ఉన్నాడన్న విషయం ఆయన దాకా రాలేదు. వాళ్ళు పరీక్షలు వ్రాయడానికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేవరకు ఆమె భోజనం చేసేది కాదు. “బాగానే వ్రాసాను “ అని వాళ్ళు చెప్పే అంతవరకు ఆమెకు మనశ్శాంతిగా ఉండేది కాదు. ఎక్కువగా చదువుకోలేక పోయినా లోకజ్ఞానం ఎంతో కొంత సంపాదించుకుంది.
బ్రహ్మం తోటి విద్యార్ధులు స్కూల్లో బాగా చదువుకుంటూ ఉండటం, కొడుకు మాత్రం ఏ విషయాన్ని ఆకళింపు చేసుకోకపోవడం, ఎక్కువ సేపు చదవలేక పోవడం , కళ్ళు నొప్పులుగా ఉన్నాయంటూ రాత్రిళ్ళు త్వరగా పడుకోవడం లాంటి సందర్భాలు చూశాక రుక్మిణమ్మ అదే కాలనీలో రెండు వీధుల అవతల వున్న స్కూల్ టీచర్ రామరాజు గారి దగ్గర తెలిసిన వాళ్ళ ద్వారా ట్యూషన్లో చేర్పించింది. పిల్లలను ట్యూషన్లో చేర్పించడం అనే విషయంలో మాధవరావు గారికి శక్తీ లేదు, ఆసక్తి లేదు. అందుకనే బ్రహ్మాన్ని రామ రాజు మాష్టారు దగ్గరకు పంపిస్తున్నట్టు భర్తకు ఎటువంటి పరిస్తితిలోనూ తెలియకుండా జాగ్రత్త పడింది రుక్మిణమ్మ .
అయితే ధైర్యం చేసి కొడుకును ట్యూషన్ కు పంపుతోందే తప్ప రామరాజు మాష్టారుకు ఇవ్వ వలసిన ఫీజు గురించి ఆలోచించ లేదు. రెండు నెలల వరకు రామరాజు మాష్టారు బ్రహ్మం ఫీజు విషయంలో ఎటువంటి ఒత్తిడి తీసుకు రాకపోయినా ఆ తర్వాత తరవాత ఆయన సాధింపు మొదలయ్యింది.
“డబ్బులివ్వలేని వాడు మీ నాన్న నిన్ను ట్యూషన్ కు ఎందుకు పంపించాడు?” అంటూ రామరాజు మాష్టారు అందరు పిల్లల మధ్య బ్రహ్మాన్ని బాగా అవమానించే వాడు. .ఒక్కో సారి ఆయన గొంతు కటువుగానూ ,కర్కశంగానూ ఉండేది. ఆ సమయంలో అపరాధిలా తల దించుకునే వాడు బ్రహ్మం. ఉన్నప్పుడు ఇచ్చి , లేనప్పుడు అవమానాలు భరిస్తూ ఏదో రకంగా రుక్మిణమ్మ నెట్టుకు వచ్చేస్తోంది .
రకరకాల ఆటూ పోట్ల మధ్య బ్రహ్మం ట్యూషన్ కు అయిష్టంగానే వెళ్ళి వస్తున్నాడు. ఒక రోజు వెళ్ళి ఇంకో రోజు మానేస్తూ ఉండటం, ఎలాగూ డబ్బులు సరిగ్గా ఇవ్వడం లేదనే నెపంతో రామరాజు మాస్టారు కూడా బ్రహ్మం చదువు మీద పెద్దగా శ్రద్ద చూపించడం మానేశాడు. .
“మీ నాన్న వెయ్యి రూపాయలు నాకు బాకీ ఉన్నాడు” అంటూ ఆయన రోజుకొకసారైనా దెప్పి పొడవడం బ్రహ్మంలో అవ్యక్తమైన బెదురూ, నీరసం ముంచుకొచ్చేవి. .అదే విషయం తల్లికి చెప్పుకుని బాధ పడే వాడు బ్రహ్మం. పిల్లాడి పరిస్తితి చూసి రుక్మిణమ్మకు ఎటూ పాలు పోయేది కాదు. మొగుడుకు చెప్పుకుందాం అంటే ఇన్నాళ్ళూ ఈ విషయం దాచినందుకు అతను విరుచుకు పడతాడని భయం. . అప్పట్లో మధ్య తరగతి కుటుంబాలు అలాగే బాధ పడేవి .
ఆ సంవత్సరం పదవ తరగతి పరీక్షలు కీలకమవడంతో ఎలాగో అలాగా అన్నగార్ల సహాయంతో బలహీనంగా ఉన్న సబ్జెక్టులలో సాధన చేసి మొత్తానికి బొటా బొటీ మార్కులతో బయట పడ్డాడు బ్రహ్మం. .
తక్కువ మార్కులు పదవ తరగతిలో తెచ్చుకున్నందుకు మాధవరావు కొడుకు మీద ఎగిరిపడ్డాడు. ఆ అత్తెసరు మార్కులతో కాలేజీలో సీటు దొరకడం కష్టమవడంతో ప్రిన్సిపాల్ను బ్రతి మాలుకుని చేసేది లేక బ్రహ్మాన్ని ఆర్ట్స్ లో చేర్పించాడు .
ఇది ఇలా ఉండగా బ్రహ్మం బయటకు వెళ్ళినప్పుడల్లా ఎక్కడో అక్కడ రామ రాజు మాస్టారు కనపడటం “ ఏరా మొత్తానికి మీ నాన్న నా డబ్బులు ఎగగొట్టేశాడు. నువ్వు బాగు పడవురా “ అంటూ అవమానించడం సర్వ సామాన్యమైపోయింది. ఆయన్ని తప్పించుకోవడం కోసం కాలేజీ నుండి ఇంటికొచ్చాక బయటకు కూడా వెళ్ళడం మానేసే వాడు బ్రహ్మం.
కాల క్రమేణా మాధవరావు కుటుంబం వేరే ఊరిలో స్తిరపడటం జరిగినది. బ్రహ్మం తను చదువుకున్న చదువుకు స్తిరత్వం లేకుండా ఎక్కడో అక్కడ ఏదో ఒక ప్రైవేట్ కంపినీలో పనిచేసుకుంటూ గడుపుతూ లాక్కుంటూ వస్తున్నాడు.
ఉద్యోగం నిమిత్తం బ్రహ్మం ఎన్నో ఊళ్ళు తిరుగున్నాడు కానీ అతన్ని మనశ్శాంతి లేకుండా చేసే విషయం మాటికి మాటికి రామ రాజు మాస్టారు గుర్తుకు వచ్చి “ ఏరా మీ నాన్న డబ్బు ఎగగొట్టేశాడు “ అంటూ ఛీత్కారంగా అడుగుతున్నట్టుగా ఏ పని చేస్తున్నా ప్రతి క్షణమూ అనిపించడం .
అప్పుడెప్పుడో జరిగిన విషయాన్ని భర్తకు తెలియకుండా తనలో తనే వ్యధను అనుభవించిన తల్లి రుక్మిణమ్మా ఇప్పుడు జీవించి లేదు. తన ఆర్ధిక పరిస్తితి అంతంత మాత్రంగానే ఉన్నా ఏదో రకంగా పిల్లల చదువులు గట్టెక్కించేశాను అని జీవితంలో చివరి వరకు తృప్తిగా జీవించిన మాధవ రావు ఇప్పుడు లేడు .
ఏ ట్యూషన్ అవసరం లేకుండానే స్వంత తెలివి తేటలతో బాగానే చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకుని జీవితంలో స్తిరపడిపోయిన అన్న దమ్ములకు కూడా బ్రహ్మం మానసిక వేదనను తెలుసుకోవాల్సిన అవసరమూ లేకుండా పోయింది.
చిన్న వయసులో జరిగిన కొన్ని అనుకోని సంఘటనలు కొంతమంది జీవిత కాలం మొత్తం బాధిస్తూనే ఉంటాయి. బ్రహ్మానికి కూడా ఇది తప్పలేదు.
చాలా కాలం తర్వాత అనుకోకుండా తను చదువుకున్న ఊరుకు అన్నగారితో పాటు బ్రహ్మానికి వెళ్లాల్సి వచ్చింది. ఊరు చాలా మారిపోయింది. మామూలు పెంకుటిళ్లు స్థానంలో భవంతులు వెలిశాయి. ఇంకా కొన్ని ఇళ్ళు ఆనవాళ్ళు లేకుండా పోయాయి.
అన్నదమ్ములిద్దరూ అప్పట్లో తాము తిరిగిన వీధులన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ నడవడం మొదలు పెట్టారు. హఠాత్తుగా వాళ్ళ కాళ్ళు ఒకచోట ఆగిపోయాయి. అక్కడో ఆధునికమైన భవంతి కి తగిలించి ఉన్న నేమ్ బోర్డు వాళ్ళను ఆశ్చర్యంలో పడేసింది. దాని మీద “ఎమ్. రామ రాజు ., రిటైర్డ్ హెడ్ మాస్టర్ “ అని ఉంది. మళ్ళీ బ్రహ్మంలో గత స్మృతులన్నీ బయటపడ్డాయి. అసలు మర్చిపోతే కదా ఇప్పుడు కొత్తగా గుర్తుకు రావడానికి .
బ్రహ్మం అన్న గారు “మాస్టారు ఉన్నారేమో ఒకసారి పలకరించి వెళ్దామా ?” అన్నాడు .
బ్రహ్మానికి గుండెల్లో రాయి పడింది. కొన్ని క్షణాల సేపు తటపటాయించినా “ఎంతైనా ఆయన తనకు చదువు చెప్పిన మాష్టారు. ఇంటవరకొచ్చి వెనక్కి వెళ్ళిపోవడం కన్నా మంచో చెడో ఒకసారి చూసి వెళ్ళిపోవడం విధాయకం “ అని ధైర్యం చేసి మాష్టారి ఇంటి తలుపు తట్టాడు.
కిటికీ లోంచి బయటకు చూస్తోంది ఒక డబ్బయి ఏళ్ల ఆవిడ . వీళ్ళను చూడగానే తలుపు తెరిచి “ఎవరు అండీ మీరు ? ఏమి కావాలి ?” అని అడిగింది.
తన అన్నగారికి రామ రాజు మాష్టారుతో భయంకరమైన పూర్వ అనుభవాలు లేకపోవడంతో తన లాగా ఆందోళనతో లేడు .
“నమస్తే అండీ. ఇది రామరాజు మాష్టారి ఇల్లేనా ? వారు ఇంట్లో ఉన్నారా ? నేను చిన్నప్పుడు ఆయన దగ్గర చదువుకున్నాను “ అడిగాడు బ్రహ్మం ఊపిరి బిగపెట్టి . లోపల మాత్రం మాష్టారి బాకీ తరుముతూనే ఉంది.
“అవునండీ. ఇది మాస్టారి ఇల్లే . ఇందాకే మా అబ్బాయితో కలిసి బయటకు ఏదో పని మీద వెళ్లారు. ఒక అరగంటా గంటలో వచ్చేస్తారు . “ అంది ఆవిడ . ఆవిడ మాస్టారి భార్య అని ఇప్పుడు గుర్తుకు వస్తోంది.
“సరే అమ్మా. మేము ఈ వూళ్ళో మా పనులు చూసుకుని మళ్ళీ వచ్చి కలుస్తాము. “ అంటూ చెప్పి బయట పడ్డారిద్దరూ.
ఎందుకో మాష్టారుని కలవలేక పోయినందుకు బ్రహ్మానికి మనసు తేలిక పడింది. ముసుగులో గుద్దులాట ఎందుకని అప్పుడు రామరాజు మాస్టారుకు బాకీ పడిపోవడం, అందుకు కనపడినప్పుడల్లా తీవ్రంగా తమ తండ్రిని అవహేళన చేస్తూ దూషించడం విషయం గురించి కళ్ళకు కట్టినట్టు అన్నగారికి మళ్ళీ గుర్తు తెచ్చాడు బ్రహ్మం.
“ ఆ అప్పటి విషయం ఇంకా ఆయనకు గుర్తుంటుందని ఎందుకనుకోవాలి ? .వాళ్ళ అనుభవంలో మన లాంటి వాళ్ళు బోళ్లు మంది ఉంటారు . .. ఇంకా ఈ వూళ్ళో ఒక్కరేనా అప్పటి వాళ్ళు కనపడటం గొప్ప .. పద పదా మన పనులు చూసుకుని ఇంకో గంటలోపు మాస్టారుని కూడా పలకరించేస్తే తృప్తిగా ఉంటుంది “ అన్నాడు బ్రహ్మం అన్నగారు. అతనికి మాస్టారుని కలవాలంటే చాలా ఎగ్జైటింగ్ గా అనిపిస్తోంది.
బజారు వైపు వెళ్తూంటే ఎవరెవరో గుర్తుపట్టీ , పట్టనట్టు చూస్తూ ఒక్క నిమిషం అక్కడ ఆగి వెళ్ళి పోతున్నారు. .
ఆ ఊళ్ళో కాలేజీలో స్నాత కోత్సవం వుంటే అన్నదమ్ములిద్దరికి ఆహ్వానం మీద వచ్చారు, ఆ పని నిన్న రాత్రే పూర్తయ్యింది. ఈ రోజు ముఖ్యమైన నాలుగైదు వీధులు తిరిగి ఆ అనుభూతులతో వెనక్కి వెళ్ళి పోవాలని వారి ప్రయత్నం.
“ఏరా బ్రహ్మం ! ప్రతి క్షణమూ మాస్టారి బాకీ గురించి , ఆయన చేసిన అవమానం గురించి బాధ పడిపోయే కన్నా, ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది కదా ఆ డబ్బులేవో దక్షిణ కింద ఆయన చేతిలో పెట్టేస్తే ఇక జీవితాంతం మనం సుఖంగా బ్రతకొచ్చు. ఇన్నాళ్ళూ అనుభవించిన మానసిక వేదనకు ఒక్క రోజుతో ఫుల్ స్టాప్ పడిపోతుంది .. ఏమంటావ్ ?” అన్నాడు బ్రహ్మం అన్నగారు .
“అవును నిజమే కదా. నాది మట్టి బుర్ర అని ఇంకోసారి నిరూపించుకున్నాను. ఈ ఐడియా నాకు రానే రాలేదు. .. “ అంటూ బ్రహ్మం తన అన్నగారికి థాంక్స్ చెప్పాడు.
హోటల్ దగ్గర ఆగారు ఇద్దరూ . తిరిగి ట్రైన్ ఎక్కేటప్పటికి ఆలస్యం అవుతుందని పనిలో పనిగా భోజనం చేసేశారు . దారిలో పళ్ల దుకాణం దగ్గర పళ్ళు కొనుక్కుని ఒక కవర్లో మూడు వేల రూపాయలు పెట్టి దాని మీద మాస్టారికి శుభాకాంక్షలు అని వ్రాసి జేబులో ఉంచుకున్నాడు బ్రహ్మం. మాస్టారు తీవ్రంగా అవమానించాడు అని ఇన్నాళ్ళూ మనసులో బాధ పడ్డాడే కానీ ఏదో రకంగా ఆయన బాకీ తీర్చేయాలన్న ఆలోచన ఈ వూరు వచ్చే అంత వరకు రాకపోవడం గురించి తనని తనే ఇంకా నిందించుకుంటూనే ఉన్నాడు బ్రహ్మం.
** ** **
మాస్టారు తమకన్నా చాలా పెద్దే . అంటే సుమారు డబ్బయి ఐదేళ్లు దాకా ఉంటాయి. తమని తాము పరిచయం చేసుకున్నారు ఆయనింటికి వెళ్ళగానే.
మాష్టారుకు జ్ఞాపక శక్తి ఎక్కడా తగ్గినట్టు లేదు.
” అవును. గుర్తు లేకపోకేం . నీ పేరు బ్రహ్మం కదూ. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు బాబూ ? “ అడిగాడు ఆయన .
బ్రహ్మం తన వివరాలు చెప్పి ఆ తర్వాత బ్యాగులోంచి పళ్ళూ లోపల ఉంచిన కవరూ బయటకు తీసి ఆయన కాళ్ళకు నమస్కారం చేసి “ మాస్టారూ అప్పట్లో మా ఆర్ధిక పరిస్తితి బాగో లేకపోవడం వల్ల మీ దగ్గర ట్యూషన్ చదువుకున్నా డబ్బులు ఇవ్వలేకపోయాము. దీనికి నేను ఎన్ని ఊళ్ళు మారినా ప్రతి క్షణం గుర్తుకు తెచ్చుకుని బాధ పడని రోజంటూ లేదు. మా కాలేజీ స్నాతకోత్సవానికి అనుకోకుండా ఈ వూరు వచ్చిన మాకు ఇదే ఊళ్ళో ఇల్లు కట్టుకుని ఉన్నారని తెలిసాక చాలా సంతోషించాము. ఎలాగైనా మీ ఋణం తీర్చుకుని బంధ విముక్తుడిని అవ్వాలని నా ప్రయత్నం . దయచేసి కాదనకండి ..” అంటూ డబ్బులు ఉంచిన కవరు ఆయనకు అందించాడు.
“ అయ్యో అదేమిటి బాబూ ! నేను ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాను. ఇప్పుడు నిన్ను చూశాక గుర్తుకు వస్తోంది. అప్పట్లో మూర్ఖంగా మీ తండ్రి గారి ఆర్ధిక పరిస్తితిని దృష్టిలో ఉంచుకోక మొత్తం మీ కుటుంబాన్ని అవహేళన చేశాను. మిగతా విద్యార్ధుల మధ్య నిన్ను తీవ్రంగా అవమానించాను. ఆ తర్వాత మీరు ఈ వూరు విడిచి వెళ్ళి పోయాక నేను ఎంతో తప్పు చేశాననని గ్రహించాను . గురువుగా అప్పట్లో నా బాధ్యతను సరిగ్గా నెరవేర్చలేదేమో అని ఎన్నో సార్లు బాధ పడ్డాను. ఆర్ధికంగా బాగా లేని వారికి విద్యా దానం చేసినప్పుడే ఆ గురువు సంపూర్ణంగా పరిపూర్ణత చెందుతాడు. అది నాలో లోపించింది. మీ కుటుంబానికి చేసిన ద్రోహానికి పరిహారంగా నేను ఎంతోమందిని ఉచితంగా చదివించాను. నా దగ్గర చదువుకున్న వాళ్ళు ఎక్కడెక్కడనుండో ఫోన్లు చేసి మీ దగ్గర చదువుకోవడం వల్ల ఈ నాడు మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నాం అని చెప్తూ ఉంటే ఆ సంతృప్తి వెల కట్టేది కాదు. గురువుగా ప్రతి విద్యార్ధిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళాల్సిన అవకాశం మాకు దొరికినందుకు మాలో ప్రతి ఒక్కరూ ఈ వ్యాపార బంధాల నుండి విముక్తులం కావాలి. . మానవ సంబంధాలను పెంచుకోవడం అనేదే మొట్టమొదటిగా గురువు , శిష్యుడు నుండే మొదలవుతుంది అని అర్ధం చేసుకున్నాను. . అప్పటి నా మాటలతో నిన్ను ఇన్నాళ్ళూ మనశ్శాంతి లేకుండా చేసిన నన్ను నువ్వు మన్నించగలిగితే నాకు అదే నాకు పెద్ద దక్షిణ అనుకుంటాను “ అంటూ ఆ కవరు తిరిగి బ్రహ్మానికి ఇవ్వబోయాడు రామరాజు మాష్టారు.
“లేదు మాస్టారు ! ఇన్నాళ్ళూ నేను పడ్డ మానసిక సంఘర్షణకు పరిష్కార మార్గం ఇప్పటికే ఎంతో ఆలస్యం అయినా కూడా ఇదే అని నేను నిర్ణయించుకున్నాను. మీరు ఇప్పుడు దాతృత్వం చూపించినా దాన్ని నేను సాకుగా తీసుకుని తిరిగి ఈ డబ్బుతో వెనక్కి వెళ్లిపోతే నా అంతరాత్మ నన్ను క్షమించదు . మీ లాంటి గురువులు ఇంకా హీన దశలో ఉన్న వారికి చదువు రూపంలో సాయపడితే అంతకు మించిన ఉపకారం మరొకటి ఉండదు. ఆ భగవంతుని దయవల్ల , సమయానికి ఎలాంటి పరిస్తితులలోనైనా నాకు విద్య నందించి నా భవిష్యత్తుకు పునాదులు వేసిన మీకు ఎప్పటికీ కృతజ్ఞుడనే . .. దయచేసి ఈ డబ్బు తీసుకోండి. ఈ డబ్బుతో ఎవరైనా విద్యార్ధులకు ఆసరా నివ్వండి .. కాదనకండి ..” అంటూ రామరాజు మాస్టారికి మరోసారి వీడ్కోలు పలికి ఆత్మ సంతృప్తితో వెనుతిరిగారు ఆ అన్నదమ్ములిద్దరూ ******
సమాప్తం