ఆశయం

విశాలాంధ్ర ఆదివారం అనుబంధం • 25 May 2025 • 👁 1 views
“ ఆశయం “ (కథ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
(25/5/2025 విశాలాంధ్ర ఆదివారం అనుబంధంలో ప్రచురణ )
వీరబాబు, సుబ్రమణ్యం చిన్ననాటి మిత్రులు. వీరవాసంలో ఇద్దరి ఇళ్ళూ పక్క పక్క వీధుల్లో ఉంటాయి. . తండ్రి ఆయుర్వేద వైద్యుడు అవడంతో వీరబాబు ఆయనకు సహాయపడుతూ డిగ్రీ వరకు చదువుకున్నాకూడా ఎటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయలేదు.
ఒకసారి సుబ్రమణ్యం వాళ్ళ గ్రామం వెళ్ళినప్పుడు వీరబాబును “ నువ్వు ఈ ఊళ్లోనే ఉంటే నీకు ఎదుగుదల ఉండదు . నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ ఆడపిల్లా ముందుకు రాదు. చిన్నో, పెద్దో ఒక ఉద్యోగం అనేది ఉంటే ఆ విలువే వేరు. నేను ధైర్యం చేసి మన ఊరు నుండి బయటపడిపోయి ఎవ్వరిమీద ఆధారపడకుండా ఉద్యోగం సంపాదించుకుని పెళ్ళాం, పిల్లలను పోషించుకుంటున్నాను.నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నాను అని అనుకోకు. మనతో పాటు చదువుకున్న వాళ్ళంతా ఎక్కడెక్కడికో ఎగరిపోయి వాళ్ళ భవిష్యత్తు చూసుకుంటూ ఉంటే నువ్వు ఇంకా ఈ పల్లెటూరును పట్టుకుని వేలాడుతున్నావు. . సిటీలో నువ్వు చదువుకున్న చదువుకు ఏదో ఒక ఉద్యోగం రాకుండా ఉండదు. ఒకసారి సంపాదనలో పడ్డాక అదే నీకు సంపాదించి పెడుతుంది. మనిషివి కూడా కాస్త తేటగా తయారవుతావు.మీ అమ్మా, నాన్నల మీద బెంగగా అనిపిస్తే నేను ఎప్పుడైనా మన ఊరు వచ్చినప్పుడు నువ్వు కూడా నాతో పాటు వచ్చి వాళ్ళను చూసి వెళ్లొచ్చు .. అంతే కానీ నీ జీవితం అంతా ఇలా నిష్ఫలంగా, నిష్ప్రయోజనంగా గడిపేద్దామనుకుంటున్నావా ? ఈ విషయం గురించి కొద్దిగా సీరియస్గా ఆలోచించు. ..” అంటూ వీరబాబులో అప్పటివరకు లేని ఆలోచనలకు తెరతీశాడు సుబ్రమణ్యం.
ఏ ముహూర్తంలో సుబ్రమణ్యం వీరబాబుకు భవిష్యత్తు నిర్ధేశం చేశాడో ఆ క్షణం నుండి అతనికి కూడా సుబ్రమణ్యంలా ఏదో ఒక ఉద్యోగం చేసి జీవితంలో స్తిరపడాలన్న కోరిక మెదడును తొలిచేయడం మొదలు పెట్టింది. ఒకసారి ఆ ఊళ్ళో తనతో చదువుకున్న మిత్రులను గురించి గుర్తు తెచ్చుకున్నాడు. ఈ మధ్యనే ఇద్దరు మెడికల్ రెప్రజంటేటివ్లుగా అవకాశం వచ్చి వెళ్ళి పోయారు. ఇంకొకరు సిటీలో వాళ్ళ మేనమామ ఆడిటర్ దగ్గర ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో ఆగమేఘాలమీద వెళ్ళి పోయాడు. ఒకళ్ళిద్దరు మాత్రం చిన్న పిల్లలకు ట్యూషన్లు చెప్పుకుంటూ ఊళ్లోనే ఉండి రోజులు లాగుతున్నారు. వాళ్ళ కోసమా తను ఈ ఊళ్ళో పడుండాలి ? సుబ్రమణ్యం చెప్పినట్టు తను కూడా ఏదో ఒక దారి చూసుకోకపోతే తన బ్రతుకు ఎడారి అయిపోతుంది . పైగా తనకీ ఊళ్ళో స్వంత ఇల్లు లేదు. ఒక సెంటు పొలం కూడా లేదు ఏదో రకంగా రోజులు గడిపేయడానికి ?
రకరకాల ఆలోచనలతో వీరబాబు బుర్ర వేడెక్కిపోతోంది.
వీరబాబు తనలో తను బాగా మధన పడ్డ తర్వాత తండ్రి రామానుజంతో తనకూ, సుబ్రమణ్యానికి జరిగిన సంభాషణ గురించి చెపుతూ తను ఉద్యోగ ప్రయత్నం చేయడానికి ఒక నిర్ణయానకి వచ్చేసినట్టు ధైర్యంగా చెప్పేశాడు.
వీరబాబు మాటలకు రామానుజం గారు, ఆయన భార్య లక్ష్మీదేవమ్మ పక్కలో బాంబు పడ్డట్టు చూశారు. . . .
వాళ్ళ మొహాలలో పెళ్లి చేసి ఆడపిల్లను అత్తవారింటికి పంపేటప్పుడు తల్లి తండ్రుల భావోద్వేగాలు ఎలా ఉంటాయో అదే స్తితి వీరబాబు తీసుకున్న నిర్ణయం పట్ల కూడా కలిగింది. అన్నాళ్లుగా ఇంట్లో చేదోడు వాదోడుగా ఉంటూ తిరిగే కొడుకు హఠాత్తుగా దూరం అయిపోతే తట్టుకోవడం తమ వల్ల అవుతుందా అన్న విచారం, భయం వాళ్ళ మొహాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆయన కొన్ని నిమిషాల సేపు మౌనంగా ఉండి పోయాడు.
“ఊళ్ళో అందరూ ఉద్యోగాల పేరిట ఎవరి దారి వాళ్ళు చూసుకుంటూ ఉంటే తన స్వార్ధంతో కొడుకును ఎదగనీయకుండా వాడి భవిష్యత్తును చేచేతులా నాశనం చేయడం ఏం న్యాయం ? ఏదో కాలక్షేపం కోసం చేసుకుంటున్న ఆయుర్వేద వైద్యం కోసం వీరబాబును కూడా బలిచేయడం అవసరమా ? ముప్పై ఏళ్లు మీదకు వస్తున్నా ఇంతవరకు ఏ పెళ్లి సంబంధం వాళ్ళు గడప తొక్కలేదు.పైగా సమాజం కూడా చిన్న చూపు చూసే సంస్కృతి ఊళ్ళో అడుగడుగునా ఉంది. గుండెను రాయి చేసుకుని కొడుకును సిటీకి పంపడమే సముచితంగా అనిపిస్తోంది “ అని అంతర్మధనం చెందిన తర్వాత మనసును సమాధాన పరచుకుని కొడుకు భుజం తట్టి “అలాగే కానివ్వరా !నువ్వేమీ మమ్మల్ని విడిచి వేరే రాష్ట్రాలు వెళ్ళి పోవడం లేదు కదా ? మహా అయితే ఇక్కడ నుండి ఆరేడు గంటల ప్రయాణం. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు రావచ్చు . ఏవైనా ఇబ్బందులు ఉంటే నీ ఫ్రెండ్ సుబ్రమణ్యం ఎలాగూ అక్కడే ఉన్నాడు. మొహమాటం లేకుండా అతని సాయం తీసుకో. .అతను చాలా మంచి వాడు.నీ మంచి చెడ్డలు తెలిసిన వాడు. నీ బాగు కోరుకున్న వాడు. ఈ రోజుల్లో అవతలి వాళ్ళు ఏమైతే మనకెందుకు మన బాగు మనం చూసుకుందాం అనుకునే మనుష్యులు అడుగడుగునా ఉన్నారు. వెళ్ళగానే ముందు వాళ్ళింట్లోనే దిగు. అతనికి దగ్గరలోనే ఏదైనా రూము వెతకమని చెప్పు. . నువ్వు స్థిర పడే అంతవరకు డబ్బులు గురించి ఆలోచించకు . ఆ విషయం నేను చూసుకుంటాను. .అతని మీద మాత్రం ఆధార పడకు ..” అంటూ వీరబాబును ప్రయాణానికి సిద్దం చేశాడు రామానుజం.
వీరబాబు తనకు సంబంధించిన సామాను అంతా సర్దుకుని బయలు దేరుతూ ఉంటే అతని తల్లి మహాలక్ష్మమ్మ నోటికి చీర అడ్డం పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.
రామానుజం మాత్రం గుండె దిటవు చేసుకుని చూస్తూ నిలబడ్డాడు. .
** ** ** **
ఆ రోజు ఆదివారం అవ్వడంతో సుబ్రమణ్యం వీరబాబును బస్ స్టాండ్ కెళ్ళి రిసీవ్ చేసుకుని తన ఇంటికి తీసుకెళ్ళాడు. సెలవు రోజు ఇంట్లో వాళ్ళను పొద్దున్నే ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక పక్కనే ఉన్న ఉడిపి హోటల్ నుండి వేడివేడి అల్పాహారం తెప్పించి అందరూ కలిసి తిన్నారు.
“ఈ సందు చివరలో ఒక ఇల్లు అద్దెకు ఇస్తారని బోర్డు ఉంటం చూశాను. ఒకసారి వెళ్ళి చూసి రారాదూ ? ఇల్లు దొరికితే పాపం వీరబాబు మనకు దగ్గరలో ఉన్నట్టుగా ఉంటుంది. అతను కూడా వాళ్ళ కుటుంబం మీద బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ..” అంటూ సుబ్రమణ్యం భార్య రజని సలహా ఇవ్వడంతో వీరబాబు మొహం వెయ్యి వాల్ట్ ల బల్బ్ లాగా వెలిగిపోయింది.
స్నానాలు అవీ పూర్తి అయ్యాక సుబ్రమణ్యం, వీరబాబు ఇద్దరూ కలిసి ఇల్లు చూడటానికి వెళ్లారు.
“కుటుంబం ఉండటానికి లేదండీ. ఒక్క రూమ్ మాత్రం ఖాళీగా ఉంది “ అని ఆ ఇంటి ఓనర్ అనడంతో ఇద్దరి మొహాలు వెలిగాయి.వాళ్ళకు కావలసింది అదే. ఇంకా ఒక్క క్షణం ఆలోచించక గదిని చూడటం , తర్వాత రోజు ఉదయమే వీరబాబు సామానులు అందులోకి చేర్చడం జరిగిపోయింది. .
దోమలు కుట్టకుండా ఉండటానికి సుబ్రమణ్యం తన దగ్గర ఉన్న టేబుల్ ఫ్యాన్ వీరబాబు రూములో పెట్టాడు. ఇద్దరూ బయటకు వెళ్ళి మంచినీళ్ళ కుండ కొని తెచ్చారు. .
** ** ** **
ఆరోజు సుబ్రమణ్యంతో కలిసి” టీ” తాగుతున్న వీరబాబుకు ఇక ముందు చేయవలసిన కార్యాచరణ గురించి చెప్పడం మొదలు పెట్టాడు. .
“ముందు కొన్నాళ్ళు కనపడిన సిటీ బస్సులు ఎక్కేసి సిటీ అంతా బాగా తిరుగు. ఒక అవగాహన ఏర్పడుతుంది. ఒక ఇంగ్షీషు న్యూస్ పేపర్ కొనుక్కో. అందులో ప్రతి రోజు “వాక్ ఇన్ ఇంటర్వ్యూ “ ప్రకటనలు పడుతూ ఉంటాయి. అవి చూసుకుంటూ బద్దకించకుండా అటెండ్ అవ్వు. మొదట్లో నేను కూడా అదే పని చేశాను. .వెంటనే కాకపోయినా ఒక నెలా, రెండు నెలలకైనా చిన్నో, చితకో ఉద్యోగం దొరక్కపోదు . అప్పటి వరకు సహనంతో ఉండక తప్పదు. ఆ తర్వాత భవిష్యత్తు అంతా బంగారు బాటగా మారుతుంది. ..” అంటూ సుబ్రమణ్యం వీరబాబుకు ధైర్యాన్ని నూరిపోస్తూ కొన్ని సలహాలు చెప్పాడు.
“పోనీ మీ దాంట్లో ఏమీ ఉండవా ? జీతం తక్కువైనా చేరిపోతాను “ అన్నాడు వీరబాబు సుబ్రమణ్యం వైపు ఆశగా చూస్తూ.
“నీ అమాయకత్వం చల్లగుండా ? మా దాంట్లో జాబ్ దొరకడం అంటే నేను ఎన్నో కోర్సులు చేస్తే కానీ రాలేదు. నువ్వు చదువుకున్న ఉత్త బియ్యేకి కనీసం అటువంటి కంపినీల గేట్లను కూడా తాకనివ్వరు. ..” అని అంటూంటే వీరబాబులో నిరుత్సాహం పెల్లుబికింది.
“అలా అధైర్య పడిపోకులే . మనకు కావలసినది అంత సులువుగా దొరికిపోతే దాన్ని ఎంతోకాలం నిలబెట్టుకోలేము. పైగా అందులో విలువా, సంతృప్తి ఉండదు. నువ్వు వచ్చి ఇంకా రెండు రోజులే అయ్యింది. . మెల్లమెల్లగా ఇక్కడ సిటీలో పరిస్తితులు అర్ధం అవుతాయి. జనాలు పరిచయం అవుతారు. కష్టపడి సంపాదించుకుని బ్రతకాలి అన్న తపన మనలో కలుగుతుంది. .. ముందు నేను చెప్పినట్టు ఈ క్షణం నుండి నీ వేట ప్రారంభించు ..” అంటూ గట్టిగా చెప్పి ఇంట్లో ఆ రోజు చేసిన పూరీలు, పూరీ కూర క్యారియర్లో పెట్టి వీరబాబు రూమ్ వరకు తోడు వెళ్ళి ఈ పూటకు నీ భోజనం ఇదే .. రేపు కథ రేపు చూద్దాం ..” అని చెప్పి వచ్చేశాడు సుబ్రమణ్యం.
** ** ** **
ఉద్యోగాల వేటలో తిరగడం మాటెలా ఉన్నా వీరబాబు మాత్రం వీలు దొరకినప్పుడల్లా సుబ్రమణ్యాన్ని కలవడం, తమ ఊళ్ళోని కబుర్లు, గంటల కొద్దీ సినిమాలు, రాజకీయాల గురించి మాట్లాడి విసిగిస్తూ. ఒక కప్పు టీ తాగి బయట పడటం ఒక ఆనవాయితీగా మారింది. ఒక వారం పది రోజులు వాటినన్నిటిని సుబ్రమణ్యం ఎలాగో అలా భరించాడు కానీ రానూ రానూ వీరబాబు మీద విసుగును ప్రదర్శించడం మొదలు పెట్టాడు.
“ఇవాళ ఏవైనా ఇంటర్వ్యూలకు వెళ్ళావా ? “ అని అడిగాడు సుబ్రమణ్యం సూటిగా కళ్ళల్లోకి గుచ్చి చూస్తూ .
“లేదు సుబ్బూ ! రెండు రోజులనుండి ఒళ్ళంతా ఒకటే నొప్పులు. . అసలే కింద పడుకుంటున్నాను కదా. ఏ! నీకు నేను ఇబ్బందిగా మారానని అనిపిస్తోందా ? నేను నీ అంత తెలివైన వాడిని కాదు సుబ్బూ ! తెలుగు మీడియంలో చదువుకున్న వాడిని . ఇంగ్లీష్ మాట్లాడటం రాదు. ఈ పరిస్తితిలో ఇంటర్వ్యూలు ఫేస్ చేయగలనా అని అనిపిస్తోంది “ అన్నాడు వీరబాబు తలదించుకుని .
ఆ స్తితిలో వీరబాబును చూడగానే సుబ్రమణ్యానికి జాలేసింది.అయితే కొత్తగా ఉద్యోగ అన్వేషణ కోసం సిటీలనుండి వచ్చిన వాళ్ళందరి పరిస్తితి ఇలాగే ఉంటుందని అతనికి అనుభవమే.
“ అన్నట్టు మన ఊళ్ళో మీ నాన్న గారు రాసిచ్చిన మందులను నువ్వు కంప్యూటరు మీద టైపు చేసి ఇచ్చేవాడిని అన్నట్టు గుర్తు. అప్పుడప్పుడు మీ చెల్లెలుకు నోట్స్ కూడా తయారు చేసి ఇచ్చేవాడివి కదా. మీ ఇంట్లో పాత కాలపు నాటి టైపు మిషన్ కూడా చూశాను. ఆ మాత్రం టైపింగు అనుభవం ఉంటే చాలు ఎలాగో అలా కొట్టుకు రావచ్చు. . నువ్వు ఏదైనా ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడు వెర్రి మొహం వేసుకుని కూర్చోక కంప్యూటరు నాలెడ్జ్ కూడా వుందని చెప్పు. ఈ లోపు నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడల్లా పోసుకోలు కబుర్లలో పడక , నా సిస్టమ్ మీద ప్రాక్టీస్ చేస్తూండు. అది నీకు చాలా ఉపయోగపడుతుంది. టైపింగు తెలిస్తే వాళ్ళు నిన్ను ఏదో ఒక పనికి ఉపయోగించుకునే అవకాశం ఉంది. ముందు నీలో ఉన్న బద్దకం వదుల్చుకోవాలి . మన ఊళ్ళో అంటే నువ్వు ఏమి చేసినా, ఎన్ని గంటలకు నిద్రలేచినా నడిచిపోయేది. . ఇక్కడ క్రమశిక్షణగా ఉండటం నేర్చుకోవాలి. నీ అదృష్టం బాగుండి ఏదో ఒక ఉద్యోగం దొరికింది అనుకో. దానికి సరైన సమయానికి వెళ్ళక పోతే ఉద్యోగంలోంచి తీసేస్తారు. తిరుగు టపాలో మన వూరు వెళ్ళిపోయి మీ నాన్న దగ్గర ఆయుర్వేదం మందులు కట్టుకుంటూ కూర్చోవాలి ..” అంటూ సీరియస్ గానే హెచ్చరించాడు సుబ్రమణ్యం.
సుబ్రమణ్యం చెప్తున్న విషయాలు వింటూంటే వీరబాబులో మెల్లమెల్లగా నిస్తేజం అలుముకోసాగింది.” హాయిగా ఇంటిపట్టున కూర్చోక సుబ్బు మాటలకు ప్రేరేరింపబడి అనవసరంగా సిటీలో ఉద్యోగాలకు ఆశపడ్డానా ? “ అని అని మనసులో బాధ పడ్డాడు. .
ఆ వెంటనే తనని పంపించేటప్పుడు తల్లి బావురుమంటూ విలపించడం గుర్తుకు వచ్చి మనసు వికలం అయిపోయింది. సుబ్రమణ్యం అంటే అంత సులువుగా చెప్పేశాడు గానీ ఈ సిటీలో ఉద్యోగం సంపాదించడం తన వల్ల అవుతుందా ? అంతా కలగా అనిపిస్తోంది.
ఆ రాత్రి గదిలో పడుకున్నాడు కానీ ఎంత సేపటికి నిద్ర పట్టడం లేదు. కళ్ల ముందు తల్లి తండ్రులు, చెల్లెలు గుర్తుకు వస్తున్నారు. ఒకసారి చూసి వస్తే బాగుణ్ణు అని అనుకున్నాడు. ఇదే విషయాన్ని సుబ్బూతో చెపితే ఇంకేమెనా ఉందా ?తనని బ్రతకనిస్తాడా ? ఇప్పటికే తన కదలికలన్నీ డేగ కళ్ళతో పరిశీలిస్తున్నాడు. ఏదో అనారోగ్యం పేరు చెప్పి ఊరు దాటేస్తే ఎలా ఉంటుంది ? అన్న విపరీత ఆలోచన కూడా అతనిలో చోటు చేసుకుంది.
ఉదయం ఏడు కూడా కాకుండానే సుబ్రమణ్యం వీరబాబు రూము తలుపు తడుతూ ఉంటే రాత్రంతా నిద్ర లేక పొడికళ్ళతో గడిపిన వీరబాబు తూలిపోతూ తలుపు తెరిచాడు.
“ ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చానని ఆశ్చర్య పోతున్నావా ? నీకో శుభ వార్త చెప్పాలని వచ్చాను. నీ పరిస్తితి , నీ భయాలు అర్ధం చేసుకున్నాక నిన్న రాత్రి మా బాసుతో మాట్లాడి నీ విషయం చెప్పాను. ఆశ్చర్యంగా ఆయన ఒక కంప్యూటరు ఆపరేటర్ ప్లస్ హౌస్ కీపింగ్ చూసే మనిషి కోసం చూస్తున్నాడుట. నాకు ఆయనతో ఉన్న సత్సంబంధాల వల్ల ఆ పోస్ట్ నీకు వచ్చేటట్టు చేస్తానని మాటిచ్చాడు. ఒక వారం రోజుల క్రితం నువ్వు అన్నావు చూడు మీ ఆఫీసులో ఏదైనా అవకాశం ఉంటే చూడొచ్చు కదా అని . ఇప్పుడు అదే నిజం కాబోతోంది. మన ఊళ్ళో పాతుకుపోయి ఎక్కడికీ కదలని నిన్ను బలవంతంగా సిటీకి తీసుకు వచ్చానేమో అన్న అపరాధ భావం నాలో కలిగిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు ఇది నీ అదృష్టమో, నా అదృష్టమో కానీ నేను తప్పు చేయలేదు అని అనిపిస్తోంది. ..ఈ రోజు ఆఫీసుకు వెళ్ళాక మా బాసుతో మిగతా విషయాలు మాట్లాడతాను. నువ్వు ఫ్రీగా ఉండు. .. “ అన్నాడు సుబ్రమణ్యం ఆనందంగా.
ఆ తర్వాత రోజు వీరబాబును తీసుకుని తన ఆఫీసుకు తీసుకెళ్ళాడు సుబ్రమణ్యం. అతనికి హౌస్ కీపింగ్ తో పాటు దానికి సంబంధించిన కంప్యూటరు వర్క్ అప్పగించడం జరిగింది.
సుబ్రమణ్యం సెల్ ఫోనులో రామానుజం గారికి ఫోన్ చేసి” మీ అబ్బాయి చాలా అదృష్టవంతుడు. ఇక్కడికి వచ్చిన నెలలోనే మా ఆఫీసులోనే ఉద్యోగం సంపాదించేశాడు. ఇక మీరు హ్యాపీగా ఉండండి. ఈ ఉద్యోగంలో ఒకసారి స్తిరపడితే రెండు గదుల ఇంట్లోకి మారుస్తాను. అప్పుడు మీరు కూడా వచ్చి పోతూండవచ్చు . నా ఆశయం నెరవేరినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. .. ఇక మీరు నిశ్చింతగా ఉండండి బాబాయిగారు .. ఈ రోజు రాత్రి మీ వీరబాబు అన్ని విషయాలతో మీకు ఫోన్ చేస్తాడు ..” అన్నాడు సుబ్రమణ్యం భావోద్రేకం ద్వనించిన గొంతుతో.
“ చాలా సంతోషం బాబూ !మా అబ్బాయికి ఉద్యోగం రావడానికి వందకు వంద శాతం క్రెడిట్ అంతా నీదే . నీలాంటి వారు ఊరికి ఒక్కరు ఉంటే చాలు నా కొడుకు లాగా నిస్తేజంగా పడి ఉన్న ఎంతోమందికి కాస్తంత భుక్తి దొరుకుతుంది. నిన్ను కన్న మీ తల్లి తండ్రులు ఎంతో పుణ్యం చేసుకున్నారు కాబట్టే నీలాంటి ఆణిముత్యం మన ఊరికి లభించింది. ..” అంటూ రామానుజం గారు సుబ్రమణ్యాన్ని కొనియాడుతూనే ఉన్నాడు.
వీరబాబుకు అంతా కలలాగా అనిపించ సాగింది. కళ్ల నిండా నీళ్ళు ఊరాయి.
“అవును సుబ్బూ ! ఇందులో నాదంటూ ఏమీ లేదు. నా జీవితానికి నువ్వు ఒక దిక్సూచిలాగా మారి నన్ను ఒడ్డుకు చేర్చావు. ..” అంటూ ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు .
** సమాప్తం **