“ సంకల్ప బలం “

విశాలాంధ్ర ఆదివారం అనుబంధం • 15 Jun 2025 • 👁 1 views
“ సంకల్ప బలం “
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
(15/6/2025 విశాలాంధ్ర ఆదివారం అనుబంధంలో ప్రచురణ )
వివేక్ కు తను ఎక్కడున్నాడో అర్ధం కాని పరిస్తితి. . అప్పుడప్పుడు లీలగా అక్కడి దృశ్యం కనపడీ , కనపడక మరుక్షణమే మగతలోకి వెళ్ళి పోతున్నాడు .
రెండు రోజుల తర్వాత అక్కడి వాతావరణం అతనికి కొద్ది కొద్దిగా తెలుస్తోంది. ఎవరో ఒకళ్ళిద్దరు అతని పక్కన నిలబడి ఉన్నారు. కానీ ఎవరినీ సరిగ్గా గుర్తించలేని పరిస్తితి అతను ఎదుర్కుంటున్నాడు.
అతనికి ముక్కు ద్వారా ఏవో ట్యూబులు పెట్టినట్టు తెలుస్తోంది. కదలడానికి వీల్లేకుండా మంచానికి అటూ ఇటూ ఎత్తుగా పైపులు ఏవో అమర్చారు. బాధగా మూలుగుతూ పక్కకు చూశాడు .
“ఎక్కువగా ఆలోచించకండి. . కళ్ళు మూసుకుని పడుకోండి. మీకు విపరీతంగా తలనొప్పి వచ్చి కళ్ళు తిరిగి మీ ఆఫీసులో పడిపోతే ఆసుపత్రిలో ఉంచాము . రెండు మూడు రోజుల్లో మామూలు అయిపోతారు అని డాక్టర్లు చెపుతున్నారు. ..ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోవచ్చు ..” అంటోంది ఒకావిడ.
వాతావరణం చూస్తూంటే తనకేదో పెద్ద సమస్యే వచ్చి ఉంటుందని వివేక్ కు అనిపిస్తోంది.
తనకు ధైర్యం చెపుతున్నావిడ ఎవరో గుర్తుతెచ్చుకోవాలని బలవంతాన ప్రయత్నం చేస్తున్నాడు కానీ తలలో నరాలు లాగేస్తున్నట్టుగా అనిపించడంతో బాధగా కళ్ళు మూసుకున్నాడు .
ఎవరెవరో డాక్టర్లు వస్తున్నారు. తనని ఏదో అడుగుతున్నారు. వాళ్ళకు ఏం సమాధానం చెపుతున్నాడో అతనికి స్పష్టత లేదు. .
“ఇప్పుడు మిమ్మల్ని పలకరించినావిడ ఎవరో గుర్తు పట్టగలరా ? “
అడుగుతున్నాడు ఒక డాక్టర్ . .
“ సరిగ్గా గుర్తు రావడం లేదు ..” అన్నట్టుగా చూశాడు వివేక్ . .
ఆ తర్వాత ఏమయ్యిందో తెలియదు . మళ్ళీ అతను మగతలోకి జారుకున్నాడు .
** ** **
తను ఆఫీసులో ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోవడం వెంటనే పక్కనే ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లడం, అప్పటికే రెండు మూడు సార్లు అక్కడి డాక్టర్లు అతని పరిస్తితి చూసి ఉండటంతో అతనికి ట్రీట్మెంట్ చేయడం వాళ్ళ వల్ల కాదని అనుకున్నారేమో వెంటనే ఆలస్యం చేయకుండా సిటీలో ఏదైనా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకుపొమ్మని చెప్పడం , తను ఎలాగో అలా శరీరాన్ని, మనసును స్వాధీనంలోకి తెచ్చుకుని ట్రైన్ ఎక్కి సిటీకి రావడం , డాక్టర్లు తనకు బ్రైన్ కు స్కాన్ చేయడం వరకు వివేక్ కు గుర్తుంది . ఆ తర్వాత వెంట వెంటనే ఊహించని పరిణామాలు జరిగిపోతున్నాయి.
వివేక్ కు బ్రైన్లో ట్యూమర్ ఏర్పడిందని ఇప్పటికే ఆలస్యం అయ్యిందని వెంటనే సర్జరీ చేయక పోతే ఫిట్స్ వచ్చి ప్రాణానికే ప్రమాదం అని అతని కుటుంబ సభ్యులందరికీ తెలుసు కానీ ఆ విషయం వివేక్ కు మాత్రం తెలియదు. .
ఇప్పుడు వివేక్ ను స్పెషల్ రూమ్లోకి మార్చారు. ఎవరెవరో వచ్చి చూసి పోతున్నారు. వారి మధ్య చర్చలు ఏవో జరుగుతున్నాయి. ప్రస్తుతం డాక్టర్లు ఇస్తున్న మందుల ప్రభావం వల్ల అతను కళ్ళు తెరిచి వాళ్ళు ఏమి మాట్లాడుకుంటున్నారో చూచాయిగా అర్ధం చేసుకుంటున్నాడు. వాళ్ళ మాటల్లో తనకు వెంటనే ఆపరేషన్ చేయాల్సి వస్తుందని దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందని గ్రహించాడు వివేక్.
తన బంధువుల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి ఏదో గట్టిగా అరుస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు.
” ఇంత ప్రమాదకరమైన జబ్బుతో బాధపడుతున్నట్టు మాకొక్కళ్లకు కూడా చెప్పకుండా దాచేశారు. . తీరా ఇప్పుడు డబ్బు అవసరం పడేసరికి అందరూ కావలసి వచ్చారు. . ఇప్పటికిప్పుడు మేము మాత్రం ఎక్కడ నుండి తేగలం ? మాకే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇంకో పక్క పిల్లల చదువులు. పోనీ ఇదేమేనా వెయ్యా రెండు వేలతో అయ్యే పనా ? కనీసం లక్ష రూపాయలైనా అవుతుందిట”.
“అసలు ఏమైనా బ్యాంకులో డబ్బులు దాచాడా అంతా తినేశారా ? అయినా ఇప్పుడు పీకల మీదకు వచ్చాక డబ్బు పుట్టే మార్గం కూడా ఆలోచించడానికి టైమ్ లేదు. మీరంతా కలిసి మమ్మల్ని సుఖంగా ఉండనిచ్చేటట్టు లేరు. బంగారాలను తాకట్టు పెట్టయినా తేవాలి తప్పదు. కానీ డాక్టర్లు రెండు రోజుల్లో ఆపరేషన్ చేసి తీరాలి లేకపోతే ప్రాణానికే ముప్పు అంటున్నారు అంటే అంత త్వరగా డబ్బు ఏర్పాటు చేయడం వీలవుతుందా ? . పోనీ వాళ్ళ కాళ్ళు, వీళ్ళ కాళ్ళు పట్టుకుని తెచ్చినా డాక్టర్లు విజయవంతంగా ఆపరేషన్ చేసి ప్రాణాన్ని సేవ్ చేయగలరా ? ఏమో ఒక పక్క సమస్య బాగా తీవ్రంగా ఉంది అని డాక్టర్లు అంటున్నారు. ఇది పూర్తిగా వాడి అదృష్టాన్ని బట్టి ఆధార పడిఉంది ..” అంటూ సుమతిని ఆ వచ్చిన వారిలో ఒకళ్ళిద్దరు సూటీ పోటీ మాటలతో తూట్లు పొడిచి విషయాన్ని ఎటూ తేల్చకుండానే ఏదో పని ఉన్నట్టు అక్కడ నుండి వెళ్ళి పోయారు .
ఇటువంటి ఘోర పరిస్తితి వస్తుందని కలలో కూడా ఊహించని వివేక్ కుటుంబ సభ్యులు నోట మాట రాకుండా అచేతనంగా చూస్తూ ఉండిపోయారు.
అ రోజు మధ్యాన్నం వివేక్ పనిచేస్తున్న కంపినీ నుండి ఎవరో ఒకాయన వచ్చి వివేక్ భార్య సుమతితో ఏదో చెపుతున్నాడు. .
“ ఏమిటి మా ఆఫీసులో ఆయన ఏదో చెపుతున్నాడు ?” అని బలహీనమైన స్వరంతో భార్యను అడిగాడు వివేక్.
వివేక్ పనిచేస్తున్న కంపినీలోని ఉద్యోగస్తులు రెండు రోజులు లీవులు అమ్మి వచ్చిన ఆ డబ్బు వివేక్ ఆపరేషన్ నిమిత్తం ఇవ్వాలని అనుకుంటున్నారుట .
అలా అమ్ముకుని ఇచ్చే డబ్బుతో తన మొగుడికి ఆపరేషన్ చేయించడం సుమతికి సుతారం ఇష్టం లేదు. ఎందుకంటే అలా సహాయం పొందిన చాలా మంది పేరుకు ప్రయోజనం పొందినట్టుగా ఉంది కానీ ఆ తర్వాత వాళ్ళెవరూ ఐదారు నెలలు కూడా బ్రతికి బట్ట కట్టలేదని ఎంతోమంది చెప్పుకోవడం తను వింది. . అందుకే ఆవిడకు అటువంటి డబ్బు మీద ఆధారపడాలంటే భయం . కొంతమంది తిట్టుకుంటూ వాళ్ళ ఉసురు పోసుకుంటూ ఇచ్చే డబ్బు అది అచ్చి రాదు అని ఆవిడ ఉద్దేశ్యం. పైగా అటువంటి దురావస్థ తన భర్తకు రాకూడదని భావించి ఆ వచ్చిన వ్యక్తితో మర్యాదగానే వాళ్ళ సహాయాన్ని తిరస్కరించింది. కానీ అదే ఉద్దేశ్యాన్ని ఆమె భర్తకు చెప్పలేదు.
“చూడటానికి వచ్చారు “ అని చెప్పి తప్పించుకుంది.
ఒక పక్క సమయం తక్కువగా ఉంది. సమస్య ఎటూ తేలేటట్టు కనిపించడం లేదు. అప్పటివరకు వివేక్ ను చూడటానికి ఆసుపత్రికి వచ్చే బంధు గణం కూడా రావడం తగ్గించేశారు. అంతకు ముందు ఫోనుల్లోనూ, వేడుకలలోనూ ఒక రేంజ్ లో కలిసి మాట్లాడుకున్న వారు ఎక్కడ మోహమాటంతో డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమో నని “ ధైర్యంగా ఉండండి. భగవంతుడుని నమ్ముకోండి “ అని సలహా ఇచ్చేసి వెళ్ళిపోయే వాళ్ళు.
అయితే సుమతికి ఇలాంటి గడ్డు పరిస్తితిలోనూ తన భర్తకు సహాయం చేసి ఏదోవిధంగా కాపాడండి అని వేడుకోలేదు . తమ ఆర్ధిక పరిస్థితి తెలిసి కూడా ఏదో కావాలని తప్పు చేసినట్టు బాగా దగ్గర బంధువులు కూడా నిందలు వేసి మోహమ్మీదే ఘోరంగా అవమానించి వెళ్ళి పోవడం ఆమె మనసు తట్టుకోలేక పోతోంది. . ఏ పరిస్థితిలోనైనా వాళ్ళ నుండి ఒక్క రూపాయి ఆశించినా జీవితాంతం వాళ్ళకు బానిసలుగా బ్రతకాల్సి వస్తుంది అని ఆమెకు అనిపించింది. ఆవిడకు ఆత్మాభిమానం చాలా ఎక్కువ.
ప్రముఖ తత్వవేత్త కారల్ మార్క్స్ చెప్పినట్టు “మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే “ . అసలు అలా ఆధార పడటం ఒక రకంగా ఆత్మహత్యా సదృశ్యంగా ఆమె భావిస్తోంది. ఇటువంటి మనస్తత్వం గలవారు ఈ సమాజంలో బహు తక్కువగా ఉంటారు.
సుమతికి ఒక అద్భుత శక్తి తన కుటుంబాన్ని అన్ని సమస్యలనుండి బయట పడేస్తుందని గట్టి నమ్మకం. ఆ పరిస్తితిలో తను ఆ శక్తిని నమ్ముకున్నాను అని బయటకు చెప్పి ఉంటే మొత్తం ఆమె బంధువులంతా అవహేళన చేయడమే కాకుండా కొద్దో గొప్పో సహాయం చెయ్యాలని అనుకుని వచ్చే వాళ్ళు కూడా వెనక్కి పోయే వాళ్ళు .
వివేక్ అక్కడ అడ్మిట్ అయినప్పటినుండి అతని సమస్యను ట్రీట్ చేస్తున్న ఆ హాస్పిటల్ లోని ఒక ప్రముఖ వైద్యుడు డాక్టర్ విశాల్ జరుగుతున్న పరిస్తితిని గమనిస్తున్నాడు . రెండు రోజుల్లో జరగాల్సిన ఆపరేషన్ కు పేషంట్ ఆర్ధిక సమస్య అడ్డుగా ఉందని ఆయన గ్రహించాడు.
ఆయన వివేక్ కొడుకు మధును పిలిచి “మీ నాన్న గారు పని చేస్తున్నది ప్రయివేట్ కంపినీలో కాబట్టి ఆయనకు కంపినీ వాళ్ళు ఏదో ఒక ఇన్సూరెన్స్ అమలు చేస్తూ ఉండి ఉంటారని నా నమ్మకం. నువ్వు వెంటనే ఫ్యాక్టరీకి వెళ్ళి మేనేజ్మెంట్ తో మాట్లాడి ఇన్షూరెన్స్ విషయం కనుక్కో. మీ ఫాదర్ కంపినీలో సీనియర్ ఉద్యోగి కాబట్టి ఆర్ధిక సహాయం కూడా చేసే అవకాశం ఉంది .. అవసరం పడితే ఆపరేషన్ ఒకట్రెండు రోజులకు వాయిదా వేయడానికి కూడా ప్రయత్నిస్తాను ..” అంటూ సలహా ఇవ్వడంతో వివేక్ కొడుకు మధు ఎన్నో ఆశలతో ఆఘమేఘాల మీద అక్కడ నుండి కదిలాడు.
“డాక్టర్ గారు ఈ ఆపరేషన్ చేస్తే ఆయన క్షేమంగా బయట పడతారంటారా ?” అని అడిగింది సుమతి ఆందోళన పడుతూ.
“ ఇటువంటి బ్రైన్ ట్యూమర్లకు “కీ హోల్ సర్జరీ “ విధానంతో విజయవంతంగా చికిత్స చేసే టెక్నాలజీ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది. దీని కోసం ప్రత్యేకంగా ఒక స్పెషలిస్ట్ ఇక్కడకు చేరుకుంటున్నారు. ఆయన మీ వారిని పూర్తిగా స్టడీ చేశాకనే ఈ ఆపరేషన్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాం .. ముందు ఆపరేషన్కు అయ్యే డబ్బు సమకూర్చుకోవడమే ఒక సమస్య. ” అన్నాడు డాక్టర్ విశాల్ సుమతికి ధైర్యం చెపుతూ.
సుమతికి ఆ క్షణంలో తమ కుటుంబాన్ని ప్రస్తుత పరిస్తితిలో బయట పడేసే ఒకే ఒక మార్గం ఆమె తల్లి చనిపోతూ తనకు ఇచ్చిన గాజులు, ఇక మెడలో ఉన్న గొలుసు అమ్మితే ఈ గండం నుండి బయట పడే అవకాశం ఉంది. . అదే ఆమె మొక్కవోని ధైర్యం . తన భర్త ఆరోగ్యం ముందు ఇవేమీ విలువలోకి రావు అని అనుకుంది.
ఆ రోజు మధు తండ్రి పని చేస్తున్న కంపినీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తో మాట్లాడి పరిస్తితి వివరించి చెప్పడంతో ఆయన చాలా ఆశ్చర్య పోయి ఎంతో సిన్సియర్గా పేరుపొందిన వివేక్ కు అంత తీవ్రమయిన జబ్బు వచ్చి హాస్పిటల్లో ఉన్నట్టు తన దృష్టికి రాకపోవడంతో ఆయన ఒక ఐదు నిమిషాల సేపు దిగ్బ్రాంతితో ఉండిపోయాడు. ఆ మరుక్షణమే వెంటనే తన అధికారులకు వివేక్ కి కంపినీ ద్వారా వచ్చే ఇన్షూరెన్స్ స్టేటస్ తెలుసుకుని చెప్పమని ఆదేశించాడు. వెంటనే యంత్రాంగం ఆఘమేఘాల మీద రంగంలోకి దిగింది. వివేక్ నెల నెలా కట్టే కంట్రీబ్యూషన్ తొమ్మిది నెలల క్రితమే ఆగిపోయినట్టు ,అయితే ఆగిపోయిన తొమ్మిది నెలల వరకు ఉద్యోగస్టుడికి ఇన్షూరెన్స్ పొందే అర్హత వుంటుందని, ఇంకో రెండు రోజులలో ఆ అవకాశం ఎక్స్పైర్ అవుతుందని మీరు చాలా అదృష్టవంతులని ఇన్షూరెన్స్ కంపినీ వాళ్ళు చెప్పడంతో క్షణాల మీద సమాచారం హెడ్ క్వార్టర్ కు చేరడం, వాళ్ళు లక్ష రూపాయల వరకు చెక్కు వివేక్ బందువులకు అప్పగించడం ఎవరూ కలలో కూడా ఊహించని విషయం.
ఆ రోజు వివేక్ కు దేశ రాజధాని న్యూ ఢిల్లీ మెడికల్ సంస్థ నుండి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందం ఆద్వర్యంలో విజయవంతంగా మెదడుకు కీ హోల్ సర్జరీ జరిగినట్టు ఆ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. .
ఈ లోపు వివేక్ ఆఫీసులో అతని గురించి ఒక ముద్ర పడిపోయింది అతను మునుపులా ఉద్యోగంలో పని చేయడానికి అనర్హుడని , అతని మెదడు పూర్తి స్తాయిలో పని చేయడం కష్టమని , అతన్ని ఊరికే కూర్చోపెట్టి జీతం ఇవ్వడం తప్ప ఏమీ చేయలేం అని ఉవ్వెత్తున ప్రచారం జరుగుతోంది.
అయితే అందుకు భిన్నంగా వివేక్ మెదడు ఇప్పుడు మరింత శక్తివంతంగా పనిచేస్తూ ఉండటంతో కంపినీలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని అధిగమించి, తన పనిలో అంతకు ముందు కన్నా వంద రెట్లు సామర్ధ్యంతో దూసుకుపోతూ ఉద్యోగంలో తన స్థాయిని మెరుగు పరుచుకోవడం కంపినీలోని వారికెవరికీ మింగుడు పడటం లేదు. అయితే ఆ విషయం కంపినీ చరిత్రలోనే ఒక గొప్ప సంఘటన అని అందరూ చెప్పుకోవడం చూస్తూంటే వివేక్ కుటుంబానికి ఎంతో గర్వకారణంగా అనిపించేది. అంతేకాదు . ఇప్పుడు అతని బంధువులు కూడా” సమయానికి మేము ఆదుకోలేని పరిస్తితి వచ్చినా మీ సంకల్ప బలం అన్ని విధాలా మీకు తోడుగా నిలిచింది” అంటూ వివేక్ కుటుంబాన్ని అభినందించని వాళ్ళు అంటూ లేరు. ********
సమాప్తం