మహాత్ముడు మళ్ళీ మరణించాడు

పత్రిక • 01 May 2005 • 👁 27 views
మహాత్ముడు మళ్ళీ మరణించాడు (స్కెచ్)

-ఎం.వీరేశ్వరరావు

“ఆడికి ఒంటో బాగనేదు. ఇప్పుడు ఏసంవద్దు" చెప్పింది. బాగమ్మ!
"పర్లేదే! రెండు గంటలు రంగు ఏసుకుని నించుంటే ఓ యాభై వస్తాయి. అది పట్టుకొని అదిలాబాద్ పోవచ్చు" అన్నాడు రంగయ్య.

"అయ్యా నేను ఏసం ఎయ్యను, స్కూలుకి పోతా!" అన్నాడు పదేళ్ళ ప్రసాద్. రంగయ్య బాగమ్మల ఒక్కడే కొడుకు ప్రసాద్. రంగయ్య సంచారజాతికి చెందిన వాడు. ఎప్పుడూ ఒక చోట ఉండడు, అదిలాబాద్, హైదరాబాద్, నిజామాబాద్ తిరుగుతూ ఉంటాడు. రోడ్డు ప్రక్క దొమ్మరి వేషాలు వేస్తూ ఉంటాడు. నాటుసారా తాగుతూ ఉంటాడు. బిల్డింగులు కట్టే టప్పుడు కూలిపని చేస్తూ ఉంటాడు. కొదుకు చేత గాంధీ గారి వేషం వేయించి సెంటర్లో నిలబెడుతూ ఉంటాడు. ప్రసాద్కి కళ్ళల్లో ఎప్పుడూ ఒకే కల. తను తెల్లబట్టలు వేసుకొని, స్కూలు బ్యాగ్లో వెడుతున్నట్టు, కానీ, ఆ కల కన్నీరుగా మారి బుగ్గ మీద జారి పోతోంది.

కొడుకుని వేషం వెయ్యమన్నాడు, తల్లి వద్దంది.

"జొరంతో ఒళ్ళు పెనంలా పేలిపోతుంటే ఇనవే! సచ్చినోడా!"

"ఏటే నోరు లెగుత్తాంది? ఒక్క గంటకి ఆడేమై పోడు" అన్నాడు రంగయ్య.

"ఒరే బాబూ! ఇదే ఆకరి ఏసం, తరువాత అడగను. నిన్ను స్కూలుకి పంపుతాగా!" అని కొడుక్కి ఆశపెట్టాడు. రంగు వేసుకొని మహాత్ముడిలా కర్రపుచ్చు కుని తెల్లరంగుతో సెంటర్లో నిబడ్డాడు. జనం దారి గుండా వెడుతున్నారు. కానీ ఎవరూ రంగయ్య అను కున్నట్లు డబ్బులు వెయ్యలేదు. దారినపోయే కాన్వెంట్ కుర్రాడు ప్రసాద్ మీద చిన్నరాయి విసిరి చప్పట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. తరువాత కొద్దిగా చిల్లర పైసలు పడ్డాయి. ప్రసాడ్కి కాళ్ళు పీకుతున్నాయి. పైన సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు.

"నే దిగిపోతా అయ్యా!" అన్నాడు. "ఒక్క గంట ఉండు పైసలు వస్తాయి" అన్నాడు రంగయ్య. ప్రసాద్ ఒంటికి చెమటలు పట్టాయి. కళ్ళు తేలిపోతున్నాయి. కొద్దిసేపటికి మహాత్ముడు నేల మీదకి పడ్డాడు. రంగయ్య కంగారుపడ్డాడు. బాగమ్మ నీళ్ళు తీసుకు వచ్చి నోట్లో పోసింది. ప్రసాద్ కళ్ళుతెరిచి మళ్ళీ మూసుకున్నాడు. మరి తెరవలేదు. ఒక పోరాటం ఆగింది. ఒక స్వప్నం భగ్నమైంది.

"నీ డబ్బుకి ఆడిని సంపావు కదరా! నా కొడుకో గగ్గోలు పెట్టింది. తెల్లరంగుతో ఎందలో మహాత్ముడిలా ప్రకాశిస్తున్నాడు ప్రసాద్! ఇలా బతుకు తెరువు చూపించానా అని విచారిస్తున్నట్టుంది ఎదురుగా షాపులో ఉన్న గాంధీగారి ఫోటో!

రంగయ్య చుట్టూ జనం చేరారు. బాగమ్మ ఏడుస్తోంది.

'ఏసం ఎయ్యనే అమ్మా' అని ప్రసాద్ ఇంకా చెవిలో చెప్తున్నట్టుంది బాగమ్మకి.

*******
సరిగ్గా అదే సమయంలో బస్తీ నాయకుడు కనకారావు పాదయాత్ర చేస్తూ రంగయ్య వాళ్ళు ఉన్న చోటికి వచ్చాడు. రాత్రి చికెన్లు, మటన్లు, మందులు పుచ్చుకొని సోమరిపోతుల్లా పడి ఉండడం కాదు. మన పార్టీ ఒకటుందని జెండా పుచ్చుకొని తిరగండి అని అధినేత తిట్టడంతో కనకారావు పాదయాత్ర మొదలు పెట్టాడు. ప్రసాద్ని చూడగానే మెరుపులా ఆలోచన తట్టింది.

వెంటనే క్రిందపడిఉన్న ప్రసాద్ని ఒళ్ళోకి తీసుకొని "బాబూ! అప్పుడే నూరేళ్ళు నిండాయా? గాంధీగారి ఏసం కట్టావా? నేను అడుగుతున్నా, ప్రభుత్వం పిల్లల సంక్షేమం కోసం ఏం చేస్తోంది? ఎంత మంది గనుల్లో, షాపుల్లో, బాణాసంచా ఫ్యాక్టరీలలో గడుపుతున్నారు? టెక్నాలజీ కోసం నిధులు ఖర్చుపెట్టే ప్రభుత్వం పిల్లలికి ఒక్కపూట అన్నం పెట్టలేక పోతోంది! వాళ్ళని పట్టించుకోని ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హతలేదు" అంటూ ఆవేశంగా ప్రసంగించాడు. టివీ ఛానల్స్ వార్త కవర్ చేశాయి. పత్రికా విలేకర్లు వార్తలు రాసుకున్నారు. ప్రభుత్వాన్ని దుయ్యబడుతూ కనకారావు బృందం నినాదాలు చేశారు. కొద్దిసేపటికి వాళ్ళు ప్రసాద్ని వదిలి వెళ్ళిపోయారు. జరిగిందేమిటో అర్ధం కాలేదు రంగయ్యకి, ఎవరో కార్యకర్త

రంగయ్య చేతిలో ఇరవై నోటు ఉంచాడు. పార్టీ కార్యాలయంలో.....

'ఆ కుర్రాడి రంగు అంటుకుంది'

'అవతలి వాళ్ళ మీద బురద చల్లడానికి మనం రంగు అంటించుకోవాలి'

'నీకు రాజకీయం ఒంటబట్టింది'.

కనకారావు నవ్వాడు. అక్కడ బాగమ్మ కంట్లో

సముద్రంగా ఏడుస్తోంది!

అసెంబ్లీలో కనకారావు పార్టీ అధ్యక్షుడు హరనాథరావు ప్రభుత్వం పిల్లల సంక్షేమాన్ని పట్టించుకోలేదని, గాంధీ వేషం వేసుకున్న కుర్రాడు పోతే కనీసం నష్టపరిహారం ఇవ్వలేదని గొడవ చేశాడు. స్పీకర్ ఈ విషయాన్ని చర్చకు

అనుమతించలేదు. హరనాథ్రావు వాకౌట్ చేశాడు.

లోపల జరిగే గొడవను చూడలేక మహాత్ముడు కళ్ళు మూసుకున్నాడు.