“ఒకటి కొంటే ఒకటి ఫ్రీ" ( మినీ కథ )
_ జీడిగుంట నరసింహ మూర్తి
(12/12/2025 లహరి విశ్వ సాహితీవేదిక లో ప్రచురితం )
ఒక రిప్యూటెడ్ సంస్థలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు వంశీ. ఆఫీసులో రోజంతా ఫైల్స్, మీటింగ్స్, మెయిల్స్‌లో మునిగిపోయే అతనికి హాబీ — “ఆఫర్‌లు వెతకడం.”
అతను ఏ వస్తువు కొన్నా ఆఫర్ లేకపోతే కొనడు.
వంశీ భార్య రత్న మాత్రం ఈ ఆఫర్లను తీవ్రంగా ఖండిస్తుంది .
ఒక ఆదివారం వంశీ ఫోన్‌లో చూస్తూ గట్టిగా అరిచినంత పని చేశాడు .
“ ఏమోయి ! ఇదేదో మంచి వెరైటీ ఆఫర్లా ఉంది. గ్రైండర్ కొంటే రెండు కిలోల మినప్పప్పు " ఫ్రీ " అట. ఇప్పుడు మార్కెట్లో మినప్పప్పు కిలో 150 వరకు ఉంది.రెండు కిలోలు అంటే మూడొందల రూపాయలు.గ్రైండర్ ఖరీదు కేవలం ఐదొందలేట. ఇవన్నీ చూసుకుంటే మనకు గ్రైండర్ రెండొందలకే వచ్చినట్టు. ఆ వెధవ గ్రైండర్ ఆరునెలలు పనిచేసినా మనకు చాలు...ముందు నాకైతే అవి తెచ్చుకుని వేడి వేడి మినప గారెలు చేయించుకుని సాంబారులో నంచుకుని తినాలని ఉంది. ఆ మిగతా పప్పుతో నువ్వు గమ్మడి కాయ వడియాలు పెట్టుకో.ఒక కాయ ఆల్రెడీ మంచం కింద రెండు నెలల నుండి మూలుగుతోంది ..." అంటూ వంశీ ఆ "ఫ్రీ "ఆఫర్ తెచ్చుకోవడానికి బయటకు బయలు దేరబోయాడు.
" ఏమిటండీ మీ వెధవ గారెల కోసం గ్రైండర్ కొనుక్కు తెచ్చుకుంటారా ? నెలకు రెండు సార్లైనా వేడి వేడి గారెలు పదికి తక్కువ కాకుండా తింటూ ఉంటారు కదా.అది కాక టిఫిను సెంటర్ నుండి తెచ్చుకుని ఎన్ని సార్లు తినలేదు ? ఇలా ప్రతి సారీ ఏదో ఆఫర్ ఉందంటూ తెచ్చిన సామానులన్నీ వారం తిరక్కుండానే చెడిపోయి అటకమీద ఉపయోగం లేకుండా పడి ఉన్నాయి. ఈ సారి ఇలాంటి వెధవ ఆఫర్ల సామానులు కొనుక్కొస్తే నన్ను చంపుకు తిన్నంత ఒట్టు .." అంటూ రత్న ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చింది మొగుడికి.
ఏ కళ నున్నాడో కానీ వంశీ భార్య మాటలకు సైలంట్ అయిపోయాడు.
వంశీ తాత్కాలికంగా అటువంటి ఆలోచనలకు బ్రేక్ వేశాడు కానీ సూపర్ మార్కెట్లో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ సామానులు కొని తెచ్చి ఇంట్లో పోస్తూనే ఉన్నాడు.
అలా ఒక ఐటెం కు మరో ఐటమ్ ఫ్రీగా ఇచ్చే వస్తువు ఎక్స్పెయిర్ అయివుంటుందని దాని మీద డేట్ మార్చేసి ఫ్రీగా ఇచ్చినట్టు మోసం చేస్తున్నారని వంశీకి లివర్ దెబ్బతిని అది కామెర్ల రూపంలో బయట పడినప్పుడు అర్ధమయ్యింది.
" మీకు లివర్ దెబ్బ తినడానికి మరో కారణం కూడా ఉందని నాకనిపిస్తోంది. మొన్న మీరు తెప్పించిన ఒకటి కొంటే ఒకటి “ ఫ్రీ” ఆవు నెయ్యిలో మరో సీసాలో బంగాళా దుంప ఉడకబెట్టి దాని ద్వారా తయారు చేసిన డాల్డా లాంటి నెయ్యి కూడా ఉందిట.ఆ రహస్యం మొన్న యూట్యూబ్లో ఒక పెద్ద డాక్టర్ చెప్తుంటే చూసి వణికిపోయా. అసలు కేజీ వెయ్యి రూపాయలు ఉండే ఆవు నెయ్యి మూడొందల ఏభైకి రావడం,దానితో పాటు మరొకటి “ఫ్రీ” అని ఇస్తున్నప్పుడు మీకు డౌట్ రాకుండా ఎలా ఉందో నా బుర్రకి అర్ధం కావడం లేదు”
“మార్కెట్లో ఈ వస్తువుల విషయంలో జనాలను ఇంత కన్ఫ్యూజ్ చేసి చంపుతున్నారు కానీ ఇది ఆసుపత్రులలో కూడా ఎందుకు అప్లై చెయ్యకూడదు ? అదే రెండు కిడ్నీలు పోయిన వాళ్లకు ఒక కిడ్నీకు డబ్బు భరిస్తే ఇంకో కిడ్నీ ఫ్రీగా ట్రాన్స్ప్లాంట్ చేస్తామనో,క్లినిక్ లలో ట్రీట్మెంట్ చేయించుకుంటే కన్సల్టేషన్ ఫీజ్ “ ఫ్రీ “అనో, లేదా ఇన్ని రూపాయల వరకు మందులు” ఫ్రీ” అనో చెపితే అదేదో ప్రజలకు ఉపయోగం కానీ “ ఫ్రీ” పేరు మీద ఈ డిఫెక్టివ్ సరుకు, అమ్ముడుకాని వస్తువులు అంటగట్టి అమాయక ప్రజలను మోసం చెయ్యడం ఏమిటి ? "అంది రత్న తన మేధస్సును ఉపయోగిస్తూ.
" అవును కదా. ఈ విషయాన్ని ఫేస్ బుక్లోనూ,వాట్స్ యాప్లోనూ పెట్టేయ్.ఎవరిలోనైనా మార్పు వస్తుందేమో చూద్దాం " అన్నాడు వంశీ.
" స్వామీ ! ఆ మార్పు ముందు మీ దగ్గర నుండే మొదలవ్వాలి.ఈ క్షణం నుండి ఈ ఫ్రీ వస్తువులకు స్వస్తి పలకండి .." అంది రత్న మొగుడిలో మార్పును తేగలిగాను అన్న భ్రమలో .
వంశీకి ఇప్పుడు లివర్ సమస్య తొలగింది కానీ ఒకటి కొంటే ఇంకొకటి “ ఫ్రీ” అనే ఆఫర్లు మాత్రం పూర్తిగా అతని మెదడులోంచి తొలగకపోగా వాటికి పూర్తిగా అడిక్ట్ అయిపోయి చెత్తతో ఇల్లు అంతా నింపెయ్యడమే కాకుండా ఇంటిల్లిపాదికీ రోగాలు కూడా కొని తెస్తూనే ఉన్నాడు***
సమాప్తం