నేరస్తుడు

లహరి సాహితీ వేదిక • 30 Jan 2026 • 👁 1 views
”నేరస్తుడు “ (కథ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
(30/1/2026 లహరి సాహితీవేదిక పత్రికలో ప్రచురితం )
“ఏమిటిరా వాసూ! ఏ బాధ్యతా లేకుండా రోడ్డు మీద పడి తిరుగుతున్నావని నాకు తెలిసిన వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఏదో ఒక పనిలో పెడితే రెండు రోజులు కూడా అక్కడ నిలదొక్కుకోలేక వాళ్ళ మీద నోరు పారేసుకుని బయటకొచ్చేస్తావు . ఇంకో పక్క మీ ఆవిడ " ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంది. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర చెప్పి ఏదైనా పనిలో పెట్టించండి అన్నయ్యగారు ! ఈయనకు పూర్తిగా బాధ్యత తెలియడం లేదు. అర్ధం లేని అహంకారంతో సంసారాన్ని నరకం చేస్తున్నారు. . ఇద్దరు చిన్నపిల్లలతో ఒక్క ఆడదాన్ని ఎంతకని ఇల్లు చూసుకోవాలి ? “ అని మొరపెట్టుకోవడంతో పోనీలే దగ్గర చుట్టానివి కదా అని నీకు సహాయం చేస్తూ వస్తున్నాను. ఎక్కడా నిలకడగా ఉండలేని వాడివి అసలు నిన్ను ఈ ప్రపంచంలో ఎవరేనా బాగు చేయగలరా ? మీ ఆవిడ చెప్పినట్టు నీకు ఎందుకు ఆ అహంకారం ? ఏం చూసుకుని ఇలా తయారయ్యావు ? ఇంట్లో తిండి ఎలా వస్తోంది అనుకుంటున్నావు ? ఇద్దరు పిల్లలు ఉన్నారు . వాళ్ళ బాగోగులు పట్టించుకోవడం మానేసి ఇలా దేశ దిమ్మరిలా తిరగడం ఏమీ బావో లేదు. ఇప్పటికే చేబదులు అంటూ నాలుగైదు వేలు ఇచ్చాను. అసలు ఎక్కడైనా లెక్క రాసుకున్నావా ? ఇక నువ్వు ఎవరి దగ్గరా పని చెయ్యలేవని అర్థమైపోయింది.నీలాంటి వాడికి నాకు తెలిసి ఒకటే చివరి అవకాశం కనిపిస్తోంది. . బస్టాండ్ దగ్గర ఏదైనా స్థలం చూసి చిన్న వ్యాపారం పెట్టిస్తాను.నువ్వు ఎవరిదగ్గర పని చెయ్యాల్సిన అవసరం లేదు . ఆ వ్యాపారానికి నువ్వే మేనేజింగ్ డైరెక్టర్వి . అదేనా తిన్నగా చేసుకుంటావా ?" అడిగాను వాసూని అనుమానంగా చూస్తూ.
“ అంటే షాపా ? “ అడిగాడు వాసు మొహాన్ని కందగడ్డలా చేసుకుని .
“ ఏమిటి షాపా? తెలివుండే మాట్లాడుతున్నావా ? బస్ స్టాండ్ దగ్గర షాపు పెట్టాలంటే కనీసం లక్ష రూపాయలైనా అడ్వాన్స్ కట్టాలి. అసలు నీచేత అక్కడ గోనె సంచి వేసి వేరు శనగ కాయలు, బటాణీలు అమ్మిద్దామని నా ప్లాన్. ఎవరేనా పోలీసులు వచ్చి గొడవ చేస్తే శుభ్రంగా గోనె సంచి చంకలో పెట్టుకుని ఆ కాయలు డబ్బాలో పోసుకుని ఇంకో చోటకు మార్చేయొచ్చు . నువ్వు చదువుకున్న చదువుకు అదే బెటర్ అనిపిస్తోంది. కొద్దిగా వ్యాపారాన్ని నిలదొక్కుకునే పరిస్థితికి వస్తే బస్సుల్లో వెళ్ళే వాళ్ళకు వికారాలు, డోకులు వస్తూ ఉంటాయి కాబట్టి పుల్లటి నిమ్మ తొన బిళ్ళలు, బిస్కెట్లు ,నూజీడీలు అలా ఒక్కటొక్కటే చేర్చుకుంటూ వెళుదువు గాని. మొదట్లోనే పెద్ద లాభాలు ఆశించకు . మీ ఆవిడ చేతిలో రోజులో పదో ఇరవయ్యో పడేసినా సంతోషిస్తుంది. ఏమంటావ్ ? బుద్దిగా చేసుకుంటావా ?” అన్నాను మళ్ళీ ఇంకోసారి.
“ఏమిటి నేనంత వెర్రి వెధవనిలా కనపడుతున్నానా ? నువ్వు చెప్పిన వస్తువులు తినడమే కానీ అమ్మడం అనేది నాకు ఘోరమైన అవమానం . పోనీ ఏదో కాలక్షేపం అయిపోతుంది అనుకుంటే దుమ్ము రేపుకుంటూ వచ్చే బస్సు, వెళ్ళే బస్సు దగ్గర ఎలా కూర్చుంటానని అనుకుంటున్నావు. అసలే నాకు ముక్కు ఎలర్జీ . ఒక్కసారి తుమ్ములు మొదలయ్యాయి అంటే కనీసం వరసగా ఏభై వరకు వస్తాయి. ఆ ప్రయాణం చేసే వాళ్ళు నా తుమ్ములు చూసి అపశకునం అనుకుంటారు. .. వదిలేయి నాయనా . నాకు లేని బాధ నీకెందుకు ఊరికే హైరానా పడిపోతున్నావు. నన్ను నా మానాన వదిలేసి నీ దారిన నువ్వు పో బాబూ నీకు పుణ్యం ఉంటుంది ..” అంటూ వాసు నా మోహమ్మీద సీరియస్ గా చెప్పేసి ఎటో వెళ్ళిపోయాడు.
అసలు నేను ఇంత తాపత్రయ పడుతున్నాను అంటే ఈ వెధవ గురించి కాదు. పాపం వాడి పెళ్ళాం గురించే నా ఆలోచన.
** ** ** **
నెల రోజులు గడిచిపోయింది. వాసు భార్యను పలకరించకపోతే బాగుండదు అని ఇంటికి వెళ్ళాను. వాసు పెళ్ళాం సుమతి ఇంతకు ముందులా కాకుండా హుషారుగానే కనిపించింది. ఇంట్లో కూడా కొత్త సామానులు కనిపిస్తున్నాయి.
“అన్నయ్య గారు . మీ కోసమే చూస్తున్నాను. ఈయన ఎక్కడో తన స్వశక్తి మీద ఉద్యోగం సంపాదించుకున్నారు. ఇంటినిండా సామానులు తెచ్చి పడేస్తున్నారు. మీరు ఆయన వెనక పడి గట్టిగా పోరడం వల్లే ఆయనలో చాలా మార్పు వచ్చింది. .. మీ ఋణం ఎప్పటికీ తీర్చుకోలేను ..” అంటూ కాళ్ళకు దణ్ణం పెట్టింది సుమతి కళ్ళనీళ్ల పర్యంతమవుతూ.
నేను ఆలోచనలో పడ్డాను. దమ్మిడీకి కొరగాని వీడికి ఉద్యోగం ఎలా దొరికుంటుంది చెప్మా ? ముందు వీడు ఎక్కడ పని చేస్తున్నాడో ఛేదించడం నా ముఖ్యమైన పనిగా పెట్టుకున్నాను.
ఒక రోజు సుమతి ఏడుస్తూ మా ఇంటికి వచ్చింది. ఆమె ముక్కుపుటాలు అదురుతున్నాయి.
“ అన్యాయం జరిగిపోయింది అన్నయ్య గారు . ఈయన్ని పోలీసులు పట్టుకుపోయారు. కాళ్లా వేళ్ళా పడ్డా వదిలిపెట్టకుండా తన్నుకుంటూ తీసుకుపోయారు. ఈయన అమాయకత్వం చూసి ఎవరో గంజాయి పొట్లాలు ఈయన చేతికి ఇచ్చి ఎవరికో ఇచ్చి రమ్మంటున్నారుట . అలా రహస్యంగా ఇచ్చి వస్తున్నందుకు పదివేలు కమీషన్ ఇస్తామని ఒప్పందం చేసుకున్నారుట. నా బ్రతుకు బండలయిపోయింది . నేనేం చేయాలి ? మీరే మమ్మల్ని కాపాడాలి ?” అంటూ పిల్లలతో సహా మా ఇంటికి వచ్చి భోరుమని ఏడవడం మొదలెట్టింది వాసు భార్య సుమతి.
జరిగింది కలో , నిజమో తెలియని పరిస్థితి. ఎలాగో అలా బ్రతిమాలో, బామాలో వాసుని బలవంతం చేసి బస్టాండ్ దగ్గర చిన్న వ్యాపారమో, కనీసం ఏ ఇడ్లీ బండో పెట్టించి ఉండి ఉంటే ఇలా జైలు జీవితం అనుభవించడం తప్పేది కదా అనుకున్నాను .
సుమతిని ఓదారుస్తూ “ ఆలోచిద్దాం. ఏం చేయాలో . అలా బెంబేలు ఎత్తిపోకు “ అంటూ ఆమెకు ధైర్యం చెప్పాలనే ప్రయత్నం చేశానే కానీ నిజంగా వాసూని కాపాడటం నా వల్ల ఏమవుతుంది ? అసలే ప్రభుత్వాలు ఈ మాదకద్రవ్యాలు అమ్ముతున్న ముఠా మీద కొన్నేళ్లుగా పెద్ద నిఘా పెట్టింది కూడా.
అప్రయత్నంగా పర్స్ లోంచి వెయ్యి రూపాయలు తీసి సుమతి చేతిలో పెట్టి “ఇవి నీ దగ్గర ఉంచుకో .ఒకసారి పోలీసు స్టేషన్ వైపు వెళ్లి కనుక్కుని వస్తాను “ అంటూ నా భార్య వైపు చూసి “ కొద్దిగా వీళ్ళకు ధైర్యం చెప్పు నేనొచ్చే అంతవరకు” అంటూ భారంగా అక్కడనుండి కదిలాను*****
సమాప్తం