కాని పనులు

లహరి సాహితీ వేదిక • 20 Feb 2026 • 👁 1 views
" కాని పనులు" ( కథ ) రచన :జీడిగుంట నరసింహ మూర్తి
(20/2/2026 లహరి సాహితీవేదిక వార పత్రికలో ప్రచురితం)
"ఉద్యోగం దొరకడం లేదు ఎవరూ ఇవ్వడం లేదు అని గగ్గోలు పెట్టే బదులు ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోరాదు? కనీసంలో కనీసం రోజుకు ఐదొందల రాబడి ఉంటుంది?" అన్నాడు సుబ్రమణ్యం రమణ మూర్తికి సలహా ఇస్తూ.
" నీకేంటిరా ఎన్ని సలహాలైనా ఇస్తావ్ . గతంలో కూడా ఎక్కడ కనపడితే అక్కడ పనిగట్టుకుని బోధనలు చేసే వాడివి. నువ్వైతే హాయిగా ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటున్నావ్.పని చేసినా చెయ్యకపోయినా అడిగే వాళ్లు ఉండరు .కాయకష్టం చేసే పని ఉండదు... " అంటూ నిష్టూరంగా మాట్లాడాడు రమణమూర్తి.
" నాకు కూడా ఆ జాబ్ అంత తేలిగ్గా రాలేదురా బాబు. మా నాన్న హఠాత్తుగా గుండాగి చనిపోతే ఆ జాబ్ నాకిచ్చారు. సరే. పెట్టుబడి నేను పెడతాను.నువ్వు ఊరికే కూర్చుని అమ్మడమే నీ పని.అది కూడా చెయ్యలేనంటే చెప్పు.నా సహాయం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు...." అని స్కూటర్ ఆన్ చేసి సుబ్రమణ్యం వెళ్ళబోతూ ఉంటే " అరె.ఆగరా బాబు.పెట్టుబడి కూడా నువ్వే పెడతానంటే ఇటువంటి అవకాశం కాలదన్నుకుంటే అందరూ గడ్డి పెడతారు..." అంటూ వ్యాపారంలో సెటిల్ అయిపోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు రమణమూర్తి.
" ఈ ఏరియాలో చాలా కుటుంబాల వాళ్ళు ఉంటున్నారు. ఒక మంచి కర్రీ పాయింట్ పెడితే బాగుంటుందని నా ఉద్దేశ్యం. జనాలు ఆన్లైన్లోనే టిఫిన్లు,భోజనాలు ఆర్డర్లు చేసుకునే ఈ రోజుల్లో కర్రీ పాయింట్ ముఖ్యంగా లేడీస్ కు చాలా వెసులుబాటుగా ఉంటుంది.వాళ్ళు స్టవ్ మీద ఒక అన్నం పడేసుకుంటే చాలు.కూరలు,సాంబార్లు మనం సప్లై చేస్తాం..ఒక మంచి రోజు చూసి ఇందులోకి దిగిపోదాం.నాకు సెలవులు ఉన్నప్పుడు నేను కూడా నీకు సాయపడతాను...." అంటూ ఒక ప్రణాళికకు రూపకల్పన చేసేసాడు సుబ్రమణ్యం.
ఆ తర్వాత వెంటవెంటనే ఒక రూమ్ చూడటం,ఆ రూమ్ తెలిసిన వాళ్ళది అవడం వల్ల ఒక సంవత్సరం అడ్వాన్స్ లాంటివి ఇవ్వకుండానే సరిపోయింది.
కర్రీ పాయింట్ ప్రారంభోత్సవానికి రమణమూర్తి కుటుంబ సభ్యులు కూడా వచ్చారు .వాళ్ళ మొహాల్లో తమ కుటుంబ యజమాని పెద్ద పరిశ్రమ పెడుతున్నంతగా సంబరపడిపోతున్నట్టుగా అనిపించింది.
తర్వాత తర్వాత రమణ మూర్తికి ఇతర కర్రీ పాయింట్ నిర్వాహకులతో పరిచయాలు ఏర్పడ్డాయి. వాళ్ళ ధరలతో పోల్చుకుంటే తన షాపులో ఎక్కువున్నట్టుగా తేలింది.ప్రస్తుత ధరలతో తక్కువ చేసి అమ్మడం చాలా కష్టమని సుబ్రమణ్యం,రమణ మూర్తి గ్రహించారు. రానూ రానూ షాపు అద్దె కట్టడమే కష్టమవుతోంది.
ఆ రోజు వేరే ఏవో పనులు ఉండటంతో రమణ మూర్తి షాపు తెరవకుండా భార్యా,పిల్లలను తీసుకుని సినిమాకి వెళ్ళి వస్తూ పక్కనే ఉన్న మార్కెట్ దగ్గర ఆగాడు. రాత్రి పది తర్వాత అక్కడ తనతో పాటు కర్రీ పాయింట్ నిర్వహిస్తున్న ముగ్గురు నలుగురు కూరలు కొనడం గమనించాడు
మార్కెట్లో పాడయిపోయి , వాడిపోయి పక్కన పడేసిన కూరకాయలన్నీ అతి తక్కువ రేట్లతో కొనుక్కోవడం చూసాడు రమణ మూర్తి. అతని కళ్ళు తిరిగిపోయాయి. వీళ్ళంతా తక్కువ ధరలో కర్రీ పాయింట్లు లాభసాటిగా నడిపిస్తున్నారు అంటే దాని వెనక రహస్యం ఇదన్న మాట.
రమణ మూర్తిలో విపరీత ఆలోచనలు చోటు చేసుకున్నాయి.ఆ మర్నాడు నుండి అతను కూడా పది గంటల తర్వాత ఒక మాదిరిగా వడలి వాడిపోయి ఆవులకు పారెయ్యడానికి సిద్దంగా ఉన్న కూరకాయలను కొనడం మొదలు పెట్టాడు. దానితో ఇప్పుడు అతని లాభాలు పూర్వం కన్నా గణనీయంగా పెరిగాయి.
కొత్తగా వ్యాపారం పెట్టి తమని మించిపోతున్న రమణ మూర్తి చేష్టలకు అడ్డుకట్ట వెయ్యాలని అతని పోటీదారులు అనుకోవడం ,దరిమిలా వారిచ్చిన ఫిర్యాదుతో ఫుడ్ ఇన్స్పెక్టర్లు రమణ మూర్తి కర్రీ పాయింట్ మీద దాడి చెయ్యడం, షాపు మూసి వెయ్యడం వెంట వెంటనే జరిగిపోయింది. ఆ దాడి సమయంలో మాత్రం ఇతర నిర్వాహకులు చెడిపోయిన పదార్థాలు అమ్మకుండా జాగ్రత్త పడటంతో క్షేమంగా బయట పడిపోయారు.
కొన్నాళ్ళ తర్వాత రమణ మూర్తి భార్యా,పిల్లల అదృష్టం బాగుండి వాళ్ళ ఊళ్ళో చెక్కర ఫ్యాక్టరీలో ఉద్యోగం దొరకడంతో అతన్ని చూడటానికి వచ్చిన సుబ్రమణ్యం
" పోనీలేరా ! అటువంటి అవినీతి పనులు మనం చెయ్యలేం.ఆ రోజు అధికారులు షాపు మూయించి నీకు శిక్ష వేయబోతే నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఎలాగో అలా బయట పడేయగలిగాను. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఈ ఉద్యోగంలో తిన్నగా పని చేసుకో. " అంటూ సుబ్రమణ్యం రమణ మూర్తికి ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు***
సమాప్తం