సుజలాం సుఫలాం

కథా మంజరి • 01 Sep 2020 • 👁 1 views
*****
*సు జలాం సు ఫలాం*
===============
(కథానిక)

(నేను రాసిన ఈ కథ సెప్టెంబర్ 2020లో కథామంజరి అనే పత్రికలో ప్రచురితమైనది)

రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్

"ఏరా సత్యం ! ఈ శీను గాడి పనితనం ఎలా ఉంది ? మనకు ఉపయోగపడేలా ట్రైనింగ్ ఇచ్చావా?" అడిగారు కాంట్రాక్టరు రెడ్డి గారు, డ్రైవింగ్ సీట్లో ఉన్న సత్యాన్ని, క్లీనర్ శీను గురించి.

"చేరి రెండేళ్ళయ్యిందిగదా అయ్యా , బాగానే పికప్ అయ్యాడు. మన పద్ధతులు అన్నీ బాగానే వంట పట్టించుకున్నాడయ్యా" మెచ్చుకోలుగా చెప్పాడు సత్యం.

"ఒరే శీనూ, జాగ్రత్తగా అన్నీ నేర్చుకో. మరి కొద్ది రోజుల్లో నిన్ను డ్రైవర్ ను చేసేస్తా !" భుజం మీద తడుతూ చెప్పారు రెడ్డి గారు, నీళ్ళ టాంకర్ డోర్ వద్ద కూర్చుని డ్రైవర్ కు రైట్ రైట్ అంటూ సూచనలు ఇస్తున్న క్లీనర్ శీనుగాడితో.

"అలాగే అయ్యా, అంతా తమరి దయ " అంటూ వినమ్రంగా చెప్పాడు శీను.

***** ***** ***** ***** *****

సు'జలా'రెడ్డి గారు అంటే తెలియని వారు ఆ మూడు జిల్లాల్లోఎవరూ ఉండరనడం అతిశయోక్తి కాదు. ఎప్పుడో పది సంవత్సరాల క్రితం సుజల వాటర్ ట్రాన్స్ పోర్ట్ పేరుతో రెండు వాటర్ టేంకర్లతో వ్యాపారం ప్రారంభించిన వెంకటరెడ్డి గారు అనతికాలంలోనే వాటి సంఖ్య ఇరవైకి పెంచి వాటికి తోడుగా ఓ నాలుగు పెట్రోలు టేంకర్లు, రెండు బస్సులను కూడా చేర్చి తన వ్యాపారసామ్రాజ్యాన్ని విస్తరించారు.

సాధారణ పోలీసు దగ్గర నుంచి పెద్ద పెద్ద పొలిటీషయన్ల వరకూ అందరూ కూడా రెడ్డి గారి కనుసన్నల్లో ఉండవలసిందే. దానికి నిదర్శనమే, ఇన్ని సంవత్సరాలైనా ఆయన మీద కానీ, వాహనాల మీద కానీ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం!

ప్రస్తుతం, వేసవి కాలంలో గోదావరి నది నుంచి ఆ జిల్లాల్లోని పరిశ్రమలకు నీళ్ళు టేంకర్లు ద్వారా సరఫరా చేసే కాంట్రాక్టు తీసుకున్నారు రెడ్డి గారు.

తన దగ్గర పనిచేసే వారిని సొంతవారిగా చూసుకుంటారు రెడ్డి గారు. వారిని ఉత్సాహ పరిచేందుకే ఇలా మధ్యమధ్యలో వారితో పాటు లారీలో ప్రయాణం చేస్తుంటారు.

***** ***** ***** *****

ఏదో ఆలోచిస్తున్న రెడ్డిగారు సడన్ బ్రేక్ వేయడంతో ముందుకు పడబోయి నిలదొక్కుకున్నారు.

"ఏరా, సత్తిగా ? ఏమయ్యింది ?"

"అయ్యా ! ఎవత్తో ముసల్ది బండి కింద పడింది."

"ఓరి దరిద్రుడా ! ఎంత పని చేసావ్ ? ముందు కిందకి దిగి ఏం జరిగిందో చూసి తగలడండి" అంటూ రంకె లేసారు.

అప్పటికే చుట్టుపక్కల జనం వెనక చక్రం కింద పడి చనిపోయిన ఆ ముసలావిడ శవం వద్ద చేరి ఆవిడ గురించి చర్చించుకుంటున్నారు.

"అదిగో డ్రైవర్ దిగుతున్నాడు, కొట్టండి దొంగ వెధవని" బూతులు తిడుతూ అతని మీదకు దూసుకొచ్చారు అక్కడ చేరిన జనం.

ఈ హడావుడి చూసిన రెడ్డిగారికి లారీ దిగక తప్పలేదు. ఆయనను చూసిన జనం కొంచెం దూరం జరిగారు.

"ఏమయ్యా, ఈ బామ్మగారి తాలూకు మనుషులు ఎవరైనా ఉన్నారా?" అడిగారు రెడ్డి గారు.

ఓ పెద్దాయన ముందుకొచ్చి, "ఎవరూ లే‌రు బాబూ! ఈ మధ్యనే మా ఊర్లోకి వచ్చింది. ఎవరూ లేని అనాథ అనుకుంటా బాబూ!" చెప్పాడు.

వెంటనే రెడ్డి గారు సత్యానికి సైగ చేసారు. ఆ సైగకు అర్ధం తెలిసిన సత్యం,

"ఒరే, శీనూ, ఈ ముసలామె అచ్చు మతి చెడి మీ ఇంట్లోంచి వెళ్లిపోయిన మీ అమ్మమ్మ లా లేదూ?" అంటూ శీను భుజం తడుతూ అడిగాడు.

తెప్పరిల్లిన శీను, ఓ సారి ఆమె దగ్గరకు వెళ్లి, ప‌రకాయించి చూసి…

" ఔను, మా అమ్మమ్మే ! ఎంత పనిచేసావు అమ్మమ్మా , రెండు సంవత్సరాలుగా నీ కోసం వెతుకుతున్నాం. ఆఖరికి ఇలా కనపడ్డావా ?....." అంటూ ఆమె మీద పడి భోరున విలపించసాగేడు.

"చూసేరా, భగవంతుని లీల. అనాథ అనుకున్న ఆవిడని మనవడుతో ఎలా కలిపాడో ?"అంటూ బుగ్గలు నొక్కుకున్నారు చుట్టూ చేరిన అమ్మలక్కలు.

ఈ లోగా రెడ్డిగారు ఇందాకటి పెద్దాయన్ని దగ్గరకు పిలిచి, "మా వాడు పాపం దుఃఖంలో ఉన్నాడు. మీరే దగ్గరుండి శాస్త్రయుక్తంగా కర్మకాండ జరిపించి, తరువాత మా వాడిని బస్సు ఎక్కించి పంపించండి. నేను అర్జంటుగా ఎమ్.పీ. గారిని కలవాలి. లేకపోతే నేనే ఉందును" అంటూ ఓ పదివేలు ఆయన చేతిలో పెట్టి, లారీ ఎక్కి డ్రైవర్ ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు.

***** ***** ***** *****

సాయంత్రం ఆఫీసు కొచ్చిన శీను గాడి చేతిలో ఓ వెయ్యి రూపాయలు పెట్టారు గుమాస్తా కృష్ణమూర్తి గారు. అది చూసి..

""ఏంటయ్యా ఇది ?"" అడిగాడు శీను.

""నువ్వు పొద్దున్న చేసిన నటనకు ప్రతిఫలంరా ! అంటే , సుజల నుంచి సుఫలం అనుకో. నువ్వు ఇలాగే కేసులు లేకుండా నీ నటనతో మాఫీ చేసేసేవనుకో నీకు ఇలాగే భవిష్యత్తులో బోలెడు కానుకలు ఇస్తారు సుజలరెడ్డి గారు" గారపళ్ళు బయటకు కనబడేలా నవ్వుతూ చెప్పారు గుమస్తా గారు.

ఆనందంగా ఆ డబ్బులు జేబులో దోపుకున్నాడు శీనుగాడు.

***** ***** ***** *****

లారీ చక్రం కంటే వేగంగా కాల చక్రం ఐదు సంవత్స రాలు గిర్రుమని తిరిగింది. కాలంతో పాటు టేంకర్లో శీనుగాడి సీటు కూడా మారింది. ఆ రోజు....

"ఏరా శీనూ ! ఈ క్లీనర్ రాజుగాడికి మనకు ఉపయోగపడేలా ట్రైనింగ్ ఇయ్యి" చెప్పారు కాంట్రాక్టరు రెడ్డి గారు, డ్రైవింగ్ సీట్లో ఉన్న శీనుకి.

"అయ్యా, ఈ రోజే కదా చేరింది, బాగానే పికప్ ఔతాడు. మన పద్ధతులు అన్నీ చెబుతానయ్యా" చెప్పాడు శీను.

ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్న రెడ్డి గారు సడన్ బ్రేక్ వేయడంతో ముందుకు పడబోయి నిలదొక్కుకున్నారు.

"ఏరా, శీనుగా? ఏమయ్యింది?"

"అయ్యా ! ఎవరో బండి కింద పడ్డారయ్యా !."

"నిన్ను తగలెయ్యా ! ఎంత పని చేసావురా ? ముందు కిందకి దిగి ఏం జరిగిందో చూడు. ఈ రాజు గాడు వద్దులే, వీడికి కొత్త. నువ్వే దిగు" అంటూ సలహా ఇచ్చారు.

అప్పటికే చుట్టుపక్కల జనం వెనక చక్రం కింద పడి చనిపోయిన ముసలతను వద్ద చేరి అతని గురించి చర్చించుకుంటున్నారు.

"అదిగో డ్రైవర్, పారిపోకుండా పట్టుకోండి" అంటూ అతని మీదకు దూసుకొచ్చారు అక్కడ చేరిన జనం.

కిందకు దిగిన శీనుగాడు, అలవాటు ప్రకారం ఆ చనిపోయిన వ్యక్తిని బయటకు లాగి, పరిశీలనగా చూసి, అతని మీద పడి,

"నాన్నా ! ఎంత పనిచేసావు నాన్నా, ఇరవై సంవత్సరాలుగా నీ కోసం వెతుకుతున్నాం. ఆఖరికి ఇలా కనపడ్డావా ?....."అంటూ అతని మీద పడి భోరున విలపించసాగేడు.

ఈ లోగా రెడ్డిగారు లారీ దిగి, అక్కడే ఉన్న ఓ ముసలాయన్ని దగ్గరకు పిలిచి, "మా వాడు పాపం తండ్రి పోయిన దుఃఖంలో ఉన్నాడు. మీరే దగ్గరుండి శాస్త్రయుక్తంగా కర్మకాండ జరిపించండి. నేను అర్జంటుగా మినిస్టర్ గారిని కలవాలి. లేకపోతే నేనే ఉందును" అంటూ ఓ ఇరవై వేలు ఆయన చేతిలో పెట్టి, క్లీనర్ రాజును పక్కకు పిలిచి,

"ఇలాంటి సంధర్భాల్లో ఎలా నటించాలో ఆ శీనుగాడి ని చూసి నేర్చుకో. పని పూర్తి కాగానే ఇద్దరూ కలసి రండి" అని చెప్పి, లారీని నడుపుకుంటూ వేగంగా వెళ్ళి పోయారు రెడ్డి గారు, అక్కడ ఉన్న వారి మొహాలమీద దుమ్ము కొట్టుకుంటూ.

***** ***** ***** *****

సాయంత్రం ఆఫీసుకొచ్చిన శీను గాడి చేతిలో ఓ ఐదు వేల రూపాయలు పెట్టారు గుమాస్తా కృష్ణమూర్తి గారు. అది చూసి..

"గురువు గారూ వద్దండి. మీ దగ్గరే ఉంచండి" అన్నాడు శీను.

"ఏరా, ఎప్పుడూ లేనిది ఏంటి ఇలా కొత్తగా మాట్లాడుతున్నావు? ఇది సరిపోలేదా ? లేక ఇది పాపపు సొమ్ము అని ఆలోచిస్తున్నావా?'' అడిగారు కృష్ణమూర్తి గారు.

"అది కాదు సార్, అనాధ శవాలకు సాయం చేస్తే మంచిదని, మా అమ్మ చెప్పింది. అందుకే ఈ రోజు నుంచి ఇటువంటి పనులకు డబ్బులు తీసుకోకూడదని నిశ్చయించుకున్నా. పెద్దయ్య గారికి చెప్పకండి" అంటూ చెప్పి వెళ్తున్న శీనుని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు కృష్ణ మూర్తి గారు.

ఇంటికి వెళ్ళడానికి బయలుదేరిన శీను పొద్దున్న జరిగిన ప్రమాద సంఘటన గురించి ఆలోచిస్తూ, సైకిల్ తొక్కుతున్నాడు.

***** ***** ***** *****

"అమ్మా ! నేను ఈవేళ చాలా ఘోరమైన తప్పు చేసేనమ్మా !" తల్లితో అన్నాడు శీను.

"ఏంటి బాబూ, ఏం చేసావు ?" ఆందోళనగా, కొడుకును కుదిపేస్తూ అడిగింది.

"ఒకా పెద్దాయన మీంచి లారీ ఎక్కించే సానమ్మా !" బాధగా చెప్పాడు శీను.

"అయ్యయ్యో, ఎంత పని చేసావురా, ఇంతకీ ఎవరాయన ?"

" ఆయన ఎవరో కాదు అమ్మా, మా నాన్న. అయన్ని నా చేతులతో నేనే చంపేసాను" రెండు చేతులలోనూ మొహం పెట్టుకొని ఘొల్లుమన్నాడు శీను.

"ఎంత ఘోరం జరిగిందిరా బాబూ" అంటూ హృదయవిదారకంగా రోదిస్తూ….

"ఔనూ, మీ నాన్న మనల్ని వదిలేసి సుమారు ఇరవై సంవత్సరాలయ్యింది కదా ? నీకు అప్పటికి ఐదేళ్లు ఉంటాయి. మీ నాన్న అని ఎలా గుర్తుపట్టేవ్. బహుశా ఎవరో అయ్యుంటారు" ఎక్కడో మిణుకు మిణుకు మంటున్న ఆశతో అడిగింది.

"లేదమ్మా, నా చిన్నప్పుడు నాన్న రంపపు మిల్లులో పనిచేసినపుడు ప్రమాదంలో కుడి‌, ఎడమ చేతులు రెండింటికీ కూడా చూపుడు వేలు, మధ్య వేళ్ళు సగానికి పైగా తెగిపోవడం నాకు బాగా గుర్తు. అంతేకాదు ముక్కు చివర కొట్టొచ్చినట్లు ఉండే ఆ ఉలిపిరి కాయ కూడా నాకు జ్ఞాపకం ఉంది. ఆ ఆధారాలు చూసే నాన్నే అని నిశ్చయించుకుని దహన సంస్కారాలు నేనే చేసేనమ్మా. అందుకే మా పెద్దయ్య గారు ఐదువేలు ఇచ్చినా తీసుకోలేదు" అని ఏడుస్తూ చెబుతూ, తల్లి అక్కడ లేకపోవడం చూసి, "అమ్మా అమ్మా " అంటూ లోపలి గదిలోకి వెళ్ళేడు.

అప్పటికే తలలో పూవులు, బొట్టు తీసేసి, గాజులు కూడా తీసేయబోతున్న తల్లిని చూసి, అ….మ్మా…. అంటూ బిగ్గరగా అరిచాడు శీను.

***** ***** ***** *****

సైకిల్ తొక్కుతూ ఆలోచనల్లో మునిగిపోయి, ఇంటికి చేరుకున్న శీను ఆలోచనలోంచి ఉలిక్కిపడి తేరుకుని సైకిల్ స్టేండు వేసి ఇంట్లోకి వెళ్ళి,

"అమ్మా, ఈ రోజు నేను ఓ అనాధకు నా స్వహస్తాలతో దహన సంస్కార కార్యక్రమం నిర్వర్తించేనమ్మా ! మా అయ్యగారు డబ్బులు ఇచ్చినా తీసుకోలేదు" చెప్పాడు శీను.

"ఔను బాబూ! నిజమే, అనాధ శవాలకు సాయం చేస్తే చాలా పుణ్యం వస్తుంది. సరేకానీ ఈ మంచి నీళ్లు తాగి కాళ్ళు కడుక్కొని రా భోజనం చేద్దువుగాని" అంది తల్లి.

"నాన్న చనిపోయాడని అమ్మకు ఎప్పటికీ చెప్పకూడదు. అమ్మ ఎప్పటికీ సుమంగళి గానే ఉండాలి. ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం నాకూ, అమ్మకు నీళ్లు వదిలి తన దారి తాను చూసుకుని వెళ్లి పోయిన నాన్న మరణం గురించి అమ్మకు చెపితే, ఆమ్మ కళ్ళ వెంట కారే ఆ కన్నీళ్లు తాను చూడ లేడు. ఈ రహస్యం ఎప్పటికీ తనలోనే దాచుకోవాలి" అని మనసులో అనుకొని, ఉదయం చనిపోయిన తండ్రికి మరోసారి భక్తితో నీళ్ళు వదిలాడు శీను.

***** **సమాప్తం** *****