బ్రేక్ ద సైలెన్స్. నవల 3 వ భాగం

స్వాతి • 👁 1 views
3. బ్రేక్ ది సైలెన్స్

ఆ ఇంట్లో అందరూ గంభీరంగా వుంటున్నారు. నిజం కన్నా అనుమానం భయంకరమైనది. జ్వాల టిఫిన్ ప్లేట్ ముందు పెట్టుకుని ఆలోచిస్తోంది. “మేడం టిఫిన్ చల్లారిపోతోంది. తినండి. జ్యూస్ తీసుకొస్తాను” అంది మెయిడ్ నొరాతి.
మెల్లిగా తింటూ జ్వాల ఆలోచిస్తోంది.
ఎవరిని అనుమానించాలి? ఎవరిని చూసినా తాతయ్య మీద అటాక్ చేయబోయింది వీళ్లేనేమో అనిపిస్తుంది.
ఎలా నిర్ధారణకు రావాలో అర్థం కాలేదు.
జ్వాల ఇన్స్పెక్టర్ చంద్ర ఘోష్ కి ఫోన్ చేసింది.
“సార్, మా తాతయ్య మీద మరో అటాక్ మా ఇంట్లోనే జరిగింది. గీజర్ వైర్లు తప్పించి చంపాలని చూసారు.
ఈ మధ్య వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నీ తాతయ్య పై మర్డర్ అటెంప్ట్స్ లానే అనిపిస్తున్నాయి.నాకెందుకో చాలా భయంగా వుంది. మీరు వెంటనే యాక్షన్ తీసుకోండి ప్లీజ్” అంది జ్వాల. అతను
“అవునా, తాతయ్య గారికి ఏం కాలేదుగా?! ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను.” అని
చెప్పి కొద్దిసేపట్లో అక్కడికి వచ్చాడు ఇన్స్పెక్టర్ చంద్రఘోష్. అక్కడ పరిస్థితిని చూశాడు. విశ్వనాధ్ దగ్గరకు వెళ్ళి అడిగాడు.
“సార్, మీకు ఎవరిమీదైనా అనుమానం వుందా? ఎవరైనా మీ రూమ్ లోకి వచ్చినట్టుగానీ అనిపించిందా?”
“అసలు అలాంటిదేమీ లేదు. నేనెలా కింద పడ్డానో నాకే తెలీలేదు” అన్నాడు.
అతన్ని అడిగి ప్రయోజనం లేదు. ఇక రెస్ట్ తీసుకోమని చెప్పి గదిలోంచి బయటకు వచ్చాడు చంద్రఘోష్.

“జ్వాలా, మీ తాతగారికి ఎవరన్నా శత్రువులున్నారా? ఆయన్ని మర్డర్ చేయాలనే ఉద్దేశం ఎవరికి ఉండొచ్చని అనుకుంటున్నారు?”
“నేను లండన్ లో వుండటం వల్ల ఇక్కడి విషయాలు నాకు తెలీవు. కానీ తాతయ్యకు తరచుగా ఆపదలు వస్తున్నాయని క్రిష్ ఎప్పటికప్పుడు నాతో చెప్పేవాడు. అసలు నేనింత హడావిడిగా ఇండియా రావడానికి కారణం అదే” అప్పుడే అక్కడికి వచ్చిన క్రిష్ “సార్ ఇంటరాగేషన్ ఎంతవరకు వచ్చింది? ఇంకేమైనా ఇలాంటి కేసులు నమోదయ్యాయా?” అని అడిగాడు
“విశ్వనాథ్ గారి గురించి గత పదిరోజులుగా జరిగిన సంఘటనల గురించి చెప్పమంటే ఆమెకు ఐడియా లేదు అంటోంది. ఎక్కడో ఒకచోట కోస దొరికితే కేసును ముందుకు తీసుకెళ్లగలుగుతాం” అన్నాడు చంద్ర ఘోష్. “అసలు అలాంటి ఉద్దేశాలు ఎవరికుంటాయి? మేము ఒకళ్ళకి సహాయం చెయ్యడమేగానీ, ఒకరి జోలికి వెళ్లి ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు. ఎవరు మాపై పగబట్టారో తెలియట్లేదు”అంది జ్వాల విచారంగా.
“అలాంటి భావనలు సైకోలకి మాత్రమే ఉంటాయి” అన్నాడు క్రిష్ .
“ఎస్, మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. బట్, వృద్ధులను టార్గెట్ చేస్తున్నారంటే దాని వెనక ఏదో బలమైన కారణం ఉంటుంది. అపార్ధాలు కావచ్చు, లేదా వాళ్ళ టార్గెట్ మిస్ అయి వుండొచ్చు.”
“కానీ వృద్ధులను టార్గెట్ చేయడం దారుణం” అంది జ్వాల.
“ జ్వాలా, మీ తాతగారి ఆస్తి ఎవరి పేరు మీద ఉంది?” అని అడిగాడుచంద్రఘోష్.
“అలా ఎందుకు అడుగుతున్నారు సార్?
ఆస్తుల విషయంలో విశ్వనాథ్ గారు చాలా జాగ్రత్తగా వుంటారు. ఆయన జీనియస్” అన్నాడు క్రిష్.
“క్రిష్ ,మీరు మాటిమాటికీ అడ్డురావద్దు.మా ఎంక్వయిరీ లో అన్ని విషయాలూ తెలుసుకోవాలి. మీరు కాసేపు మౌనంగా ఉండాలి. అన్నాడు చంద్రఘోష్ .
“నువ్వుండు క్రిష్, మీరు అడిగేదాన్లో ఏం తప్పులేదు. మా కోట్ల ఆస్థికి నేనే వారసురాల్ని. ఏదైనా చేస్తే నన్ను చేయాలిగాని తాతయ్యను ఎందుకు చేస్తారు సార్?” అని అడిగింది జ్వాల. “ఏస్,లాజిక్ గా ఆలోచిస్తే, నిన్ను ఏదో చేస్తే వాళ్ళకి ఆస్తి రాదు కదా. ఆయన ఆస్తి దక్కవలసిన వాళ్ళకి కాకుండా వేరే ఎవరికో చెందుతోంది అనే కోపంతో ఇలా చేస్తూ ఉండవచ్చు. లేదా ఆయనకి వేరే సంతానం ఎవరైనా ఉన్నారేమో ఆ దిశగా ఎంక్వయిరీ చేయాలి.”చంద్రఘోష్ అనగానే వెంటనే జ్వాల
“నో ఇన్స్పెక్టర్ . హౌ ఇస్ ఇట్ పాసిబుల్ మా తాతయ్యకి అలాంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏమీ లేవు. మా ఫ్యామిలీ అలాంటిది కాదు. మా కుటుంబం ఎట్టిపరిస్థితుల్లో విలువలు తప్పదు”అంది జ్వాల కాస్త విసురుగా.
“ఐ నో మిస్ జ్వాలా! నేను అనేది మిమ్మల్ని బ్లేమ్ చేయడానికో మరో దానికో కాదు. జస్ట్ ఫర్ క్లారిటీ కోసం. ఈ మిస్టరీ ఛేదించాలనే అడుగుతున్నాను. డోంట్ థింక్ అదర్వైస్ “అన్నాడు
అక్కడికి వచ్చిన విశ్వనాథ్ “ఇన్స్పెక్టర్ గారూ! నాకు అలాంటి సంబంధాలు అయితే ఏమీ లేవు .నాకున్న యావదాస్థికి వారసురాలు నా మనవరాలు జ్వాల . ఆమె పేరు మీద ఎప్పుడోనే రాసేశాను. ఆమె తప్ప నా వారసులు ఎవ్వరూ లేరు. సో ఆస్తిపాస్తులు లేని నన్ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? నాకెలాంటి థ్రెట్ లేదని అనుకుంటున్నాను. జరిగేవన్నీ అనుకోని సంఘటనలు మాత్రమే. మర్డర్ ఎటెంప్ట్స్ కావు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే మంచిది” అన్నాడు
“ఏస్, నిజమే. కానీ మీ ఆస్థి జ్వాల పేరుమీద ట్రాన్స్ఫర్ చేసేశారని తెలియని వాళ్ళెవరన్నా ఇలాంటి అటెంప్ట్స్ చేస్తున్నారేమో అని నా డౌట్.”అన్నాడు చంద్ర ఘోష్
“ఓకే సార్, మేం చెప్పాల్సింది చెప్పేసాం. మీకు డౌట్ వున్న వైపునుంచి మీ ఇన్వెస్టిగేషన్ మీరు చేయండి. మావైపు నుంచి మేం క్లియర్” తేల్చి చెప్పింది జ్వాల.
“ఆల్ రైట్. తాతగార్ని జాగ్రత్తగా కనిపెట్టుకుని వుండండి. బయటకు వెళ్ళేటప్పుడు కానిస్టేబుల్స్ మీతో వస్తారు. ఏమాత్రం అనుమానం వచ్చినా డోంట్ ఫర్జెట్ టు కాల్ మీ. ఓకే” అని చెప్పి చంద్ర ఘోష్ వెళ్ళిపోయాడు.
పనివాళ్ళు ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కింద ఇంత జరుగుతున్నా తన తల్లి కిందకు రాలేదెందుకని, ఆమెకు తెలిసే రాలేదా? పోనీ వెళ్లి చెబితే కంగారుపడుతుందేమో. వెళ్లి ఆమెతో మాట్లాడాలి అనుకుంది జ్వాల.
విశ్వనాథ్ కాసేపు విశ్రాంతి తీసుకుంటానని తన రూమ్ కి వెళ్ళి పడుకున్నాడు. జ్వాల, క్రిష్ బయటకు వచ్చి సిట్ ఔట్ లోకి వచ్చి కూర్చున్నారు.
“ఆర్ యూ ఓకే “ అన్నాడు క్రిష్.
“నో , ఇప్పుడే కొత్త సంఘర్షణ మొదలైంది. ఆస్తుల విషయంలో ఏవైనా లావాదేవీలు ఉన్నాయేమో లాయర్ గారిని అడగాలి. చంద్రఘోష్ గారు కొత్త అనుమానం పెట్టారు నాకు ” అంది ఎటో చూస్తూ
“ఆల్ రైట్, వాటి గురించి తెలుసుకో. కొన్నాళ్ళు తాతయ్యని ఇంటికే పరిమితం చేస్తే మంచిది. సేఫ్ గా చూసుకునే పనివాళ్లని పెట్టు. అంతా చక్కబడుతుంది” అన్నాడు క్రిష్
“లేదు క్రిష్, తాతయ్యను స్వేచ్చగా బయటకు తీసికెళ్ళి తిప్పాలి. తాతయ్య మీదకు బాల్ విసిరిన వాళ్ళు ఎవరు? సారీ నువ్వు మా టార్గెట్ కాదు అని లెటర్ ఎందుకు పంపారు. ఇవన్నీ తెలుసుకోవాలనుంది. ఇందులో చాలామంది హస్తం వుందని నా అనుమానం. వాళ్ళు దూరంగా లేరు. ఇక్కడే మా చుట్టుపక్కలే తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. కనిపెట్టి తీరతాను” అంది.
“డోంట్ థింక్ టూ మచ్ జ్వాలా, ఒకపని చేయండి, మీరందరూ కలిసి లండన్ వెళ్ళిపొండి. ప్రాబ్లం సాల్వై పోతుంది” అన్నట్టు.సరేనా అన్నట్టు ఆమెవంక చూస్తూ
“ఇంపాజిబుల్. ఇన్ని ప్రాపర్టీస్ వదిలేసి లండన్ ఇప్పటికిప్పుడు ఎలా వెళ్ళిపోతాం? వాళ్ళకి వీసా కూడా లేదు.
పోనీ ఎలాగొలా వెళ్ళినా, వాళ్ళు ఆరు నెలల్లో తిరిగి ఇక్కడికి రావాల్సిందే. నేను టూ త్రీ ఇయర్స్ అక్కడ జాబ్ చేసి ఇండియా వచ్చి సెటిల్ అవుదామని అనుకుంటున్నాను. మాకున్న పెద్దదిక్కు తాతయ్య ఒక్కరే. మామ్ ని చూసావుగా. ఆవిడ డిఫరెంట్ వరల్డ్ లో వుంటుంది. సో”
“సో ఇక్కడినుంచి వెళ్ళనంటావ్. తాతయ్యను సీక్రెట్ గా వుంచనంటావ్. ఆల్ రైట్. వాట్ నెక్స్ట్?”
“నాదొక ఐడియా, చాలా కేసెస్ లో చిన్న చిన్న విషయాలు మిస్ అవుతుంటాం. పోలీసులు వాళ్ళ పని వాళ్లు చేస్తారు. మనం సీక్రెట్ డిటెక్టివ్ ఎజెంట్ సహాయం తీసుకుంటే ఎలా వుంటుందని ఆలోచిస్తున్నా. వాళ్లైతే మన పని సులువు చేస్తారు. మనకి ఇంత ఆలోచించే టెన్షన్ తప్పుతుంది.” అంది అతని సమాధానం కోసం చూస్తూ
“ఏస్, గుడ్ ఐడియా, నాకు తెలిసిన ఒక బెస్ట్ ఏజెన్సీ వుంది.”
“ఓ, నైస్, ఇంకేం. వెంటనే కాంటాక్ట్ చెయ్యి.అతని పేరు?”
“తెలీదు, నానక్ రామ్ గూడా చౌరస్తా పక్క గల్లీలో మోర్ పై అంతస్తులో వుంటాడని తెలుసు”
“ఇంకేం, అతన్ని కలిసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయమని చెబుదాం. ఎప్పుడు వెళ్లి కలుద్దాం?”
“నీముక్కుకి తగిలిన దెబ్బ కాస్త తగ్గని బు. నువ్విలా వస్తే బాగోదేమో” అన్నాడు చిన్నగా నవ్వుతూ.
“నో ప్రాబ్లం. నాకలాంటి సిగ్గులు లేవు.
నివ్వెప్పుడంటే అప్పుడు నేను రెడీ”
“ముందు నేను వెళ్లి కాంటాక్ట్ చేసి వచ్చాక మనిద్దరం వెళదాం. ఈరోజే వెళ్లాలని చిన్నపిల్లలా పట్టుపట్టకు.”అన్నాడు.
“తాతయ్య మీద ఎటాక్ చేస్తున్న వాళ్ళని ఎంత తొందరగా కనిపెడతానా అనుంది”అంది కుర్చీలో వెనక్కి వాలుతూ.
“నేను వెళతాను. నువ్వు రెస్ట్ తీసుకో. మళ్ళీ రేపు వచ్చి కలుస్తాను.”
“ఆల్ రైట్, ఈలోపు నేను, ఇప్పటివరకూ జరిగిన విషయాలన్నీ నోట్ చేసి ఉంచుతాను. డిటెక్టివ్ ఎజెంట్ కి పనికొస్తాయి” అంది.
“సరే, వస్తాను. జాగ్రత్త” అని చెప్పి వెళ్ళిపోయాడు క్రిష్.
తాతయ్య రూమ్ దగ్గరకు వెళ్లి చూసింది. అతను నిద్రపోతున్నాడని నిర్ధారించుకుని తన గదిలోకి వెళ్ళి పడుకుంది జ్వాల. ఆమెకు నిద్ర రావడం లేదు. హ్యాండ్ బ్యాగ్ లోంచి ‘థ్రిల్ ఫర్ మెనీటైమ్స్’ నవల తీసి చదువుతూ కూర్చుంది జ్వాల. అది అంతకుముందు సగం వరకూ చదివింది.

జార్జ్ అనే వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ నాన్సీ ని అమితంగా ప్రేమిస్తాడు. ఎప్పుడూ ఆమె ప్రెజెన్స్ కావాలని కోరుకుంటాడు. ఆమెతో కలిసి వుండటాన్ని ఇష్టపడతాడు. ఇద్దరూ కొంతకాలం కలిసున్న తర్వాత నాన్సీ జార్జ్ ని పట్టించుకోవడం మానేస్తుంది. కనీసం అతన్ని తన గదిలోకి అడుగు పెట్టనివ్వదు. అతను చాలా బాధపడతాడు. ఆమెలేని జీవితాన్ని ఊహించుకోలేనని జార్జ్ నాన్సీ తో చెప్పేందుకు ప్రయత్నించినా ఆమె ఆ మాటలు వినేందుకు ఇష్టపడదు. మెల్లగా వాళ్ళమధ్య దూరం పెరుగుతుంది. ఆమెకు తనంటే ఇష్టం లేదని తెలిశాక దూరంగా వెళ్ళిపోయాడు. నాన్సీ కొత్త బాయ్ ఫ్రెండ్ కోసం వెతుకుతున్నప్పుడు ప్రిన్స్ కనపడతాడు. అతనితో స్నేహం చేస్తుంది. అతన్ని ఇంటికి తీసుకొస్తుంది. ఇద్దరూ కొంతకాలం డేటింగ్ చేశాక ఎందుకో నాన్సీ అతన్ని భరించలేకపోతుంది. ఏదో ఒక విషయంలో గొడవపడుతూ క్రమంగా ఇద్దరిమధ్యా దూరం పెరుగుతుంది. కారణం అడక్కుండానే అతను కూడా ఆమె నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళకు నాన్సికి పీటర్ పరిచయం అవుతాడు. నాన్సీ అతనితో కొన్నాళ్ళు కలిసి వున్నాక, వున్నట్టుండి అతను కూడా వెళ్ళిపోతాడు. అతనికోసం నాన్సీ చాలా ఏడుస్తుంది. కొన్నాళ్ళు ఒంటరిగా గడుపుతుంది. ఆ ఒంటరితనాన్ని భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకోబోతుంటే హెన్రీ అనే వ్యక్తి ఆమెను ఆపుతాడు. ఆమె ఒంటరి జీవితానికి తోడుగా వుంటానంటాడు. అప్పటినుంచి అతనితో వుంటుంది. ఆ ఇంట్లో అతనితో గడిపే క్షణాలలో ఒకటి నోటీస్ చేస్తుంది నాన్సీ. జార్జ్, ప్రిన్స్, పీటర్, హెన్రీ ఆ నలుగురి అలవాట్లు వస్త్ర ధారణ, తనతో వ్యవహరించే తీరు, రొమాన్స్ మూడ్స్, స్టైల్, ఇంట్రెస్ట్ నలుగురివీ ఒకేలా వుండటం చూసి ఆశ్చర్యపోతుంది. వాళ్లంతా తన మొదటి బాయ్ ఫ్రెండ్ జార్జ్ ని గుర్తు తెచ్చేలా ప్రవర్తించడం ఆమెను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. అప్పటినుంచి
జార్జ్ కోసం వెదకడం మొదలు పెడుతుంది. అతని ఫోటో, డిటైల్స్ పట్టుకుని వాళ్ళు తిరిగిన అన్ని ప్లేసెస్ కి వెళ్లి చాలా మందిని జార్జ్ కోసం అడుగుతుంది. ఎవరూ మాకు తెలీదని చెబుతారు. ఆ వెతుకులాటలో జార్జ్ ని ఎంతగా మిస్ అవుతున్నానో చెబుతూ ఒక బుక్ రాసి పబ్లిష్ చేస్తుంది. అందులో జార్జ్ ఎక్కడున్నా వచ్చి తనని కలుసుకోవాలని రాస్తుంది. కొందరు అతను చనిపోయాడని చెప్తారు. ఆమె షాకవుతుంది. అచ్చం అతనిలానే ప్రవర్తించే ఆ ముగ్గురూ ఎవరు? వాళ్ళలో జార్జ్ ఆత్మ ప్రవేశించిందా? నా మీద కోరిక చావక నాతో గడిపిన ఆ ముగ్గురిలో జార్జ్ ఆత్మ వుందా? అనే ఆలోచనతో నాన్సీ మెంటల్ గా డిస్టర్బ్ అవుతుంది. కొన్నాళ్ళు సైక్రియాటిస్ట్ దగ్గరకు వెళ్ళి చికిత్స తీసుకుంటుంది. అయినా ఆమెను ఆ ప్రశ్న వెంటాడుతూ వుంది.
ఆమె ఒకరోజు న్యూస్ పేపర్ లో ఒక కేస్ ని ఎంతో చాకచ్యంగా ఛేదించిన ప్రైవేట్ డిటెక్టివ్ లియో గురించి చదివి అతని దగ్గరకు వెళుతుంది. ఆమె తీవ్రమైన ఆవేదనతో తన జార్జ్ తనకు కావాలని హిస్టీరిక్ గా అరుస్తూ చెబుతుంది. అతను జార్జ్ చనిపోలేదు. బతికే వున్నాడని చెప్తాడు. ఎక్కడున్నాడు అని ఉద్వేగంగా అడుగుతుంది. ప్రస్తుతానికి నీ ప్రతి ఆలోచనలో బతికే ఉన్నాడు. అందరిలో నువ్వు అతన్నే చూస్తున్నావు. వాళ్ళ ప్రతి చర్యలో అతన్నే భావిస్తున్నావు. అంటాడు. “నో, లేదు. జార్జ్ చేసే పనులు నాకు నచ్చవు. నేనతన్ని హేట్ చేసి వదిలేసాను”అని ఏడుస్తుంది.
“అతనిలో నచ్చని గుణం ఏమిటి?”అనడుగుతాడు.
“జార్జ్ నన్ను కిస్ చేస్తున్నప్పుడు నా పేస్ అరవై డిగ్రీల ఒంపు తిప్పి, అయిదు నిమిషాల పాటు కిస్ చేస్తాడు. నేను వన్ మినిట్ చాలంటాను. ఆ విషయంలోనే మామధ్య గొడవలు జరిగి, అవి క్రమంగా పెరిగి, వేరే విషయాల మీద ఎఫెక్ట్ పడి విడిపోయాం.” అని చెప్తుంది
ప్రిన్స్, పీటర్, హెన్రీ లను విడివిడిగా కలుస్తాడు లియో. “మీరు జార్జ్ లా ఎలా ప్రవర్తిస్తున్నారు?” అని అడుగుతాడు డిటెక్టివ్ లియో.
వాళ్ళు చెప్పిన సమాధానాలు విని ఆశ్చర్యపోతాడు.
ముగ్గురూ ఒకే విషయం చెప్తారు
“నాన్సీ తన ఫేస్ ని అరవై డిగ్రీల ఒంపు తిప్పి, ఫైవ్ మినిట్స్ పాటు ముద్దు పెట్టమంటుంది. తన ఇంట్లో తనకు నచ్చినట్టుగా వుండమని చెప్తుంది. అవన్నీ ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ జార్జ్ అలవాట్లని మాకు తెలిసింది. ఆమె అతన్ని బాగా మిస్ అవుతోందనిపించి ఆమెనుంచి విడిపోయాం” అని నలుగురూ ఓకే విధంగా చెప్తారు.
దాంతో నాన్సీ జార్జ్ ని చాలా ఇష్టపడుతోందని అర్థం చేసుకుంటాడు
లియో. ఇక జార్జ్ ని వెదికే దిశగా లియో ఇన్వెస్టిగేషన్ మొదలెడతాడు. లియో వుండే రూమ్ పైన ఒక నలభై ఏళ్ల స్త్రీ వుంటుంది. ఆమెకు ఒక చిన్న పాప వుంటుంది. ఆమె తన బిడ్డను పోషించేందుకు రకరకాల పనులు చేస్తుంది. ఆమె లియోని ఆత్మీయుడిగా చూస్తుంది. ఒకరోజు అతనితో తనతో గడిపిన ఒక వ్యక్తి గురించి ఆసక్తికరమైన విషయం చెబుతుంది. అదేంటంటే అతను తనతో ఉన్నంతసేపు నాన్సీ అని పిలుస్తాడని, కిస్ చేసేటపుడు నీకు ఫైవ్ మినిట్స్ కిస్ ఇష్టం లేకపోతే చెప్పు, నన్ను ద్వేషించి వెళ్ళిపొమ్మనకు నాన్సీ అంటాడని చెప్పింది. లియో అతన్ని చూడాలంటాడు. ఆమె జార్జ్ ని ఇంటికి పిలుస్తుంది. అతను వస్తాడు. అక్కడ నాన్సిని చూసి ఆశ్చర్యపోతాడు. ఇద్దరూ ప్రేమాలింగనం చేసుకుంటారు. మనసు విప్పి అని విషయాలూ మాట్లాడుకుంటారు. చిన్న విషయాలకు విడిపోతే లైఫ్ పాడైపోతుందని చెప్పి ఇద్దర్నీ కలుపుతాడు లియో. అతను ఎంతో సునిశితంగా ఆలోచించటం వల్ల ఇద్దరం కలిశామని లియోకి థాంక్స్ చెప్తారు ఇద్దరూ.

పుస్తకం చదవటం పూర్తి కాగానే పక్కన పెట్టింది జ్వాల. డిటెక్టివ్ నావెల్స్ చదువుతుంటే ఏదో కొత్త లోకంలోకి వెళ్ళినట్టు, చిన్న విషయాలనుంచి వాస్తవాల్ని ఎలా తెలుసుకోవచ్చో అర్థమవుతుంది. ఇంతకీ తాతయ్యకు ప్రాణ హాని ఎవరు కలిగిస్తున్నారు? లేదా ఎవరన్నా తనచుట్టూ పన్నిన వలా?
ఐతే ఎవరు? జ్వాల ఆలోచనలు ముందు క్రిష్ మీదకు మళ్ళాయి. చాలా రోజులుగా అతనే ఇక్కడ విషయాల్ని వాట్సప్ ద్వారా తెలియజేస్తూ వచ్చాడు. మెటా
ఏ .ఐ తో కొన్ని విషయాలు సీక్రెట్ గా డిస్కస్ చేసింది. ఆశ్చర్యకరంగా తను అడిగిన విషయాలకు సంబంధించిన పాపప్స్ యూట్యూబ్ లో రావడం గుర్తించింది. అంటే మెటా ఏ ఐ తన వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికైనా చేరవేస్తోందా? ఆ ఫీచర్ అందులో వుందా? అయితే ఎవరికి పంపుతోంది? ఇదంతా గూగుల్ కూడా చేయగలదా?
ఆలోచనలతో జ్వాల బుర్ర వేడెక్కింది.
లేచి వెళ్ళి ఫ్రిజ్ లో నీళ్ళబాటిల్ తీసుకుని తాగింది. డిటెక్టివ్ నవల చదివిన ఎఫెక్ట్.
క్రిష్ తన శ్రేయోభిలాషి అని తను ఎప్పటినుంచో నమ్ముతోంది. బాల్య స్నేహితుడు, కాలేజ్ మేట్. ఒకరిపై ఒకరికి ఇష్టం వుందని ఎప్పుడూ చెప్పుకోలేదుకానీ అతను తన సర్వస్వం అనుకుంది.
అతను కూడా సభ్యత పాటిస్తాడు అని తన నమ్మకం. కానీ ఎవర్నీ గుడ్డిగా నమ్మే రోజులు కావివి. అమ్మ, గోపీ చంద్ మధ్య ఏం నడుస్తోంది. వాళ్ళ సంభాషణ సారాంశం ఏవిటి? అమ్మ అతన్ని ఏదో తీసుకు రమ్మని, లేకపోతే ఇంటికి రావద్దని చెప్పినట్టుగా తెలుస్తోంది. కానీ అతని ఉత్తి చేతులతో రావడం అమ్మకి కోపం తెప్పించింది. ఆ తేవాల్సింది ఏంటి?
వీళ్ళ పరిచయం ఎప్పుడు ఎంతవరకూ జరిగిందో తనకు తెలీదు. పాపం అమ్మ. నాన్న పోయాక మునిలా బ్రతుకుతోంది. తాతయ్యకు తోడుగా వుంటోంది. ఇది తనకు తెలిసిన, బయటకు కనిపించే నిజం.ఇందులో మరో కోణం కూడా వుందేమో తెలియదు. తాతయ్యతో మనసు విప్పి మాట్లాడితే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. రేపు ఎలాగైనా ఒంటరిగా తాతయ్యను బయటకు తీసికెళ్ళి వివరాలు రాబట్టాలి. అమ్మ, గోపీ చంద్ అంకుల్ గురించి తాతయ్యను అడిగితే? ఛీ చాలా అసహ్యంగా వుంటుంది. ముందు ఏదోటి కదిపితే ఆయనే బయటపెడతారేమో చూడాలి. ఏస్. అంతే అనుకుని హుషారుగా పైకి లేచి వాష్ రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది. పనివాళ్ళు మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకోవాలని తాతయ్య ఆర్డర్. అందర్నీ మానవతా దృష్టితో చూసే తాతయ్య మీద ఎవరికీ కోపం వుండదు మరి.
మరొక డిటెక్టివ్ నవల ‘ ది రేర్ బ్లడ్ శాంపిల్‘ బుక్ రాక్ లో కనిపించింది. దాన్ని తీసుకుని బెడ్ రూం లోకి వెళ్లి పడుకుని పుస్తకం తెరిచింది. అక్షరాల వెంట కళ్ళు పరిగు పెట్టాయి. రక్తం వేడెక్కించే రొమాన్స్, రోమాలు నిక్కబొడుచుకునే సస్పెన్స్ తో వున్న ఆ పుస్తకాన్ని చదువుతుంటే మెల్లగా కళ్లు మూతలు పడ్డాయి. బుక్ గుండె మీద పెట్టుకుని నిద్రలోకి జారుకుంది జ్వాల.
అందులోని పాత్రల ప్రభావానికి లోనైనట్టు ఆమె శరీరం స్పందించి మగతలోనే గట్టిగట్టిగా అరిచింది. సర్వెంట్ నొరాతి పరిగెత్తుకు వచ్చి
“ఏమైంది మేం సాబ్?” అనడిగింది కంగారుగా. జ్వాల చటుక్కున లేచి “ఏం లేదులే”అంది ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకుంది. నొరాతి మంచినీళ్ళు ఇచ్చింది. జ్వాల నీళ్ళు తాగి మళ్ళీ పడుకోబోతుంటే కింద నుంచి
పైకి వచ్చిన మరొక మెయిడ్ “ మేమ్! మీకోసం ఎవరో వచ్చారు”అని చెప్పడంతో గదిలోంచి బయటకు వచ్చింది జ్వాల. కింద హాల్లో క్రిష్ వున్నాడు. “హై క్రిష్, ఇంటికి వెళతానన్నావు. వెళ్ళలేదా? భోజనం చేద్దువుగాని రా”అంది పైనుంచి మెట్లు దిగుతూ
“ఒక ముఖ్యమైన వ్యక్తిని తీసుకొచ్చాను. చూడు”అని అతని వెనక వున్న అతన్ని చూపించాడు. అతన్ని పరీక్షగా చూసి కెవ్వు మని అరిచి “ఇతన్నే నేనక్కడ చూశాను. ఇతనే” అని అరిచింది.
క్రిష్ ఖంగు తిన్నాడు. ఆమె చేతిలోని డిటెక్టివ్ నవల వైపు చూస్తూ
“ముందు నువ్వవి చదవడం మానెయ్యి. నువ్వు భయపడి అరిచి మమ్మల్ని భయపెట్టకు.” అన్నాడు.
ఆమె క్రిష్ పక్కనున్న వ్యక్తి వంక అనుమానంగా చూస్తూ కిందకు వచ్చింది.
“నిన్నెక్కడో చూసినట్టుగా వుంది. పార్క్ లో చెట్టు చాటున కనపడిన వ్యక్తి ఇతనే అనుకుంటా”అంది.
“జ్వాలా, ఊరికే కంగారు పడకు. ఇలా వచ్చి కూర్చో. ఇతన్ని సరిగ్గా చూసి చెప్పు. నువ్వు చూసింది ఇతన్నేనా?” ఆమెను సోఫాలో కూర్చోబెట్టి అడిగాడు.
జ్వాల ఆ వ్యక్తివంక అనుమానంగా చూస్తూ
“పార్క్ దగ్గర నా ముక్కుకి దెబ్బ తగిలిన
బాధలో మైకం కమ్ముతున్నప్పుడు చెట్టు చాటున ఒక వ్యక్తి నిలబడి తొంగి చూడటం నేను చూశాను. ఎందుకో ఇతన్ని చూడగానే ఆ మొహం గుర్తొచ్చింది. సారీ.” అంది నొప్పెడుతున్న ముక్కుని చేత్తో పట్టుకుని ఆ వ్యక్తి వంక పరిశీలనగా చూస్తూ.
క్రిష్ అతనికి సారీ చెప్పి కూర్చోమన్నాడు.