2. బ్రేక్ ది సైలెన్స్
జ్వాలను పరీక్షించి ఆమె ముక్కుకి బలమైన గాయం అయిందని చెప్పారు డాక్టర్స్. చిన్న సర్జరీ చేయాలి, రెండ్రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది.ఆమెకు ఏం ఫర్వాలేదని డాక్టర్ చెప్పడంతో క్రిష్, విశ్వనాథ్ కాస్త ఊపిరి పీల్చుకున్నాను. జ్వాల ముక్కుమీద తగిలిన గాయానికి నాలుగు కుట్లు పడ్డాయి. రెండు గంటలకు మత్తు విడిన ఆమె లేచి చూసేసరికి ఎదురుగా విశ్వనాథ్, క్రిష్, ఇన్స్పెక్టర్ చంద్రఘోష్ వున్నారు. “తాతయ్యా” అంది జ్వాల నీరసంగా. అక్కడేవున్న ఇన్స్పెక్టర్ చంద్ర ఘోష్ “మేడం, ఇప్పుడెలా వుంది మీకు? “ అనడిగాడు. “ బాగానే వున్నానంకుల్” అని చెప్పింది.
చాలా కాలంగా ఎస్ ఐ చంద్రఘోష్ తో విశ్వనాథ్ కి మంచి పరిచయం వుంది. రెండు కుటుంబాలకు చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. విశ్వనాథ్ సర్వీస్ లో వున్నప్పుడు ఆయన సాహస కార్యాలు ఎన్నో విన్న చంద్ర ఘోష్ విశ్వనాథ్ కి మంచి అభిమానిగా మారాడు. అందుకే కబురు తెలియగానే హాస్పిటల్ కి వచ్చాడు.
“గుడ్, నీమీద ఎటాక్ చేసినవాళ్ళని గుర్తుపట్టగలరా?” అనడిగాడు చంద్ర ఘోష్. “ఐ డోంట్ నో సర్ , క్రికెట్ బాల్ దూసుకొచ్చి బలంగా ముక్కుకి తగిలింది. ఆ పరిసరప్రాంతాల్లో మనుషులెవరూ కనపడలేదు.చాలా దూరంగా, మసగ్గా ఒక వ్యక్తి కనిపించాడు. ఇలా అతనే చేసాడని చెప్పలేనుగానీ, నాకెందుకో ఇదంతా కావాలనే ఎవరో చేశారని నా అనుమానం.బాల్ అంత వేగంగా ఎలా వచ్చిందో నాకు తెలీదు. అంతకు ముందు వచ్చిన బాల్ కూడా అంతే వేగంగా వచ్చి పక్కకు పడింది. ఒక ముసుగు వ్యక్తి నా పక్కనుంచి వెళ్ళటం గమనించాను. పట్టుకుందామని చూసాను. బట్, బాల్ ముక్కుకి తగిలేసరికి నా తల దిమ్మెక్కిపోయింది. అంతే ఆతర్వాత నాకేం తెలీదు”చెప్పింది జ్వాల.
“ ఆ చుట్టుపక్కల క్రికెట్ ఆడుతున్న పిల్లలెవరన్నా ఉన్నారా? “
“లేరు సార్ “
“ఎవరూ లేనప్పుడు ఆ బాల్ ఎలా వచ్చింది. కావాలనే విసిరారు అనుకున్నా మనుషులు కనపడాలి కదా” అన్నాడు ఇన్స్పెక్టర్ సాలోచనగా. “ఆ బాల్ కావాలనే విసిరారంటారా ఇస్పెక్టర్?”అడిగింది జ్వాల.. “మే బీ, కానీ మీ మీద ఎవరు విసురుతారు. ఆ అవసరం ఎవరికుంది?”అన్నాడు ఎస్ ఐ “నామీద కాదు ఇన్స్పెక్టర్. మా తాతయ్య మీదకి విసిరారు. అది గురితప్పి నాకు తగిలింది.” “తాతయ్యగారిమీదకి బాల్ అంత బలంగా విసిరారంటారా? ఇది మర్డర్ ఎటెంప్ట్ అని అనుమానిస్తున్నారా ?”
“ఏస్ ఇన్స్పెక్టర్, నా అనుమానం అదే.”
“ఆయనపై దాడి చేసే అవసరం ఎవరికుందని మీ వుద్దేశ్యం?”
“అది మీరే కనిపెట్టాలి . గత పదిరోజులుగా ఆయన మీద ఏదో ఒక అటెంప్ట్ జరుగుతోంది అని నా ఫ్రెండ్ క్రిష్ చెప్తున్నారు”
“ఈజ్ ఇట్?! మరెందుకు కంప్లైట్ చేయలేదు” క్రిష్ ని అడిగాడు చంద్రఘోష్.
“నాకింకా కన్ఫర్మ్ కాలేదు ఇన్స్పెక్టర్. జస్ట్ డౌట్ అంతే. ఇదంత సీరియస్ అవుతుందనుకోలేదు.” అన్నాడుక్రిష్.
అతనితో మాట్లాడాక ఇన్స్పెక్టర్ చంద్రఘోష్ తన కానిస్టేబుల్ కి రమ్మని సైగ చేశాడు. అతను దగ్గరికి వచ్చాడు .అతనితో ఏదో మాట్లాడాడు ఓకే సార్ అన్నాడు.
“ మేడం మీరు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కానిస్టేబుల్స్ మీ కూడా వస్తారు. యు డోంట్ వర్రీ.వాళ్లే మీ ప్రొటెక్షన్ చూసుకుంటారు”అని చెప్పాడు.
“ఇదంతా ఏంటి ఇన్స్పెక్టర్ ఎవరిమీద ఈ మర్డర్ అటెంప్ట్ జరిగింది? నాకేం అర్థం కావట్లేదు” అన్నాడు క్రిష్ .
“నేను కేసు ఫైల్ చేసి ఎంక్వయిరీ చేస్తాను ప్రస్తుతానికి ఆమెను రెస్ట్ తీసుకోనీయండి. మేం అంతా చూసుకుంటాం. యు డోంట్ వర్రీ. ఓకే మిస్ జ్వాలా. టేక్ కేర్ “ అని చెప్పి క్రిష్ తో పాటు బయటకు వచ్చాడు.
“సార్, విశ్వనాధ్ గారికి టెన్షన్ వల్ల బి పి పెరిగి ఛాతీలో నొప్పి వచ్చింది. డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చారు. ఇప్పుడు కాస్త ఫర్వాలేదు. చూద్దాం రండి.” అని చెప్పి చంద్రఘోష్ ను లోపలికి తీసుకెళ్లాడు క్రిష్. విశ్వనాధ్ లోపల బెడ్ మీద పడుకున్నవాడల్లా ఇన్స్పెక్టర్ ని చూసి లేచి కూర్చున్నాడు.
“సార్, నా మనవరాలు?” అన్నాడు ఆందోళనగా. “ఆవిడ బ్రహ్మాండంగా వున్నారు. మీరు అసలు టెన్షన్ పడకండి. నేనున్నాను కదా. అంతా నాకొదిలేసి నిశ్చింతగా వుండండి” అని ధైర్యం చెప్పి, కానిస్టేబుల్ ని అక్కడే వుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానిస్టేబుల్ హాస్పిటల్ రూమ్ బయట ఉన్న స్టూల్ మీద కూర్చున్నాడు.
జ్వాలను హాస్పిటల్లో రెండు రోజులు వుండాలని చెప్పారు. ఆ రోజు సాయంత్రం ఆమెకు నర్స్ ఒక లెటర్ తీసుకొచ్చి ఇచ్చింది. “వాటీజ్ దిస్? ఇందులో ఏముంది?” అనడిగింది జ్వాల ఆసక్తిగా లెటర్ వంక చూస్తూ.
“తెలీదు మేడం.” అంది నర్స్. లెటర్ తెరిచి చూసింది జ్వాల. “వాట్. హూ ఈజ్ దిస్” అంది ఆశ్చర్యగా.”ఏమైంది మేడం?” అని నర్స్ అడిగింది.
“ఇందులో ‘ఐ యాం వెరీ సారీ .యు ఆర్ నాట్ అవర్ టార్గెట్’ అని రాసుంది. ఇది ఎవరు పంపారు?” అనడిగింది జ్వాల. “ఏమో మేడం. నాకు తెలీదు. హెడ్ నర్స్ తెచ్చి ఇచ్చింది. ఆమెను పంపిస్తాను. అడగండి” అని ఆమెను పిలుచుకువచ్చేందుకు వెళ్ళింది. ఇన్స్పెక్టర్ ను పంపి లోపలికి వచ్చిన క్రిష్ జ్వాల చేతిలో లెటర్ తీసుకుని చదివాక అతని భ్రుకుటి ముడిపడింది. “అయితే వాళ్ళ టార్గెట్ ఎవరు? ఎవరిచ్చారు నీకు?” అడిగాడు.
నర్స్ ఇచ్చింది అని చెప్పింది జ్వాల. ఇంతలో హెడ్ నర్స్ వచ్చింది.
“సిస్టర్, ఇది మీకు ఎవరిచ్చారు?” అడిగాడు క్రిష్.
“ఏమో తెలీదు సార్. ఒక వ్యక్తి మా బాయ్ కి ఇస్తే, మా బాయ్ తెచ్చి నాకిచ్చాడు. నేను నర్స్ కి ఇచ్చి మీకిమ్మన్నాను.” చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయింది నర్స్.
“స్ట్రేంజ్ , అతని టార్గెట్ నేను కాదా! అంటే ఎవర్నో ఒకరిని టార్గెట్ చేసినట్టేగా.
నేను కాదని తెలిసింది. ఇక మిగిలింది తాతయ్యేగా” అంది జ్వాల భయంగా చూస్తూ.
“అదేగా అప్పట్నుంచి నేను మొత్తుకునేది. అందుకే నిన్ను ఇండియా రమ్మన్నాను. తాతయ్య ప్రాణానికి ప్రమాదం వుందన్నది క్లియర్”
“థాంక్స్ క్రిష్, నువ్వు ఇండియాలో జరిగేవన్నీ నాతో షేర్ చేశావు. నా మాస్టర్స్ పూర్తయ్యేలోగా మా వాళ్ళని కనిపెట్టుకుని వున్నావు. నువ్వు అబ్జర్వ్ చేయకపోతే ఈ పాటికి మా ఇంట్లో పెద్ద విషాదాన్ని చూడాల్సొచ్చేది” క్రిష్ చేతిపై కృతజ్ఞతగా చేయివేసింది.
“నీడ్ నాట్ సే థాంక్స్ జ్వాలా. మన స్నేహం ఈనాటిది కాదు. నీకోసం ఆమాత్రం చేయలేనా?” అన్నాడు ఆమె చేతిని సున్నితంగా నొక్కుతూ.
“బై ది వే, తాతయ్యను ఎందుకు టార్గెట్ చేసినట్టు. ఆ ఓల్డ్ మాన్ ఏం చేశారు?
ఆయన ఈ మధ్యకాలంలో ఎవరితోనైనా గొడవపడ్డారేమో అడగాలి. ఇంతకీ తాతయ్య ఏరీ?” అంది.
“తాతయ్య వేరే రూమ్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. గొడవలు పడటం లాంటివి ఏమీ లేవు. ఇంకేదో బలమైన కారణం వుందేమో.ఈ విషయంలో మీ మదర్ ఏం చెప్తారో అడిగి చూడు” అన్నాడు క్రిష్.
“లేదులే, ఆవిడ వీటన్నిటికీ చాలా దూరం. ఆవిడ లోకం వేరు. నాగురించి కూడా అన్నీ తాతయ్యే చూసుకుంటారని నీకూ తెలుసుగా. అమ్మ చాలా సెన్సిటివ్. ఆవిడ హెల్త్ కూడా బాగాలేదు. ఇలాంటివి చెప్పకూడదు. ఏదోజరుగుతోంది క్రిష్ .అది మనం కనిపెట్టాలి” అంది విచారంగా.
“ఉష్, నువ్వేం ఆలోచించకుండా రెస్ట్ తీసుకో. అన్నీ ఇన్స్పెక్టర్ తో చెప్పాను. ఆయన చూసుకుంటారులే. ఎక్కువ ఆలోచించకు. టేక్ రెస్ట్.” అని చెప్పి క్రిష్ ఆమెను పడుకోబెట్టాడు. పడుకున్నాగాని
ఆమె ఆలోచనల నిండా ప్రశ్నలే. ఇన్స్పెక్టర్ చంద్ర ఘోష్ కి ఆ లెటర్ ఫోటో తీసి వాట్సప్ చేసింది. అది ఎవరు రాశారో పోల్చుకోవటానికి చేతి వ్రాత కాదు టైప్ చేసిన మేటర్. ఎవరు ఎందుకు రాశారో అర్థం కాలేదు. రెండు రోజులు గడిచాక జ్వాలను హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేసారు. విశ్వనాథ్ కూడా కోలుకున్నాడు. ఇద్దర్నీ ఇంటికి తీసుకొచ్చాడు క్రిష్.
ఇన్స్పెక్టర్ చంద్రఘోష్ ఇంటికి వచ్చి ఎలా వున్నారని పరామర్శించాడు. తాతయ్య, నేను ఇద్దరం బాగానే వున్నామని చెప్పింది జ్వాల.
“ మీకో విషయం చెప్పాలి. కంగారు పడకండి. ఈరోజు ముషీరా బాద్ హౌసింగ్ కాలనీ సమీపంలోని పార్క్ లో ఒక మర్డర్ జరిగింది. హతుడి వయసు దాదాపు అరవై ఏళ్ళు. ఆశ్చర్యం ఏంటంటే అతన్ని క్రికెట్ బాల్ తో తల వెనుక భాగంలో కొట్టారు . అతను పడిపోగానే పెద్ద రాయితో తలపై మోది మరీ చంపారు.అతను స్పాట్ డెడ్. ఇంకో విషయం ఏవిటంటే అతను అచ్చం మీ తాతగారి లానే వున్నారు.” అని చెప్పి ఆ చనిపోయిన వ్యక్తి ఫోటో చూపించాడు. ఆ ఫోటో చూసి జ్వాల ఆశ్చర్య పోయింది. అతనికీ తాతయ్యకీ ఎక్కడో పోలికలు వున్నట్టుగా అనిపించింది. ఆమాటే ఇన్స్పెక్టర్ తో అంది.
“మిస్ జ్వాలా! పోలికలొకటే కాదు. అతనిపై కూడా చాలా సార్లు ఇలాంటి మర్డర్ ఎటెంప్ట్స్ జరిగాయిట. వాళ్ళ కుటుంబ సభ్యులు వాటిని పెద్దగా పట్టించుకోలేదుట. చివరికి ఇలా తలకి క్రికెట్ బాల్ తగిలి చనిపోయాడు.”
“ఒకేలాంటి ప్రయత్నాలు చూస్తుంటే ఇదేదో వింతగా అనిపించడంలేదూ?! వయసు మళ్ళిన పెద్దవాళ్ళని టార్గెట్ చేస్తున్నదెవరు? అసలు వాళ్ళ మోటో ఏంటి అనేది తెలుసుకోవాలి.”అన్నాడు చంద్ర ఘోష్.
“అది ఉద్దేశ్య పూర్వకంగా చేస్తున్నారనడానికి ప్రూఫ్ ఏమైనా వుందా సార్?” జ్వాల ప్రశ్నకు చంద్రఘోష్ అడ్డంగా తలూపాడు. “నిజానికి ఏజ్డ్ పీపుల్ భద్రత విషయంలో మాదగ్గర ప్రత్యేకమైన మార్గదర్శకాలు గానీ, సెక్షన్స్ కానీ, ప్రత్యేక ప్రొటెక్షన్ సెల్ గానీ లేదు. మీ లాంటి వాళ్ళు ఇచ్చిన కంప్లైట్ బట్టి మా ఇన్వెస్టిగేషన్ వుంటుంది. ఈ మర్డర్ లో కూడా నాలుగైదు సార్లు ప్రయత్నించి విఫలమైనట్టు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు. అవి మర్డర్ అటెంప్ట్ అని వాళ్ళెవరూ అనుమానించనంత సహజంగా ప్రమాదాలు జరిగాయి. ఈసారి హంతకుడి గురి తప్పలేదు. సో పిటీ ఆన్ హిమ్” అన్నాడు.
“ఈజ్ ఇట్?” “ఏస్, వాళ్ళకి కూడా మీకు వచ్చినట్టే ఒక లెటర్ వచ్చిందిట. అదీ ప్రింటెడ్ మేటర్. సారీ. యూ ఆర్ నాట్ మై టార్గెట్ అని. అతన్ని ఎవరో వచ్చి ప్రమాదం నుంచి చాలాసార్లు తప్పించారు. ఎవరో కావాలనే చేస్తున్నారనడానికి ఇవి ఎవిడెన్సెస్.”
“అసలు రిటైర్ అయిపోయి, కృష్ణా రామా అనుకునే వయో వృద్ధులమీద పగపెంచుకునేవాళ్ళు కూడా వుంటారా? వాళ్ళెలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడలేరు కదా. మరెందుకు ఇలా వెంటాడి చంపాలని చూస్తున్నారు. దీనిమీద మీరు స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం వుంది సార్. టాస్క్ ఫోర్స్ పంపమని మీ పై ఆఫీసర్లకు రికమెండ్ ఎందుకు చేయకూడదు?” క్రిష్ మాటలకు చంద్ర ఘోష్ మొహం చిట్లించాడు.
“నగరాల్లో పౌరులను పీడిస్తున్న అనేక సమస్యలున్నాయి. మహిళా సమస్యలైతే ఇక చెప్పక్కర్లేదు. థౌజండ్స్ ఆఫ్ కేసేస్.అవన్నీ పక్కనపెట్టి ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్ సేఫ్టీపై దృష్టి పెట్టడం ఎంతవరకూ సాధ్యం?”
“ఎందుకుసార్? పెద్దవాళ్ళది ప్రాణం కాదా? వాళ్ళకి భద్రత కల్పించాల్సిన బాధ్యత మీది కదా?”
“ఏస్ ఆఫ్కోర్ మిస్ జ్వాలా, కేవలం వృద్ధుల్ని మాత్రమే చూసుకోవడం అసాధ్యం. కొన్ని కోట్ల మందిలో ఎంతమందికని ప్రొటెక్షన్ ఇస్తాం. ఇట్స్ ఇంపాజిబుల్. రాండం కేసెస్ నమోదవుతున్నాయి. చాలా లోతైన ఇన్వెస్టిగేషన్ జరిగితే తప్ప మనకేం అర్థం కాదు”
“పోనీ ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్ ని ఎలర్ట్ చేయండి.”
“నో వే…అలా చేస్తే పబ్లిక్ ప్యానిక్ అవుతారు. సిట్యువేషన్ కంట్రోల్ తప్పుతుంది. ఎవరో హంతకుడు వృధ్ధుల్ని చంపుతున్నాడని వదంతి వ్యాపిస్తే, వృద్ధుల రక్షణకు భంగం కలుగుతుంది. యూ థింక్ వన్స్, ఇక వాళ్ళ ప్రతి మరణానికి కారణం ఆ హంతకుడే అనే టాక్ వస్తుంది. నెక్స్ట్ మినిట్ లోనే పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్న వస్తుంది. వృద్ధుల రక్షణ ప్రమాదంలో పడుతుంది. పై ఆఫీసర్స్ అందుకు ఒప్పుకోరు. వాళ్ళకి కొన్ని ప్రూఫ్స్ చూపించాలి. అవి మనదగ్గర లేవు సో”
“సో, వాళ్ళ చావు వాళ్ళని చావమంటారా? మీరు మాత్రం ఏమీ చెయ్యరా?” క్రిష్ మాటలకు చంద్ర ఘోష్
సీరియస్ అయ్యాడు.
“సీ మిస్ జ్వాలా, మీ తాతగారు విశ్వనాథం గారు రైటర్స్ ఆర్మీ మేజర్ గా నాకు చిన్నప్పటినుంచి తెలుసు. మా నాన్నగారు కూడా మిలటరీలో పనిచేసేవారు. మేజర్ గా ఆయన చేసిన సాహసాలు వినాలని కుతూహల పడేవాడ్ని. అలా ఆయనతో నాకు పరిచయం వుండటం వల్ల ఈ కేస్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. ఇద్దరు కానిస్టేబుల్స్ ను కూడా ప్రొటెక్షన్ కోసం ఇచ్చాను.
ఇంతకు మించి చేయడం ప్రస్తుతానికి కుదరదు. ఇన్ఫాక్ట్ అవి మర్డర్స్ అని ప్రూవ్ అయితే తప్ప. మాకు ఇంతవరకూ కంప్లైట్ ఎవరూ ఇవ్వలేదు.సారీ. మీరు జాగ్రత్తగా ఉండండి” అనిచెప్పి
ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు .
గోపీ చంద్ వచ్చాడు. అతను డాక్టర్.
విశ్వనాథ్ కుటుంబానికి సన్నిహితుడు.
అతను కొన్ని కారణాలవల్ల ప్రాక్టీస్ మానేశాడు. అతను ఇంటికి వస్తూనే
“జ్వాలా, తాతగారికి ఏం కాలేదుగా?” అనడిగాడు. “ఏం కాలేదంకుల్. అయినా ఈ విషయం మీకెలా తెలిసింది?” అడిగింది జ్వాల.
“నిన్న హాస్పిటల్ లో తాతగార్ని చూశాను. చాలా వీక్ గా కనబడ్డారు. పలకరిద్దామనుకునేలోపు ఆయన వెళ్ళిపోయారు. నీ ముక్కుకి కట్టేంటి?” అడిగాడు గోపీచంద్. జరిగినదంతా చెప్పింది జ్వాల.
“ఓ మై గాడ్. తాతయ్యను టార్గెట్ చేస్తున్నారంటే ఆశ్చర్యంగా వుంది. నాకు తెలిసి ఈ వూళ్ళో హ్యూమన్ ఆర్గాన్స్ దొంగిలించే మాఫియా చాలా ఎక్కువగా వుంది. వృద్దుల్ని కొట్టి తీసికెళ్ళి వాళ్ళ శరీర భాగాలను దొంగిలించి అమ్ముకునే ముఠా తిరుగుతోందని విన్నాను. ఇది వాళ్ళ పనే అయ్యుంటుంది. లేకపోతే ఓల్డ్ పీపుల్ మీద పగా ప్రతీకారాలు ఎవరికుంటాయి చెప్పు” గోపీ చంద్ చెప్పిన విషయాన్ని విని ఉలిక్కి పడింది జ్వాల.
“మై గాడ్, ఈ డైరెక్షన్ లో నేను అసలు ఆలోచించలేదంకుల్. ఇక తాతయ్యను బయటకు వెళ్ళనివ్వను. డోంట్ గో ఎనీ వేర్ తాతయ్యా…ప్లీజ్.”
అప్పుడే పైనుంచి కిందకి వచ్చింది సౌదామిని. “మావయ్యకి ఏవైంది?” అని అడిగింది గాభరాగా .
“అమ్మా, నీకు దైవ భక్తి ఎక్కువ. ఆ దేవుడి గది విడిచి ఎప్పుడూ రావు. అందుకే నీకు కొన్ని విషయాలు తెలియవు. తాతయ్యకు ఏం కాలేదులే. నాకే ముక్కు పగిలింది చూడు” అంటూ
బాధగా మూలిగింది జ్వాల.
సర్వెంట్ ఆమెకు వేడి పాలు తీసుకొచ్చి ఇచ్చింది.
“జ్వాలా, నాదగ్గర ఏం దాచాలని చూడకు. తాతయ్యకు ఏం జరిగిందో చెప్పు” అంది.నిరాశ నింపుకున్న ఆమె కళ్ళు ఎప్పుడూ ఎండనే ఎండవు. విషాదాన్ని దాచిన పెదవులు నవ్వనే నవ్వవు. సౌదామిని భర్త పోయిన దగ్గర్నుంచీ బాధగా బతికీడుస్తోంది మామగారి అండతో కూతుర్ని పెంచి పెద్దచేసింది. మరో పెళ్లి చేసుకోమని ఎంతోమంది చెప్పారు. కానీ ఆమె ఎవరిమాటా వినలేదు. పుట్టింటికి వచ్చేయమని కన్నవాళ్ళు ఎన్నోసార్లు పిలిచినా, ఆమె మామగారిని ఒంటరిగా వదిలి వెళ్ళలేదు. కాషాయ బట్టలు కట్టుకుని దైవ ధ్యానంలో ఎక్కువసేపు గడుపుతూ వుంటుంది. మానసిక సాంత్వనకు భక్తి మార్గాన్ని ఎంచుకుంది.
“విశ్వనాథ్ గారిపై ఎవరో ఎటాక్ చేసారు. ముర్డర్ ఎటెంప్ట్ లాంటిది” చెప్పేశాడు గోపీ చంద్. ఆమె చేతిలోని జపమాల జారి టప్పున నేలమీద పడింది. ఆమె ఒళ్ళు చిన్నగా కంపించింది. తనలో తనే కుములుతూ ఏడవటాన్ని అక్కడున్న అందరూ చూసారు.
“హయ్యో అంకుల్, మమ్మీతో ఎందుకు చెప్పారు. షి ఈజ్ సో వీక్. తట్టుకోలేదు” అంది జ్వాల.
“ఓహ్ ఐ యాం సారీ, టంగ్ స్లిప్ అయింది. మీరేం కంగారు పడకండి. మేమంతా వున్నాంగా. జాగ్రత్తగా చూసుకుంటాం.” గోపీచంద్ ఆమెను ఓదార్చే ఉద్దేశ్యంతో. కానీ అతని
వైపు నిరసనగా చూసింది సౌదామిని.
అతను వెంటనే తలదించుకోవడం జ్వాల చూపుల్ని దాటిపోలేదు.
సౌదామిని మెట్లెక్కి పైనున్న తనగదిలోకి వెళ్ళిపోయింది. “ఏదైనా అవసరం వుంటే వెంటనే నాకు ఫోన్ చేయండి. డోంట్ హేజిటేట్” అని చెప్పి గోపీ చంద్ వెళ్ళిపోయాడు. “క్రిష్ , నువ్వు కూడా ఇంటికెళ్ళు. ఐ యాం ఓకే”అంది జ్వాల.
“సరే జ్వాలా, ఏదన్నా అవసరం వుంటే ఫోన్ చెయ్యి. తాతయ్యను జాగ్రత్తగా చూసుకోమని సర్వెంట్స్ తో చెప్పు. మళ్ళీ రేపొస్తాను . బై” చెప్పి క్రిష్ వెళ్ళిపోయాడు.
జ్వాల ఆలోచనలో పడింది. మెల్లగా లేచి
ఆలోచిస్తూ అటూ ఇటూ తిరిగింది. ఈ ఇంట్లో రోజూ ఏం జరుగుతోంది? మామ్ నోటీస్ కి వచ్చిన విషయాల గురించి అడిగితే కొంత క్లూ దొరకొచ్చు. అనుకుని లిఫ్ట్ లో మూడో అంతస్తులో వున్న తల్లి రూమ్ కి వెళ్ళింది జ్వాల. ఆమె గదిలో కనపడలేదు. ఖచ్చితంగా దేవుడి గదిలోనే ఉంటుంది అని అటువైపు నడిచింది. దేవుడి గది తలుపులు తెరిచే ఉన్నాయి .అక్కడ లేదు. బాల్కనీ లోకి వెళ్లి చూసింది అక్కడ లేకపోవడంతో హాల్లోకి వచ్చింది. అక్కడ సోఫాలో అటు తిరిగి కూర్చున్న తల్లి కనబడింది. ఆమె దగ్గరికి వెళ్లేసరికి ఏవో మాటలు వినిపించాయి.
“నేను చెప్పింది చేయకుండా ఎందుకొచ్చారూ? నాక్కావాల్సింది చేయకపోతే మీ మొహం కూడా నాకు చూపించద్దని చెప్పానుగా.ఈరోజు ఏదో వంకపెట్టుకుని వచ్చారు. మరోసారి ఉత్తిచేతులతో వస్తే ఊరుకోను. మీ మాట వినను”అని ఫోన్ ఆపేసి సోఫాలో పడేసి కళ్ళుమూసుకుంది సౌదామినీ.
ఆమాటలు విన్న జ్వాలను మతి పోయినట్టైంది. మమ్మీ ఎవరితో మాట్లాడుతోంది. ఈరోజు ఇంటికి వచ్చింది గోపీ చంద్ అంకుల్ కదా. అంటే అమ్మ, అంకుల్ ఫోన్ లో మాట్లాడుకుంటారా? అతను ఉత్తి చేతులతో వచ్చాడా? అమ్మకి అసలు ఏం కావాలి? ఆలోచిస్తూ
తల్లి తనను చూడకుండా వెనక్కి వెళ్లి డోర్ నాక్ చేసి “మమ్మీ, లోపలికి రావచ్చా?” అనడిగింది. సౌదామిని చీర కొంగుతో కళ్ళు తుడుచుకుని “రా బేబీ” అంది. జ్వాల వెళ్లి సోఫాలో తల్లి పక్కన కూర్చుంది. “కుట్లు నొప్పిగా ఉన్నాయా?” అని ఆమె బుగ్గలు పట్టుకుని నిమురుతూ అడిగింది సౌదామిని. “ఐ యామ్ ఓకే మామ్. నీ ఒళ్ళో పడుకుంటే అన్నీ తగ్గిపోతాయి” అంది.
“రామ్మా” అని ఒళ్ళో పడుకోబెట్టుకుంది.
కొద్దిసేపు పడుకున్నాక లేచి కూర్చుని
“మామ్, ఎప్పుడన్నా మీకు బెదిరింపు లేఖలు వచ్చాయా? గ్రాండ్ పా ఎవరితోనైనా గొడవపడ్డారా? ఏదైనా ముఖ్యమైన విషయాలు నీ దృష్టికి వచ్చినవి వుంటే చెప్పు” అంది తల్లి మొహంలోకి చూస్తూ. సౌదామిని ఒక్క నిమిషం ఆలోచించి “అలాంటివేం లేవు. మేము బాగానే ఉంటున్నాం. తాతయ్య పెన్షన్ తీసుకోడానికి కార్ లోనే వెళతారు.
మన ఎస్టేట్ పనులు మ్యానేజర్ చూస్తారు. అంతా నార్మల్ గానే వుంది”ఆమె చెప్పిన సమాధానం తృప్తిగా అనిపించినా, ఎక్కడో ఏదో జరుగుతోంది అనే భావన జ్వాలనే విడిచిపెట్టలేదు. తల్లితో కాసేపు మాట్లాడింది. సౌదామిని జ్వాల లండన్ లో చేరబోయే ఉద్యోగం గురించి అడిగి తెలుసుకుంది. చదువు పూర్తికాగానే ఉద్యోగం వచ్చినందుకు సంతోషంగా ఉందని, నీ భవిష్యత్తుని అందంగా మలుచుకోమని చెప్పింది.
దేవుడికి హారతి ఇవ్వాల్సిన సమయం అయిందని లేవబోయింది .ఇంతలో కింద నుంచి ఏవో అరుపులు వినిపించాయి. ఇద్దరూ గబగబా కిందకి వెళ్లి చూసారు. “మేడం, తాత గారికి గీజర్ షాక్ కొట్టింది. తాతగారు ఒక్కసారిగా కిందపడిపోయారు. లేపి మంచం మీద పడుకోబెట్టాను. కొద్దిగా షాక్ లో వున్నారు మేడం” అంది నొరాతొ కంగారుగా ఆమె చెప్పిన మాటకు అదిరిపడింది జ్వాల.
తాతయ్య గదిలోకి పరిగెత్తింది. విశ్వనాథ టవల్ కట్టుకునే మంచం మీద పడుకుని ఉన్నాడు. “ఏమైంది తాతయ్యాి?” అంటూ దగ్గరికి వెళ్ళింది. “ఏమోనమ్మా! స్నానం చేద్దామని గీజర్ వేసుకుని షవర్ ఆన్ చేశాను. అంతే ఒక్కసారిగా విసిరేసినట్టుగా దూరంగా వచ్చి పడ్డాను ఏమైందో నాకే తెలియట్లేదు” అన్నాడు. అతను శరీరం కొద్దిగా వణుకుతోంది. జ్వాల అతనికి దుప్పటి కప్పి ఎలక్ట్రీషియన్ కి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పింది. ఫ్యామిలీ డాక్టర్ని కూడా రమ్మని ఫోన్ చేసింది. ఫోన్ చేసిన పది నిమిషాలకి డాక్టర్ వచ్చాడు. విశ్వనాథ్ ను పరీక్ష చేసి ఆయన షాక్ లో ఉన్నారు కొంచెం తాగటానికి ఏదైనా ఇవ్వండి. అన్నాడు. సర్వెంట్ నొరాతి వేడి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది .అంతలో ఎలక్ట్రిషియన్ వచ్చాడు .
“ఏవైంది మేడం?” అని అడిగాడు.” “కొత్తగా కొన్న గిజరే కానీ ఎందుకో తాతయ్య గారికి షాక్ కొట్టింది” అని చెప్పింది నొరాతి.
అతను చెప్పులు వేసుకుని వెళ్లి అంతా చెక్ చేశాడు. మెయిన్ ఆపి వచ్చి గీజర్ ని ఓపెన్ చేసి చూశాడు “ఇందులో వైర్లు బయటకు వచ్చాయి మేడం. కొత్త గీజర్ అంటున్నారు కదా. ఇలాంటి కంప్లైంట్ రాకూడదు. కంపెనీ వాళ్ళకి కాల్ చేసి విషయం చెప్పి కొత్త గీజర్ ఇవ్వమనండి మేడం” అన్నాడు.
“పది రోజులుగా వాడుతున్నా షాక్ కొట్టకుండా ఈరోజు ఎందుకు కొట్టింది? ఎనీ స్పెసిఫిక్ రీజన్? అసలు ఆ వైర్స్ వాటంతటవే ఎలా బయటకి వస్తాయి?”
“బయటనుంచి గీజర్ లోకి వాటర్ తీసుకెళ్లే ట్యూబ్స్ ఎవరో బలంగా కదపడంవల్ల లోపలున్న వైర్లు కూడా కదిలి ట్యాంక్ లో వాటర్ కి టచ్ అయింది. ఇప్పుడు కనెక్షన్ తప్పించాను. మీరు షోరూమ్ కి కంప్లైంట్ ఇవ్వండి మేడం” అని చెప్పాడు.
గీజర్ వైర్లు ఎవరు కదుపుతారు. ఇంట్లో ఉన్న నలుగురు సర్వెంట్ మెయిడ్స్ ని పిలిచి అడిగింది. “మాకేం తెలీదు మేడం రోజు లాగానే స్విచ్ ఆన్ చేశాం. సార్ లోపలికి వెళ్లారు. గట్టిగా అరిచేసరికి మేం పరిగెత్తుకు వచ్చాం” అని భయపడుతూ చెప్పారు. వాళ్ల ఉద్యోగం పోతుందని వాళ్ళ కంగారు.
వాళ్ళు నిజమే చెబుతూ వుండొచ్చు. కానీ తాతయ్యకు ఇలా ఎందుకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి? గోపీ చంద్ అంకుల్ ఈ కుటుంబానికి శ్రేయోభిలాషేనా? అని మొదటిసారిగా జ్వాలలో అనుమానం మొదలైంది.