నోటివరకూ అందిన కూడుని ఎవరో లాగేసుకున్నట్టు అయింది ప్రసాద్ కి.
గత అయిదారేళ్ళుగా నిరుద్యోగిగా బ్రతుకు సాగిస్తూన్న అతనికి ఈసారి ఉద్యోగం వచ్చేదే. కానీ అతనికంటే తక్కువ మార్కులు పొందిన ఒక అభ్యర్ధి వికలాంగుడు కావడం చేత ప్రసాద్ కి రావలసిన ఉద్యోగం వికలాంగుల రిజర్వేషన్ కోటాలో అతనికి పోయింది.
దొరక్క దొరక్క దొరికిన ఒక్క ఛాన్సూ పోవడం చేత కసితీరా ప్రభుత్వాన్నీ, వికలాంగుల్నీ మనసులోనే తిట్టుకుంటూ రోడ్డు పక్కన నిలబడి ఉన్నాడు.
“సార్” అని దీనంగా వినిపించిన వైపు చూసాడు. ఒక కుంటివాడు కుడివైపు చంకలో కర్ర ఆసరాతో నిలబడి ఉన్నాడు.
“ఒంట్లో బాగోలేదు. కాస్త రోడ్డు దాటిస్తారా?” అని ప్రాధేయపడ్డాడు.
అసలే వికలాంగులంటే తగని అసహ్యం, దానికి తోడు ఒక వికలాంగుని కారణంగానే ఈ రోజు అతనికి రావాల్సిన ఉద్యోగం పోయింది. దాంతో “పోవయ్యా” అని కోపంగా కసురుకున్నాడు. అక్కడే నిలబడితే మళ్ళీ అడుగుతాడనుకున్నాడో ఏమో అక్కడినుంచి గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అలా నడిచి నడిచి ఒక సినిమా థియేటర్ ముందు ఆగాడు.
గంటసేపు క్యూలో కుస్తీ పట్టిన తర్వాత కౌంటర్ దగ్గరికొచ్చాకా పర్సు కోసం జేబులో చెయ్యి పెట్టి ఒక్కసారే “మై గాడ్” అనుకున్నాడు ఆశ్చర్యంగా.
జేబులో పర్సు లేదు. ఎవడో పిక్ పాకెట్ గాడు కొట్టేసి ఉంటాడు. ఆ పర్సులో తప్ప అతని దగ్గర చిల్లిగవ్వకూడా లేదు మరి.
“ఏమయ్యా. టిక్కెట్ నువ్వు తీసుకుంటావా? మమ్మల్ని తీసుకోమంటావా?” వెనకాల క్యూలోంచి జనం అసహనంగా కేకలు వేయడంతో ప్రసాద్ క్యూలోంచి బయటపడి రోడ్డు మీదికొచ్చాడు.
ప్రసాద్ కో పెద్ద సమస్య ఏర్పడిందిప్పుడు. ఇల్లు ముప్పయి కిలోమీటర్ల దూరంలో ఉంది. సిటీ బస్ లో వెళ్ళాలన్నా కనీసం అయిదు రూపాయిలు అవుతుంది. తన దగ్గర కట్టుకున్న బట్టలు, పాత చెప్పులు తప్ప మరే ఇతర వస్తువులూ లేవు. దగ్గర్లో ఎవరూ తెలిసిన వాళ్ళయినా లేరు.
దారిన పోయే ఏ స్కూటరిస్ట్ నయినా మరో వెహికిలిస్ట్ నయినా లిఫ్ట్ అడుగుదామనుకున్నాడు. కానీ ఈ మహానగరంలో పక్కవాడి కష్టాన్ని అర్ధం చేసుకునేపాటి తీరిక ఎవరికుంటుంది? ఎవరి గొడవ వారిది. ఎవరి లోకం వారిది.
ఎంత ఆలోచించినా ఇంటికి ఎలా చేరుకోవాలన్నది తోచలేదు ప్రసాద్ కి. మహారణ్యం మధ్యలో దారితప్పి చిక్కుబడిపోయి దిక్కు తోచనివాడిలా అయిపోయాడు.
యథాలాపంగా తలతిప్పి చూసిన ప్రసాద్ కి దూరంనుంచి ఒక అవిటివాడు చక్రాలబండి మీద కూర్చుని వస్తూ కనిపించాడు. నిజానికి అతను అవిటివాడు కాదు. కాళ్ళూ, చేతులూ ఒక్కొక్కటీ ఆరేసి అంగుళాలు మాత్రమే ఉన్నాయి.
ప్రసాద్ అతన్ని గుర్తు పట్టగలిగాడు. ఒక పబ్లిక్ టెలీఫోన్ బూత్ లో పని చేస్తాడతను. అతన్ని చూడగానే ప్రసాద్ మెదడులో ఫ్లాష్ లా వెలిగింది ఓ ఐడియా.
ఆ నగరంలో ఉద్యోగస్థులైన వికలాంగుల కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక సదుపాయం కల్పించింది. వారు తమ నివాసం నుంచి యాభై కిలోమీటర్ల పరిధిలో ఎక్కడికైనా బస్ లో టికెట్ లేకుండా ప్రయాణం చేయొచ్చు. అంతే కాదు. తమకు తోడుగా మరొక వ్యక్తిని కూడా వాళ్ళు తీసుకువెళ్ళొచ్చు. వీల్ ఛెయిర్ లో ఉన్న వికలాంగుల కోసం బస్సులకి మరో ఎంట్రెన్స్ ఏర్పాటు చేయబడి ఎస్కలేటర్స్ కూడా అమర్చబడ్డాయి. పబ్లిక్ టెలిఫోన్ బూత్ లలో పని చేసే వారికి కూడా ఈ ప్రత్యేక సదుపాయం వర్తిస్తుంది.
ప్రసాద్ అతన్ని ఆపి తన కష్టాన్ని అతనితో చెప్పుకున్నాడు. ఒక అవిటివాడి సహాయాన్ని అర్ధించేందుకు ఇప్పుడతను నామోషీ చెందలేదు. అవసరం అలాంటిది మరి.
ఆ వికలాంగుడు ప్రసాద్ బాధని అర్ధం చేసుకున్నాడు. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న ప్రసాద్ పైన ఆ వికలాంగునికి జాలి ఏర్పడి “సరే పద” అన్నాడు.
బస్ స్టాప్ కి చేరుకుని ప్రసాద్ ఎక్కవలసిన బస్ రాగానే ఇద్దరూ ఆ బస్ ఎక్కారు.
‘ఒక వికలాంగునికి తోడుగా ఒక వ్యక్తి ప్రయాణించవచ్చు’ అనేది ప్రభుత్వం కల్పించిన సదుపాయం అయితే ఇక్కడ అందుకు వ్యతిరేకంగా అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న వ్యక్తికి సహాయంగా ఒక వికలాంగుడు ప్రయాణం చెయ్యాల్సిన అవసరం ఏర్పడిందని ఆ బస్ లో ఉన్న వారికెవ్వరికీ తెలీదు.
“ఏమిటి నీ పేరు?” అడిగాడు ప్రసాద్.
“దేవుడు. నీ పేరు?”
“నా పేరు ప్రసాద్”
“ఏం చేస్తావు?” అని అడిగాడు దేవుడు.
“ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాను” అని చెప్పాడు ప్రసాద్.
ఆ మాటకి దేవుడు ఎంతో ఆశ్చర్యపడినట్టు చూసాదు. ఖాళీగా ఉండడం అనేది నేరాల్లోకెల్లా పెద్ద నేరం అన్న సంగతి ఈ పెద్దమనిషికింకా తెలీనే తెలీదా? అన్న భావం ఆ చూపులో దాగుందని ప్రసాద్ గ్రహించలేకపోయాడు.
“మరి భోజనం వగైరా?” అని అడిగాడు దేవుడు.
“నా తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నాను” అని చెప్పాడు ప్రసాద్.
దేవుడు మనసులోనే నవ్వుకున్నాడు.
“నీ చక్రాలబండి చాలా బాగుంది” అన్నాడు ప్రసాదు.
“ఒక మహానుభావుడు దీన్ని నాకు ప్రెజెంట్ చేసాడు” అన్నాడు దేవుడు.
ఇంతలో ప్రసాద్ దిగవలసిన స్టాప్ వచ్చింది. ఇద్దరూ బస్ దిగారు.
“నువ్వు చేసిన సహాయం మరువలేనిది. చాలా థేంక్స్” కృతజ్ఞతగా అన్నాడు ప్రసాద్.
“దానిదేముంది? ఒక మనిషి మరో మనిషికి అవసర సమయాల్లో సహాయపడడమనేది మనిషికుండాల్సిన కనీస బాధ్యత. ఈ ప్రపంచంలో ఒకరి అవసరం మరొకరికి ఎప్పుడూ ఉంటుంది. కానీ ఆ సంగతి నువ్వు మరిచిపోయావు. పొద్దున్న ఒక కుంటివాడిని రోడ్డు దాటించడానికి నిరాకరించావు. కేవలం అతనొక వికలాంగుడైన కారణంగానే నువ్వతన్ని అసహ్యించుకున్నావు. ఇప్పుడు నీ అవసరానికి మరో వికలాంగుడే నిన్ను ఆదుకోవాల్సి వచ్చింది.
“శారీరకమైన వైకల్యం జాలిపడదగ్గది అయితే మానసికమైన వైకల్యం క్షమించరానిది. వికలాంగుణ్ణి చూసి జాలిపడి సానుభూతి చూపాల్సింది పోయి పైగా అసహ్యించుకున్నావంటే, నీవు అంతకంటే ఎక్కువగా అసహ్యించుకోదగ్గ మానసిక వికలాంగుడివన్నమాట” ఆవేశంగా అన్నాడు దేవుడు.
ఆ మాటలు విని ప్రసాద్ ఆశ్చర్యపోయాడు. “అంటే... నువ్వు?” అని అడిగాడు సంభ్రమంగా.
“అవును. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. నువ్వు నిరాకరించి వెళ్ళిపోయాకా ఆ కుంటివాణ్ణి నేనే రోడ్డు దాటించాను” అన్నాడు దేవుడు.
దేవుడిప్పుడు ఒక అవిటివాడిలాగా కనిపించడం లేదు ప్రసాద్ కళ్ళకి. మానవత్వం మూర్తీభవించిన సంఘసంస్కర్తలా కనిపిస్తున్నాడు. పొద్దున్న తన ప్రవర్తనని కళ్ళారా చూసి కూడా తనకిప్పుడు సహాయం చేసాడూ అంటే నిజంగా దేవుడు చాలా గొప్పవాడు అనుకున్నాడు మనసులోనే.
“క్షమించు దేవుడూ, నేనలా ప్రవర్తించింది అసహ్యంతో కాదు. ప్రభుత్వం అసమర్ధత వల్ల నిరుద్యోగం ప్రబలిపోయి బ్రతుకు తెరువు గగనమైపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాక రాక వచ్చిన ఉద్యోగం చేజారిపోయిందన్న ఉక్రోషం నా చేత అలా చేయించింది” అన్నాడు.
ఆ మాటకి దేవుడు విరగబడి నవ్వాదు. “బ్రతుకు తెరువు గగనమైపోతోందా?” అని హేళనగా అడిగి మరింత గట్టిగా నవ్వాడు. అతి కష్టం మీద నవ్వుని ఒక్క క్షణం ఆపుచేసి “చేతకాని వాళ్ళంతా చేసే మొదటి పని ప్రభుత్వాన్ని తూలనాడడం” అన్నాడు. అని మళ్ళీ నవ్వసాగాదు.
ప్రసాద్ కి కోపం వచ్చింది. “ఎందుకలా ఊరికే నవ్వుతావు? నిరుద్యోగుల బాధలు నీకేం తెలుసని? నీకేం? చక్కగా ఎవరో ధర్మం చేసిన చక్రాల బండిమీద కూర్చుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సదుపాయంతో బస్ లో ఫ్రీగా తిరుగుతూ, ఎవరో పడేసే ఇంత ముద్దతో నీ కాలాన్ని నువ్వు సుఖంగానే వెళ్ళబుచ్చేస్తున్నావు. ఇక మా బాధలేం తెలుస్తాయి నీకు?” అన్నాడు.
ఆ మాటతో దేవుడి ముఖంపై నవ్వు మాయమైపోయింది. “షటప్” అని అరిచాడు కోపంగా.
ప్రసాద్ ఆ అరుపుకి విస్తుపోయి చూసాడు. “చూడు మిస్టర్, నీకు మైనారిటీ తీరి అయిదారేళ్ళు కావస్తున్నా ఇప్పటికీ నువ్వు నీ తల్లిదండ్రులమీదే ఆధారపడి బతుకుతున్నావు. నేను ఆ విధంగా కూడా ఇంతవరకూ ఎవ్వరి మీదా ఆధారపడలేదు. ఒకరి దయాధర్మాలతో బతకాల్సిన దుస్థితి నాకెప్పుడూ రాలేదు, రానివ్వను” స్థిరంగా అన్నాడు దేవుడు.
ఆ సమయంలో దేవుడి కళ్ళలో కనిపించిన వింత కాంతి, తేజస్సు అతని పట్టుదలనూ, దీక్షనూ సూచిస్తూంటే ప్రసాద్ అతన్నే చూస్తుండిపోయాదు.
“అయినా ప్రపంచం మొత్తం మీద బాధలు నీ ఒక్కడికే ఉన్నట్టు మాట్లాడతావేం? బాధలూ, కన్నీళ్ళూ అందరికీ ఉండేవే. ఆత్మవిశ్వాసాన్ని ఊపిరిగా చేసుకుని పట్టుదలతో కృషి చేసి, బాధల్నీ, కన్నీళ్ళనీ దూరంగా తరిమికొట్టే వాళ్ళు కొందరైతే, లేని బాధలు ఊహించుకుని పాతాళంలోకి క్రుంగిపోతూ ఊరికే బాధపడిపోయే వాళ్ళు మరి కొందరు.
“నాకు చూడు. కాళ్ళూ, చేతులూ ఒక్కొక్కటీ ఆరేసి అంగుళాలే. పుట్టేటప్పుడు నేనూ అందరిలాగే పుట్టినా, చిన్నతనంలో ఏదో వ్యాధి సోకి నా కాళ్ళూ చేతులు అలా అయిపోయాయి. అయినా అందుకు నేనెప్పుడూ బాధపడలేదు. నిరాశా, నిస్పృహల్ని అసలు దగ్గరికే రానివ్వలేదు. నిజానికి బాధపడేందుకు నాకసలు తీరికే లేదు.
“ఆ బోర్డ్ చూడు. పెయింటింగ్ వర్క్, అక్షరాల డిజైన్ బాగున్నాయా?” అని అడిగాడు దేవుడు దగ్గర్లో ఉన్న ఒక బోర్డ్ ని చూపిస్తూ.
“చాలా ఆర్టిస్టిక్ గా ఉన్నాయి” అన్నాడు ప్రసాద్.
“అంత పెద్ద బోర్డ్ ని పెయింట్ చేసిందీ, ఆ అక్షరాలను డిజైన్ చేసిందీ వైకల్యానికి గురి అయిన ఈ చిన్ని చిన్ని చేతులే అంటే నమ్మగలవా నువ్వు?” అని అడిగాడు దేవుడు.
ప్రసాద్ కళ్ళల్లో విస్మయం కొట్టొచ్చినట్టు కనిపించింది.
“అదొక్కటే కాదు. ఈ సిటీ మొత్తంలో నాలుగో వంతు బోర్డులు నేను రాసినవే. వికలాంగుల శిక్షణా శిబిరంలో చేరి నేను నేర్చుకున్న పనుల్లో ఇది ఒకటి మాత్రమే. నేనీ టెలిఫోన్ బూత్ లో పని చేస్తుండగా నువ్వు నన్ను చాలాసార్లు చూసావు. ఇవి కాకుండా రోజూ ఉదయాన్నే పిల్లలకు ట్యూషన్ చెపుతుంటాను. నా ఈ ఆరేసి అంగుళాల కాళ్ళూ, చేతులూ అనుకూలించే ఏ పని అయినా నేను చేస్తుంటాను.
“ఇకపోతే ఈ చక్రాలబండి ఎవరో ధర్మం చేస్తే వచ్చిందని అన్నావు. నేను నీకు ముందే చెప్పాను. ఒక మహానుభావుడు దాన్ని నాకు ప్రెజెంట్ చేసాడని. మనం దేహీ అని అడిగినప్పుడే అది ధర్మం అవుతుంది. కానీ దీన్ని నా చురుకుతనం, కార్యదీక్షకి మెచ్చుకుని ప్రెజెంట్ చేసాడాయన. ఫ్రీ బస్ సర్వీస్ గురించి కూడా ఏదో అన్నావు. నీకు మరో షాకింగ్ న్యూస్ చెప్పనా?” అని అడిగాడు దేవుడు.
“ఏమిటది?” అని అడిగాడు ప్రసాద్.
“వికలాంగులనందరినీ సంఘటిత పరచి ఒక సంఘంగా ఏర్పాటు చేసి ప్రభుత్వంతో పోరాడి ఆ ఫ్రీ బస్ ట్రావెలింగ్ సదుపాయాన్ని కలుగజేసింది నేనే. పట్టుదల, కృషి ఉండాలే కానీ ఏ అంగవైకల్యమూ అభివృద్ధికి ఆటంకం కాదని నిరూపించగలిగాను” అన్నాడు దేవుడు.
ప్రసాద్ ఊపిరి సలపనంత దిగ్భ్రాంతికి లోనయ్యాడు. తాను రోజూ అతి చులకన భావంతో చూస్తూ తక్కువ అంచనా వేసింది ఈ మహామహుడినా? అనుకున్నాడు. ఒక విచిత్ర వ్యక్తినీ, అద్భుత మానవుడినీ చూస్తున్నట్టు అనుభూతి చెందాడు.
“మరి వస్తాను మిత్రమా. ఇక సెలవు” అంటూ చివరగా ఒక చిరునవ్వు నవ్వేసి చక్రాలబండి నడుపుకుంటూ వెళ్ళిపోతూన్న దేవుడివైపే రెప్పవేయకుండా చూస్తుండిపోయాడు ప్రసాద్.
ఒక సందేహం కలిగిందతనికి. తాను గత ఐదారేళ్ళుగా కనీసం ఒక్కసారైనా అంత మనస్ఫూర్తిగా, అంత హాయిగా, అంత మధురంగా నవ్వగలిగాడా? అని!
- సమాప్తం -