బ్రేక్ ది సైలెన్స్
ధేమ్స్ నదిమీద కట్టిన లండన్ బ్రిడ్జి పర్యాటకులతో సందడిగా వుంది. ముసురుతున్న చీకట్లను తరిమేస్తూ విద్యుద్దీపాలు వెలిగాయి. సీతాకోక చిలుకల్లా హుషారుగా తిరుగుతున్న యువతీ యువకులకు ఆ ప్రాంతం మరో స్వర్గాన్ని తలపిస్తోంది . శీతల గాలులు ఎక్కువగా వీస్తుండటంతో ట్రెంచ్ కోట్ వేసుకుంది జ్వాల.
నిక్కీ వైన్ క్యాన్ చేత్తో పట్టుకుని హుషారుగా డ్యాన్స్ చేస్తోంది. చిల్లింగ్ మూడ్ లో ఆమె ఊగుతున్న తీరుని తమాషాగా చూస్తూ నిలబడ్డాడు వివేక్. “మేరి మెహబూబ్ ఖయామత్ హోగీ … సాంగ్ హమ్ చేస్తూ చిటికెలేస్తోంది స్రవంతి. చేతిలో మైక్ వున్నట్టుగా వూగుతూ పెద్దగా పాడుతోంది నిక్కీ. కింగ్స్ యూనివర్సిటీ ఆఫ్ లండన్ స్టూడెంట్స్, వాళ్ళ మాస్టర్స్ డిగ్రీ పూర్తయిన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి అక్కడికి వచ్చారు. నిక్కీ బాయ్ ఫ్రెండ్ చేతిలోంచి బాటిల్ లాక్కుని తాగేసింది.
“ఇందాకటినుంచి చూస్తున్నాను. ఎందుకలా గోల చేస్తారు. ఇక్కడికి వచ్చింది నేచర్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుందాం అని కదా. బట్ మీరంతా ఇలా బ్యాలెన్స్ తప్పుతున్నారేంటి? మీ ఇష్టం వచ్చినట్టు వుండండి. ఐ యాం గోయింగ్” అని అలిగినట్టుగా మొహం పెట్టి వెళ్ళిపోయేందుకు వెనక్కి తిరిగింది జ్వాల. “నో బేబీ నో. ఇక తాగం. అందరం కలిసి మాట్లాడుకుందాం.” అని జ్వాలను వెళ్లకుండా ఆపింది స్రవంతి.
“మనం ఇక్కడికి వచ్చినప్పుడు అందరం ఒంటరివాళ్ళం. ఎన్నో కష్టాలు పడ్డాం. పస్తులున్నాం. ఒకే రూమ్ షేర్ చేసుకున్నాం. పార్ట్ టైం జాబ్స్ కి కూడా ఎంత ట్రబుల్ ఫేస్ చేసామో గుర్తు తెచ్చుకుంటే ఏడుపొస్తోంది. పేరెంట్స్ సంతోషంగా ఉండాలని మన ట్రబుల్స్ వాళ్లతో చెప్పకుండా ఎన్నాళ్ళు సఫర్ అయ్యాయో కదా. ఒకపక్క పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ, యూనివర్శిటీకి నడిచివెళ్లి చదువుకుంటూ, కుక్ చేసుకుంటూ , డిషెస్ తోముకుంటూ, ఓ మై గాడ్. హెల్.ఇప్పుడు ఆ కష్టాలన్నీ తీరిపోయాయ్. మాస్టర్స్ పూర్తయిపోయింది. జాబ్స్ వచ్చేసాయి. ఇంతకంటే ఆనందం ఏముంటుంది. హుర్రే…వియార్ ద విన్నర్స్. డోంట్ స్టాప్ డ్యాన్సింగ్. నాన్ స్టాప్ చిల్లింగ్.” అంటూ గట్టిగా అరిచింది నిక్కీ.అక్కడికి వచ్చినవాళ్ళు ఆమె అరుస్తుంటే చూసి నవ్వుకుంటూ వెళుతున్నారు.
నిక్కీ బాయ్ ఫ్రెండ్ వివేక్ ఆమె చేష్టలకి నవ్వుకున్నాడు. ఆమె ఎంత కష్టపడిందో అతను చూశాడు. చాలాకాలం తర్వాత ఆమె అంత సంతోషంగా వుండటాన్ని చూసి అతను కూడా ఎంజాయ్ చేశాడు.
ఇండియాలో తల్లిదండ్రుల చాటున ఆనందంగా పెరిగి, విదేశాలకు చదువుకోసం వెళ్ళిన ఆడపిల్లల మానసిక స్థితి అత్యంత సున్నితంగా వుంటుంది. అందరూ అనుకున్నట్టు విచ్చలవిడితనం, వెర్రి పోకడలు పోతారనే నానుడికి భిన్నంగా వాళ్ళందరూ భయాన్ని మోస్తూ, ఒంటరితనాన్ని భరిస్తూ చాలా కష్టపడి చదువుకుని ఉద్యోగాలు దక్కించున్నారు.
“వియ్ ఆర్ గ్రేట్! హహ ”స్రవంతి నిషాగా కళ్ళు మూసి తెరుస్తూ అరిచింది.
“షట్ అప్ గర్ల్ . తాగేది బ్రీజర్. యాపిల్ జ్యూస్ కన్నా నీళ్లలా వున్న డ్రింక్ అంత నిషా ఇస్తోందా? థిక్ వైన్ తాగిన్నట్టు బిల్డప్ ఇవ్వకు. లెట్స్ గో టు రూమ్. రేపు నేను ఇండియా వెళ్ళాలి. ఇంకా ప్యాకింగ్ పని కాలేదు. మీరంతా నాకు హెల్ప్ చేసేందుకు వస్తారా రారా” అంది ఆఖరి వార్నింగ్ ఇస్తున్నట్టుగా.
“వస్తాం బేబీ. నువ్వు గోల్డెన్ స్పూన్ తో పుట్టావు. ఇండియాలో కోటీశ్వరుల ఇంట్లో పుట్టిన ఏకైక కూతురివి. కానీ డ్రింక్ చేయవు. పబ్ కి రావు. మోడ్రన్ కల్చర్ ఫాలో అవవు. పైగా మాకే నీతి సూక్తులు చెప్తావు. అంత డబ్బు, అందమైన వయసు ఏం చేసుకుంటావ్? ఎంజాయ్ బంగారం” అంది స్రవంతి ఖాళీ అయిన బ్రీజర్ క్యాన్ దూరంగా విసిరికొడుతూ . “ఇట్స్ టూ మచ్. డబ్బున్నవాళ్ళంతా తాగి ఊగుతారా? నో.” అంది స్రవంతి వైపు కోపంగా చూసి.
“సారీ బేబీ. రియల్లీ నువ్వు సూపర్. మమ్మల్ని నువ్వు గైడ్ చేయబట్టే బుద్దిగా చదువుకుని జాబ్స్ తెచ్చుకోగలిగాం. మా పేరెంట్స్ కి మాకంటే నువ్వంటేనే ఎక్కువ నమ్మకం. మాతో నువ్వున్నావనే వాళ్ళక్కడ హ్యాపీ గా వున్నారు. మీ ఇంట్లో నీ పెంపకం అలాంటిది. నువ్వు మా మాస్టరమ్మ. నువ్వెలా అంటే మేం కూడా అలానే. కానీ ఈ ఒక్కరోజూ ఎంజాయ్ చేసేందుకు పర్మిషన్ కావాలి మేడం” అన్నాడు వివేక్ అభ్యర్థనగా చూస్తూ.
జ్వాల వాళ్ళను చూసి నవ్వింది.
“చేసిన ఎంజాయ్ మెంట్ చాలు. మనం ఇక్కడికొచ్చి నాలుగు గంటలయింది. వీళ్ళ చిందులు మాములుగా లేవు. మనకి తెలిసినవాళ్ళు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు. చదువుకునేందుకు విదేశాలు వచ్చి వేషాలేస్తున్నారనుకోరూ?” అంది జ్వాల.
“ మీ హైద్రాబాద్ వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసెళ్లి మీ ఇంట్లో చెప్పేస్తారని భయమా. మీ మమ్మీ, తాతయ్య నిన్నేమంటారు? నిన్ను చూడొచ్చారా ఇక్కడ?” అంది స్రవంతి తేలిగ్గా నవ్వేస్తూ.
“వాళ్ళు చూస్తారని కాదు. నేనెక్కడున్నా ఇలానే వుంటాను. మా తాతయ్య పెంపకం అలాంటిది. ఆయన మాజీ
లెఫ్టినెంట్ కల్నల్ కాబట్టి నిజాయితీ క్రమశిక్షణకు మారుపేరుగా అనేక అవార్డులు పొందారు. అదే పోలిక నాకూ వచ్చింది అంటుంది మా మామ్. ప్రతిదీ ఆర్గనైజ్డ్ గా వుండాలి. లేకపోతే టెన్షన్ పడిపోతాను. అలా అలవాటైపోయింది. ఆ ఉత్తుత్తి ఊఁగడం ఆపి రూమ్ కి పదండి” అని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చి ముందుకు కదిలింది. వివిధ దేశాలకు చెందిన యువతీ యువకులు లండన్ బ్రి డ్జి దగ్గర నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. సీతాకోక చిలుకల్లా రెక్కవిప్పుకున్న వయసు జోరులో హుషారుగా తుళ్ళి పడుతున్నారు. చాలా సేపు అక్కడ గడిపాక, జన సందోహాన్ని తప్పించుకుని ఇంటికి చేరుకున్నారు ఫ్రెండ్స్ నలుగురు. జ్వాల ఫోన్ మోగింది. ఈ టైం లో ఎవరబ్బా అనుకుంటూ చూసింది.
ఓహ్ క్రిష్ ఎందుకు చేసాడు అనుకని
ఫోన్ ఎత్తి “క్రిష్, మళ్ళీ కొత్త ప్రాబ్లం రాలేదుగా. తాతయ్య బానే ఉన్నారుగా. ఓకే. జాగ్రత్తగా చూస్తుండు. వచ్చేస్తాను.రేపు ఈవెనింగ్. ఎయిర్ పోర్ట్ కి కార్ తీసుకురా” అని చెప్పి పెట్టేసింది. “ఎవరు మీ డ్రైవరా?” అడిగారు ఫ్రెండ్. “కాదులే.” అంది. “బాయ్ ఫ్రెండా?”
“క్రిష్ మా కాలనీలో ఉంటూ నాతో చదువుకున్న నా బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళ డాడీ కూడా మా తాత్తయ్యతో పాటు ఆర్మీలో పనిచేసేవారు. మా రెండు ఫ్యామిలీస్ కీ మంచి బాండింగ్ వుంది. క్రిష్ ఈజ్ ఏ నైస్ గై.”
“ఓహో, అయితే అతనే నీ ప్రియుడన్నమాట” అని ఫ్రెండ్స్ దగ్గరగా చేరి ఇంకా చెప్పమని అడిగారు.
“ అవన్నీ తర్వాత చెప్తాను. నేను అర్జెంట్ గా ఇండియా వెళ్ళాలి. అక్కడ తాతయ్య సిట్యుయేషన్ బాలేదుట. అందుకే క్రిష్ ఫోన్ చేసాడు”అని లగేజ్ ప్యాకింగ్ చేసే పనిలో పడింది. అందరూ ఆమెకు హెల్ప్ చేశారు. అన్నీ సర్దుకున్నాక రిలాక్స్ అవుతూ. “హరే, మా ఇంట్లోవాళ్లకి ఏం తీసుకోలేదు. లెట్స్ గో ఫర్ షాపింగ్.”అంటూ లేచింది. “పెద్దాయనకు తీసుకునేవి ఏముంటాయి?” అంది నిస్సి. “కోట్ కొంటాను. అండ్ బ్యూటిఫుల్ క్యాప్ కూడా. పదండి.” అంది. అందరూ కలిసి సిటీ సెంటర్ కి వెళ్లారు. క్రిష్ మళ్ళీ ఫోన్ చేశాడు “హలో, గ్రాండ్ పాకి ఏం కాలేదుగా? ”అనడిగింది జ్వాల కంగారుగా “జస్ట్ మిస్. అదర్వైజ్ హోప్స్ వదులుకోవాల్సి వచ్చేది. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యు”. అన్నాడు.“పోలీస్ స్టేషన్ లో కంప్లైట్ ఇవ్వు” అంది. “నో జ్వాలా. అది నా అనుమానమో నిజమో తెలియట్లేదు. ముందు నువ్వు ఇండియా రా. ఏంచేయాలో ఆలోచిద్దాం.”అన్నాడు క్రిష్.
“ప్లీజ్ క్రిష్, నేనొచ్చేదాకా బీ కేర్ ఫుల్”అని చెప్పి ఫోన్ పెట్టేసింది. “ఎవరంటే చెప్పదు. సీక్రెట్ ఏమో.”అంది నిస్సి చిన్నగా నవ్వుతూ. ఆమెవంక సీరియస్ గా చూసింది జ్వాల.
“సమ్ థింగ్ ఈజ్ రాంగ్? ఓకే జ్వాలా” వివేక్ ప్రశ్నకు తల పంకిస్తూ నథింగ్ అంది.
“ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ ప్లీజ్ ఆస్క్ మీ . డోంట్ హెజిటేట్ ”అన్నాడు.
“థాంక్స్, నేను రేపు ఇండియా వెళ్ళాక మీకు ఫోన్ చేసి అక్కడి పరిస్థితి చెప్తాను. ఇప్పుడు షాపింగ్ పని త్వరగా కానిద్దాం.పదండి. “ అని షాప్ లోకి నడిచింది . జ్వాల తాతయ్యకు కావలసిన వస్తువులు జాగ్రత్తగా ఎంపికచేసి తీసుకుంది..
కొన్ని చాక్లెట్స్ కొనుక్కుని ఇంటికి వచ్చారు అందరూ .
“వన్ మంత్ నువ్వు మాతో వుండవు అంటేనే బాధగా వుంది. అసలెందుకు ఈ సడెన్ ట్రిప్?” అన్నారు ఫ్రెండ్స్.
“నేను వచ్చే నెల జాబ్ లో జాయిన్ అవ్వాలి కదా. రూమ్ రెంట్ కూడా కట్టేసాను. వన్స్ జాయిన్ అయితే ఆరునెలల పాటు ప్రోబేషన్ పీరియడ్. కదలటానికి వుండదు. సో అందుకే ఒకసారి వెళ్లి అందర్నీ చూసి వచ్చేస్తాను “
“సో, నీకు అందరూ వున్నారు. నాకే ఎవ్వరూ లేరు.” అంది ఆమె స్నేహితురాలు స్రవంతి బాధగా.
“హే డోంట్ ఫీల్. నీకు తోడుగా నేనున్నాను కదా.చాలదా?” అన్నాడు వివేక్.
“పేరెంట్స్ లేని లోటు ఎవరూ తీర్చలేరు వివేక్. ఆ బాధ నాకొక్కదానికే తెలుసు” అందామె.
“ప్లీజ్ స్టాప్ ఇట్. చేంజ్ ది టాపిక్. ఈ ప్రపంచంలో మనకన్నా ఎక్కువ బాధలు పడేవాళ్ళు వున్నారు. అనాధలుగా బెగ్గర్స్ గా, ఎన్నో అట్రాసిటీస్ మౌనంగా భరిస్తూ, తిండికి లేక, చావలేక బతకలేక నరకయాతన పడుతున్నారు. మనం ఆ స్థితిలో లేమని సంతోషిస్తూ గడుస్తున్న ఒక్కొక్క రోజుకి థాంక్స్ చెప్పుకోవాలి” అంది జ్వాల.
“బాబోయ్, నా ఒంటరితనంకన్నా నీ క్లాసులే కష్టంగా వున్నాయి. పోయిరా తల్లి. సేఫ్ గా వెళ్ళిరా”అంది స్రవంతి నవ్వుతూ. ఆమె నవ్వులో అందరూ శ్రుతి కలిపారు.
మర్నాడు ఆమెను సాగనంపడానికి ఆమె ఫ్రెండ్స్ అందరూ ఎయిర్ పోర్ట్ కి వచ్చారు. బోర్డింగ్ కి టూ అవర్స్ టైం వుంది. “నువ్వు మళ్ళీ తిరిగి ఇక్కడికి రావేమో అనిపిస్తోంది నాకు.” అంది స్రవంతి.
“అలా అనకు. తధాస్తు దేవతలుంటారు. జ్వాల వస్తుంది. తను రావాలి”అన్నాడు వివేక్.
ఆమె అలా ఎందుకందని ఆలోచించింది జ్వాల. ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్ లో సెండాఫ్ ఇచ్చారు. మర్నాటికి ఇండియా వచ్చింది జ్వాల.
ఆమె చిన్ననాటి స్నేహితుడు క్రిష్ ఆమెను తీసుకువెళ్లేందుకు ఎయిర్పోర్ట్ కి వచ్చాడు. బయటకు వచ్చి అతన్ని చూడగానే చెయ్యి ఊపింది. అతను ఆమె బ్యాగేజ్ తీసుకుని కార్ లో పెట్టాడు. ఇద్దరూ కలిసి కార్లో ఇంటికి బయలుదేరారు. జ్వాల తాతయ్య ఎలా వున్నారని అడిగింది. ఆయన బాగానే వున్నారు. కానీ నిన్న ఒక సంఘటన జరిగింది. అదృష్టం కొద్దీ తాతయ్య బయటడ్డారు. అని చెప్పాడు.మాట్లాడుకుంటూ ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. ఎదురు వచ్చి పలకరించిన తాతయ్యను చూశాక గానీ ఆమె మనసు కుదుట పడలేదు. నాలుగు అంతస్థులున్న ఆయింట్లో పై అంతస్తులో జ్వాల తల్లి సౌదామిని ఉంటుంది. ఆమె జ్వాల రాగానే గబగబా కిందకు వచ్చి కూతుర్ని ఆలింగనం చేసుకుంది. ఎన్నో రోజుల తర్వాత కలిసిన తల్లీ కూతుళ్లు ఒకరినొకరు కౌగలించుకుని మౌనంగా చాలా సేపు ఉండిపోయారు. ఇద్దర్నీ తాతయ్య విశ్వనాధ్ సముదాయించాడు . తర్వాత ఇంట్లో వున్న నలుగురు పనివాళ్ళు వచ్చి ఆమెను పలకరించారు. లండన్ నుంచి వాళ్ళకోసం తెచ్చిన గిఫ్ట్స్ ఇచ్చింది నేను వాళ్ళు చాలా సంతోషించారు. ఆమె రాకతో ఇంట్లోకి వసంతం వచ్చినట్టుగా ఉందని జ్వాల తాతయ్య విశ్వనాధ్ అన్నాడు. తాతయ్యను ప్రేమగా పట్టుకుని పడుకుంది జ్వాల. ఆయన ప్రాణానికి ప్రమాదం ఉందని తెలియని విశ్వనాధ్ మానవరాలిపై ప్రేమగా చెయ్యివేసి పట్టుకుని హాయిగా నిద్రపోయాడు. జ్వాలకు మాత్రం నిద్ర పట్టక ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది.
****************
బారేడు పొద్దెక్కాక మెలుకువ వచ్చిన జ్వాల హడావిడిగా నిద్రలేచింది. బెడ్ మీదనుంచి హాల్లోకి తొంగిచూసింది. థాంక్ గాడ్. గ్రాండ్ పా ఇంకా వాహింగ్ కి వెళ్ళలేదు అనుకుంటూ గబగబా లేచి వాష్ రూమ్ లోకి వెళ్ళి వచ్చింది. నేనూ నీతో వాకింగ్ కి వస్తానని రాత్రే చెప్పేసింది.
“ నీకెందుకు బేబీ వాకింగ్. ఫిట్ గానే వున్నావుగా. ఇంత చలిలో రావడం అవసరమా మై డియర్ యంగ్ గర్ల్. “అన్నాడు నవ్వుతూ.
“ ఏస్ గ్రాండ్ పా. నాకు ఇంపార్టెంట్ పనుంది. ఇన్ఫాక్ట్ నువ్వు అందంగా వుంటావు కదా.నిన్నెవరన్నా ఎత్తుకుపోతారేమోనని భయం బాడీ గార్డ్ లా వస్తాను.సరేనా జస్ట్ కిడింగ్” అంటూ నవ్వింది.
“యూ సిల్లి, నీతో కలిసి నడవటం సంతోషమే మై డియర్ బ్యూటీ. ప్లీజ్ కమ్” అన్నాడు మనవరాల్ని మురిపెంగా చూస్తూ. జ్వాల తన పనులు ముగించుకుని డ్రెస్ చేసుకుని బయటకు వచ్చింది. బ్లూ టైట్ జీన్స్, వైట్ టీ షర్ట్ దానిమీద చేజ్ మీ అని ఎర్రటి అక్షరాలు రాసివున్న టీ షర్ట్ ధరించింది పాతికేళ్ళ పరువం.
పైకి వేసుకున్న పోనీ టైల్ కి , ఎలాస్టిక్ రిబ్బన్ బిగించి కట్టింది. ఎర్రని పెదాలను మరింత మెరిపిస్తూ లిప్స్టిక్ వేసుకుంది.
ఆమె ఫోన్ మోగింది. తీసి చూసింది. క్రిష్ ఫోన్ చేసాడు. ఆమె పెదవులు విచ్చుకున్నాయి. “రెడీ అయ్యావా?కమాన్. ఐ యామ్ వెయిటింగ్ హియర్”అన్నాడు. “ఏస్ జస్ట్ టెన్ మినిట్స్” చెప్పి కిందకొచ్చి వాకింగ్ షూస్ వేసుకుంది.
ఆ ఇంట్లో ఎప్పటినుంచో పనిచేస్తున్న మెయిడ్ నొరాతి. ప్రోటీన్ షేక్ తెచ్చి జ్వాల చేతికి అందించింది. “థాంక్స్, లండన్ లో నాకు ఇచ్చేవాళ్ళు ఎవరూ వుండరు. నేనే అన్నీ చేసుకోవాలి” అని చెప్పి సిప్ చేస్తూ “మామ్ ఇంకా లేవలేదా?”అడిగింది.
“లేచారు మేం సాబ్. పూజ గదిలో వున్నారు” అని చెప్పింది నొరాతి. అవునా అని మూడంతస్తుల పైనున్న తల్లికి వీడియో కాల్ చేసింది జ్వాల. “మామ్, వాకింగ్ కి వెళుతున్నాను.టూ అవర్స్ లో వచ్చేస్తాను.” అని చెప్పగానే,
“ నిన్నే కదా వచ్చావు. జెట్ లాగ్ లేదా? కాసేపు పడుకోవచ్చుగా?” అంది.
“కొంచెం సేపట్లో వచ్చేస్తాను మామ్. తర్వాత సాయంత్రం దాకా పడుకుంటాను”
“బీ కేర్ ఫుల్ బేబీ. అసలే కంటోన్మెంట్ ఏరియా. పొద్దున్నే జనం వుండరు. నిర్మానుష్యంగా వుంటుంది. మిలటరీ ఏరియా అయినా అసాంఘిక చర్యలకు తక్కువేం లేదు. ఇండియా లో ఆడపిల్లలకు రక్షణ ఎక్కడుంది? ఇక్కడ జరుగుతున్నవి బహుశా నీకు తెలీకపోవచ్చు.”
“మామ్, ప్లీజ్, డోంట్ డిస్కరేజ్ మీ. భయపెట్టకు.తాతయ్య ఉన్నారుగా. యూ నో? ఐ హేవ్ వెపన్స్ విత్ మీ.కారం పొడి, సిరంజ్ నీడిల్, వెజిటబుల్ నైఫ్. నాకేం కాదు. ఐ యాం సూపర్ గర్ల్.” అంది.
“లవ్ యూ బంగారం. జాగ్రత్త” అంది సౌదామినీ . సరే మమ్మీ అని ఫోన్ పెట్టేసి గబగబా బయటకు వచ్చింది. గేట్ బయట క్రిష్ బండి మీద కూర్చుని ఎదురుచూస్తున్నాడు.
అతన్ని చూసి హై అని చెయ్యి ఊపింది జ్వాల.
అతను కూడా చెయ్యి ఊపి కమాన్ అన్నాడు.
కల్నల్ విశ్వనాథ్ మెడకు రెడ్ స్కార్ఫ్ కట్టుకుని, బాల్డ్ హెడ్ మీద బ్లూ కాప్ పెట్టుకుని , వాకింగ్ స్టిక్ పట్టుకుని బయటకు వచ్చాడు. చాననచాయ రంగు, దృఢమైన శరీరం, కొనదేలిన ముక్కు. మిలటరీలో పనిచేసినప్పటి ఠీవి ఇంకా కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. కానీ మోకాళ్ళ నొప్పులు కారణంగా నడుం కాస్త వంచి నడుస్తాడు. సైనిక్ పురి కంటోన్మెంట్ ఏరియా పక్కనే వున్న పార్క్ లో వాకర్స్ సందడి ఎక్కువగా వుంది. ఆరోజు ఆదివారం కావడం వల్ల చిన్నపిల్లలు ఎక్కువమంది వచ్చారు. జ్వాల, విశ్వనాథ్ కలిసి కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు వాళ్లకి కాస్త వెనకగా క్రిష్ వస్తున్నాడు విశ్వనాథ్ ఎక్కువగా జనాలు ఉన్నచోట నడవడానికి ఇష్టపడడు. అందుకే ఇంకాస్త ముందుకు వెళ్లి గుబురుగా ఉన్న చెట్ల మధ్యన వేసిన వాకింగ్ ట్రాక్ మీద నడక ప్రారంభించాడు .జ్వాల అతనితో నడుస్తూనే అటూ ఇటూ చూస్తూ నిశితంగా గమనిస్తోంది.
ఆమె వెనక కాస్త దూరంలో క్రిష్. ఆమె కాళ్ళకి ఏదో అడ్డురావడంతో ఫుట్ పాత్ దిగి ఒక్క అడుగు వెనక్కి వేసి కాలికున్న కంప లాగి అవతల పడేసింది.
అంతే ఆమెకు కాస్త దూరంలో నడుస్తున్న విశ్వనాథ్
వైపు వేగంగా దూసుకు వచ్చింది క్రికెట్ బాల్.
సరిగ్గా అతని ఛాతీని తాకేలోపు ఎవరో ముసుగువేసుకున్న వ్యక్తి మెరుపులా వచ్చి బాల్ ను పక్కకి తోసి అంతలోనే చెట్లలోకి వెళ్లిపోయారు. బాల్ విశ్వనాథ్ కి కాస్త దూరంగా పడింది. జ్వాల కంగారుగా పరిగెత్తుకొచ్చింది “నీకేం కాలేదుగా గ్రాండ్ పా.” అంది.
“నో బేబీ నాకేం కాలేదు. ఏమైంది అంత వర్రీ అవుతున్నావ్. ఎవరో క్రికెట్ ఆడుకుంటున్నారు. అది గురితప్పి ఇటొచ్చినట్టుంది.” అన్నాడు వాకింగ్ స్టిక్ సహాయంతో వడిగా నడుస్తూ.
జ్వాలకు ఏం జరిగిందో అర్ధం కాలేదు. బట్ ఏదో జరిగింది. ఎవరో తాతయ్య మీదకు బాల్ బలంగా విసిరారు. ఎవరో వచ్చి దాన్ని అడ్డుకున్నారు. అసలేం జరుగుతోంది అని
క్రిష్ వంక చూసింది. అతను జ్వాల దగ్గరకొచ్చి
“అలార్మింగ్ సిట్యువేషన్. నువ్వూ చూశావుగా. కొద్దిరోజులుగా తాతయ్య మీద ఇలాంటి దాడులే జరుగుతున్నాయి. ఆశ్చర్యం ఏంటంటే అవన్నీ
చాలా నేచురల్ గా వున్నాయి. అన్ఎక్సపెక్టెడ్ గానా, ప్లాన్ ప్రకారమా అనే సందేహానికి ఆధారాలు దొరకట్లేదు. బట్ ఇట్ ఈజ్ ప్లాన్డ్ ఎటాక్ అని నా వుద్దేశ్యం. వాట్ డు యు సే?” అన్నాడు.
“ఏస్ ఆఫ్కోర్స్. చాలా స్పీడ్ గా జరిగిపోయింది.లెట్ అజ్ వెయిట్ అండ్ సీ”అంది జ్వాల.
తల పంకించాడు క్రిష్. విశ్వనాథ్ దూరంగా చూస్తూ
స్ట్రెయిట్ గా నడుచుకుంటూ వెళ్లిపోతుంటే
జ్వాల కంగారుగా “గ్రాండ్ పా,ప్లీజ్ ఆగండి. ఐ యాం కమింగ్” అంటూ నడక వేగం పెంచింది. ఆమె మొహమంతా చిరు చెమటలు పోశాయి. ముందు ఇంకేదైనా ఆపద వుందేమో అనే అనుమానంతో ఆమె ముందుకు వేగంగా పరిగెత్తింది.
మరో బాల్ వేగంగా దూసుకొచ్చి జ్వాల ముక్కుని తాకుతూ వెళ్ళి దూరంగా పడింది. అమ్మా అని అరిచింది జ్వాల. పరిగెడుతున్నదల్లా ఒక్కసారిగా ఆగిపోగి రొప్పుతూ కిందకు వంగింది.
ముక్కునుండి రక్తం ధారగా కారింది.
అది చూసిన విశ్వనాథ్, క్రిష్ కంగారు పడుతూ ఆమె దగ్గరకు వచ్చారు. క్రిష్ కర్చీఫ్ తీసి ముక్కుకి అడ్డు పెట్టాడు తెల్లని జేబురుమాల రక్తంతో తడిసి ముద్దయింది.
ఆమె కళ్ళు మసకబారినట్టై కిందపడిపోయింది. చెట్టు చాటునుండి చూస్తున్న వ్యక్తి తన టార్గెట్ తప్పింది అనుకుంటూ చెట్టుని పిడిగిలితో గుద్దాడు. మరో బాల్ విసిరి, రాయితో కొట్టాలనుకున్న అతని ప్రయత్నాన్ని బలవంతంగా అడ్డుకున్న ముసుగు మనిషి చెప్పే మాటలకు అతను తలపంకించాడు. విశ్వనాధ్ వంక కోపంగా చూస్తూ ఆ ముసుగు మనిషితో పాటు నడుస్తూ చెట్లలో కలిసి పోతుండగా,
కళ్ళు మూతలు పడుతున్న జ్వాలకు చెట్లచాటుకు వెళ్లి పోతున్న ఆ వ్యక్తి లీలగా కనపడ్డాడు.
“క్రిష్ క్రిష్. అక్కడా” అని వేలితో చూపిస్తూ
ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తున్న జ్వాల ముక్కుకు తీవ్ర రక్తస్రావంతో నొప్పి ఎక్కువై అబ్బా అని బాధతో మూలిగింది. మెల్లగా స్పృహ తప్పింది.
క్రిష్ ఆమెను చేతుల మీద ఎత్తుకుని రోడ్డుమీదకు తీసికెళ్ళాడు. అక్కడున్న వాళ్ళ సాయంతో ఆమెను హాస్పిటల్ కి తీడుకు వెళ్ళాడు.
లండన్ నుంచి వచ్చిన పిల్లకు ప్రమాదం ఎందుకు జరిగిందనే బాధను
తట్టుకోలేకపోయాడు విశ్వనాధ్.
ఈ వయసులో ఇంకా పరీక్షిస్తున్నావెందుకు. ఆ పసిపిల్లకు ఏమీ కాకూడదు. కావాలంటే నన్ను తీసుకెళ్ళు. అని కన్నీళ్లు పెట్టుకున్నాడు విశ్వనాధ్.
“ఏం కాదు తాతగారూ. చిన్న సర్జరీతో మామూలవుతుంది. మీరేం కంగారు పడకండి.”అని అనునయించాడు క్రిష్.
“ఈ విషయం సౌదామినికి చెప్పొద్దు. అసలు తట్టుకోలేడు. మా సెర్వెంట్ మెయిడ్ నొరాతి ఫోన్ కి ఫోన్ చేసి జ్వాలకి మార్చేందుకు వేరే డ్రెస్ తెమ్మని చెప్పు. ఇన్స్పెక్టర్ చంద్రఘోష్ కి ఫోన్ చెయ్యి. మనం హాస్పటల్ లో వున్నామని, త్వరగా రమ్మని చెప్పు. గోపీ చంద్ కి కూడా ఫోన్ చెయ్యి.” అని హడావిడిగా చెబుతూనే నొప్పితో గుండె పట్టుకుని మెలికలు తిరిగితుంటే
“డాక్టర్, తాతగారిని చూడండి ప్లీజ్ ”అంటూ అరిచాడు క్రిష్.
అక్కడకొచ్చిన నర్సులు వెంటనే అతన్ని ఐ సి యూ లోకి తీసుకెళ్లారు.