వారసులు

విశాలాక్షి • 01 Jul 2024 • 👁 1 views
*****
*వారసులు*
========
(కథానిక)

(నేను రాసిన ఈ కథ విశాలాక్షి అనే మాసపత్రికలో, జూలై 2024 న ప్రచురితమైనది)

రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్.


"మావయ్యా, రేపు మన ఆటోమోబైల్ షోరూం ప్రారంభోత్సవానికి ఆ బేంక్ మేనేజర్ గారు తప్పకుండా వస్తానన్నారా?" షాపును పూలదండలతో అలంకరించుతూ నీలకంఠాన్ని అడిగింది వినీల.

"తప్పకుండా వస్తానన్నారమ్మా. అంతేకాదు మనం అడిగిన ఋణం కూడా మంజూరు చేయమని వాళ్ల పై అధికారుల నుంచి ఆదేశాలు కూడా వచ్చాయిట" లోపలికి వస్తూ చెప్పాడు నీలకంఠం.

"ఔనక్కా! ఆ మేనేజర్ గారు చాలా మంచిగా మాట్లాడారు అక్కా. ముఖ్యంగా స్వయంకృషితో పైకి వచ్చే మహిళలు అంటే ఆయనకు చాలా గౌరవం అని ఆయన మాటల్లో తెలిసింది" కవలల్లో చిన్నదైన సునీల, అక్క వినీలకు చెప్పింది.

"పోనీలెండి, చక్కటి శుభవార్త చెప్పారు. సరేకానీ, మావయ్యా నువ్వూ కలిసి రేపటి ఏర్పాట్లు చూడండి" గోడకు అలంకరించిన తల్లి ఫొటోకు దండ వేస్తూ చెప్పింది వినీల.

***** ***** ***** *****

మర్నాడు ఉదయం సుగుణ ఆటోమోబైల్ షోరూం ముందు ఆగిన కారులోంచి దిగాడు బేంక్ అధికారి, యాభై ఏళ్ల దివాకర్.
ఆయనకు ఎదురేగి స్వాగతం పలికారు వినీల, సునీలలు తమ బాగోగులు చూసుకునే నీలకంఠంతో కలిసి.

ప్రారంభోత్సవం కార్యక్రమం ముగిసిన తరువాత బేంక్ మేనేజర్ దివాకర్ ను తమ గదిలోకి ఆహ్వానించారు వినీల, సునీలలు.

కుర్చీలో కూర్చుని పరిసరాలను గమనిస్తున్న అతని చూపు ఎదురుగా గోడకు అలంకరించి ఉన్న ఓ తైలవర్ణ చిత్రంపై పడింది. మరోసారి పరిశీలనగా చూసి,

"ఏంటమ్మా ఆ ఫోటో? అందులో సైకిల్ తొక్కుతున్న ఆవిడ ఎవరు?" కుతూహలం ఆపుకోలేక అడిగాడు దివాకర్.

"సార్! ఆ సైకిల్ తొక్కుతున్న ఆవిడ మాకు బతకడం నేర్పిన మా అమ్మ సుగుణ. ఈ మధ్యనే కాలం చేసారు" వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పింది వినీల.

"ఔనా? ఓ.. సారీ! మరి, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు?" సందేహంగా అడిగాడు దివాకర్.

"అదంతా ఓ పెద్ద కథ సార్. అది చెప్పి అనవసరంగా మీ అమూల్యమైన సమయం వృధా చేయడం ఎందుకు సార్? రండి సార్. అల్పాహారం తీసుకుందురుగాని" దివాకర్ ను తీసుకుని పక్కనే ఉన్న విశ్రాంతి గదిలోకి వెళ్లారు ఆ అక్కాచెల్లెళ్ళు.

***** ***** ***** *****

అల్పాహారం అనంతరం ఋణం మంజూరు కాగితాలు వినీల చేతిలో పెట్టి అక్కడ నుండి బయలుదేరాడు బేంక్ మేనేజర్ దివాకర్. ఆయన చేతికి ఓ మెమెంటో ఇచ్చి

"మావయ్యా! సార్ ని దిగబెట్టిరా" నీలకంఠంతో చెప్పింది వినీల.

***** ***** ***** *****

"నీలకంఠం గారూ? మీ బావగారు అదే ఆ పిల్లల తండ్రి ఏమయ్యారు? ఆ సైకిల్ తొక్కుతున్న ఆవిడ ఫొటో అక్కడ పెట్టడంలో విశేషం ఏమిటి?" కారులో వెళ్తూ, నీలకంఠాన్ని అడిగాడు దివాకర్.

"సార్! ఆయన మా బావగారూ కాదు. ఆవిడ నా చెల్లెలూ కాదు. నాకు ఓ చిన్న సైకిల్ షాపు ఉండేది. ఇరవై ఏళ్ల క్రితం ఓ రోజు సామాన్లు కొనుక్కుని వస్తూంటే మా ఊరి బస్టాండ్ లో కవల పిల్లలతో ఉన్న ఈ సుగుణ అనే ఆవిడను మొదటి సారి చూసాను. అప్పుడు ఈ పిల్లలకు బహుశా ఆరేళ్ల వయస్సు ఉంటుందేమో? రోదిస్తున్న ఆమె వద్దకు వెళ్లి, "చెల్లెమ్మా! నీకు అన్నలాంటి వాడను. ఏం జరిగిందో చెప్పమ్మా?" అని అడిగాను సార్. అప్పుడు ఆవిడ అసలు విషయం చెప్పింది సార్" పాత సంగతులు గుర్తుకు తెచ్చుకుని చెప్పసాగాడు నీలకంఠం.

"ఆవిడ ఏం చెప్పారు? ఆమెను ఎవరైనా మోసం చేసి వదిలేసారా?" ఆతృతగా అడిగాడు దివాకర్.

"లేదు సార్. ఆమె ఓ అనాథ. ఒకాయన ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ కవల పిల్లలు పుట్టిన తరువాత, కొడుకు పుట్టలేదన్న కోపంతో ఆమెకు భర్త నుంచి, అత్తగారి నుంచి సాధింపులు ఎక్కువయ్యాయి. ఈ పిల్లలను ఏదైనా అనాథ శరణాలయంలో వదిలేయమని, తమకు ఓ వారసుడుని కనివ్వమని రోజూ హింసించేవారు. తనలా తన పిల్లలు అనాథలు కాకూడదని ఆ మహాతల్లి ఆ పిల్లలను తీసుకుని మా ఊరు వచ్చేసింది. ఈ సంగతులు విన్న నేను ఆమెను స్వంత చెల్లెలులా చూసుకుని నా షాపు బాధ్యతలు అప్పగించాను. నా భార్య పోయిన తరువాత ఆడదిక్కు లేని నా ఇంటికి ఆమె ఆడపడుచులా వచ్చింది. నాకు పిల్లలు లేరు బాబూ, లేకపోతే ఓ పిల్లను నా కోడలిగా చేసుకునే వాడను" ఎంతో తన్మయత్వంతో చెప్పాడు నీలకంఠం.

"ఇంతకీ ఆ ఫొటో వెనుక ఉన్న విశేషం ఏమిటో చెప్పారు కాదు" సందేహం వెళ్లబుచ్చాడు దివాకర్.

"ఏం లేదు సార్. మా సుగుణ పట్టుదల మనిషి. ఓ రోజు సైకిల్ రిపేర్ కోసం వచ్చిన ఓ వ్యక్తి ఈమెను సైకిల్ తొక్కడం రాదు కానీ, నువ్వు రిపేర్ ఏం చేస్తావు? అని హేళనగా మాట్లాడాడు సార్. అంతే రెండు రోజుల్లో పిల్లల సాయంతో సైకిల్ తొక్కడం నేర్చేసుకుంది. అంతే కాదు ఓ సంవత్సరం తిరక్కుండా బైక్ నడపడం, రిపేర్ చేయడం కూడా నేర్చుకుంది. తరువాత రోజుల్లో పగలూ రాత్రి తాను కష్టపడి పిల్లలను ఆటోమోబైల్ ఇంజనీరింగ్ చేయించింది. పిల్లలను చూసుకునే క్రమంలో తన ఆరోగ్యాన్ని కూడా విస్మరించింది" కళ్లు తుడుచుకుంటూ చెప్పాడు నీలకంఠం.

"సారీ నీలకంఠం గారూ! వెరైటీగా ఉన్న ఆ ఫొటో చూసి కారణం అడిగాను, అంతే. అనవసరంగా మిమ్మల్ని బాధపెట్టాను. సరే నేను దిగుతాను. వీలు చూసుకుని మళ్లీ ఇంకో సారి వస్తానని ఆ పిల్లలకు చెప్పండి" కారు దిగుతూ చెప్పాడు దివాకర్.

***** ***** ***** *****

"ఏమేవ్. ఈ రోజు నేను ప్రారంభోత్సవం చేసిన ఆ ఆటోమోబైల్ షాపు ఎవరిది అనుకున్నావ్?" ఇంట్లోకి వస్తూ భార్య సులక్షణను అడిగాడు దివాకర్.

"ఎవరో ఇద్దరు ఇంజనీరింగ్ అమ్మాయిలదని మీరేగా చెప్పారు" బదులిచ్చింది సులక్షణ.

"ఆ అమ్మాయిలు ఎవరో కాదు. మా అన్నయ్య కూతుర్లే!" ఉద్వేగంతో చెప్పాడు దివాకర్.

"ఔనా? ఆ విషయం మీకు ఎలా తెలిసింది?" భర్తకు కాఫీ ఇస్తూ అడిగింది సులక్షణ.

"గదిలో ఫొటోలో ఉన్న ఆవిడను చూడగానే గుర్తు పట్టాను ఆవిడ మా వదిన సుగణే అని. తరువాత నీలకంఠం చెప్పిన విషయాలు విన్న తర్వాత పూర్తిగా అవగాహన అయ్యింది" అంటూ నీలకంఠం చెప్పిన విషయాలు భార్యకు చెప్పాడు దివాకర్.

"అయ్యో, ఇంత కథ ఉందా? సుగుణే బావగార్ని వదిలేసి ఎవరితోనో లేచిపోయింది అని చెప్పారు?" భర్తను ప్రశ్నించింది సులక్షణ.

"అప్పుడు వేరే ఊర్లో చదువుకుంటున్న నాకు కూడా అలాగే చెప్పారు. ఇప్పుడు చూడు, వారసుడు కావాలి అంటూ ఈమెను వదిలేసి రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో ఆవిడకు పుట్టిన కుర్రాడిని, వంశాంకురం అంటూ బాగా గారంగా పెంచడంతో వ్యసనాలకు బానిస అయ్యి, వాడు చిన్నతనంలోనే జైలు పాలయ్యాడు. అన్నయ్యకు పుట్టిన ఈ అమ్మాయిలు ఈరోజు ఓ యాభై మందికి జీవనోపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలిచారు. ఈ విషయం అన్నయ్యకు చెబితే ఎంత సంతోషిస్తాడో?" గతాన్ని తవ్వుకుంటూ ఆనందంగా చెప్పాడు దివాకర్.

"చాల్లే ఊరుకోండి. ఈ విషయం ఆయనకే కాదు, ఆ పిల్లలకు కూడా చెప్పకండి. అక్కయ్యకు, పిల్లలకు ఆయన చేసిన అన్యాయం తక్కువేమీ కాదు. అందుకే అనుభవిస్తున్నారు. అంతకీ అవసరం అయితే ఆఖరి రోజుల్లో చెబుదారుగాని లెండి. ఆ పిల్లలను మాత్రం తరచూ మన ఇంటికి తీసుకుని వస్తూండండి. ఎంతైనా మన అమ్మాయి లాగే వాళ్లు కూడా ఈ ఇంటి ఆడపడుచులు కదా..." చెబుతున్న భార్య వంక సంభ్రమంగా చూస్తూ ఉండిపోయాడు దివాకర్.

***** **శుభం** *****