*****
*అవకాశ వాణి*
==========
(బాలి గారు వేసిన బొమ్మకు కథ)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
"పిన్నిగారూ!" అంటూ ఉదయాన్నే, అండాళ్లమ్మ ఇంటికి వచ్చింది, పక్కింట్లో ఉండే వాణి.
అదే సమయానికి ఇక్ష్వాకులకాలం నాటి రేడియో ఆన్ చేసాడు జోగినాధం.
"ఆకాశవాణి, వార్తలు చదువుతున్నది అవసరాల వాణి...." అంటూ గొంతు సవరదీసుకుంది రేడియో.
"అబ్బబ్బ, ఆ రేడియో సౌండ్ తగ్గించండి. ఏదో అవసరంపడి వాణి వచ్చినట్టుంది. ఏం కావాలో కనుక్కోండి" అంటూ తడిచేతులు చీరకు తుడుచుకుంటూ రంగప్రవేశం చేసింది జోగినాధం భార్య అండాళ్లమ్మ.
"తగ్గించడానికి ఇది నా మాట ఎప్పుడు విని చచ్చింది?" అంటూ రేడియోని రెండు పీకేడు జోగినాధం. అయినాకానీ ఆ రేడియో ఎక్కడా ఆగకుండా
"మన ముఖ్యమంత్రి ఈ రోజు రాష్ట్ర అవసరాల నిమిత్తం అప్పు కోసం వరల్డ్....." అంటూ మామూలుగా తన బాణీలో చెప్పకుపోతోంది రేడియో.
"చెప్పమ్మా ! ఏం కావాలి?" అడిగింది ఆండాళ్లమ్మ.
"అప్పు పిన్నిగారూ! అప్పు. సారీ సారీ ఓ కప్పు కందిపప్పు, ఆ రేడియో ధ్యాసలో పడి ఏం మాట్లాడుతున్నానో తెలియడంలేదు" జోగినాధం వైపు చూస్తూ చెప్పింది వాణి.
జోగినాధం పీకిన పీకుడుకు పక్క స్టేషనుకు పారిపోయిన రేడియోలో ముల్లు,
"అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా" అంటూ కచేరీ మొదలెట్టింది.
"అయ్యో అయ్యో ఈ టైంలో ఏమిటా పాటలు? ఆ పిల్ల ఏమనుకుంటుంది? ఆపాట ఆపండి" అంటూ భర్తకు చెబుతూ కందిపప్పుతో వచ్చిన ఆండాళ్లమ్మ,
"ఆ పాటలూ, ఆయన మాటలూ పట్టించుకోకమ్మా!" అంటూ చెప్పింది వాణితో.
"దీనికి ఈమధ్య నోరు ఎక్కువయ్యిందే" అంటూ కోపంగా రేడియో మీద తబలా వాయించాడు జోగినాధం.
"పిన్ని గారూ! ఈ కంప్యూటర్ కాలంలో బాబాయ్ గారికి ఇంకా ఆ రేడియో మీద అంత ప్రేమ ఏంటండీ?" అమాయకంగా అడిగింది వాణి.
"ప్రేమా లేదు! నా పిండాకుడూ లేదు. అది నేను కాపురానికి వచ్చినప్పుడు తెచ్చుకున్న రేడియో. నా మీద కోపం వచ్చినప్పుడల్లా, నన్ను ఏమీ అనలేక ఆ కోపాన్ని పాపం ఆ రేడియోమీద చూపిస్తారు" అసలు విషయం చెప్పింది ఆండాళ్లమ్మ.
"ఔనా ?" అంటూ కందిపప్పుతో గబగబా ఇంటి ముఖం పట్టింది వాణి, ఇంకా అక్కడే ఉంటే తను ఏమవుతాననే భయంతో.
***** **సమాప్తము** *****
(బాలి గారి బొమ్మకు నేను రాసిన ఈ కథ విశాలాక్షి మాసపత్రికలో ఏప్రిల్ 2021 లో ప్రచురితమైనది)