అడగని వరం

విశాలాక్షి • 01 May 2021 • 👁 1 views
*****
*అడగని వరం*
==========
(సామాజిక కథ)

రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్

(నేను రాసిన ఈ కథ *విశాలాక్షి* మాసపత్రిక వారు 2021లో నిర్వహించిన దీపావళి కథల పోటీలో బహుమతి పొంది, దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురితమయ్యింది)

*****

టూరిస్ట్ బస్సు డ్రైవర్ వేసిన షడన్ బ్రేకుతో, ఉలిక్కిపడి మెలకువ వచ్చి లేచిన నేను, విండో తలుపు కొద్దిగా తీసి, బయట కనపడుతున్న మైలురాయి వంక చూసాను, 'వారణాసి 85 కిలోమీటర్లు' అని ఇంగ్లీషు, హిందీ భాషలలో రాసి ఉంది.

కాశీ చూడాలన్న నా కోరిక ఇలా పదిహేను సంవత్సరాల తరువాత తీరుతున్నందుకు సంతోషించాలో, లేక బావ లేకుండా వెళ్తున్నందుకు బాధపడాలో తెలియటం లేదు. బావ జ్ఞాపకం రాగానే, హేండ్ బేగ్ లో ఉన్న బావ ఫొటోను తడిమాను ఆప్యాయంగా, బావను నాతో పాటే కాశీ తీసుకుని వెళ్తున్నాను అనే ఆనందంతో.

***** ***** ***** *****

పదిహేను సంవత్సరాల క్రితం....
ఆ రోజు తనకు బాగా గుర్తు. రాత్రి భోజనాలు తర్వాత, బావ వద్దకు వచ్చి,
"బావా! పిల్లలిద్దరూ ఉద్యోగాల్లో చేరారు. ఓపిక ఉండగానే, ఓ వారం రోజులు కాశీ వెళ్లి వద్దాం" అనగానే, "చూడూ, పిల్లల చదువుల కోసం చేసిన అప్పు ఇంకా తీరనేలేదు. ఈ రెండు సంవత్సరాలూ కొంచెం పొదుపుగా ఉంటే, అప్పుడు చూద్దాం" అన్నాడు.

కానీ ఆ తరువాత రెండు సంవత్సరాలు తిరక్కుండానే, రెండో వాడి పెళ్లి చూడకుండానే, కాలేయ వ్యాధితో , కాశీ చూడకుండానే బావ కాటికి వెళ్లిపోయాడు. డబ్బులు పొదుపు ఆలోచన కనుక లేకపోయుంటే, అప్పుడే బావతో వచ్చేదాన్ని.

అసలు ఈ పొదుపు అనే మాటకూ, నాకూ ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టుంది.

బయట రోడ్డు మీద కురుస్తున్న మంచులాగే, చిన్నతనం నుంచి జరిగిన సంఘటనలు ఒక్కొక్కటే తెరలు తెరలుగా గుర్తుకు రాసాగాయి.

***** ***** ***** *****

రెండో తరగతిలో ఒకరోజు.....
"రాత్రి నాకు ఓ తమ్ముడు పుట్టాడు తెలుసా?" అంటూ వేరుశెనగ అచ్చు చేతిలో పెడుతూ చెప్పింది, నా స్నేహితురాలు నాగమల్లి.

"ఔనా? నువ్వు అదృష్ట వంతురాలివే. నాకు అక్క ఉంది కానీ తమ్ముడు లేడు" అన్నాను బాధగా.

"పర్వాలేదులే, ఇంటికి వెళ్లి ఓ తమ్ముడిని ఇమ్మని మీ అమ్మను అడుగు" ఇంకో ముక్క చేతిలో పెడుతూ ధైర్యం చెప్పింది నాగమల్లి.

ఇంటికి వెళ్లగానే, అమ్మ ఇచ్చిన ఓవల్టీన్ తాగుతూ, ఇదే విషయం అడిగాను.
"ఇప్పటి నుంచి పైసా పైసా పొదుపు చేస్తేనే నిన్నూ అక్కను చదివించి, ఓ అయ్య చేతిలో పెట్టగలం. అలాంటి ఆలోచనలు పెట్టకోకమ్మా!" సున్నితంగా మందలించింది అమ్మ. అదిగో, అదే పొదుపు అనే మాట మొదటి సారి వినడం.

ఈలోగా మా మాటలు విన్న అమ్మమ్మ,
"ఒసే చిన్నీ! నువ్వు నెలలు నిండకుండా ఏడో నెలలోనే పుట్టేసావు. అప్పడే చెప్పాడు డాక్టర్, ఇంకో ప్రయత్నం చేస్తే మీ అమ్మ ప్రాణానికి ప్రమాదమని". అమ్మమ్మ మాటలు ఆ వయసులో అర్ధం అవలేదు కానీ ఇప్పుడు అర్ధమవుతోంది, నేను పుట్టేటపుడే నాకు తెలియకుండా పొదుపు పాటించి, అమ్మకు మోసే భారం తగ్గించానని.

చదువుకునే రోజుల్లో..... ప్రతీ సంవత్సరం బడులు తీయగానే "అమ్మా! కొత్త పుస్తకాలు ఎప్పుడు కొంటారు ?" అని నేను అడగడం, దానికి అమ్మ, "అక్క పుస్తకాలు ఉన్నాయి కదమ్మా! మంచిగా అట్టలు వేసి ఇస్తా" అని చెప్పడం. కాసేపు ఏడ్చి గొడవ చేసినా, నాన్న నచ్చచెప్పడంతో ఊరుకునేదాన్ని. అంతే తప్ప , ఏ ఒక్క సంవత్సరమూ కూడా నేను కొత్త పుస్తకాలకు నోచుకోలేదు.ఆ విధంగా నాన్నకు నా చదువుకు అయ్యే ఖర్చును పొదుపు చేసేనన్నమాట.

***** ***** ***** *****

రోజులు వేగంగా కదిలాయి. అక్కకు పెళ్లి అయ్యింది. ఇద్దరు మగపిల్లలు పుట్టారు. ఆనందంగా సాగిపోతోంది వాళ్ళ జీవితం.
నాకు కూడా పెళ్లి చేయాలని నిశ్చయించు కుని, సంబంధాలు చూడడం మొదలెట్టారు.

ఈ లోగా మా జీవితంలో భయంకరమైన కుదుపు, మా అక్క చనిపోయిందన్న వార్త.

ఓ రెండు నెలల తర్వాత మా ఇంటికి పెద్ద మావయ్య వచ్చాడు. ఆ రోజు రాత్రి నాన్నతో,

"బావా! ఇలా అంటున్నందుకు ఏమీ అనుకోవద్దు. పెద్ద దానికి పెళ్లి చేసి ఆరేళ్లు అవ్వకుండానే, పెళ్లికి చేసిన అప్పు తీరకుండానే అది కాలం చేసింది. అతను పిల్లలను పెంచడంకోసమైనా, తప్పకుండా రెండో పెళ్లి చేసుకుంటాడు. ఇప్పటికే మీ రెండో దానికి పెళ్లి చేయడం ఆలశ్యం అయ్యింది. అందుకే దీనిని అతనికి ఇచ్చి పెళ్లి చేస్తే పిల్లలకు సవతి తల్లి బాధ ఉండదు....." పక్క గదిలో ఉండి వింటున్న నాకు విషయం అర్ధమై మౌనంగా ఉండి పోయాను.

ఆ తరువాత కొన్నాళ్ళకి నా ప్రమేయం లేకుండానే బావతో నా పెళ్లి సాదాసీదాగా జరిగిపోవడంతో, ఆ విధంగా నాన్నకు నా పెళ్లి ఖర్చులు మిగిల్చాను.

***** ***** ***** *****

కాపురానికి వెళ్లిన ఓ ఆరు నెలల తర్వాత, ఓ రోజు రాత్రి బావతో,

"బావా! ఇంక ఆలశ్యం చేయకుండా, మనం కూడా ఓ అమ్మాయినో, అబ్బాయినో కంటే మనకి ఓపిక ఉండగానే వాళ్లని ఓ ఇంటి వాళ్లను చేసేయొచ్చు" అన్నాను గోముగా.

"అయ్యో, అయితే నేను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నానన్న విషయం మావయ్య నీకు చెప్పలేదా?" అడిగాడు బావ, బిక్కమొహం వేసిన నావైపు ఆశ్చర్యంగా చూస్తూ. నేను కూడా నాన్నని దృష్టిలో పెట్టుకుని మౌనంగా ఉండిపోయాను.

ఆ విధంగా నాకు తెలియకుండానే మా వాళ్లకు నా పురుళ్లకు అయ్యే ఖర్చులు మిగిల్చేనన్న మాట.

***** ***** ***** *****

కాలచక్రం గిర్రున తిరిగింది. పెద్ద వాడికి పెళ్లి అయ్యింది. కోడలు పెత్తనం ప్రారంభం అయ్యింది. బావకు కాలేయం వ్యాధి తీవ్రమయ్యింది. అది బావను బలితీసుకుంది. బావ పోయిన రోజున పెద్దాడిని పిలిచి,

"ఒరే, మీ నాన్న అంత్యక్రియలు రాజీ పడకుండా ఘణంగా చేయండి. అలా చేస్తేనే ఆయనకు సద్గతులు ప్రాప్తిస్తాయి" చెప్పాను ఉబికి వస్తున్న దుఃఖాన్ని నొక్కిపెడుతూ.

"పిన్నీ, నీకేం ఎన్ని మాటలైనా చెబుతావు. ఇప్పటికే నాన్న ఆరోగ్యానికి చాలా ఖర్చు పెట్టాము. ఏదో ఓపిక ఉన్నంతలో మమ అనిపిస్తాం. ఈ విషయంలో నువ్వు ఇంకేం
మాట్లాడొద్దు" చెప్పాడు పెద్ధోడు. భార్యా, చిన్నోడు మౌనంగా వింటుండగా.

అప్పుడే అనుకున్నా, ఇంక ఆర్ధిక విషయాలే కాదు మాటలు కూడా పొదుపుగా వాడాలని.

"అందరూ దిగండి. కాశీ వచ్చేసాము. తిన్నగా నడుచుకుంటూ వెళ్లి, కుడి వైపు తిరిగితే మనం ఉండే సత్రం వస్తుంది" అరుస్తున్న టూర్ గైడ్ అరుపుతో కలలోంచి వాస్తవం లోకి వచ్చాను.

***** ***** ***** *****

కాశీలో ఉన్న నాలుగు రోజులూ నాలుగు నిమిషాలుగా గడిచిపోయాయి. మామూలుగా అయితే బావ నన్ను తీసుకుని వెళ్లాలి అలాంటిది నేనే బావ ఫొటో తీసుకుని వెళ్లి విశ్వేశ్వరుడినీ, అన్నపూర్ణ మాతను చూపించి, బావఫొటోను కొంగుకు కట్టుకుని గంగా స్నానం కూడా చేయించాను. ఆ రోజు రాత్రి తిరుగు ప్రయాణమయ్యాము.

***** ***** ***** *****

బస్సు ప్రయాణం మొదలైంది. మళ్లీ ఏదో ఆలోచనలు మొదలయ్యాయి. ఈ కాశీ ప్రయాణం కూడా అనుకోకుండా కుదిరింది. మా వీధిలో ఉండే నా స్నేహితురాలు రత్నం గారు, కాశీ వెళ్తూ నన్నూ రమ్మన్నారు. మా పిల్లల విషయం తెలిసిన నేను, "ఆరోగ్యం బాగా లేదు రానని" అబద్ధం చెప్పాను. అయితే నా గురించి తెలిసిన ఆవిడ ఊరుకోకుండా మా పిల్లలకు ఈ విషయం చెప్పారు. ఆ రోజు రాత్రి పిల్లలు నా మీద నిప్పులు చెరిగారు, నేనే ఆవిడ చేత అడిగించేనని. ఆ రాత్రంతా మౌనంగా రోదిస్తూ జాగారం చేసా.

అనుకోకుండా మర్నాడు ఉదయం, మా బావ స్నేహితుని కొడుకు అయిన ఈ టూర్ ఆపరేటర్ మా ఇంటికి వచ్చి, "ఆఖరి నిమిషంలో ఒకాయన ప్రయాణం వాయిదా వేసుకోవడంతో ఒక సీటు ఖాళీ అయ్యిందని, సగం ఛార్జ్ ఇస్తే చాలుననీ" మా పిల్లలకునచ్చచెప్పడంతో, వేరే దారి లేక బలవంతాన ఒప్పుకున్నారు. అంటే నా చిరకాల కోరిక కాశీ యాత్ర ఖర్చులను కూడా పొదుపు చేసానన్న మాట.

చాలా రోజులు తరువాత ప్రశాంతంగా నిద్ర పోయాను. "బస్సు వెనుక సీట్లో కూర్చంటే, కుదుపులకు కొంచెం వికారంగా ఉందని" చెప్పి రత్నం గారు ఎవరినో బతిమాలి, ముందు వరస సీటులోకి వెళ్లి పడుకున్నారు.

బస్సు అద్దాలకు కర్టెన్లు వేసేయడం వలన అంతా చీకటిగా ఉంది. బస్సు వేగంగా పోతోంది.

ఈలోగా ఏవో హాహాకారాలు, ఎక్కడ చూసినా మంటలు, పొగ, అరపులు, కేకలు ఏమీ పాలుపోవడం లేదు. ఎక్కడున్నానో నాకే తెలియడం లేదు.

ఎవరో కిందనుంచి,
"ఆంటీ, బస్సులో అందరూ దిగిపోయాము. మీరొకరే ఉన్నారు, బయటకు వచ్చేయండి"

"మేడమ్, మంటలు వెనకవైపు ఎక్కువగా ఉన్నాయి. డ్రైవర్ వైపు వచ్చేయండి".
ఇలా రకరకాలుగా అరుస్తున్నారు .

"ఒదిన గారూ, నేను దిగి పోయాను. త్వరగా దిగిపోండి. మంటలు ఎక్కువ అవుతున్నాయి" అది రత్నం గారి గొంతు.

ఎవరో బయటనుండి విండో తలుపులు బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈలోగా, కర్టెన్లుకు వ్యాపించిన మంటలు నా చీరకు అంటుకున్నాయి.

అప్పుడే తెలిసింది నాకు, నేను మంటల్లో పూర్తిగా చిక్కుకున్నానని. అప్పటికే కాలుతున్న చీరతో, ఒంటికి వ్యాపించిన మంటల బాధను భరిస్తూ బస్సు ముందు డోర్ వైపుకి పరుగుతీసా, ప్రాణాలు దక్కించుకోవడానికి.

ఈలోగా మంటల దాడి ముందు వైపు నుంచి కూడా మొదలయ్యింది. ప్రాణ భయంతో బస్సులో ముందుకు, వెనకకు పరుగెడుతున్న నాకు అనుకోకుండా ఒక ఆలోచన వచ్చింది.

నేను పుట్టినప్పటి నుంచి ఈరోజు వరకూ నేను కోరిన కోరికలేవీ కూడా భగవంతుడు నాకు అనుగ్రహలించలేదు. పొదుపు పేరుతో సాదా సీదా జీవితమే గడిపాను.

అయితే, ఇది మాత్రం నేను కోరకుండా, భగవంతుడు నాకు ఇచ్చిన అద్భుతమైన వరం అని మనసులో అనుకుంటూ, నా జీవితపు అంతిమ ప్రయాణంలో కూడా అలా ఆదా చేస్తే, మా పిల్లలకు ఆ ఖర్చుల భారం తగ్గించినదాన్ని అవుతాను కదా ?

ఈ ఊహ రాగానే, వెంటనే చీర కొంగు చింపి, అందులో చేతికి ఉన్న బంగారు గాజులు, చెవులకున్న దుద్దులు మూట కట్టి, 'రత్నం గారూ' అంటూ అరుస్తూ కిటికీలోంచి వాటిని బయటకు విసిరేసి, వెంటనే వెనక్కి తిరిగి నేను కూర్చున్న సీటు వైపు పరుగెత్తడం మొదలెట్టా! ఎదురొచ్చిన అగ్ని దేవుడు స్వాగతం పలుకుతుండగా, పైనుంచి అమ్మ, నాన్న, అక్క, బావ ఆహ్వానిస్తుండగా, కింద ఉన్న రత్నంగారితో సహా జనం అంతా హాహాకారాలు చేస్తుండగా!

***** **సమాప్తము** *****