కష్టం విలువ

విశాలాక్షి • 01 Nov 2020 • 👁 1 views
*****
*కష్టం విలువ*
===========
(కథానిక)

(నేను రాసిన ఈ కథ విశాలాక్షి మాస పత్రిక 2020లో నిర్వహించిన *లాక్ డౌన్ కష్టాలు* అనే కథల పోటీలో బహుమతి పొంది, అదే సంవత్సరం వారు ముద్రించిన ప్రత్యేక సంకలనంలో ప్రచురించడమైనది)


రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్

*****

"అమ్మా, సెల్లి సూడే ! ఆకలితో ఏడిసేడిసి ఎలా తొంగుండి పోయిందో ? నాకు కూడా ఆకలైతాందే !!" కటిక నేల మీద ముడుచుకొని పడుకున్న నాలుగేళ్ళ తన చెల్లెల్ని చూపిస్తూ చెప్పింది, ఆరేళ్ళ అరుణ.

"ఏటి సేయమంటావ్ సెప్పు. నిన్న ఆ మారాజు ఎవరో వణ్ణం పొట్లాలు ఇత్తన్నారంటే, ఈ అయిటి కాలుతో ఎల్లి, ఆడా లైన్లా గంట సేపు నిలబడితే ఓ రెండు పొట్లాలు దొరకబట్టాయి. ఈయాళ ఎవలూ ఇత్తన్న జాడే లేదు. ఈ పూటకి ఎట్టాగో ఓర్సుకో తల్లీ !" కూతురుకు నచ్చచెప్పింది దుర్గ.

"ఏంటి అక్కా! చంటిది ఆకలని ఏడుస్తోందా? అందాకా ఇదిగో, పోనీ ఈ బిస్కెట్లు పెట్టు" అంటూ వచ్చింది పక్క గుడిసెలో ఉండే పదిహేనేళ్ల లక్ష్మి.

"అవునే లచ్చీ ! పాపం, అదిగో ఏడిసేడిసి అలా పడుకుంది. ఏటి సేయను సెప్పు. రెండు నెలల నుంచి , ఎవరి ఇళ్ళకూ పనిలోకి ఎల్లడంలేదు. ఎలితే మటుకు రోజూ ఆళ్ళిచ్చిన వణ్ణమో ఏదో తెచ్చేదాన్ని. ఇంక ఆ భగమంతుడే కాపాడాలి అందరినీ !!" అంటూ నిట్టూర్చింది దుర్గ.

ఈలోగా....

"హాయ్, హలో... ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో చిన్న చిన్న గుడిసెల్లో ఉంటున్న వాళ్ళు ఎలా జీవిస్తున్నారో, ఎలాంటి కష్టాలు పడుతున్నారో తెలుసుకోవడానికి మన స్పందన టీవీ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం మనం హైదరాబాద్ లోని పేదలు, మరియు వలస కూలీలు అధికంగా నివసించే కార్మిక నగర్ లోని ఒక గుడిసె ముందు ఉన్నాం......" అంటూ ఓ మీడియా గుంపు గుడిసె లోపలికి వచ్చింది.

"చెప్పండమ్మా ! మీ పేరు ఏంటి ? మీది ఏ ఊరు ? ఇక్కడికి ఎలా వచ్చారు ?" మైక్ ముందు పెట్టి అడిగాడు రిపోర్టర్.

ముందు కొంచెం కంగారు పడినా, తరువాత తేరుకుని,

"నా పేరు దుర్గ. మాది తుని దగ్గర ఓ పల్లెటూరు బాబూ ! నా కాలుకు పోలియో అని తెలిసికూడా, మా మేనమామ నన్ను ఇష్టపడి మనువాడేడు. అక్కడ పనులు లేక ఓ పదేళ్ల క్రితం ఈడకి వచ్చేసాం బాబూ. మావ అడ్డా కూలీ పనులకు, నేను ఓ అపార్ట్ మెంట్ లోని మూడిళ్ళలో పనులకు వెళ్తూ హాయిగా ఉండే వాళ్ళం. కానీ అదిగో ఆ రెండో పిల్ల పుట్టిన తరువాత ఓ ఏడాదికి..." అంటూ భోరున ఏడవసాగింది దుర్గ.

"బాధ పడకమ్మా ! ఏం జరిగిందో చెప్పు ?" ఓదారుస్తూ అడిగాడు రిపోర్టర్.

"మమ్మల్ని ఒగ్గేసి, తనతో పాటు పనిచేసే వేరే అమ్మాయితో చనువుగా ఉండి, దానితో పాటు ఎటో ఎళ్ళిపోయాడు బాబూ ! ఆ తర్వాత ఆళ్ల గురించి ఏ ఇవరాలు తెలియవు బాబూ ! అదిగో అప్పటి నుండి ఏదో ఇలాగే బతుకుతున్నాం బాబూ !" కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది దుర్గ.

"మరి, రెండు నెలల నుంచి లాక్ డౌన్ అమలలో ఉంది కదా, మరి ఇలాంటి సమయంలో మీరు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు ?" అడిగాడు రిపోర్టర్, గుడిసెలో బోర్లించి ఉన్న పాత్రలవైపు చూస్తూ.

"ఈ కట్టాలు పగోడికి కూడా రాకూడదు బాబూ ! బయటికి ఎళ్ళడానికి లేదు. ఎవరైనా దానం చేస్తే , ముక్కకు గుడ్డ కట్టుకుని, కుంటుకుంటూ ఎళ్ళి తెచ్చుకోవడం లేదా మంచి నీళ్ళు తాగి పడుకోడం. సూడండి బాబూ, ఆకలితో సంటిది ఎలా పడుకుండిపోయిందో ?" చిన్న కూతుర్ని చూపిస్తూ చెప్పింది.

"పోనీ, మీరు పనిచేస్తున్న ఇంటి వాళ్ళని ఏదైనా సహాయం చేయమని అడగలేక పోయారా ?" ప్రశ్నించాడు రిపోర్టర్.

"మనం ఆరి పని సేయకుండా ఉత్తినే ఆళ్ళని డబ్బులు ఎలా అడుగుతాం సెప్పండి ? అయినా పాపం ఆళ్ళేం కట్టాల్లో ఉన్నారో ?" అంటూ సమాధానం ఇచ్చింది దుర్గ.

"ఇదీ ఇక్కడి పేదల పరిస్థితి. రెండు నెలలుగా తిండికి చాలా ఇబ్బంది పడుతున్న సంఘటనలు మనం చూసాం. ఈ కరోనా ఎన్నాళ్ళు ఉంటుందో? ఈ లాక్ డౌన్ ఎప్పుడు విరగడౌతుందా అని వీళ్లంతా ఎదురు చూస్తున్నారు. కెమెరా మెన్......" అంటూ నిష్క్రమించింది మీడియా బృందం, వెళ్తూ వెళ్తూ ఓ మూడు బిరియానీ పోట్లాలు దుర్గ చేతిలో పెట్టి.

"అక్కా, చూసేవా ? భగవంతుడు ఇలా టీవీ వాళ్ళ రూపంలో వచ్చేడు, ఆహారం తీసుకుని" నవ్వుతూ చెప్పింది లక్ష్మి.

"ఔనే, మాయమ్మ కూడా సెపుతూ ఉండేది, నమ్ముకున్నోళ్ళని భగమంతుడు ఎప్పటికీ అన్నాయం సేయడని. ఏదో ఈ రోజుకి ఇలా గండం గడిచింది" అంటూ చంటిదాన్ని లేపడానికి లేచింది దుర్గ.

"ఎప్పుడూ ఈ టీవీ వాళ్ళు వచ్చి, ఏవో ఇలాంటి కబుర్లు చెప్పేసి పోతారు కానీ, వీళ్ళెవరో మంచోళ్ళే అక్కా ! కష్టసుఖాలు తెలుసుకొని, ఆహారం పొట్లాలు కూడా ఇచ్చి వెళ్ళారు. మరి నే వెళ్తానక్కా ! నాన్న ఒక్కడూ ఉన్నాడు ఇంట్లో" అంటూ లేవబోయింది లక్ష్మి.

"ఉండు, మూడు పొట్లాలు మాకెందుకు ? ఇదిగో ఒకటి తీసుకెళ్లి నాన్న, నువ్వు తినండి" అంటూ బలవంతంగా చేతిలో పెట్టింది దుర్గ.

పడుకున్న చంటిదాన్ని లేపి, పొట్లాలు విప్పి, ముగ్గురూ తినగా మిగిలింది, బయట ఆకలితో ఎండిపోయిన డొక్కలతో మూలుగుతూ పడుకున్న వీధి కుక్కకు పెట్టి, "హమ్మయ్య, ఈ రోజు మా ఆకలి తీర్చావు దేముడా ! నీకు దండాలు" అంటూ మనసులో అనుకొని పిల్లల పక్కన సంతృప్తిగా పడుకుంది దుర్గ.

***** ***** ***** *****

మరుసటి రోజు ఉదయం, లోపల పిల్లలకు తల దువ్వుతున్న దుర్గతో..

"అక్కా, అక్కా మీ ఇంటికి ఎవరో కారులో వచ్చారు. త్వరగా బయటకు రా !" గుమ్మం ముందు నిలబడి అరుస్తోంది లక్ష్మి.

"కార్ల మా ఇంటికొచ్చేవాళ్ళు ఎవరబ్బా? కొంపదీసి పాకలు పీకేసే మునిసిపాలిటీ వాళ్లు కాదు కదా ?" అనుకుంటూ, బయటకు వచ్చిన దుర్గకు, కారులోంచి దిగుతున్న, తను పనిచేసే ఇంటి యజమానురాళ్ళు ముగ్గురునీ చూసి, ఆశ్చర్యంతో..

"అమ్మగార్లూ, మీరేటి ? నా కొంపకు రావడ మేటి ? లోపలికి రాండమ్మా ! కూసోడానికి బల్లలు కూడా లేవు. సెమించండమ్మా!" అంటూ కళ్ళ నీరు పెట్టుకుంది.

"లేదు దుర్గా ! నువ్వే మమ్మల్ని క్షమించాలి" అంది వాళ్ళలో పెద్దావిడ.

"ఏటయినాదమ్మా ! నాకేటీ అర్దమైత లేదు ?" ఉద్వేగంతో అడిగింది దుర్గ.

"దుర్గా ! నిన్న టీవీలో వచ్చిన ఓ కార్య క్రమంలో నువ్వూ, పిల్లలు పడుతున్న కష్టాలు చూసిన తరువాత మా గుండె తరుక్కు పోయింది. ముఖ్యంగా ప్రోగ్రాంలో నువ్వు "అయినా పాపం ఆళ్ళేం కట్టాల్లో ఉన్నారో ?" అని మా గురించి ఆలోచించిన తీరు మమ్మల్ని సిగ్గు పడేలా చేసింది. ఆ మాత్రం ఆలోచన నీ గురించి మాకు రానందుకు" చెప్పసాగింది పెద్దావిడ.

"సార్లకు కూడా జీతాలు సరిగ్గా ఇత్తాలేరని తెలిసిందమ్మా. అందుకే అలా అన్నాను" లోగొంతుకతో చెప్పింది.

"లేదు దుర్గా ! భగవంతుని దయవలన మాకు జీతాలు మీద ఆధారపడవలసిన అవసరం లేదు. నీ కష్టాలు చూసి చలించిపోయిన మేము తెలిసిన వారి ద్వారా పాస్ సంపాదించి, ఇదిగో మా ముగ్గురి తరపున ఈ రెండు నెలల జీతం బాపతు పన్నెండు వేల రూపాయలు ఇచ్చి పోదామని వచ్చాం"
అంటూ డబ్బులు ఉన్న కవర్ చేతిలో దుర్గ పెట్టారు.

"అలా కాదు అమ్మగారూ, నేను పనిలోకే రాలేదు కదా ? పూర్తి జీతం ఎందుకమ్మ గోరూ ? పోనీ ఓ పని సేయండి. ఎంతో కొంత ఇవ్వండి, మీ సంతోసం కొద్దీ" మొహమాట పడుతూ చెప్పింది దుర్గ.

"దుర్గా ! ఇది సంతోషంగా ఇస్తున్నదే. ఇకపోతే నువ్వు కావాలని మానేయలేదు కదా ! పరిస్థితులు అలా వచ్చాయి. అంతే కాదు, ఓ రెండు నెలలకు సరిపడా బియ్యం, పప్పులు, నూనె, మిగతా ఆహార దినుసులు, పిల్లలకు బిస్కెట్లు, తినుబండారాలు కూడా తెచ్చాం. ...ఇదిగో బాబూ‌, డ్రైవర్ ! ఆ సరుకులు లోపలకి చేర్చు" అంటూ పురమాయించింది ఆ పెద్దావిడ.

ఆశ్చర్యం నుంచి తేరుకున్న దుర్గ పిల్లలతో సహా ఆ ముగ్గురి కాళ్ళ మీద పడింది.

"లే లే, పిచ్చిదానా ! ఇన్నాళ్లు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండే వాళ్ళం. ఈ కరోనా లాక్ డౌన్ వలన కష్టాలంటే ఏమిటో తెలిసొచ్చేయి. ఈ జీవితం, ఈ సంపద శాశ్వతం కాదని తెలుసుకున్నాం. నువ్వు పడుతున్న కష్టాలుతో పోలిస్తే మా కష్టాలు ఏ పాటివి ? నీకు ఏ కష్టమొచ్చినా మాకు ఎవరిచేతైనా ఫోన్ చేయించు. మరచిపోకు. ఉంటాం"
అంటూ ధైర్యం చెప్పి వెళ్లి పోతున్న ఆ ముగ్గురి వైపూ కన్నీళ్లతో చూస్తూ ఉండి పోయింది దుర్గ.

కాసేపటికి తేరుకుని,

"ఒసే, లచ్చీ రేపటి నుండి నువ్వు వణ్ణం కోసం బయటకి ఎళ్ళకు. నీకు, బాబాయి కి కూడా నేనే వండేత్తా !" అంటూ చెబుతున్న దుర్గ వైపు రెప్ప ఆర్పకుండా చూస్తూ ఉండి పోయిన లక్ష్మి మనసులో అనుకుంది, ఓక్కోసారి మీడియా కూడా మంచి చేస్తుంది అని!

పిల్లలిద్దరూ ఆతృతగా ఆ మూటవైపు కదిలారు, ఆ బిస్కెట్లు వ్యవహారం ఏదో తేల్చేయడానికని!

బయట ఉన్న వీధి కుక్క రెట్టించిన ఉత్సాహంతో వచ్చి, గుమ్మం వద్ద తిష్ట వేస్తూ, ఆనందంతో తోక ఊపుతూ అనుకుంది తనకూ మంచి రోజులు వచ్చాయని!

ఆ అమ్మలు ముగ్గురునీ తీసుకుని వెళ్తున్న డ్రైవర్ అనుకున్నాడు మనసులో...ఒక విధంగా కరోనా లాక్ డౌన్ పెట్టడం మంచిదే అయ్యింది, అమ్మగార్లకి కష్టం విలువ ఏమిటో తెలిసిందని!

***** ***** శుభం ***** *****