జూన్ - 2026 నవ మల్లెతీగ మాసపత్రికలో ప్రచురితమైన నా కథ "ఎక్వేరియం !"
ఎక్వేరియం !(కథ)!
పూజ పూర్తయ్యాక హాల్లో సోఫాలో కూర్చుని కోడలు పట్టుకొచ్చిఇచ్చిన కాఫీ తాగుతూ హాలంతా పరిశీలించాను.
గతంలో నేను వచ్చినప్పుడు లేని ఎక్వేరియం హాల్లో ప్రత్యేకంగా కనిపిస్తూ తనదైన శైలిలో నన్ను చాలా ఆకర్షించింది. ఎక్వేరియంను స్నేహితుల ఇళ్లల్లో చూడడమేతప్ప ఎప్పుడూ అంత దగ్గరగా చూడలేదు.
దాదాపు మూడు అడుగుల పొడవు ఉన్న గాజు పెట్టెలో, గులకరాళ్ళ మధ్య, అక్కడక్కడ అమర్చిన ప్లాస్టిక్ చెట్ల మధ్య రంగు రంగుల చేపలు విద్యుత్ దీపం కాంతిలో మెరుస్తూ ఎంతో చలాకీగా అటు ఇటు తిరుగుతున్నాయి. ఆ కాస్త ప్రదేశంలోనే అన్నీ తిరుగుతున్నా ఒకదానిని ఒకటి కనీసం పట్టించుకోకుండా తాము బ్రతకడం కోసం తిరగాలి అన్నట్టు తిరుగుతున్నాయి ఈనాటి సమాజ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ.
అంతలో " తాతయ్య! మీకు ఫోన్ " అంటూ మనవడు సెల్ పట్టుకొచ్చి నా చేతికి ఇచ్చి హడావిడిగా వెళ్ళిపోయాడు.
వాళ్ళ అమ్మ వాడిచేత హోమ్ వర్క్ చేయిస్తోంది మరి!
ఫోన్ అందుకుని హలో అన్నాను.
" హలో చక్రవర్తిగారా? "
"అవునండి."
" మీ నెంబరు నాగభూషణంగారు ఇచ్చారు సార్. నా పేరు శ్రీనివాసన్. క్యాస్టింగ్ డైరెక్టర్ ని మాట్లాడుతున్నాను.రేపు రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ ఉంది. తెల్లవారుజామున ఐదుగంటలకు మీరు బయలుదేరావాల్సి ఉంటుంది. రాగలరా? " అడిగాడు ఫోన్చేసినవ్యక్తి.
నేను నిటారుగా అయ్యాను.
" వస్తాను సార్." అన్నాను ఉత్సాహంగా.
" మీరు ఎక్కడ ఉంటారు సార్? "
అబ్బాయి ఉంటున్న లొకాలిటీ చెప్పాను.
" అంత దూరం కాలనీ లోపలికి వాన్ రావడం కష్టం సార్. ఎందుకంటే మీలా మిగతా కళాకారులను కూడా సేకరించుకుని మేం బయలుదేరాలి. ఒక పని చేయండి, తార్నాక పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చేయండి. సరిగ్గా ఉదయం ఐదు గంటలకి ఉండాలి సుమా! నేను మీకు మళ్ళీ 11 గంటలకు కాల్ చేస్తాను "ఫోన్ కట్ చేశాడు.
ఈలోపు నా మనసు పరిపరి విధాల ఆలోచించసాగింది.
మా నాన్న పుణ్యమాని నా చిన్నప్పుడే నాకు నాటకాలంటే అభిరుచి ఏర్పడింది.
ఆ అభిరుచితోనే మా ఊరి కళాకేంద్రంలోని నటులుకూడా నన్ను ప్రోత్సహించడంతో ఆ వేదిక మీద ఎన్నో సాంఘిక నాటకాలలో ప్రధాన పాత్రలు ధరించాను. ఎన్నో పరిషత్తులో కూడా బహుమతులు పొందాను.
నేను ఉద్యోగం చేసిన ఆ ఊళ్లోనే నాగభూషణం వీడియో గ్రాఫర్ గా ఉండేవాడు. మా ఇంట్లో చాలా ఫంక్షన్స్ కు కూడా అతన్ని పిలిచాను. మా ఊర్లోనే కాకుండా పక్క ఊళ్ళల్లో కూడా పెళ్లి ఫంక్షన్లకు హాజరై వీడియోలు తీసేవాడు. ఆసమయంలోనే మా ఊరి మిట్టమీద జరిగిన షూటింగ్ కి వచ్చిన
సినీ పరిశ్రమకు చెందిన ఒక డైరెక్టర్ గారితో అతనికి పరిచయం అయింది. ఆ సినిమాలో ఆ డైరెక్టర్ ఒక చిన్న పాత్ర కూడా ఇచ్చాడు.
దాంతో అతని పట్టుకుని హైదరాబాద్ వస్తూపోతూ చిన్న చిన్న వేషాలు వేశాడు. ఇలా అక్కడో కాలు ఇక్కడో కాలు ఎందుకని స్నేహితులు సలహా ఇవ్వడంతో హైదరాబాద్ మకాం మార్చేసాడు.
ఈ మధ్య సినిమాల్లోను టీవీ సీరియల్స్ లోను ఐదు నిమిషాలుండే పాత్రలలో ఎక్కడో ఒకచోట కనిపిస్తూనేవున్నాడు.
యధాలాపంగా ఒకసారి మా ఊరు వచ్చినప్పుడు 'మా అబ్బాయి హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడయ్యా. నేను హైదరాబాద్ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు చెప్తాను అవకాశం ఉంటే నాకు మంచి వేషం ఉంటే చూపించు.' అని చెప్పాను.
అబ్బాయి ఇంటికి వచ్చి నాలుగు రోజులు అయింది. వచ్చాక నాగభూషణానికి ఒకసారి ఫోన్ చేశాను. నా ఫోటోలు, రెండు మూడు యాక్టింగ్ వీడియోలు కూడా పంపాను.
దాని ఫలితమే ఈ పిలుపు.
అన్నట్టుగానే శ్రీనివాసన్ దగ్గర్నుంచి 11 గంటలకు ఫోన్ వచ్చింది.
" సార్. తెల్ల పంచలు నాలుగు, తెల్లచొక్కాలు లేదా లాల్చీలు నాలుగు, బ్యాగ్ లో సర్దుకుని ఉదయమే 5:00 కల్లా మీరు తార్నాక పెట్రోల్ బంక్ దగ్గర సిద్ధంగా ఉండండి. నేను వ్యాన్ నెంబర్ మీకు మెసేజ్ పెడతాను. ఆ నెంబర్ కి కాల్ చేసి ఆ వ్యాన్ అందుకోండి. మీతో పాటు ఇంకా ఆరుగురు కళాకారులు కూడా వస్తారు. మళ్లీ మళ్లీ మీకు ఫోన్ చేయడం నాకు కుదరదు. తప్పక వస్తారు కదా!" అన్నాడు.
''సరే.అలాగే ''అన్నాను.
" నాలుగు పంచలు నాలుగు చొక్కాలు అంటే నాగభూషణం నాకు పెద్ద వేషమే ఇప్పించాడన్నమాట. స్నేహం, కృతజ్ఞత అంటే అలా ఉండాలి అనుకున్నాను. ఇలా
నాలుగైదు పెద్ద వేషాలు వేస్తే కుర్రాడు దగ్గరే శాశ్వతంగా ఉండిపోయి నా అభిరుచికి తగ్గట్టు ఓపిక ఉన్నంతకాలం నాలుగు వేషాలు వేసుకొని బతికేయొచ్చు... అనుకున్నాను.
ఆ రోజంతా ఇంచుమించు అస్తవ్యస్తంగానే ఉంది నా మనసు.
నా నటనానుభావాన్ని అంతటినీ కూడా మరీ మరీ జ్ఞాపకం చేసుకుంటూ రోజంతా గడిపేసాను.
రామోజీ ఫిలింసిటీ లో షూటింగ్ అంటే అబ్బాయి కూడా చాలా సంతోషించాడు.
మరుసటి రోజు ఉదయం వాడే నన్ను తార్నాక పెట్రోల్ బంకు దగ్గర దిగవిడిచాడు.
******
" సార్. చక్రవర్తిగారా? ఎక్కడున్నారు సార్? " అది వ్యాన్ డ్రైవర్ నుంచి ఫోను.
నేను ఎక్కడ నిలబడిఉన్నది చెప్పాను.
" నేను మెట్టుగూడలో ఉన్నాను సార్. ఐదు నిమిషాలలో మీ దగ్గరికి వస్తాను" అని ఫోన్ కట్ చేశాడు అతను.
మరో 10 నిమిషాల్లో అప్పటికే ముగ్గురు కళాకారులు ఉన్న వాన్ లోకి ఎక్కిన నాతో, మరో ముగ్గురు కళాకారులను ఎక్కించుకొని రామోజీ ఫిలింసిటీ వైపు మా ప్రయాణం సాగిపోయింది.
*****
దారిలో నా వెనుక కూర్చున్న కళాకారిణిని అడిగాను ఏం షూటింగ్ అని!
ప్రస్తుతం లెజెండ్స్ గా కీర్తింపబడుతున్న ప్రముఖ హీరో హీరోయిన్ల కొత్త చిత్రం అని, అందులో హీరోయిన్ మీద పాట చిత్రీకరణ జరిగే సన్నివేశం అని చెప్పారు ఆమె.
ఆమె చెప్పిన హీరో హీరోయిన్ల పేర్లు వింటూనే నా అదృష్టానికి పొంగిపోయాను.
మేము రామోజీ ఫిలిం సిటీలో లోకేషన్ కి చేరుకునేసరికి ఉదయం ఏడు గంటలు అయింది.
వ్యాన్ దిగిన వెంటనే కళాకారులందరం క్యాస్టింగ్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాము.
మమ్మల్ని అందరినీ చూసి అతని సంతృప్తితో తలపంకించాడు.
ఎవరెవరితోనో ఫోన్ మాట్లాడుతూనే శ్రీనివాసన్ అందరిలోనూ, ముఖ్యంగా పూర్తి తెల్ల జుట్టుతో ఉన్న నన్ను పైనుంచి కిందదాకా చురుగ్గా గమనిస్తూనే ఉన్నాడు.
ఫోన్ మాట్లాడడం పూర్తయ్యాక నా దగ్గరగా వచ్చి "మీరు డైలాగ్స్ చెప్పగలరా సార్ " అని అడిగాడు శ్రీనివాసన్.
అంటే నా వీడియో క్లిప్పింగ్స్ అతనికి నచ్చాయన్నమాట.
" నేను డైలాగ్ ఆర్టిస్ట్ని బాబు" అన్నాను తన్నుకొస్తున్న సంతోషాన్ని ఆపుకుంటూ.
"మీరు..... మీరు తీసుకొచ్చిన డ్రెస్సెస్ చూపించండి"అని అడిగాడు కళాకారులందర్నీ.
అందరం చూపించాం. అతను సంతృప్తి వ్యక్తం చేశాడు.
మరో అరగంటలో అందరమూ వెళ్ళి కాఫీ ఫలహారాలు స్వీకరించి వచ్చాం.
అసిస్టెంట్ డైరెక్టర్ మా దగ్గరగా వచ్చి మా ఆహార్యం ఎలా ఉంటుందో వివరించి దానికి తగ్గ బట్టలు ధరించి తనకు చూపించమన్నాడు. అరగంటలో మేమంతా తయారయ్యి మేకప్ వేసుకున్నాము. మమ్మల్ని చూసి అసిస్టెంట్ డైరెక్టర్ సంతృప్తిపడ్డాడు.
దాదాపు పది గంటల ప్రాంతంలో మూడు కారవాన్ లలో హీరో,హీరోయిన్లు, ఇతర ప్రముఖ పాత్రల నటులు వచ్చారు.
అందరమూ షూటింగ్ జరిగేటువంటి ఇంటి వెలుపల ఆవరణలో కుర్చీలలో కూర్చున్నాము.
అప్పుడు అక్కడ చేరిన కళాకారులందరిని చూసి ఆశ్చర్యపోయాను. దాదాపు 100 మందికి పైగా ఉన్నారు.
వారిలో స్త్రీలు ఐదేళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ల ముత్తయిదువలవరకు ఉన్నారు. వాన్ దిగినప్పుడు పనిమనుషుల బృందంలా ఉన్నవాళ్లు ఇపుడు ఉద్యానవనంలో సీతాకోకచిలుకల్లా ఉన్నారు.
ఇక మగవాళ్ళు అయితే తెల్ల పంచలు చొక్కాలు కట్టుకుని , తమ ఒళ్ళు తాము మోసుకొలేక, కొత్తగా నడక నేర్చుకుంటున్న చిన్నపిల్లల నడకతో, రొప్పుతూ ఆయాసపడుతూ నడిచేవారు కొందరైతే, 50 ఏళ్ళు వచ్చినా 35 ఏళ్ల కుర్రాళ్ళలా రంగులు వేసుకుని జూనియర్ పురోహితుల్లా మరికొందరు... తమకు పరిచయం ఉన్న వారితో తాము గతంలో నటించిన చిత్రాలలోని తమ ఫోటోలను ఒకరికొకరు చూపించుకుంటూ ఫోన్ నెంబర్లు షేర్ చేసుకుంటూ కనిపించారు.
అసిస్టెంట్ డైరెక్టర్ ముందుగా స్త్రీలందరినీ వారి వారి వయసుల ప్రకారం ఏడు ఎనిమిది రకాలుగా వర్గీకరించి అందర్నీ క్రమపద్ధతిలో పూజా మందిరం చుట్టూ వరుసల్లో కూర్చోబెట్టాడు.
హీరోయిన్ వారి మధ్యలోనుంచి వచ్చి తనకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థానంలో కూర్చుంది. పాట షూటింగ్ అంతా పూర్తి అయ్యేసరికి మధ్యాహ్నం రెండు గంటలు అయింది.
ఈలోగా క్యాస్టింగ్ డైరెక్టర్ మమ్మల్ని వెళ్లి భోజనాలు చేసి రమ్మన్నాడు.
పాట పూర్తయిన అనంతరం అక్కడే జరిగిన సన్నివేశంలో ముందుగా క్యారెక్టర్ ఆర్టిస్టులందరికీ ఐదు కుర్చీలు వేసి, వారి వెనుక స్థానాల్లో మమ్మల్ని ఒక పద్ధతి ప్రకారం కుర్చీల్లో కూర్చోబెట్టారు.
అప్పటికే సూపర్ హిట్ చిత్రాలు తీసిన డైరెక్టర్ గారి క్రమశిక్షణాయుతమైన దర్శకత్వంలో అక్కడికి చేసిన ఐదుగురు పాత్రధారులు అత్యద్భుతంగా సన్నివేశాన్ని రక్తిగట్టించారు.
దాదాపు 7 గంటల ప్రాంతంలో షూటింగ్ పూర్తి అయిపోయింది.
మేకప్ తీసేసి ఎవరి దుస్తులు వాళ్ళు ధరించి, వచ్చిన వ్యానుల్లోనే వారిని ఎక్కి కూర్చోమన్నారు.
వెళ్తున్నాం అని చెప్పడానికి కూడా క్యాస్టింగ్ డైరెక్టర్ ఎక్కడా కనిపించలేదు.
అప్పటికి అర్థమయింది నాకు... మా ఏడుగురు కళాకారులను ఎందుకు తీసుకొచ్చారో. నా నరాలన్నీ కుంచించుకుపోయినట్లుగా అనిపించి తీవ్రమైన నడుము నొప్పితోపాటు నన్నెవరో తీవ్రంగా అవమానించిన బాధ.
ఒక్కసారిగా నేను నమ్ముకున్న అలనాటి నాటకరంగం సమాజానికి ఏరకమైన సేవలు అందించిందో గుర్తు చేసుకుంటూ ఆలోచనలో పడ్డాను.
ఆనాటి నాటక రంగం మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబంమై నిలిచింది.
ఆ కాలంలో నాటకాలు ప్రజలకు వినోదం మాత్రమే కాక, ఆలోచనకు, మార్పుకు దారితీశాయి.
సామాజిక, నైతిక, ఆధ్యాత్మిక విషయాలను సులభంగా ప్రజల ముందుకు తెచ్చిన ప్రధాన వేదికగా నిలిచాయి.
పౌరాణిక, చారిత్రక కథలను ఆధారంగా తీసుకుని రచించిన నాటకాలు ధర్మం, న్యాయం, సత్యం వంటి విలువలను ప్రతిపాదించాయి. నటులు, రచయితలు, సంగీతకళాకారులు సమిష్టిగా పనిచేసి నాటకాలను జీవంగా నిలిపారు.
అప్పటి సాంకేతిక పరిమితుల మధ్య కూడా కళాకారులు తమ హావభావాలతో, స్వరమాధుర్యంతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు. నాటకరంగం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చక్కని ప్రజాదరణ పొందింది.
సమాజంలోని దురాచారాలను, మూఢనమ్మకాలను తొలగించి, అవగాహన పెంచడంలో కూడా నాటకాలు కీలక పాత్ర పోషించాయి.
మొత్తానికి, ఆనాటి నాటక రంగం తెలుగు సంస్కృతికి పునాది వేసిన సజీవ కళారూపం. అది మన విలువలకూ, మనసులకూ వెలుగునిచ్చిన అజరామరమైన సాంస్కృతిక సంపద.
అటువంటి రంగస్థలం మీద ధైర్యంగా గంటలసేపు నవరసాలు పలికించి దాదాపు 12 సార్లు పరిషత్తులలో ఉత్తమ నటుడు అనిపించుకున్న నా 15 ఏళ్ల నాటకానుభవానికి దక్కిన గౌరవం ఇదా!
నటరాజుకు నిజమైన భక్తులుగా మేము చేసిన కళాసేవకు ఈనాటి సినిమాకళకు అసలు పోలిక ఉందా? ఏమో! ఆ నటరాజుకే తెలియాలి. నాకు తెలియకుండానే నా కళ్ళ నుంచి జారిన ఆశృవులు మనసులోని నటరాజస్వామి పాదాలను అభిషేకిస్తున్నట్టుగా చొక్కాపై ఇంకిపోయాయి.
మాతో బయలుదేరిన వేన్ మేము ఎక్కిన స్థానాల్లో మమ్మల్ని దిగవిడిచి వెళ్ళిపోయింది.
అబ్బాయి వచ్చి నన్ను ఇంటికి తీసుకు వెళ్ళాడు.
*******
ఇంటికి వెళ్లి భోజనం చేశాక సెల్ ఫోన్ తీసి
చూశాను. క్యాస్టింగ్ డైరెక్టర్ ఫోన్ పే చేసినట్టుగా 2000 రూపాయలు నా అకౌంట్లో జమైనట్టు సందేశం కనిపించింది.
" షూటింగ్ ఎలా జరిగింది నాన్న? " అబ్బాయి అడిగిన ప్రశ్నకి జరిగినది వివరించాను.
అంతలో శ్రీనివాసన్ ఫోన్ చేశాడు. మరలా ఎల్లుండి షూటింగ్ ఉందని. రావడానికి సిద్ధంగా ఉండమని.
అబ్బాయిచేత సమాధానం చెప్పించాను.
"బంధువులు ఎవరో పోవడంతో నాన్నగారు రేపు ఉదయం సొంత ఊరికి వెళ్ళిపోతున్నారు సార్ " అని.
అంతలో మనవడు ఎక్వేరియంనుంచి బయటికి తీసిన అరచేతిని చూపిస్తూ
" అయ్యో డాడీ. ఎక్వేరియంలో
బగారురంగుచేప చచ్చిపోయింది" అన్నాడు.
"అవును నాన్నా. చేప చచ్చిపోయింది"అని
విరక్తిగా నవ్వుకున్నాను.
సమాప్తం