*బాలి చిత్రానికి కథ*
ఉషోదయం
=========
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
గాఢనిద్రలో ఉన్న ఉష, మెలికలు తిరిగిపోతూ తన ఒడిలో తల వాల్చేసిన భర్తను చూసి ఉలిక్కిపడిన ఆమె చూపు, పక్కనే ఉన్న గ్లాసు, దాని పక్కనే ఉన్న ఉత్తరం మీద పడింది. అది తీసి ఆందోళనతో చదివింది.
"ప్రియమైన ఉషకి,
లక్షాధికారి వామనరావు గారి ఏకైక సంతానానివి నీవు. పత్రికలలో ప్రేమకథలు రాసే నన్ను ప్రేమించి, మీ వద్ద పనిచేసే డ్రైవర్నని తెలిసినా, మీ తల్లితండ్రులును ఎదిరించి నాతో వచ్చేసావు. మీ నాన్నగారి భయంతో నాకెవరూ ఉద్యోగం ఇవ్వడంలేదు. కథల్లో రాసినదానికి, వాస్తవానికి చాలా దూరమని తెలుసుకున్నాను. గతాన్ని మరచిపోయి, మీ నాన్నగారు కుదిర్చిన సంబంధాన్ని చేసుకుని హాయిగా జీవించు.
నీ
ఉదయ్.
"ఎంతపని చేసేవు ఉదయ్ !" అని ఘొల్లుమంటూ, తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తండ్రికి మెసేజ్ పెట్టి, గ్లాసులో మిగిలిన విషం తాగేసి, ఉదయ్ మీద వాలిపోయింది ఉష.
***** ***** ***** *****
మర్నాడు ఉదయం కాలింగ్ బెల్ శభ్దానికి ఉలిక్కిపడిన ఉదయ్, వెళ్లి తలుపు తీసాడు.
"చెప్పు, మా అమ్మాయి ఏది ?" ఆవేశంగా అతన్ని తోసుకుని, లోపలికి వెళ్ళేడు వామనరావు.
"ఏంటి సార్ ? ఏమయ్యింది ?"
"బాగానే నటిస్తున్నావు. చూడు మా ఉష పంపిన మెసేజ్" కోపంగా ఫోన్ చూపించాడు.
అందులో "అమ్మా నాన్నా, మీకు కడుపుకోత మిగిల్చి వెళ్లిపోతున్నందుకు క్షమించండి. వచ్చే జన్మంటూ ఉంటే మళ్లీ కలుద్దాం !" మెసేజ్ చదివిన ఉదయ్,
"ఒక్క నిమిషం ఉండండి సార్" అంటూ ఉష మొహం మీద నీళ్లు చల్లేటప్పటికి భారంగా కళ్ళు విప్పిన ఆమె,
"ఆత్మహత్య ఎందుకు తలపెట్టేవమ్మా?" అని అడిగిన తండ్రికి,
"ఇదిగో, ఇందుకు నాన్నా !" అంటూ ఉదయ్ రాసిన ఉత్తరం ఆయన చేతిలో పెట్టింది.
ఉత్తరం చదివి, "నిన్ను తప్పుగా అర్ధం చేసుకున్నా ఉదయ్. నిజంగా నీ ప్రేమ కల్తీ లేనిది. అందుకే భగవంతుడు నీకు కల్తీ విషం అందించాడు. ఇంటికి పదండి. ఇంక వ్యాపార బాధ్యతలు మీరే చూసుకోండి" అని ఇద్దర్నీ తీసుకుని ఉషోదయం వేళ, కార్లో ఇంటికి బయలుదేరాడు వామనరావు.
***** **శుభం** *****
(నేను రాసిన ఈ కథ విశాలాక్షి మాసపత్రికలో
జూన్ 2020 లో ప్రచురితమైనది)