మొండి బకాయి

లహరి సాహితీ వేదిక • 23 Mar 2026 • 👁 2 views
మొండి బకాయి (కథ )
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
(23/3/2026 లహరి సాహితీ వేదికలో ప్రచురితం )
“గేదెను కొనడానికి డబ్బులు తక్కువ పడ్డాయని నా దగ్గర పది వేలు అప్పు తీసుకుని రెండేళ్ళు కావస్తోంది. ఎన్ని సార్లు అడగడానికి వచ్చినా మొహం చాటేస్తున్నావు . ఇలా మోసం చేయడానికి నీకు సిగ్గు అనిపించడం లేదా ? ఆ గేదె వల్ల నువ్వేం బాగుపడతావో నేను కళ్ళారా చూస్తానులే !” అంటూ తీవ్రంగా శపించి వచ్చేశాడు ముని రత్నం.
నారాయణ గతంలో ఎప్పుడో కొన్నాళ్ళు మునిరత్నం ఇంట్లో పాలు పోసాడు. గేదెలు ఈనినప్పుడు జున్ను పాలు తెచ్చి ఇచ్చేవాడు. పేడతో చేసిన పిడకలు సప్లై చేసే వాడు. కేవలం ఆ పరిచయాన్ని పురస్కరించుకుని ఆ ఊళ్ళో పెద్ద మనిషి అయిన ముని రత్నాన్ని ఇంకొక్క కొత్త గేదెను కొనుక్కోవడానికి అవసరార్ధం డబ్బు అడగాల్సి వచ్చింది. ఇది జరిగి చాలా రోజులయ్యింది.
రెండేళ్లుగా ముని రత్నం నారాయణా వాళ్ళ గొడ్ల చావిడి దగ్గరకు వెళ్లి తన బాకీ గురించి గుర్తు చేస్తూ ఉండటం, నారాయణ ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటూ ఉండటం ఇద్దరికీ అలవాటైపోయింది.
జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేసినా, శక్తి దేవాలయాలలో నిమ్మకాయ డొప్పలో దీపం వెలిగించినా ఎటువంటి మొండి బాకీలైనా వసూలవుతాయి అని ఎవరో ప్రవచానాకారుడు టీవీలో చెప్పడం విని మునిరత్నం తన భార్యకు ఆ రెండు పనులు చెయ్యమని పురమాయించి , ఆ క్షణం నుండి నారాయణ ఇవ్వాల్సిన డబ్బు కోసం ఎదురు చూస్తున్నారు.
ఒక రోజు తెలతెల వారుతూ ఉండగానే మునిరత్నం ఇంటి తలుపు దబదబా చప్పుడవడంతో కళ్ళు నులుముకుంటూ బయటకు వచ్చిన అతనికి బయట నారాయణ గేదెతో పాటు నిలబడి ఉండటం గమనించాడు. .
“సార్ !మీ దగ్గర తీసుకున్న బాకీకి నలుగురి నోళ్ళల్లో పడిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. అందరూ అనుకున్నట్టుగా నేను పాడి పరిశ్రమ పెట్టి బోళ్ళు డబ్బులు వెనకేసుకోలేదు . ఎవరి శాపం తగిలిందో కానీ బాగా పాలు ఇచ్చే నాలుగు గేదెలు చనిపోయి ,వాడుకగా పాలు పోస్తున్న వాళ్ళందరికీ మానేసాను. మీకు తిరిగి ఇవ్వాలనుకున్న డబ్బు వెంటనే ఇవ్వలేకపోవడం అదంతా కేవలం నా ఆర్ధిక సమస్యలే తప్ప కావాలని చేసింది కాదు. మీరు మీ బాకీ కోసం చేసే రచ్చ చూస్తూంటే నాకు అవమానంగానే అనిపిస్తోంది. ఈ పరిస్థితులలో నేనో నిర్ణయం తీసుకున్నాను . నా దగ్గరున్న రెండు పాడి గేదేలలో ఒకదాన్ని మీకు అప్పగించి వెళ్దామని తీసుకొచ్చాను. దీన్ని మీరే సాకుకోండి . దీని పాలు వాడుకుంటారో, బయట అమ్ముకుంటారో మీ ఇష్టం. కానీ సరిగ్గా సంవత్సరం తర్వాత నా గేదెను వెనక్కి తీసుకుపోతాను. ఇది మీకిష్టం అయితేనే చెప్పండి. బంగారం లాంటి నా గేదెను ఇక్కడ వదిలేసి వెళ్తాను. . అయితే నా మీద కోపంతో దీనికి గడ్డి, తవుడు పెట్టక హింసించి బాధ పెడితే మటుకు ఆ పాపం జన్మ జన్మలకు కూడా మిమ్మల్ని పట్టుకుని వదలదు ...” అంటూ ఇంతకు ముందు తనని ముని రత్నం శపించిన దానికి రెండింతలు తిరుగు శాపం పెట్టి ముక్కు చీదుకుంటూ వెళ్ళిపోయాడు నారాయణ .
నారాయణ తనని దూషణ భూషణలతో చీత్కారంగా అవమానించినా, తను ఆశించిన దానికన్నా ఎక్కువగా ప్రతిఫలం కళ్ల ముందు కనిపించేసరికి అప్పటివరకు నారాయణ మీదున్న దురభిప్రాయాన్ని పక్కకు పెట్టి “ పోనీలే నారాయణకు ఇన్నాళ్ళకైనా బుద్దొచ్చింది. ఒక సంవత్సరం పాటు రెండు పూటలా పాలు పిండుకుంటే అతనికివ్వాల్సిన పదివేలేం ఖర్మ ? అంతకు రెండు రెట్లు ఎక్కువే సంపాదించుకోవచ్చు “అని అనుకున్నాడు మునిరత్నం మనసులో ఆనంద పడిపోతూ.
ఆ రోజు నుండి ఊరి బయట పచ్చిక బయళ్ళకు గేదెను తీసుకెళ్ళి తనే స్వయంగా గడ్డి మేపడమే కాకుండా, తన దొడ్లో ఒక గోడ పక్కన పెద్ద ఎత్తున ఎండు గడ్డి మోపులు వేయించాడు. మంచి మేలు రకం తౌడు బస్తాలు తెప్పించి క్రమం తప్పకుండా గేదెకు కుడితి పెట్టిస్తున్నాడు. పాలు ఎక్కువ రావడానికి తెలగపిండి, వేరు శనగ, పత్తి ,నువ్వుల చెక్కల లాంటి లాంటి పౌషికాహారం ఇస్తున్నాడు.
రానూ రానూ ఆశ్చర్యంగా గడ్డిమోపులు కరిగిపోతున్నాయి. తౌడు బస్తాలు అరాయించుకు పోతున్నాయి . రెండు లీటర్లకన్నా ఎక్కువ పాలు ఇస్తుందని నమ్మించి నారాయణ తన బాకీ కింద గేదెను అంటగట్టాడు . కానీ “నానాటికి తీసికట్టు నాగంభొట్లు “ అన్న సామెత మాదిరిగా గేదె మాత్రం మొదట అర లీటర్ పాలు ఇవ్వడంతో మొదలయ్యి మెల్లమెల్లగా పావు లీటర్ కన్నా తక్కువలోకి దిగిపోయింది. మేత ఎక్కువ పెడితే పాలు పెరగడం మాటెలా ఉన్నా దాని పేడ, మూత్రం మాత్రం ఎత్తి పారబోయలేక వాళ్ళ చేతులు పడిపోతున్నాయి. ఒక్కసారే కాకుండా మధ్యలో గ్యాప్ ఇచ్చి వాయిదాల పద్దతిలో పాలు పితికి చూడండి అని పక్క వాళ్ళు ఎవరో సలహా ఇస్తే ఒక గంట , రెండు గంటలు విరామం అనంతరం పాలు పితకడానికి చెంబు తీసుకెళ్ళే వాళ్ళు. చివరకు ఒక గ్లాసుడు పాలు వచ్చినా ఏ కాఫీనో కలుపుకుని తాగొచ్చన్న నిర్ణయానికొచ్చిన మునిరత్నం దంపతులకు ఒక్క చుక్క కూడా పాలు పెరగడం కాదు కానీ, దాని ఆగ్రహానికి గురయ్యి వెనక రెండు కాళ్ళతో తన్నులు తినాల్సి వచ్చింది. ఇలాంటి విపత్కర పరిస్థితిని చూస్తున్నాక మునిరత్నంలో రోజు రోజుకు నారాయణ మీద అసహనం , కక్ష పెరిగిపోసాగింది. .
పాలు ఇవ్వని గేదెకు దాణా కూడా ఎందుకు దండగ అని ఆ రోజు నుండి గేదెకు గడ్డి పెట్టడం, కుడితి తాగించడం తగ్గించేశాడు ముని రత్నం.
ఆ రోజు ఉదయం ఎప్పుడూ ఇచ్చే పావులీటర్ పాలు తియ్యడానికి ముని రత్నం భార్య వెళ్లి కళ్ళు తేలేసి, గోడపక్కకు సొమ్మసిల్లి కాళ్ళు రెండూ పైకెత్తేసి పడి ఉన్న గేదెను చూసి కెవ్వున అరిచి కుప్పకూలిపోయింది.
క్షణాల్లో ఆ వార్త నారాయణకు తెలియడం , మునిరత్నం ఇంటికి ఆఘమేఘాల మీద పరిగెత్తుకు వచ్చాడు. నిస్తేజంగా పడిఉన్న గేదెను చూసి నారాయణ గుండె బాదుకుంటూ “నిక్షేపం లాంటి రెండు లీటర్లు పాలిచ్చే దుక్క లాంటి గేదెను పొట్టనెట్టుకున్నారు కదయ్యా ! మీరు నాకన్నా బాగా చూసుకుంటారనే భరోసాతోనే కదా మీకు వదిలి వెళ్ళింది ? అది కానీ ఇంకో రెండు రోజులు మీ దగ్గర ఉండి ఉంటే సీదా కబేళానికి మీ చేతుల మీదగా పంపించేసే నా మీద కసి తీర్చుకునే వాళ్ళు. నేను బాకీ తీర్చలేదనే కోపంతో దీనికి సరిగ్గా గడ్డీ, మేత పెట్టారో లేదో అనే అనుమానం నాకొస్తోంది. ఎంత మూగ జీవి అయినా కూడా ఇంత బాధ పెడతారా ? మనం కడుపు నిండా మూడు పూటలా మెక్కుతున్నాం కదయ్యా ! వేళకు క్రమం తప్పకుండా తన రక్తాన్ని పాలుగా మార్చి మీ కడుపులు నింపుతుండే నా గేదెకు ఇంత ద్రోహం తలబెడతారా? ఈ రోజుల్లో గేదెను కొనడం మాటలా ? మీరేం చేస్తారో నాకు తెలియదు గుట్టు చప్పుడు కాకుండా ఒక ఇరవై వేలు పారేస్తే ఏదో రకంగా నా గేదెకు వైద్యం చేయించుకుంటాను. ఏమో అప్పటికీ బ్రతుకుతుందో లేదో కూడా ఎవరికి తెలుసు ? ఓషోస్ ! పొద్దునే ఎంత ఘోరం చూడాల్సి వచ్చింది ? ఎన్నో గేదెలను నా చేత్తో పెంచిన వాడిని. నేనెప్పుడూ ఇటువంటి అఘాయిత్యాలు ఎరుగను. ..” అంటూ నారాయణ ముని రత్నాన్ని ఒక అరగంటసేపు ఊపిరాడకుండా ఆడిపోసుకోవడం అక్కడ మూగిన జనం అంతా ప్రేక్షకులై వీక్షించారు.
ఇదంతా చూస్తున్న మునిరత్నం భార్య మెల్లిగా మొగుడి చేతిని గిల్లి “ నారాయణ అడిగింది ఇచ్చేయండి. అది మన దొడ్లో కానీ ఇప్పుడు చచ్చిందంటే ఇంకా నానా రభస చేసి దాని రేటు పెంచేసినా పెంచేస్తాడు ..” అని చెవిలో గుసగుసలాడటంతో దిక్కుతోచని పరిస్తితిలో అప్పటికప్పుడు మునిరత్నం నారాయణ చేతిలో అతను అడిగిన డబ్బునంతా పోసేసి “ ముందు ఆ గేదెను ఇక్కడ నుండి తీసుకుపో నారాయణా ! చిన్న పిల్లలు చూస్తే దడుచుకుంటారు..” అంటూ లోపలి వెళ్లి తలుపు మూసుకున్నాడు.
** ** ** **
చూస్తూ చూస్తూ తన దగ్గరున్న ఒక ముసలి గేదెకు తిండి పెట్టక చంపలేక , కొన్నాళ్లుగా తలపట్టుకుని సతమతమవుతున్న నారాయణకు సమస్య మునిరత్నం రూపంలో పరిష్కారం కావటమే కాకుండా, అతనికి ఇవ్వాల్సిన పాత బాకీ కూడా ఊహకందకుండా పైసలవ్వడంతో పాటు అదనంగా మరో పదివేలు లాభం కూడా తెచ్చిన తన ముద్దుల ముసలి గేదెకు మనసారా హారతులు పట్టాడు నారాయణ ****
సమాప్తం