“సుందరో పాఖ్యానం"

ఉషా పక్ష పత్రిక • 30 Apr 2026 • 👁 2 views
సుందరో పాఖ్యానం"
(కామెడీ కథ)
రచన : జీడిగుంట నరసింహమూర్తి
(ఉషా పక్ష పత్రిక ప్రత్యేక సంచిక (1-15&16-30) లో ప్రచురితం )
"ఎవరండీ ఇంట్లో సుందర్రావు ఉన్నాడా?"
అంటూ ఇప్పటికి ఏభై మంది వచ్చి
అడిగారు. ఎందుకు మీరంతా ఆయన వెనుకబడ్డారు ? ఆయన ఏం చేశాడు? ఈ వీధిలో నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు సుందర రావులు ఉన్నారు. నా పేరులో కూడా సుందరం అయితే ఉంది గానీ అసలు పేరు సుందరశివరావు. ఇంతకీ మిమ్మల్ని ఎవరు పంపిస్తున్నారు మా ఇళ్ల మీదకి?
నిన్నటి నుంచి ఒకటే గోల. ప్రతివాడు రావడం సుందర్రావు ఉన్నాడా అని అడగటం. విషయం ఏమిటో మాత్రం చెప్పరు. ఇంట్లో అనారోగ్యంగా ఉన్న మా తండ్రి గారు రేపా మాపా అన్నట్టుగా ఉన్నారు. ప్రతివాడు ఇలా వచ్చి తలుపులు బాదుతూ ఉంటే మాకు చివరి చూపులు కూడా దక్కేటట్టుగా లేదు " అంటూ కస్సుమని ఎగిరిపడ్డాడు సుందరశివరావు.
" ఏమీ అనుకోకండి సార్. మేము వెతికే సుందర రావు మీద పోలీసు వారెంట్ ఉంది. గత నెల రోజులుగా ఎవరికి దొరక్కుండా తప్పించుకుంటున్నాడు. ఈమధ్య పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ప్రకటన చేసింది ,ఎవరైతే సుందర్రావు ఆచూకీ తెలుసుకొని సమాచారం అందిస్తారో వారికి ఏభై వేల రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. మరి ప్రతి వాడికి డబ్బు మీద ఆశ ఉంటుంది కదా అందుకనే ఎక్కడైతే సుందర్ రావు పేరుగల వాళ్ళు ఉన్నారో వాళ్లని గాలించి పట్టుకుని ఆ బహుమానాలు కొట్టేయాలని ఈ మా ప్రయత్నం.. అందులో ఆ నిందితుడు ఎవరో ఆ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. మా డ్యూటీ ఆ పేరు గల వాళ్లను అప్పగించడం వరకే.
అదిగో దూరం నుంచి ఎవరో మీ ఇంటి వైపు వస్తున్నారు బహుశా సుందర్రావు ఉన్నాడా అని అడగడానికే అయి ఉంటుంది .మీరు ఏమీ తెలియనట్టుగా ఉండండి .ఏదైనా క్లూ దొరికితే ఆ బహుమానం కొట్టేసే దొంగలు ఉన్నారు" అంటూ ఆ వచ్చిన వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. , పీడా వదిలిందనుకుని సుందర శివరావు తలుపులు మూసేసాడు.
మళ్ళీ ఎవరో తలుపులు బాదేస్తున్నారు.
విసుక్కుంటూ వెళ్లి తలుపు తీశాడు.
"సార్ ఈ లైన్లో ఎవరేనా సుందరరావు పేరుగల వాళ్ళున్నారా ? " అంటూ అడిగాడు ఆయన.
"చంపేస్తున్నారు కదయ్యా బాబు! ఇటువంటి సమస్యలు మా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అసలు ఏ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది ఇలా వెతికి పట్టుకోమని. ఆ చేసేదేదో వాళ్లే చేయొచ్చు కదా. లేకపోతే పోస్ట్ మ్యాన్ ను అడిగితే తెలిసిపోతుంది. అయితే నాకు తెలిసిన బాల సుందర రావు అనే అతను ఇక్కడ పార్క్ పక్కన ఉన్న ఇండిపెండెంట్ ఇంట్లో ఉంటున్నాడు. వెళ్లి కాసేపు ఆయన్ని ఏడిపించండి. మీరు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆశ చూపిస్తున్న డబ్బు కోసమే అయితే ముందే చెపుతున్నాను.మీ అందరికీ ఇంత టైమ్ వెచ్చించి ప్లాన్స్ ఇచ్చే నాకు కూడా ఎంతో కొంత ముట్టచెప్పాలి.అసలే నాది ప్రైవేట్ ఉద్యోగం. వెట్టి చాకిరీ తప్ప ఏమీ సాధించేది లేదు .." అంటూ ఆశగా వచ్చినాయన కళ్ళల్లోకి చూసాడు.
" ముందు ఆ సుందర రావును పట్టుకొనివ్వండి మహాశయా ! వెధవ డబ్బు కోసం కక్కుర్తి పడి ఈ పనికి ఒప్పుకున్నాము.అసలు తనని మేము ఇలా వలవేసి పట్టుకోవాలని చూస్తున్నామని తెలిస్తే మా శాల్తీ లే గల్లంతయ్యే అవకాశం ఉంది. సరే కానీ పార్క్ పక్కన ఇండిపెండెంట్ ఇల్లా ?.మీరు చెప్పేది పక్కాయేనా? అయ్యబాబోయ్ ఎవరో ఇద్దరు ఇటువై పే వస్తున్నారు. వాళ్ళు కూడా ఆ ఏబై వేల కోసమే అనుకుంటా. దయచేసి క్లూలు ఇవ్వకండే .నా పొట్ట కొడతారు ..." అంటూ అక్కడ నుండి జారుకున్నాడు.
సాయంత్రం అయ్యేటప్పటికీ ఆ కాలనీలో జనాలు అంతా ఒకచోట చేరారు. ఎవరో గజదొంగ గంగుల ముఠా వచ్చి ఇళ్లమీద పడినట్టు సుందర్ రావు అనే పేరు ఉన్న ప్రతి ఇంటి మీద పడి నేరస్తుడిని చూసినట్టు చూస్తూ ప్రశ్నలు వేస్తున్నారు. సుందర్ రావు పేరు పెట్టుకోవడం కూడా తప్పా ? అసలు ఇదేం పద్ధతి ? ఈ కాలనీలో మమ్మల్ని మనశ్శాంతిగా బతకనిస్తారా లేదా ? ఇలా అయితే మేము పోలీసులను సంప్రదించాల్సి ఉంటుంది" అన్నారు అక్కడ వాళ్ళు ఉద్రేకపడి పోతూ.
"పోలీసులను సంప్రదిస్తారా నాయనా వెళ్ళండి ..వెళ్ళండి ..డైరెక్టుగా బొక్కలో వేసేస్తారు" అని ఆ వచ్చిన వ్యక్తి అంటుంటే అక్కడ వాళ్ళు అయోమయంగా చూస్తూ నిలువునా వణికిపోవటం మొదలుపెట్టారు .
" మీలో సుందర్రావు పేరులు ఉన్న వారంతా నాతో పాటు వెనక వస్తె ఆయన ఎవరో పెద్దపెద్ద బహుమానాలు ఇస్తానని ప్రకటించాడు. ఆ ఛాన్స్ ఎందుకు వదులుకుంటారు ?." అంటూ పదిమంది సుందర్ రావులకు ఆశ చూపించి వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాడు అతను.
"సార్ ఈ కాలనీలో ఉన్న మొత్తం సుందరావులందర్నీ ప్రలోభపెట్టి తీసుకొచ్చేశాను .ఇక వీరిలో మీకు కావాల్సిన నిందితుడు ఎవరున్నారో చూసుకొని ఆ బహుమతి సొమ్ము నాకు ఇప్పించండి బాబు" అంటూ పోలీస్లను వేడుకున్నాడు అతను.
" గ్రేట్ అయ్యా బాబు. ఈమధ్య ఫండ్స్ ప్రాబ్లం వచ్చి మాకు జీతాలు సరిగ్గా రావట్లేదు అందుకనే రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక నీలాంటి బకరాలను కొంతమందిని ఇలాంటి కేసులు పట్టుకోవటానికి ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది .. మంచి లాజిక్ ఉపయోగించి సుందర్ రావ్ అనే పేరుగల అందరినీ మా దగ్గరికి తీసుకువచ్చి మంచి పని చేశావు.
ఇక మాకు కావాల్సిన ఆ నిందితుడు ఎవరో ఒక్కొక్కరికి థర్డ్ డిగ్రీ
ఇచ్చి వాళ్ళ అంతు తేల్చుకుంటాం..." అన్నాడు పక పకా నవ్వుతూ ఆ ఆఫీసర్.
" సార్ మీకే జీతాలు సరిగ్గా రావటం లేదు అంటున్నారు ఇక మాకుబహుమతి ఏమిస్తారు ? చూస్తుంటే మీకు కంచి గరుడ సేవ చేసినట్టు అయిపోయింది. కాస్త "టీ "డబ్బులు అయినా ఇచ్చి పంపించండి బాబు మీ పుణ్యం ఉంటుంది" అన్నాడు సుందర్రావు లను పోగేసుకుని వచ్చిన వ్యక్తి.
ఆఫీసర్ మళ్ళీ పకపకా నవ్వాడు. ఇంకా నవ్వుతూనే ఉన్నాడు.
" ఏమిటి పట్టపగలు ఆ నవ్వులు?. ఏం జరిగింది రిటైర్ అయిపోయాక మీకు కలవరింతలు ఎక్కువైపోయాయి" అంటూ ఆ రిటైర్డ్ ఆఫీసర్ భార్య బకెట్ నీళ్ళు మొహం మీద పోసింది.ఆయన వణుకుతూ " ఏంటో సర్వీసులో ఏవేవో పిచ్చి పనులు చేసేసాం. అవన్నీ ఇప్పుడు కలల రూపంలో వస్తున్నాయి. అయితే ఈ వెతకడాలు,బహుమతులు ప్రకటించటం అంతా కల్లో వ్యవహారం అన్నమాట .అబ్బ.ఇంత పూర్తి అసహజ సంఘటన తన సర్వీసులో ఎప్పుడూ చూడలేదు " అంటూ తలచుకుని తలుచుకుని నవ్వేశాడు ఆ రిటైర్డ్ ఆఫీసర్. ఇంతకీ యాదృచ్ఛికంగా ఆయన పేరు కూడా సుందర్రావే**""
సమాప్తం