కథ : డియర్ ఫ్యామిలీ
ఎప్పటిలాగే ఆరోజు అలారం మోగింది. లేవాలని మనసు చెబుతున్నా, శరీరం సహకరించడం లేదు. మూతపడ్డ కళ్ళు తెరుచుకోవడం లేదు. ఎవరో కొట్టి పడేసినట్టు ఒళ్ళంతా నొప్పులు.
'కనీసం ఎవరైనా వేడివేడి కాఫీ పెట్టిస్తే బాగుండు' అని జగదీష్ మనసులో అనుకుంటున్నాడు . రెండేళ్లుగా జగదీష్ ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉండి ఇంటికి వెళ్దాం అనుకుంటూనే పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు.
రోజు ఒకేలా ఉంటే చెప్పుకోవడానికి ఇంకేముంది. కష్టాలు అనేవి చెప్పి రావు. అలానే సాఫీగా సాగిపోతున్న జగదీష్ లైఫ్లో జ్వరం అనే కష్టం చెప్పా పెట్టని అతిథిలా వచ్చేసింది.
ఊర్లో ఉంటే అమ్మ చూసుకునేది. ఒంటరిగా హైదరాబాదులో రూమ్లో ఉండడం వల్ల సాయం చేసే దిక్కు లేక మంచం మీద మూలుగుతున్నాడు.
హైదరాబాద్ వచ్చిన కొత్తలో తన స్నేహితులతో పాటు షేరింగ్ రూమ్లో ఉండేవాడు. అందరితో ఇమడలేక ఒంటరిగా సింగిల్ బెడ్ రూమ్ హౌస్కి మారిపోయాడు.
నలుగురితో ఉన్నప్పుడు ఒంటరితనాన్ని కోరుకుంటాం. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ నలుగురి విలువ తెలుస్తుంది.
ఇప్పుడు జగదీష్ పరిస్థితి అదే... లేవలేక అవస్థ పడుతూ, ఓపికనంతా కూడగట్టుకొని మెల్లగా వంటింట్లోకి వెళ్ళాడు. చేతిలో ఓపిక లేక పాల గిన్నె చేయజారి కింద పడిపోయింది.
కింద పడిపోయిన పాలను శుభ్రం చేస్తున్న జగదీష్ కి ఇల్లు బాగా గుర్తొచ్చింది. ఇంట్లో తానే మగపిల్లాడు. ఇద్దరు ఆడపిల్లల తర్వాత పుట్టాడని ఎంతో గారాబం. ఇక తాత అమమ్మ, పిన్ని, పెద్దమ్మ అందరూ దగ్గర దగ్గర ఇళ్ళలోనే ఉండేవారు. పండగ వచ్చిందంటే అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లిపోయే వాళ్ళు. ఇల్లంతా సందడిగా ఉండేది.
అలా పాత రోజులను గుర్తు చేసుకుంటూ ఫ్లోర్ శుభ్రం చేశాక, కాఫీ కలుపుకొని సోఫాలో కూర్చొని, మొబైల్ చూస్తూ ఇంటికి ఫోన్ చేసి అందరితో మాట్లాడాలి అనుకున్నాడు. అంతలోనే 'ఇంటికి వెళ్ళ్ళి రెండు సంవత్సరాలు పైనే అవుతుంది. ఇంటికి వెళితే అందర్నీ చూసినట్టు ఉంటుంది' అని అనుకున్నాడు.
జగదీష్ చేస్తున్న కంపెనీలో ఒక మంచి ప్రాజెక్టులో జగదీష్ ను వేశారు. ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే తనని అమెరికా పంపిస్తానని టీం లీడర్ చెప్పడంతో రాత్రిపగలు ప్రాజెక్టులో కష్టపడుతున్నాడు జగదీష్.
ఈ ప్రాజెక్టులో చేరినప్పటి నుంచి తినటానికే సమయం దొరకక ఇంటి నుంచి ఫోన్లు వచ్చినా ఎత్తకుండా బిజీగా ఉండడంవల్ల తను మాట్లాడలేకపోతున్నానని మాట దాటేస్తూ వచ్చాడు.
అందుకే అందరూ జగదీష్ మీద చాలా కోపంగా ఉన్నారు. ఫోన్లో మాట్లాడే కంటే అందర్నీ సప్రైజ్ చేయాలని చెప్పా పెట్టకుండా బయలుదేరాడు.
ఇంటికి చేరుకున్న జగదీష్ కి మొదటి రోజున ఉన్న ఆనందం మరుసటి రోజు కనిపించలేదు.
అమ్మానాన్న హాల్లోనే కూర్చుని ఉన్నా ఎవరి ఫోన్లో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. అక్కలు టిక్ టాక్ చేసుకుంటున్నారు.
ఇంట్లో బోర్ కొడుతుందని, అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాడు. అక్కడ పరిస్థితి అంతే...వంటింట్లో అమ్మమ్మ కూడా టీవీ సీరియల్ చూస్తూ వంట చేస్తోంది. తాతయ్య మంచం మీద పడుకొని చాగంటి గారి ప్రవచనాలు వింటున్నాడు.
జగదీష్ వెళ్లిన రెండు రోజులకి వినాయక చవితి పండుగ వచ్చింది. పిన్ని, పెద్దమ్మ కుటుంబంతో సహా వస్తారు అనుకున్నాడు.
కానీ ఎవరి ఇంటిలో వాళ్లే పండుగ జరుపుకున్నారు.ఎవరూ రాలేదు.
ఒకప్పుడు పండగ అంటే ఇంట్లో హడావిడి మామూలుగా ఉండేది కాదు. అమ్మమ్మ చేసే పాలతాళికలు అంటే అందరికి ఎంతో ఇష్టం. వినాయకచవితి పండగ వస్తె ముఖ్యంగా పాలతాళికల కోసమే అమ్మమ్మ ఇంటికి వచ్చేవారు.తాతయ్య మండపం డెకరేషన్ చాలా బాగా చేసేవారు. పిల్లలందరితోను పనులు చేపిస్తూ బొజ్జ గణపయ్య కథలను చెప్పేవారు.
సాయంత్రం అయితే చాలు అమ్మ పిల్లలందరినీ గదిలో పెట్టేసేది.చంద్రుని చూస్తే నీలాప నిందలు వస్తాయని మేడ మీదకు అస్సలు వెళ్ళనిచ్చేది కాదు.
అందరం సముద్రం ఒడ్డుకు వెళ్ళి గణేషుడిని నిమర్జనం చేసి కాసేపు అక్కడే మట్టిలో అడుకొని ఇంటికి వచ్చేవాళ్ళం.
కాలం ఎంత త్వరగా పరుగులు పెడుతుంది. ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళం అయిపోయాం. అక్కలకు పెళ్లిళ్లు అయిపోయాయి. నేను జాబ్ మీద హైదరాబాద్ వెళ్ళిపోయాను. మొన్నటివరకు అందరూ ఎంత బాగుండేవారు. ఇప్పుడు అన్ని మారిపోయాయి. పండగ వాతావరణమే కనిపించడం లేదు.
క్షణం తీరిక లేదు దమ్మిడి ఆదాయం లేదు అన్నట్టు ఎవరికి వాళ్ళే ఫోన్లో తీరిక లేకుండా ఉన్నారు. ఒకే ఇంట్లో ఉంటున్న అమ్మ నాన్న... ఒకే ఊర్లో ఉన్న అమ్మమ్మ తాతయ్య వీళ్లు కూడా దూరం దూరంగానే బ్రతుకుతున్నారు. మనుషులు దగ్గరగా ఉన్నా వారి ప్రపంచాలు వేరు వేరుగా ఉన్నాయి.
ఇంతలో టింగ్ టింగ్ అనే మెసేజెస్ వచ్చాయి. ఫోన్లో వాట్సాప్ గ్రూప్లో అమెరికాలో ఉన్న తన ఫ్రెండ్స్ అందరూ గెట్ టు గెదర్ అయిన ఫొటోస్ ని పెడుతున్నారు.
వినాయక చవితి రోజు దగ్గర ప్రాంతాలలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ
కలిశారు. ఎంత చక్కగా చీరలు, పంచలు కట్టుకొని, అన్ని రకాల ప్రసాదాలు చేసి చక్కగా గణపతికి పూజలు చేసిన ఫోటోలను పెడుతున్నారు.
ఆ ఫోటోలను చూసిన జగదీష్ ,కుటుంబ విలువలు, ప్రేమలు, ఆప్యాయతలు, అన్ని మరిచిపోయి పేరుకే నాలుగు గోడల మధ్య వస్తువుల వలే బతికేస్తున్న తన వారిని చూసి మనసులో బాధపడ్డాడు. ఒకప్పుడు నేను కూడా సంపాదనలో పడి అందర్నీ దూరం చేసుకొన్నాను. ఇప్పుడు కావాలనుకున్నా, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. తన తప్పును తాను తెలుసుకున్న జగదీష్ ఈ సమస్యకు పరిష్కారంగా మార్పు తనతోనే రావాలని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు.
చిందరవందరగా మారిన తన కుటుంబాన్ని మళ్ళీ ఒక దారికి తేవాలని నిశ్చయించుకున్నాడు.
అనుకున్నదే తడువుగా నెట్ కనెక్షన్ కట్ చేశాడు. అయినా ఎవ్వరూ స్పందించ లేదు. చక్కగా ఫోన్ డేటా ఉపయోగించుకుంటున్నారు.
ఇంతలో అమ్మా...! అని గట్టిగా గావుకేక వేస్తూ జగదీశ్ కింద పడిపోయాడు.
ఒక్క సారిగా జగదీశ్ అలా మైకంతో కింద పడిపోవటం చూసి కంగారుగా అందరూ పరుగున వచ్చారు.
జగదీశ్... జగదీశ్ అని ముఖం మీద నీళ్ళు చల్లారు. అందరూ ఆతృతగా ఏమైందో అని జగదీశ్ వంక చూస్తున్నారు.
చుట్టూ చేరి కంగారు పడుతున్న అందరిని ఒంటి కన్నుతో గమనిస్తూ మెల్లగా కళ్లు తెరిచి పక్కున్న నవ్వేశాడు.
జగదీశ్ చేసినా తొంటరి పనికి కోపగించుకున్నారు.
ఫోన్కి బంకమట్టిలా అతుక్కు పోయిన కుటుంబ సభ్యులందరినీ ఒక చోటకు చేర్చేందుకే తానిల నాటకం ఆడాల్సి వచ్చిందని చెప్పాడు. జగదీష్ మాటలు విన్నాక ఒక మంచి కార్యం కోసమే నాటకం ఆడాడని అందరూ క్షమించేశారు.
అలా అందరూ ఒకచోటకు చేరి కబుర్లు చెప్పుకున్నారు. జగదీష్ తన ఫోన్ తీసి విదేశాలలో ఉన్న తన స్నేహితులు ఎలా గణపతి పూజ జరుపుకున్నారో చూపించాడు.
తన గూగుల్ పిక్స్లో ఉన్న కుటుంబ సభ్యుల పాత ఫొటోస్ని చూపించి ఒకప్పటి వారి అనుబంధాలను గుర్తు చేశాడు.
స్వయంగా తానే పిన్ని పెద్దమ్మ ఇంటికి వెళ్లి వాళ్లతో కలిసి రెండు రోజులు గడిపి వచ్చాడు. అలా అందరిని కల్పుకుంటూ సంతోషాలను పూయించాడు.
మార్పు అంటే ఉన్నదాన్ని వదిలి లేని వాటిని ఆపాదించుకోవడం కాదని ,మన సంతోషం మన చేతిలోనే ఉంటుందని
అందరూ అర్థం చేసుకున్నారు. తమ తప్పును తాము తెలుసుకొని, మనుషులను దూరం చేసిన ఆ ఫోన్ని పక్కన పెట్టేసి జరిగిన పొరపాటును సరిదిద్దుకొని అందరూ జగదీష్ ఉన్న వారం రోజులు కలిసిమెలిసి సంతోషంగా గడిపారు.
- జ్యోతి మువ్వల