ఏది నిజం ?

లహరి సాహితీ వేదిక • 15 May 2026 • 👁 2 views
“ ఏది నిజం?” ( కథ)
రచన : జీడిగుంట నరసింహ మూర్తి
15/5/2026 సాహితీవేదిక వార పత్రికలో ప్రచురితం
“ఏమిటిరా అన్నం తినకుండా అలా కూర్చున్నావ్?” సోమశేఖరం గట్టిగా అడిగాడు.
సారధి ఎదుట విస్తరిలో పొగలు కక్కుతున్న పనసకాయ కూర.
“ఇది… పనసకాయ కూరా?” అతని స్వరం కంపించింది.
“అవును రా! నీకిష్టమని ప్రత్యేకంగా చేయించాను,” అన్నాడు బాబాయి గర్వంగా.
సారధి చేతి వేళ్లు వణికాయి. ఒకప్పుడు ఈ కూర కోసం మారు వడ్డన అడిగేవాడు. ఇప్పుడు ఆ వాసనే అతనికి భయంగా అనిపిస్తోంది. సారధి మార్పు ఒక్కరోజులో రాలేదు. ఆ మార్పుకు మూలం — భక్తి పేరుతో మొదలైన భయం.
అతనికి భారత దేశంలో ఉన్న అన్ని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు చుట్టుముట్టి రావాలన్న కోరిక. ఆదాయ వనరులు అంతగా సహకరించకపోయినా సత్రాలలో సేదతీర్చుకుంటూ , గుళ్ళల్లో పెట్టిన ప్రసాదాలను తింటూ నెత్తిమీద భారీగా వ్యయభారం పడకుండా చూసుకునే వాడు. కొన్నిసార్లు తన మిత్ర బృందంతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ ఉండేవాడు. ఒక ప్రసిద్ధ క్షేత్రంలో అక్కడ ఒక వృద్ధుడు చెప్పిన మాట అతని మనసులో బాగా పాతుకుపోయింది.
“ఇక్కడికి వచ్చినవాళ్ళు తమకు అత్యంత ఇష్టమైన పదార్ధాన్ని వదిలి పెట్టి వెళ్ళడం చాలా కాలంగా వస్తున్న ఆచారం . అలా చేసిన వాళ్లకు జీవితం అంతా సుఖమయంగా గడిచిపోతుంది......” అని .
ఆ సమయంలో అతనికి బాగా ఇష్టమైన పనసకాయ కూర గుర్తుకొచ్చింది. ఆ తరువాత యాదృచ్ఛికంగా సమస్య పరిష్కారమైంది. అది సహజమో, కాలానుగుణమో కానీ తర్వాత ప్రతి యాత్రలో తనకు ఇష్టమైన ఏదో ఒక పదార్ధాన్ని వదిలి వచ్చే వాడు. వాటిలో తనకు బాగా ఇష్టమైన మజ్జిగపులుసు. అరటికాయ కూర, దొండకాయ కూడా ఉన్నాయి. ఆ యాత్రల్లో ఎవరో హెచ్చరించారు — “వదిలినదాన్ని పోరపాటునైనామళ్లీ తింటే పాపం వెంటాడుతుంది” అని. ఆ మాట అతని మనసులో ముల్లులా గుచ్చుకుంది.
ఆ రోజు బాబాయి ఇంట్లో జరిగిన చిన్న శుభకార్యం అతని జీవితంలో పెద్ద సంఘటన అయింది. “తిన రా! అలా పిచ్చి చూపులు చూస్తావేమిటి ?” అంటూ బాబాయి ప్రేమగా సారధివైపు చూసాడు. అది చూసి పక్కనే కూర్చున్న అతని చిన్న కుమార్తె అడిగింది — “నాన్నా… మీకు ఇష్టమే కదా ? ఎందుకు తినడం లేదు ?” అంటూ.
ఆ ప్రశ్నలో అమాయకత్వం ఉంది. అతని కళ్లలో మాత్రం గిల్టీ.
“నేను తినకూడదు” అన్నాడు కొంత కఠినంగానే. అప్పటికే అతను ఎన్నో విందుల్లో ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు కూడా విషయం ఏమిటో చెప్పకుండా అర్ధాకలితో బయటపడ్డాడు. భార్యా , పిల్లలు మాత్రం ఆ విందును ఆస్వాదిస్తూ తినసాగారు.
బయట కూర్చుని పేపర్లో తలదూర్చిన సారధిని అతని బాబాయి కదిపి చూసాడు. సారధి మొహం దిగులుగా మారింది.
“లేదు బాబాయి. ఇన్నాళ్ళు మీకు చెప్పని విషయం ఒకటుంది. నేను వెళ్ళిన ప్రతి యాత్రలోనూ అక్కడున్న పద్దతులను అనుసరించి మనకిష్టమైన ఏదో ఒక పదార్ధాన్ని వదిలెయ్యాలని తిరిగి జీవితకాలంలో మళ్ళీ ఎప్పుడూ ఎటువంటి పరిస్థితులలోనూ వాటిని ముట్టుకోకూడదు అన్న నిబంధన ఉండటంతో ప్రతివారికీ చెప్పుకోలేక అప్పటికీ ఎన్నో ఫంక్షన్లు మానేస్తూ వస్తున్నాను. నా ప్రవర్తన వల్ల ఎంతోమంది కోపగించుకున్నారు. నేను వాటిని వదిలేసిన విషయాన్ని ఎవరితోనూ చర్చించకూడదన్న నియమం కూడా ఉండటంతో ఇంతవరకు నేను ఎక్కడా పెదవి విప్పలేదు. మీరు నాకు కావలసిన వాళ్ళు. నాకు పాపం తగిలినా పర్వాలేదు. మొదటి సారిగా మీకు చెపుతున్నాను ..” అన్నాడు సారధి ఉద్వేగంగా.
“ఓహో అదన్న మాట విషయం. నువ్వేమీ కంగారు పడకు. నువ్వు చెప్పిన వాటి వెనుక ఒక తాత్విక సిద్ధాంతం ఉంది. అది ఎంతమంది ఆచరిస్తారో నాకు తెలియదు. కానీ నేను చదివిన ఎన్నో గ్రందాల సారాన్ని బట్టి చూస్తే మనం వదిలేయాల్సింది కూరలు కావు రా. అరిషడ్వర్గాలు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. వాటిని వదిలేయగలిగితే అదే నిజమైన త్యాగం. ఇది అర్ధం చేసుకోవడానికి అంత సులువైన విషయం కాదు. ముందు ముందు నీకే అర్ధమవుతుంది. పైగా నీకు ఈ వయసులోనే షుగర్ , బీపీల లాంటి రోగాలు ఉన్నాయి. నువ్వు ఇలా ఒక్కొక్కటీ వదులుకుని పోతూ ఉంటే నీ శరీరం శుష్కించి పోతుంది. నువ్వే మిగలవు.. “ అంటూ చెప్పుకుపోతున్నాడు సోమశేఖరం .
బాబాయి చెప్పిన తాత్విక రహస్యాన్ని మనసులో తలుచుకుంటూ ఇంటికి వచ్చేసాడు సారధి.
అతను ఆలోచనలో పడ్డాడు.
బాబాయి చెప్పింది సాధ్యమేనా ? పైగా తనలాంటి వాడికి ? ఎంతోమంది ప్రవచనాకారులు ఈ విషయాన్ని ఏళ్ల తరబడి చెపుతూనే ఉన్నారు. బాబాయి చెప్పింది తనూ ఎన్నోసార్లు విన్నాడు. కానీ సామాన్యులు ఎవరూ ఈ అరిషడ్వర్గాలను జయించినట్టు తను ఎక్కడా వినలేదు. బాబాయి చెప్పింది సీరియస్గా తీసుకోవాలా ? కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యాలలో తను ఒక్కటేనా వదులుకోగలడా?
ఆలోచనలతో సారధి బుర్ర వేడెక్కిపోతోంది.
“మీ బాబాయిగారు చెప్పింది నేనూ విన్నాను. ఆయన మంచి భోజన ప్రియుడు . నాకు తెలిసీ మనం వెళ్ళినట్టుగా ఏ యాత్రలకు వెళ్ళలేదు. అక్కడ ఏదీ వదిలి వచ్చిన దాఖలాలు లేవు. వాటి మీద ఆయనకు నమ్మకాలు లేవని మీ పిన్ని గారు చెప్పగా విన్నాను. ఆయన చెప్పిన అరిషడ్వర్గాలు మనమే కాదు పురాణ పురుషులు సైతం జయించలేకపోయారు. మీరు చేస్తున్న పనులు ఆయనకు నచ్చక , మీ మనసును వేరేవైపు మళ్ళించడానికి అటువంటి సలహా ఇచ్చి ఉంటారు. అయితే ఒక విషయం నిజాయితీగా ఒప్పుకోవాలి. మీరు మీ ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయక సాధ్యం కానివి కూడా త్యజించడం అలవాటు చేసుకున్నారు. ఇప్పటికే లెక్కనేనంత పుణ్యాన్ని మూటకట్టుకున్నారు. మనకున్న పరిస్థితుల దృష్ట్యా ఇకనుండి వాటిని నియంత్రించుకోవడం చాలా అవసరం. వదిలేసిన వాటిని తిరిగి స్వీకరించమని నేను చెప్పను కానీ ఇంకా మీకు బాగా ఇష్టమైన వాటిని మాత్రం వదలకుండా ఎక్కడకెళ్ళినా ఆస్వాదిస్తూ జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ వెళ్ళడమే ..” అని సారధి భార్య వేదాంత సారాన్ని పుక్కిట పట్టిన దానిలా అనునయంగా చెప్తూ ఉంటే అప్పటివరకు మనసును పట్టి పీడించిన అపోహల నుండి సాంత్వన పొందాడు*****
సమాప్తం