*****
*హంతకుడెవరు?*
==============
(క్రైమ్ కథ)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
*****
సాయంత్రం నాలుగు గంటలు.
ఏదో కేసుకు సంబంధించిన ఫైల్ స్టడీచేస్తున్న రామచంద్రపురం సీఐ జయసింహ, ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేయగానే,
"హలో... హలో...సార్! నేను పసలపూడి నుంచి పడాల దుర్గారావుని మాట్లాడుతున్నాను. ఓ దుర్మార్గుడు మా అమ్మాయిని నూతిలోకి తోసేసి హత్య చేసాడు సార్. మీరు త్వరగా రావాలి సార్" ఏడుస్తూ చెబుతున్న అతనితో
"ఔనా? సరే, ఇప్పుడే బయలుదేరుతున్నాం. హత్య జరిగిన ప్రదేశం ఎక్కడో చెప్పండి. ఈలోగా ఎవరినీ ఆ నూతి వద్దకు వెళ్లకుండా చూడండి. " అడిగాడు సీఐ.
"అలాగే సార్, మీరు చెప్పినట్లే చేస్తాం. ఇక హత్య జరిగింది, చెల్లూరు వెళ్లే దారిలో వంతెన దాటగానే వచ్చే మా పొలంలో సార్" ఏడుస్తూనే ఫోన్ పెట్టేసాడు దుర్గారావు.
వెంటనే తన సిబ్బందితో ఆ ప్రాంతానికి బయలుదేరాడు సీఐ జయసింహ.
***** ***** ***** *****
"ఇక్కడ దుర్గారావు అంటే ఎవరు?" అక్కడ ఉన్న జనాన్ని చూస్తూ అడిగాడు సీఐ.
"మీకు ఫోన్ చేసింది నేనే సార్! ఆ దుర్మార్గుడు నా బిడ్డ విశాలను ఈ బావిలోకే తోసి చంపేసాడు సార్" బావి వైపు చూపిస్తూ, భోరున విలపిస్తూ చెప్పాడు దుర్గారావు.
నూతిలోంచి మృతదేహాన్ని బయటకు తీయమని తన సిబ్బందికి పురమాయించి,
"మీ అమ్మాయిని ఎవరు నూతిలోకి తోసేసారని మీ అనుమానం?" ఆ చుట్టుపక్కల తన డేగ కళ్లతో పరీక్షిస్తూ అడిగాడు సీఐ.
"ఇంకెవరు సార్? ఆ దరిద్రుడు గోపాల్ గాడే! రెండు సంవత్సరాలుగా మా అమ్మాయి వెనుక పడి, ప్రేమించమని వేధిస్తున్నాడు. ఈరోజు ఇక్కడికి రమ్మని ఉంటాడు. తను తిరస్కరించడంతో ఇదిగో ఇలా తోసేసి..." నూతిలోంచి తీస్తున్న కూతురు మృతదేహాన్ని చూస్తూ భోరున విలపిస్తూ చెప్పాడు దుర్గారావు.
"ఆ గోపాలే తోసేసాడని అంత కచ్చితంగా ఎలా చెప్పగలరు?" అనుమానంగా అడిగాడు సీఐ.
"సార్, వీడు మా తమ్ముడు గౌరీపతి. ఈ సంఘటన జరిగిన తరువాత ఆ గోపాల్ పారిపోవడం వీడు ప్రత్యక్షంగా చూసాడు" అంటూ తమ్ముడి వైపు చూపిస్తూ, బావి లోంచి తీసిన కూతురు మృతదేహం వద్ద ఏడుస్తూ కూర్చుండిపోయాడు దుర్గారావు.
***** ***** ***** *****
"చూడండి గౌరీపతి గారూ! ఏం జరిగిందో వివరంగా చెప్పండి" సంఘటన స్థలం నుంచి కొంచెం దూరం తీసుకుని వెళ్లి అడిగాడు సీఐ జయసింహ.
"సార్, మా అన్నయ్యకు ఈ విశాల ఒక్కతే సంతానం. ఎలా పడిందో తెలియదు కానీ మా విశాల ఆ గోపాల్ గాడి బుట్టలో పడింది. వాళ్లిద్దరూ కలసి తిరగడం నేను చాలాసార్లు చూసాను. ఇద్దరినీ పిలిచి మందలించాను కూడా. అయితే ఈమధ్య ఎందుకో విశాల మౌనంగా ఉండడం గమనించాను. ఈరోజు సాయంత్రం, నేను నా పొలం వద్దకు వస్తూ ఉండగా, విశాల మా అన్నయ్య పొలం వైపు రావడం గమనించాను. కాసేపటికి ఆ గోపాల్ కూడా వచ్చాడు. దూరం నుంచి నన్ను చూసిన గోపాల్ అక్కడ నుంచి పారిపోవడం చూసాను. ఓ పావుగంట తరువాత విశాల ఏమైంది అన్న అనుమానంతో ఇక్కడకొచ్చి, ఆమె కోసం ఈ చుట్టుపక్కల అంతా వెతికాను. కాసేపటి తరువాత ఏదో అనుమానం వచ్చి నూతి దగ్గరకు వచ్చి చూస్తే......." ఏడుపు దిగమింగుకుంటూ చెప్పాడు గౌరీపతి.
"ఓకే, అర్ధమయ్యింది. అవసరం అయితే మీకు కబురు పంపుతాను. స్టేషన్ కు రావాల్సి ఉంటుంది" అని గౌరీపతికి చెప్పి,
'వీలైనంత త్వరలో ఆ గోపాల్ ని అదుపులోకి తీసుకొమ్మనీ, తర్వాత అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని స్టేషన్ కి రమ్మని' తన సిబ్బందికి చెప్పి అక్కడ నుండి బయలుదేరాడు సీఐ జయసింహ.
***** ***** ***** *****
అదే రోజు రాత్రి దుర్గారావు ఇంటికి వెళ్లిన సీఐ,
"చూడండి, దుర్గారావు గారూ! ఈ సమయంలో మిమ్మల్ని బాధ పెట్టడం భావ్యం కాదు కానీ, మా డ్యూటీ మేము చెయ్యాలి కదా? ఒకసారి మీ అమ్మాయి విశాల రూమ్ చూపిస్తారా?" అడిగాడు సీఐ ఆ పరిసరాలను ఓ కంట చూస్తూ.
"అలాగే, రండి సార్! ఇంతకీ ఆ గోపాల్ గాడు దొరికాడా సార్?" కూతురు రూమ్ చూపిస్తూ, గద్గద స్వరంతో అడిగాడు దుర్గారావు.
"లేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఇల్లు వదలి పారిపోయాడుట. ఓ రెండు బృందాలు ఆ పని మీదే ఉన్నాయి. త్వరలో పట్టుకుంటాం" అని చెప్పి, ఆ గదిని క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ దొరికిన కొన్ని వస్తువులు తనతో తీసుకుని వెళ్లాడు సీఐ.
***** ***** ***** *****
హత్య జరిగిన మూడవ రోజు రాత్రి, విజయనగరంలో తమ దూరపు బంధువుల ఇంట్లో రహస్యంగా తలదాచుకున్న గోపాల్ ని అరెస్ట్ చేసి తీసుకుని వచ్చారు పోలీసులు.
"గోపాల్! నువ్వు విశాలను నూతిలోకి తోసి హత్య చేస్తూంటే, స్వయంగా చూసినట్టు ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. అందుచేత ఏం జరిగిందో మర్యాదగా చెప్పి తప్పు ఒప్పుకుంటే శిక్ష తగ్గించే ఏర్పాటు చేస్తా" ఇంటరాగేషన్ లో భాగంగా ప్రశ్నించాడు సీఐ జయసింహ.
"సార్! ఈ హత్యకు నాకూ ఎటువంటి సంబంధం లేదు. నన్ను నమ్మండి సార్!" ఏడుస్తూ చెప్పాడు గోపాల్.
"ఒరే హత్య చేసిన ప్రతీ వాడూ నేనే ఆ హత్య చేసానని ఒప్పుకుంటాడా? మా పద్ధతిలో విచారిస్తేనే నిజాలు బయటపడతాయి" లాఠీ ఝలిపిస్తూ చెప్పాడు సీఐ.
"సార్, మీరు కొట్టినా చంపినా నేను చెప్పేది ఒకటే. విశాలా నేనూ గాఢంగా ప్రేమించుకున్నాం. త్వరలో పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నాం. నా ప్రాణమైన విశాలను నేను ఎందుకు చంపుకుంటాను సార్?" బిగ్గరగా రోదిస్తూ చెప్పాడు గోపాల్.
"మీ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదా?" ఆశ్చర్యంగా అడిగాడు సీఐ.
"మా ఇంట్లో ఎవరికీ అభ్యంతరం లేదు సార్. కానీ విశాల వాళ్ల నాన్న, చిన్నాన్నలకు మాత్రం మేము కలవడం ఇష్టం లేదు. ఎందుకంటే మేము వాళ్లకన్నా తక్కువ కులం వాళ్లమని! నన్ను మరచిపొమ్మని విశాలను హింసించేవారుట సార్. అంతే కాదు అవసరం అయితే నన్ను లేపేస్తామని కూడా బెదిరించేవారుట సార్. తనే చెప్పింది ఈ విషయాలన్నీ" కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు గోపాల్.
అయితే ఇదేదో పరువు హత్య బాపతు అన్నమాట అని మనసులో అనుకుని,
"సరే, మరి ఆ సంఘటన జరిగిన సాయంత్రం దుర్గారావు పొలం వద్ద నువ్వు ఎందుకు ఉన్నావ్?" అనుమానంగా అడిగాడు సీఐ.
"సార్, ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు నన్ను, తమ పొలం వద్ద కలుసుకొమ్మని, తనకు నమ్మకమైన పనిమనిషి ద్వారా విశాల కబురు పంపింది. నేను అక్కడికి వెళ్లగానే తను ఏడుస్తూ, నన్ను గట్టిగా కౌగలించుకొని 'వెంటనే నన్ను అక్కడ నుండి వెళ్లిపొమ్మని లేకపోతే వాళ్ల బాబాయ్ నన్ను చంపేస్తాడని' తన బాబాయ్ ని చూపిస్తూ చెప్పింది సార్. అంతే, నేను అమెను వదలలేక వదలలేక ఏడుస్తూ అక్కడనుండి పారిపోయాను" విలపిస్తూ జరిగింది చెప్పాడు గోపాల్.
"ఈ స్టోరీ కూడా బాగానే ఉంది కానీ, మరి ఊర్లోంచి ఎందుకు పారిపోయావ్?" కొంచెం వెటకారంగా అడిగాడు సీఐ.
"నేను ఇంటికి చేరిన కాసేపటికే విశాల హత్య విషయం తెలిసింది. హత్య నేనే చేసానని పుకారు రావడంతో, వాళ్లు నన్ను చంపేస్తారనీ అలాగే ఒక్కడినీ పంపితే నేను ఏ అఘాయిత్యం చేసుకుంటానో అని భయపడి ఓ మనిషిని తోడిచ్చి హుటాహుటిన విజయనగరం పంపేసారు సార్" భయంభయంగా చెప్పాడు గోపాల్.
"సరే కాసేపు ఆ సంగతి పక్కన పెట్టు. ఇంతకీ ఆ హత్య ఎవరు చేసి ఉంటారంటావ్?" కుర్చీ లోంచి లేస్తూ అడిగాడు సీఐ జయసింహ.
"నాకు తెలిసి విశాల వాళ్ల చిన్నాన్న గౌరీపతి చేసి ఉంటాడు సార్. ఎందుకంటే......... " తను విన్న సంగతులు చెప్పాడు గోపాల్.
"ఓకే!... ఏయ్ కానిస్టేబుల్స్! ఇతడిని లోపల ఉంచి, ఆ గౌరీపతిని తీసుకుని రండి" ఆర్డర్ వేసి బయటకు వెళ్లాడు సీఐ.
***** ***** ***** *****
"సీ మిష్టర్ గౌరీపతీ! మాకు లభించిన సమాచారం ప్రకారం, విశాలను నూతిలోకి తోసి చంపింది నువ్వేనని మా వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయి" విచారణలో భాగంగా ఓ బాణం వేసాడు సీఐ జయసింహ.
"ఏమిటి సార్ మీరు మాట్లాడేది? మా పిల్లను నేను ఎందుకు చంపుతాను?" ఆశ్చర్యంగా అడిగాడు గౌరీపతి.
"ఎందుకంటే, ఆ గోపాల్ ని విశాల పెళ్లి చేసుకుంటే మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు రావనీ. అలాగే ఆమె చనిపోతే మీ అన్నగారి ఆస్తికి నువ్వే వారసుడవి కావచ్చనీ" అసలు విషయం చెప్పాడు సీఐ.
"సార్! మీరు ఏదైనా అనుకోండి. నేను చెప్పింది మాత్రం నిజం. ఆ రోజు వాళ్లిద్దరినీ చూసాను. గోపాల్ పారిపోయాడు. కాసేపటి తర్వాత చూస్తే విశాల నూతిలో శవమై తేలుతోంది. అంతే నేను చెప్పగలను" జరిగిన విషయం మరోసారి చెప్పాడు గౌరీపతి.
"సరే! పోనీ మీ అన్నగారు ఎవరైనా కిరాయి మనుషులతో...." చెప్పబోతున్న సీఐ తో
"సార్, అవసరం అయితే ఆ గోపాల్ గాడిని లేపేస్తాం కానీ, సొంత బిడ్డను చంపుకుంటామా సార్? ఇదంతా ఆ గోపాల్ గాడు చేసిందే సార్" కరాకండీగా చెప్పాడు గౌరీపతి.
"ఇంకో రెండు రోజులు పాటు మీరు మా ఆధీనంలో ఉండాలి" గౌరీపతికి చెప్పి ఇంటికి బయలుదేరాడు సీఐ జయసింహ.
***** ***** ***** *****
మర్నాడు ఉదయం,
తన గుమ్మంలో సీఐ ని చూసిన దుర్గారావు బిగ్గరగా ఏడవడం మొదలెట్టాడు.
"నీ దొంగ ఏడుపు ఆపు మిష్టర్ దుర్గారావ్. మీ విశాల గోపాల్ ని ప్రేమించడం ఇష్టం లేని నువ్వు, ఆ అమ్మాయిని కిరాయి గూండాల చేత నూతిలోకి తోసేసావని మీ తమ్ముడు వాంగ్మూలం ఇచ్చాడు. అందుకే, పరువుహత్యా నేరం కింద నిన్ను అదుపులోకి తీసుకుంటున్నాము" చెప్పాడు సీఐ.
"సార్! మా అమ్మాయిని నేను చంపుకోవడం ఏమిటి సార్! ఆ గోపాల్ గాడే...." చెప్పబోతున్న దుర్గారావుతో
"స్టాపిట్, ఈ విషయాలన్నీ విశాల ఓ లెటర్ లో రాసింది. అది దొరికితే ప్రమాదమని ఆ ఉత్తరం, నువ్వు మాయం చేసావు. కానిస్టేబుల్ అరెస్ట్ హిమ్" ఆర్డర్ పాస్ చేసాడు సీఐ జయసింహ.
ఆ మాటలకు భయంతో గజగజ వణుకుతూ,
"సార్, విశాల రాసిన ఆ ఉత్తరం మీకు ఇస్తాను. అలాగే, అసలు జరిగిన విషయం కూడా చెబుతాను....." అంటూ చెప్పడం మొదలెట్టాడు దుర్గారావు.
***** ***** ***** *****
సాయంత్రం పోలీసు స్టేషన్ కు వచ్చిన డీఎస్పీ రంగనాధ్
"గుడ్ మిష్టర్ జయసింహ! ఆ విశాల మర్డర్ కేసు సాల్వ్ చేసావుట. ఇంతకీ హంతకుడు ఎవరు? దుర్గారావా? గౌరీపతా లేక గోపాలా?" కుతూహలంగా అడిగారు.
"వాళ్లెవరూ కాదు సార్. అసలు ఇది హత్య కాదు, ఆత్మహత్య" కూల్ గా చెప్పాడు సీఐ.
"వ్వాట్...అసలు ఆ విషయం నీకు ఎలా తెలిసింది?" అనుమానంగా అడిగారు డీఎస్పీ.
"సార్! ఆ రోజు సీన్ ఆఫ్ అఫెన్స్ చూడగానే నాకు అనుమానం వచ్చింది, ఇది హత్య కాకపోవచ్చని. ఎందుకంటే నూతి వద్ద ఉన్న మట్టినేల మీద, పెనుగులాట జరిగినట్లు ఎటువంటి దాఖలాలు కానీ, వేరే ఎవరి పాదముద్రలు కానీ లేవు. ఆమె ధరించిన జోళ్లు ఆ పాకవద్ద నీటుగా పెట్టి ఉన్నాయి. అంతేకాదు, విశాల పాదముద్రలు ఆ నూతి గట్టు మీద ఉన్నాయి. హత్య చేసినవాడు ఆమెను నూతిలోకి తోసేస్తాడు కానీ ఆమెను గట్టు మీద నిలబెట్టి తర్వాత నూతిలోకి తొయ్యడు కదా? విశాలే నూతి గట్టు మీద నిలబడి లోపలికి దూకి ఆత్మహత్య చేసుకుందని నా పరిశీలనలో తేలింది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకోవడం కోసమే ఈ ఇంటరాగేషన్ చేయవలసి వచ్చింది సార్"
అంటూ మొత్తం విచారణ వివరాలు డీఎస్పీ కి వివరించసాగాడు సీఐ జయసింహ.
***** ***** ***** *****
"సార్, గోపాల్ తో ప్రేమ వ్యవహారాలు మానేయమని, తమ కుటుంబం పరువు కాపాడమని లేకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని దుర్గారావు చాలా సార్లు తన కూతురు విశాలకు చెప్పేవాడు. అయితే అప్పటికే గోపాల్ తో పీకలలోతు ప్రేమలో కూరుకుపోయిన విశాల ఎటూ తేల్చుకోలేక సందిగ్ధంలో పడిపోయింది. విశాల చనిపోయిన రోజు ఉదయం తన తండ్రి, బాబాయ్ లు మాట్లాడుకుంటున్న విషయాలు రహస్యంగా విన్నది. వెంటనే ఓ స్థిర నిర్ణయానికి వచ్చిన ఆమె ఇదిగో ఈ లెటర్ రాసి, ఆత్మహత్య చేసుకుంది" అని చెబుతూ, చదవమని ఆ లెటర్ డీఎస్పీ చేతికి ఇచ్చాడు సీఐ జయసింహ.
"డాడీ!
ఎట్టి పరిస్థితుల్లోనూ మా ప్రేమను మీరు అంగీకరించరని తెలిసింది. మీ కులాల కుంపట్లో పడి మా ప్రేమ మాడిపోయింది. గోపాల్ లేకుండా నేను బతకలేను. నేను వాడితో వెళ్లిపోతే పరువు పోయిందని మీరు బతకలేరు.
ఈరోజు ఉదయం బాబాయి, నువ్వూ మాట్లాడుకుంటూ 'అవసరం అయితే ఆ గోపాల్ గాడిని ఓ రెండు రోజుల్లో లేపేద్దాం' అనుకోవడం నేను విన్నాను. పాపం... డాడీ, ఆ గోపాల్ ని ఏమీ చేయకండి. వాడు చాలా మంచివాడు. వాళ్ల అమ్మకు వీడొక్కడే ఆధారం.
గోపాల్ ని సాయంత్రం మన పొలం వద్దకు రమ్మని, వాడిని ఒక్కసారి తనివితీరా చూసి, మీకు కనబడకుండా ఎక్కడికైనా పారిపొమ్మని వాడికి చెప్పి, ఆ తరువాత మీ అందరికీ ఎప్పటికీ అందనంత దూరంగా వెళ్లిపోవడానికి నిశ్చయించుకుని మన పొలంలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నాను.
అమ్మా, నన్ను క్షమించు, నీకు కడుపు కోత మిగిల్చినందుకు.
మీ
విశాల "
లెటర్ పూర్తిగా చదివి,
"ఈ పెద్దలకు కులాల పట్టింపులు ఏమిటో? ప్రేమ కోసం ఈ పిల్లలు ప్రాణాలు తీసుకోవడం ఏమిటో? భవిష్యత్తులో ఇలాంటి దారుణాలు జరగకుండా, త్వరలో అన్ని కాలేజీలలో కౌన్సెలింగ్ ప్రోగ్రాంలు అరేంజ్ చెయ్యి. సరే ఇక అసలు విషయానికి వద్దాం" అని చెప్పడం కొనసాగించారు డీఎస్పీ.
"సరే! ఈ సంఘటనలో నాకు అర్థమయ్యింది ఏంటంటే, ఆ రోజు సాయంత్రం, తన కూతురు విశాల, ఆమె గదిలో లేకపోవడంతో అనుమానం వచ్చిన దుర్గారావుకు టేబుల్ మీద ఈ ఉత్తరం కనబడింది. అది చదివి బిత్తరపోయి, దానిని జేబులో పెట్టుకుని బయటకు వచ్చేటప్పటికి, విశాల నూతిలో శవమై పడి ఉందని, గోపాల్ పారిపోయాడనీ తన తమ్ముడు పంపిన సమాచారం అందింది. ఈ సంఘటనతో ఉక్రోషంతో ఊగిపోయాడు
దుర్గారావు. వెంటనే అతనిలోని రాక్షసుడు మేల్కొన్నాడు. తన కూతురు చావుకు కారణమైన ఆ గోపాల్ గాడి మీద కక్ష తీర్చుకోవడానికి ఇదే మంచి సమయమని భావించాడు. ఈ ఆత్మహత్యని గోపాల్ చేసిన హత్యగా చిత్రీకరించి అతడిని కటకటాల పాలు చెయ్యాలనుకున్నాడు. ఈ లెటర్ ఎవరికీ కనబడకుండా దాచేసాడు. యామై కరెక్ట్ మిష్టర్ జయసింహ?" అడిగారు డీఎస్పీ రంగనాధ్.
"ఎగ్జాగ్ట్లీ కరెక్ట్ సార్. ఇదే విషయం దుర్గారావు కూడా నా విచారణలో చెప్పాడు" డీఎస్పీ చెప్పిన తీరుకు ఆశ్చర్యపడి చెప్పాడు సీఐ.
"ఓకే బాగానే ఉంది కానీ, అసలు విశాల ఆ లెటర్ రాసి ఉంటుంది అని నీకు ఎలా తెలిసింది?" కుతూహలంతో అడిగారు డీఎస్పీ.
"సార్, ఆ సంఘటన జరిగిన స్థలంలో హత్య చేసినట్టు ఎటువంటి ఆనవాళ్లు లేకపోవడంతో, అది ఆత్మహత్య అయి ఉండవచ్చు అన్న అనుమానం వచ్చి, వెంటనే అదే రోజు రాత్రి విశాల గది పరిశీలించాను. వెళ్లగానే టేబుల్ మీద పెట్టి ఉన్న స్క్రిబ్లింగ్ పాడ్, బాల్ పెన్ను ల మీద నా కన్ను పడింది. అసలు అవి అక్కడ ఎందుకు ఉన్నాయన్న అనుమానం వచ్చి, ఆ పాడ్ లోని మొదటి పేజీ చూడగానే, దాని ముందు పేజీ మీద బాల్ పెన్ తో గట్టిగా రాసిన అక్షరాల తాలూకు ఇంప్రెషన్స్ అక్కడ.కనపడ్డాయి. నా అనుమానం నిజమయ్యింది. అయితే ఆ లెటర్ లో ఏముంది? ఆ లెటర్ ఎక్కడుంది? అసలు ఇది ఆత్మహత్య అని నిరూపించడం ఎలా? ఈ విషయాలు రాబట్టడం కోసమే ఇంత టైం పట్టింది సార్" తన పరిశోధన వివరాలు చెప్పాడు సీఐ జయసింహ.
"అయితే ఆ లెటర్ దుర్గారావు వద్ద ఉందని నీకు తెలియదు. అతడిని జస్ట్ భయపెట్టావ్ అంతేనా?" అడిగారు డీఎస్పీ.
"ఔను సార్. జస్ట్ ఓ బాణం వేసాను. గురి తప్పలేదు" నవ్వుతూ చెప్పాడు సీఐ జయసింహ.
"ఓకే గుడ్ జాబ్ మైడియర్ సీఐ. కీపిటప్. సరే వాళ్లందరినీ కూర్చోబెట్టి ఓ సారి అడుగు, కాంప్రమైజ్ అవుతారా? కేసు ఫైల్ చేయమంటారా అని?" కుర్చీలోంచి లేస్తూ చెప్పారు డీఎస్పీ రంగనాధ్.
"ఓకే సార్" అని సాల్యూట్ చేసి, ఆయనను వెంట నడిచాడు సీఐ జయసింహ.
***** **సమాప్తము** *****
(నేను రాసిన ఈ క్రైమ్ కథ సాక్షి ఆదివారం అనుబంధం ఫన్ డే.లో ది. 10.07.2022న
ప్రచురితమైనది)