*****
*ఫస్ట్ కాల్*
=========
(క్రైమ్ కథ)
(నేను రాసిన ఈ కథ సాక్షి ఆదివారం అనుబంధం ఫన్ డే లో ది.27.03.2022న ప్రచురితమైనది.)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్.
విజయరాజపురం గ్రామం మీద నెమ్మదిగా చీకటి తెరలు కమ్ముకుంటున్నాయి. ఆ ఊర్లో జరగబోతున్న మరో హత్యాకాండను చూడలేక కాబోలు, సూర్యుడు నెమ్మదిగా జారుకుంటున్నాడు.
చాలా రోజుల తర్వాత తన పొలానికి వచ్చిన ఆ ఊరి మాజీ సర్పంచ్ వెంకటరాయుడు, తన అనుచరులతో కలిసి ఇంటికి బయలుదేరాడు. పొలం గట్టు దాటి మట్టిరోడ్డు మీదికి చేరుకున్నారు అందరూ.
ఈలోగా వారికి ఎదురుగా రాజదూత్ బండి మీద, కేవలం కళ్లు మాత్రమే కనబడేలా దుస్తులు వేసుకుని వేగంగా వస్తున్న ఇద్దరు వ్యక్తులను చూసి, ఏదో అనుమానం వచ్చిన వెంకటరాయుడు అనుచరులు అప్రమత్తం అయ్యేలోపే, జరగరాని నష్టం జరిగిపోయింది.
బైక్ వెనకాల కూర్చున్న ఓ వ్యక్తి, రాయుడు తల తెగి పడేలా తన వేట కొడవలితో వేసిన వేటుకు ఆ తల, మెడ నుంచి వేరు పడి, ఎగిరి అల్లంత దూరాన పడింది. వెంటనే అగంతకులు విజయగర్వంతో అక్కడనుండి వేగంగా వెళ్లిపోయారు.
***** ***** ***** *****
"సార్, విజయరాజపురం మాజీ సర్పంచ్ రాయుడు గారి మీద హత్యా ప్రయత్నం జరిగిందిట" అప్పుడే స్టేషన్ లోపలికి వచ్చిన ఎస్సై కిరణ్ తో చెప్పాడు కానిస్టేబుల్ అప్పారావు.
"ఎవరు చేసారుట?" అడిగాడు ఎస్సై.
"ఎవరో తెలియదు సార్. కానీ, ఆయన ప్రత్యర్థి కనకరాజు కుటుంబం, ఈ రాయుడు గారి కుటుంబాల మధ్య ఎన్నో సంవత్సరాలుగా పాత కక్షలు ఉన్నాయి సార్. అంతేకాక నక్సలైట్ల హిట్ లిస్టులో కూడా ఈయన ఉన్నాడుట. ఈయన కోసం వాళ్లు రెక్కీ నిర్వహిస్తున్నారని కూడా తెలిసింది సార్" చెప్పాడు కానిస్టేబుల్.
"సరే! ఆ గొడవలు ప్రతీచోటా ఉండేవే కానీ ఇంతకీ ఈ హత్య గురించి మనకి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా?" ఆసక్తిగా అడిగాడు ఎస్సై.
"ఆ ఊర్లో ఏం గొడవలు జరిగినా వాళ్లూ వాళ్లూ తేల్చకుంటారు కానీ మన వరకూ ఎవరూ రారు సార్. అంతే కాదు ఊరు జనం కూడా పిర్యాదు చేయడానికే కాదు, కనీసం ఫోన్ చేసి చెప్పడానికి కూడా సాహసించరు" అసలు విషయం చెప్పాడు కానిస్టేబుల్.
"సరే! ఇంక ఆ సంగతి వదిలేయ్. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అప్పుడు చూద్ధాం" కుర్చీలో రిలాక్స్ అవుతూ చెప్పాడు, ఈ మధ్యనే బదలీ మీద అక్కడకు వచ్చిన ఎస్సై.
***** ***** ***** *****
ఆ రోజు రాత్రి,
"ఒరే సన్నాసుల్లారా! ఆ రాయుడు తలని నరకమంటే వాడి అనుచరుడిది నరికేరా?" కోపంతో ఊగిపోతూ రంకెలేసాడు కనకరాజు.
"లేదు దొరా, ఆ రాయుడు తలకే గురిచూసి కొడవలి దూసా. ఆఖరి నిమిసంలో ఆయన మమ్మల్ని పసిగట్టి కిందకు ఒంగడం వలన ఆ కత్తి వెనుక ఉన్న అనుచరుడికి తగిలింది. ఇంకో సారి ఇలాంటి పొరబాటు జరగదు దొరా, నన్ను నమ్మండి" చేతులు కట్టుకుని వినయంగా చెప్పాడు.
"ఇప్పుడు చూడండి, ఆ రాయుడు గాడు తప్పకుండా నా మీద కక్ష తీర్చుకుంటాడు. ఎందుకైనా మంచిది, మీరు కూడా అప్రమత్తంగా ఉండండి" హెచ్చరించాడు కనకరాజు.
"కంగారు పడకండి దొరా! నాకు తెలిసి ఆ రాయుడుకి మన మీద అనుమానం రాదు, ఇది నక్సలైట్ల పని అనుకుంటాడు" నచ్చచెప్పే ప్రయత్నం చేసాడు ముఖ్య అనుచరుడు.
"ఏది ఏమైనా ఇక నా జాగ్రత్తలో నేను ఉండాలి" మనసులో అనుకున్నాడు కనకరాజు.
***** ***** ***** *****
ఆరోజు....రాయుడు మీద జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన రంగడి పదవరోజు. ఆ కార్యక్రమానికి హాజరైన రాయుడుతో
"అయ్యగారూ! నాకు ఓ అవకాశం ఇవ్వండి. మా నాన్నను చంపించిన ఆ కనకరాజు తల తెచ్చి మీ ముందు పడేస్తా" ఆవేశంగా చెప్పాడు బాబు.
"కంగారు పడకురా, బహుశా ఇది నక్సలైట్ల పనేమో అని నా అనుమానం" సర్దిచెప్పబోయాడు రాయుడు.
"లేదు అయ్యగారూ! నాకు తెలుసు, వాళ్లు ఆ కనకరాజు మనుషులే. అందులో ఒకడిని నేను గుర్తు పట్టాను కూడా......" మొత్తం వివరాలు చెప్పాడు ఓ అనుచరుడు.
"సరే! కొన్నాళ్ళు ఓపిక పట్టండి. టైమ్ చూసి వేసేద్దాం" వారిని సముదాయించి, అక్కడ నుంచి బయలుదేరాడు రాయుడు.
***** ***** ***** *****
ఓ రెండు వారాలు తరువాత....
ఆరోజు సాయంత్రం, తన ఇంటి బయట ఉన్న పెరట్లో తన అనుచరులతో మాట్లాడుతున్నాడు కనకరాజు. ఈలోగా ఓ నలుగురు వ్యక్తులు మొహానికి ముసుగులు వేసుకుని ఆ పెరటి గోడ ఎక్కి తమ వద్ద ఉన్న నాటు తుపాకులతో కనకరాజు లక్ష్యంగా చేసుకుని గుళ్లవర్షం కురిపించారు.
వెంటనే అప్రమత్తమైన అతని అనుచరులు ఎదురు కాల్పులు జరిపి, కనకరాజుని రక్షించి జాగ్రత్తగా లోపలికి చేర్చారు.
ఆ సంఘటనలో రాయుడు అనుచరుడు ఒకడు, కనకరాజు అనుచరులు ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం కళ్లారా చూసిన కనకరాజు భార్య
"ఏమండీ! ఎన్నాళ్లీ రక్తపాతం? ఎమిటీ కక్షలు, కార్పణ్యాలు? ఇరువైపులా మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు" కనకరాజుకి భోజనం వడ్డిస్తూ, ఆవేదనతో అడిగింది అతని భార్య సువర్ణ.
"సువర్ణా! నీకు తెలిసిందే కదా ? ఇది నలభై సంవత్సరాల నుంచి కాలుతున్న కాష్టం. మొదట్లో మా నాన్న, ఆ రాయుడు తండ్రి చాలా స్నేహంగా ఉండేవారు. ఓ పొలం సరిహద్దు తాలూకు తగదా వారిద్దరి మధ్య దూరం పెంచి, ఒకరినొకరు హత్య చేసుకొనే స్థాయికి చేరింది. దానితో ఊరు రెండు వర్గాలుగా చీలిపోయింది. ఆ తరువాత కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్న ఊరు, చదువు పూర్తి చేసుకుని వచ్చిన మేము, తప్పనిసరి పరిస్థితుల్లో మా నాన్నల వారసత్వం తీసుకోవడంతో తిరిగి యుద్ధరంగంగా మారింది. ఆ తర్వాత జరిగిన విషయాలు నీకు తెలిసినవే కదా?" జరిగిన చరిత్ర మరోసారి చెప్పాడు కనకరాజు.
"ఏమండీ, మనకీ పిల్లలు లేరు. ఆ రాయుడికి కూడా సంతానం లేదు. ఇద్దరూ రాజీకొచ్చి, మిగిలిన జీవితాన్ని హాయిగా గడపవచ్చు కదా?" ఆశగా అడిగింది సువర్ణ.
"అదీ జరిగింది కదా ? కిందటేడాది మన ఎమ్మెల్యే గారు మా ఇద్దరినీ కలిపారు. తరువాత ఏమయ్యింది? వారం తిరక్కుండానే ఆ రాయుడు మనుషులు, బస్సు దిగి వస్తున్న మన సాంబయ్యని నరికి చంపారు. చూడు సువర్ణా! ఆకలితో ఉన్న పులి వేటాడుతూ ఉండాలి. అలా కాకుండా దాని సహజ గుణం మరచి బుద్ధిగా ఉంటే మేక కూడా పులిని వెక్కిరిస్తుంది. అలాగే, ఇలాంటి పరిస్థితుల్లో మేమూ కూడా వేట మానకూడదు. ఈ ఊర్లో ఆ రాయుడో, నేనో ఎవరో ఒకరే ఉండాలి. ఇదే ఫైనల్" కంచంలో చేయి కడుక్కుంటూ చెప్పాడు కనకరాజు.
"హూ..మీరిద్దరూ బాగానే ఉన్నారు. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్లే బలైపోతున్నారు" మనసులో అనుకుంటూ కంచం తీయడానికి లేచింది సువర్ణ.
***** ***** ***** *****
అదేరోజు రాత్రి
"హలో...బావా! అక్క ద్వారా నీ సంగతులు అన్నీ తెలుస్తున్నాయి. నువ్వు జాగ్రత్తగా ఉండు. అన్నానని కాదు కానీ, ఎందుకు బావా ఈ హత్యా రాజకీయాలు? ఇప్పటికీ మించి పోయేదేమీ లేదు. ఇద్దరూ సంధి చేసుకోండి. ఎందుకంటే, తప్పకుండా ఆ కనకరాజు నిన్ను హత్య చేయడానికి ఈ పాటికి ఏదో ప్లాన్ వేసే ఉంటాడు. నీ సంగతులు అన్నీ వాడికి తెలుస్తున్నాయంటే నాకు తెలిసి, వాడి కోవర్టులు ఎవరో నీ అనుచరులలో ఉండే ఉంటారు. వీలైతే నీ రోజువారీ పద్ధతులు కూడా మార్చుకో బావా! కొద్ది రోజుల్లో మీ ఊరు పక్కన ఉన్న టౌనులో మా ప్రోగ్రాం ఉంది. అప్పుడు వచ్చి నిన్ను తప్పకుండా కలుసుకుంటా..." ఫోన్ లో బావకు చెప్పాడు రాయుడు బావమరిది.
"పెతీవోడూ వెధవ సలహాలిచ్చేసి, జాగ్రత్తలు చెప్పేసేవోడే" విసుక్కుంటూ ఫోన్ పెట్టేసిన రాయుడుకి, అందులో ఓ సలహా మాత్రం బాగా నచ్చింది.
***** ***** ***** *****
ఓ పది రోజుల తర్వాత
"ఏమండీ! భోజనం వడ్డిస్తున్నా రండి" రాయుడుని పిలిచింది అతని భార్య.
"ఇదిగో వస్తున్నా, రెడీ చెయ్యి" గ్లాసులో ఉన్న విదేశీ మద్యం ఆఖరి చుక్కను నోట్లో వేసుకుని చెప్పాడు రాయుడు.
నాటుకోడి కూర, చేపల పులుసుతో తృప్తిగా భోజనం చేసి, మేడ మీద తన గదిలోకి తూలుతూ వెళ్లి, దుప్పటి కప్పుకుని, కాసేపటికే గుర్రు పెడుతూ నిద్రలోకి జారిపోయాడు రాయుడు.
పాపం ఆ సమయంలో అతనికి తెలియదు అక్కడ అతనికి అదే ఆఖరి నిద్ర అని.
***** ***** ***** *****
అర్ధరాత్రి, కారుచీకటి. ఆ సమయంలో ఓ ముగ్గురు ముసుగు మనుషులు, నిశ్శబ్దంగా రాయుడు ఇంటి వెనుక వైపు గోడ దూకి, సిమెంట్ పైపులు ద్వారా ఎగబాకి, మేడమీద ఉన్న రాయుడు పడకగది వద్దకు చేరుకున్నారు.
శబ్దం చేయకుండా ఆ గది తలుపు గడియ తీసి, రాయుడు పడుకున్న మంచం వద్దకు చేరుకున్నారు. తెల్లటి దుప్పటి ఒళ్లంతా కప్పుకొని పడుకున్న రాయుడుని చూసి, గురి తప్పకుండా ఒకే ఒక్క వేటుతో అతని తల నరికాడు వారిలో ఒకడు. అంతే...అబ్బా అంటూ రాయుడు అరచిన అరపులతో ఆ గది దద్దరిల్లింది.
అదేక్షణంలో ....
కింద స్కూటర్లు ఆగిన శబ్దం రావడంతో, ఉలిక్కిపడిన ఆ ముగ్గురు అగంతకులు, గబగబా ఆ గది నుండి బయటకు వచ్చి, కిందకు చూసి "ఒరే నక్సలైట్లు వచ్చార్రా, త్వరగా పోదాం, వాళ్లకు కనబడితే ప్రమాదం" అనుకుని గబగబా కిందకు దిగి, ఆ వీధి చివరకు వెళ్లి, ఎవరికీ కనబడకుండా నిలబడ్డారు.
కాసేపటికి, యూనిఫామ్ లో ఉన్న నలుగురు నక్సలైట్లు, రాయుడు జీపులో అతని మృతదేహాన్ని వేసుకుని వెళ్లడం వారి కంటికి కనిపించడంతో, కాగల కార్యం గంధర్వులు తీర్చారు అనుకుని ఆ విషయం కనకరాజుకు చెప్పడానికి, ఆనందంగా అక్కడ నుండి బయలుదేరారు ఆ ముగ్గురూ.
***** ***** ***** *****
మర్నాడు ఉదయం,
తీరుబడిగా కూర్చుని, టిఫిన్ తింటున్న కనకరాజుతో,
"దొరా! ఇంకో శుభవార్త. ఆ రాయుడుని, అతని జీపుతో సహా మన ఊరుకు దగ్గర ఉన్న అడవి వద్దకు తీసుకుని వెళ్లి, అక్కడ పెట్రోలు పోసి తగలెట్టేసారుట ఆ నక్సలైట్లు. కేవలం ఎముకలు, ఆ రాయుడుకు సంబంధించిన వాచీ, చేతి కడియం లాంటి కొన్ని వస్తువులు తప్ప ఏమీ మిగలలేదుట దొరా! ఇప్పుడే మన సూరిగాడు చూసి వచ్చాడు. అంతే కాదు, ఆ రాయుడు మనుషులు కూడా అజ్ఞాతంలోకి వెళ్లి పోయారుట" ఆనందంగా చెప్పాడు అతని అనుచరుడు.
"హమ్మయ్య, ఇంక శత్రుశేషం ఏమీ మిగలలేదన్న మాట. సరే, నేను కూడా ఇంక ఈ హత్యారాజకీయాలకు జనగణమన పాడేస్తా! అలాగే మీ అందరికీ డబ్బులు ఇస్తా. హాయిగా పట్నం పోయి ఏదైనా వ్యాపారాలు చేసుకుని బాగుపడండి.." అనుచరులకు మంచి మార్గం సూచిస్తున్న తన భర్త మాటలు విని, మురిసిపోయింది వంటింట్లో ఉన్న సువర్ణ.
***** ***** ***** *****
ఓ సంవత్సరం తర్వాత..
"ఏమోయ్! అప్పారావ్, ఏమిటి ఈమధ్య ఆ వీ. ఆర్. పురం అదే ఆ విజయరాజపురం విశేషాలు ఏమీ చెప్పటం లేదు" అడిగాడు ఎస్సై కిరణ్.
"ఏమున్నాయి సార్! ఆ రాయుడు గారు పోయిన తర్వాత, ఇంక ఈ గొడవలు వదిలి ఎక్కడికైనా వెళ్లి, హాయిగా బతకమని ఆయన అనుచరులకు డబ్బులు ఇచ్చి పంపించేసింది ఆయన భార్య. అలాగే, చాలా మంది నక్సలైట్లు ప్రభుత్వానికి లొంగిపోయారు. ఇక, ఆ కనకరాజు గారి అనుచరులు కూడా ఆ ఊరు వదిలి వేరే ఊర్లలో సెటిలైపోయారు. ఇప్పుడు కనకరాజుగారు పూర్తిగా తన వ్యాపార లావాదేవీల్లో బిజీ అయిపోయారు" తను సేకరించిన విషయాలు చెప్పాడు కానిస్టేబుల్ అప్పారావు.
"పోనీలే ! సమస్యలు పరిష్కారం అయ్యి, మొత్తం మీద ఊరు బాగుపడిందన్న మాట. మనకు కావలసింది కూడా అదే కదా" సాలోచనగా చెప్పాడు ఎస్సై.
***** ***** ***** *****
పది రోజుల తర్వాత ఓ సాయంత్రం,
"ఏమండీ! ఎవరో మక్బూల్ ఖాన్ ట. హైదరాబాద్ నుంచి వచ్చారుట. ఏదో బిజినెస్ గురించి మాట్లాడాలిట. మీ ఆఫీసు గదిలో కూర్చోపెట్టా" సోఫాలో కూర్చొని కాఫీ తాగుతున్న కనకరాజుతో చెప్పింది అతని భార్య సువర్ణ.
కాసేపటికి ఆ గదిలోకి వచ్చిన కనకరాజు
"చెప్పండి ఖాన్ సాబ్! మీరు ఏం బిజినెస్ చేస్తుంటారు?" కుర్చీలో కూర్చొని అడిగాడు కనకరాజు.
"బిజినెస్ చేయడానికి రాలేదు కనకరాజూ! బిజినెస్ క్లోజ్ చేయడానికి వచ్చాను" అంటూ రివాల్వర్ కనకరాజుకు గురి పెడుతూ చెప్పాడు ఆ వ్యక్తి.
"ఎవరు నువ్వు?" అంటూ టేబుల్ ఓపెన్ చేయబోతున్న కనకరాజుతో,
"పిచ్చి వేషాలు వేయకుండా రెండు చేతులూ పైకి ఎత్తు మిస్టర్ కనకరాజూ, నన్ను గుర్తుపట్టలేదు కదూ?" అంటూ పెట్టుడు గడ్డం, మీసాలు తీసేసాడు ఆ వ్యక్తి.
"రాయుడూ! నువ్వా? ఇంకా బతికే ఉన్నావా? మా మనుషులు నీ తల నరకడం......, నక్సలైట్లు నిన్నూ, నీ జీపుని తగలెట్టడం....ఇవన్నీ....." ప్రాణ భయంతో గజగజ వణుకుతూ ప్రశ్నల వర్షం కురిపించాడు కనకరాజు.
"అన్నీ నిజమే కనకరాజూ! ఎటొచ్చీ మీ వాళ్లు అనుకున్నట్లుగా వాళ్లు నక్సలైట్లు కారు. మన పక్క సిటీలో నక్సలైట్ల నేపథ్యంలో రాసిన 'అడవిలో అన్నలు' అనే నాటకాన్ని వేయడానికి వచ్చిన మా బావమరిదీ, అతని బృందం. ఆలశ్యం కావడంతో ఆ రాత్రి అదే డ్రెస్ లో మా ఇంటికి వచ్చారు. నా అరుపులు విని పైకి వచ్చి, నన్ను నా జీపులో ఆ అడవి వద్దకు తీసుకుని వెళ్లి అక్కడ దానికి నిప్పు పెట్టి, కొంత ప్రాధమిక చికిత్స తర్వాత వేరే వాహనంలో హైదరాబాద్ తరలించారు" రివాల్వర్ కనకరాజు వైపే ఉంచి చెప్పాడు రాయుడు.
"మరి అక్కడ దొరికిన నీ వస్తువులు, ఎముకలు.....??" అనుమానంగా అడిగాడు కనకరాజు.
"హహహహ, ఆ వస్తువులు నిన్ను పక్కదోవ పట్టించడానికి మా బావమరిది వేసిన ప్లాన్. ఆ ఎముకలు నావి కావు, పక్కనున్న శ్మశానంలోనివి" కర్కశంగా నవ్వుతూ చెప్పాడు రాయుడు.
"ఎంత మోసం, అయితే మా వాళ్లు నీ తల నరకడం కూడా ఉత్తదే అన్నమాట" నీరుగారిపోతూ అడిగాడు కనకరాజు.
"మీ వాళ్లు నన్ను నరకడం కరెక్టే. కానీ నా తలను మాత్రం కాదు. చూడు, కనకరాజూ, నిన్ను చంపడం కోసమే అంత దూరం నుంచి శ్రమ పడి వచ్చాను. ఇంక ఈ ఊరికి నేనే మకుటం లేని రాజును. ఋణశేషం ఉండవచ్చు కానీ, శత్రుశేషం ఉండకూడదు రాజూ. ఇక నుంచి ఊరు ప్రశాంతంగా ఉంటుంది" అంటూ వికటాట్టహాసం చేస్తూ కనకరాజు గుండెకు గురిపెట్టి రివాల్వర్ పేల్చాడు రాయుడు.
"అబ్బా....." అంటూ బాధగా మూలుగుతూ, గుండె చేత్తో పట్టుకుని, కుర్చీలో కూలబడుతూ, కృత్రిమ కొయ్య కాళ్లతో టకటకా శబ్ధం చేసుకుంటూ నెమ్మదిగా వెళ్తున్న రాయుడు వంక ఆశ్చర్యంగా చూస్తూ తల వాల్చేసాడు కనకరాజు.
పక్క గదిలో ఉండి, రివాల్వర్ శబ్దం వినబడడంతో, ఆ గదిలోకి వచ్చిన కనకరాజు భార్య సువర్ణ, అక్కడ చనిపోయి ఉన్న తన భర్తను చూసి, నిర్ఘాంతపోయి, మరుక్షణమే టేబుల్ తీసి అందులో ఉన్న రివాల్వర్ తీసుకుని నెమ్మదిగా నడచి వెళ్తున్న రాయుడుకి గురిపెడుతూ,
"ఊరు ప్రశాంతంగా ఉండాలంటే మీరు కూడా ఉండకూడదు రాయుడు గారూ!" అంటూ రివాల్వర్ గురి పెడుతున్న సమయంలో, ఆ మాటలు ఎవరివా అన్న అనుమానంతో వెనక్కి తిరిగి చూసిన రాయుడు గుండెల్లోకి వేగంగా దూసుకు పోయింది ఆ రివాల్వర్ బుల్లెట్.
వెంటనే తేరుకున్న సువర్ణ, ఆ రివాల్వర్ చీరతో తుడిచి, దానిని కనకరాజు కుడి చేతిలో పెట్టి, పక్కనే ఉన్న ఫోన్ తీసుకుని,
"హలో.. హలో.. పోలీసు స్టేషన్ ? నేను వీ. ఆర్. పురం కనకరాజు గారి భార్యను మాట్లాడుతున్నా. ఇక్కడ మా ఆయనా, రాయుడు గారు గొడవపడి, ఒకరినొకరు రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయారు. మీరు వెంటనే రావాలి" అంటూ భర్త శవం మీద పడి రోదించసాగింది సువర్ణ.
ఎన్నో దశాబ్దాల తర్వాత ఆ ఊరు నుంచి పోలీసు స్టేషన్ కు వచ్చిన ఫస్ట్ ఫోన్ కాల్ అదే కావడంతో ఆశ్చర్యపోయిన కానిస్టేబుల్ అప్పారావు, ఆ విషయం ఎస్సై కిరణ్ కు చెప్పడానికి లేచాడు, గోడమీద ఫొటోలో ఉన్న గాంధీ తాత బోసినోటితో నవ్వుతూ చూస్తుండగా!
***** **సమాప్తం** *****