అనుమానం పెనుభూతం

సాక్షి • 29 Nov 2020 • 👁 1 views
*****

*అనుమానం పెనుభూతం*
==================
(నేర పరిశోధన కధ)

రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్.


" హలో, హలో..ఔను, నేనే సుమనే మాట్లాడుతున్నా చెప్పు, ఎలా ఉన్నావు ?"

"......... ......... ......."

"నా మేరేజా ? బాగా జరిగింది. పరవాలేదు, ఒక విధంగా చూస్తే, పెళ్లికి నువ్వు రాక పోవడం చాలా మంచిది అయ్యింది" నెమ్మదిగా చెప్పింది సుమ.

"...... ..... ..... ....."

"ఎవరూ ? మా ఆయనా ? ఔను, ఇక్కడే ఉన్నారు. ఈ రోజు ప్రోగ్రామా? ప్లాన్ చేసాం. మధ్యాహ్నం విజయనగరం వెళ్లి, మా ఆయన కోసం నాన్న గారు బుక్ చేసిన బైక్ తీసుకుని, దృశ్యం సినిమా మొదటి షో చూసి తిరిగి నెల్లిమర్ల వచ్చేద్దామని" అంటూ గట్టిగా చెప్పి ఫోన్ పెట్టేసింది సుమ.

"ఏమిటోయ్, మొత్తం ఈరోజు ప్రోగ్రాం అంతా టెలికాస్ట్ చేసేసావ్. ఇంతకీ ఎవరు?" బద్ధకంగా మంచం మీదనుంచి లేస్తూ అడిగాడు కొత్త పెళ్ళికొడుకు సుమంత్.

"అబ్బే, మా ఫ్రెండ్ అండీ. పెళ్లికి రాలేక పోయాననీ,అలాగే ఎక్కడికైనా ప్లాన్ చేసారా అని అడుగుతోంటే ఈరోజు ప్రోగ్రాం గురించి చెబుతున్నా" చెప్పింది సుమ.

అయితే, ఆ ఫోన్ కాలే తన పాలిట మృత్యు పాశం అవుతుందని ఆ సమయంలో పాపం సుమంత్ కు తెలియదు.

***** ***** ***** *****

ఆ రొజు రాత్రి సినిమా చూసి, బైక్ మీద ఇంటికి వెళ్తూ,

"ఏయ్, దుర్మార్గుడా ! సినిమా హాల్లో ఏకంగా రెండు సార్లు కూల్ డ్రింక్స్, రెండు సార్లు ఐస్ క్రీములు తినిపించావు. దానికి తోడు ఏసీ హాల్. కొంచెం చాటు ఉన్న చోట ఎక్కడైనా ఆపు బాబూ !" బైక్ నడుపుతున్న సుమంత్ నడుము మీద సున్నితంగా గిల్లింది సుమ.

"అబ్బో, సుమకు కొంచెం చిలిపి తనం ఎక్కువే సుమా !" అంటూ బైక్ పక్కకి తీసి ఆపాడు సుమంత్.

అయితే, ఉదయం సుమ ఫోన్ కాల్ ఆధారంగా ఓ నలుగురు వ్యక్తులు తనని ఫాలో అవుతున్నారన్న విషయం పాపం సుమంత్ కు తెలియదు.

ఈ లోగా ఓ నలుగురు వ్యక్తులు సుమంత్ నోరు గట్టిగా మూసి, రాడ్ లతో తలమీద బలంగా బాది చంపేశారు. ఆ సంఘటన చూసి, భయంతో అరుస్తున్న సుమను కూడా కొట్టి, ఆమె నగలు తీసుకుని ఆటోలో పారిపోయారు.

***** ***** ***** *****

కాసేపటి తరువాత, సంఘటనా స్థలానికి వచ్చిన ఇనస్పెక్టర్ ష్రఘ్వీ

"అసలు ఎలా జరిగిందో కొంచెం వివరంగా చెప్పమ్మా !" సుమను అడిగాడు ఇనస్పెక్టర్.

"సార్, నేను పొదచాటుకు వెళ్లి వచ్చి చూసేటప్పటికి...." అంటూ జరిగింది అంతా ఏడుస్తూ చెప్పింది సుమ.

"ఓకే అమ్మా , ఇదిగో కానిస్టేబుల్స్! బాడీని పోష్ట్ మార్టంకు తరలించి, మిగతా ఫార్మాలిటీలు అన్నీ కంప్లీట్ చేసి రండి" అని చెప్పి జీప్ ఎక్కి వెళ్ళబోతూ, ఏదో జ్ఞాపకం వచ్చి మళ్లీ వెనక్కి వచ్చి, సుమన్, సుమంత్ ల ఫోన్లు స్వాధీనం చేసుకున్నాడు ఇనస్పెక్టర్.

***** ***** ***** *****

మర్నాడు ఉదయం, స్టేషన్ కి వచ్చిన ష్రఘ్వీ, సుమ మీద అనుమానం వచ్చి, ఆమె ఫోన్లో కాల్ వివరాలు తీసుకుని నిన్న ఉదయం ఆమెకు వచ్చిన ఓ నెంబర్ కు డయల్ చేసాడు.

"హలో, రేష్మా గారు ! నేను ఇనస్పెక్టర్ ష్రఘ్వీని మాట్లాడుతున్నా ! మీ ఫ్రెండ్ సుమ వాళ్ళ భర్తను, నిన్న రాత్రి ఎవరో హత్య చేసారన్న విషయం తెలుసుగా ? ఇందులో మీ పాత్ర మీద కూడా సందేహాలున్నాయ్ !"

"ఈ ఉదయమే తెలిసింది సార్ ! మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ం సార్. సరదాగా ఉండేవాళ్ళం. నేను మేరేజ్ చేసుకుని, నెల్లూరులో స్థిర పడ్డాను. నా మీద అనుమానం ఏమిటి సార్ ? ఆశ్చర్యంగా ఉంది."

"ఎందుకంటే, వాళ్ళు విజయనగరం వెళ్తున్నారన్న విషయం సుమ తల్లి తండ్రులకు, నీకు తప్ప ఎవరికీ తెలియదు. ఒకవేళ ఎవరికైనా తెలిసింది అంటే అది నీ ద్వారానే తెలియాలి. కొంచెం ఆలోచించు కుని చెప్పమ్మా. కంగారు ఏమీ లేదు."

"ఆ ! జ్ఞాపకం వచ్చింది సార్. నిన్న ఉదయం ప్రభాకర్ ఫోన్ చేస్తే అతనికి చెప్పాను ఈ విషయం."

"ప్రభాకరా ? ఎవరతను ?"" ఆశ్చర్యంగా అడిగాడు ఇనస్పెక్టర్.

"ప్రభాకర్, సుమ.................." అంటూ అన్ని సంగతులు వివరంగా ఫోన్ లో చెప్పింది రేష్మా.

***** ***** ***** *****

మధ్యాహ్నం ప్రభాకర్ ని అదుపులోకి తీసుకొని స్టేషన్ కి తెచ్చారు పోలీసులు.

"సీ, మిష్టర్ ప్రభాకర్ ! ఈ హత్య మీరే చేసి ఉంటారని మీ మీద అభియోగం ఉంది. అదే విషయాన్ని సుమ తల్లితండ్రులు, మీ కామన్ ఫ్రెండ్ రేష్మా కూడా చెబుతున్నారు. అందుకే నేరం ఒప్పుకుంటే శిక్ష తగ్గించే ప్రయత్నం చేస్తాం !" చెప్పాడు ఇనస్పెక్టర్.

"సార్ ! నన్ను నమ్మండి. ఈ హత్య నేను చేయలేదు. నేను సుమను ప్రేమించిన విషయం వాస్తవమే కానీ దానికోసం హత్య చేసేటంత దుర్మార్గుడుని మాత్రం కాదు."
చెప్పాడు ప్రభాకర్.

"హత్య చేసిన ప్రతీవాడూ ఇలాగే చెప్తాడు. మీరు మాకు వదిలెయ్యండి సార్. మేము చూసుకుంటాం" ష్రఘ్వీని రెచ్చగొట్టాడు ఓ కానిస్టేబుల్. వారిని సముదాయించి,

"సరే కానీ, ప్రభాకర్ ! మరి, నిన్న హత్య జరిగిన సమయంలో మీరు ఎక్కడున్నారు ? అసలు నిన్న ఏం జరిగిందో వివరంగా చెప్పండి." అడిగాడు ఇనస్పెక్టర్.

"సార్, నిన్న మధ్యాహ్నం నేను ......" అంటూ జరిగిన విషయం వివరంగా చెప్పాడు ప్రభాకర్.

"సరే, ఎంక్వయిరీ అయ్యేవరకూ ఇతడిని లోపల ఉంచండి." అంటూ స్టాఫ్ కి ఆర్డర్ వేసి, బయటకు నడిచాడు ష్రఘ్వీ.

***** ***** ***** *****

సాయంత్రం ఐదు గంటలు. సాయిసుమంత్ రియల్ ఎస్టేట్ ఆఫీసు ముందు ఆగింది పోలీసు జీప్. అందులోంచి బిలబిలమంటూ దిగారు ఇనస్పెక్టర్ బృందం.

"మిష్టర్ సాయిరాం, మీ పార్టనర్ సుమంత్ హత్య కేసులో మీరే హంతకుడని తేలింది. యూ ఆర్ అండర్ అరెస్ట్" అంటూ అతన్ని అదుపులోకి తీసుకున్నాడు ష్రఘ్వీ.

"వ్వాట్. ఏమిటి మీరు చెప్పేది ? నేను హత్య చేయడం ఏమిటి ?" భయపడుతూ అడిగాడు సాయిరాం.

"అవన్నీ, స్టేషన్లో చెబుతా ! కమాన్, ముందు జీప్ ఎక్కు." అంటూ అక్కడి నుండి బయలు దేరారు ఇనస్పెక్టర్ బృందం.

***** ***** ***** *****

"సార్, నన్ను అక్రమంగా అరెస్టు చేసారు. నేనే ఈ హత్య చేసినట్లు ఋజువు ఏమిటి ? " కొంచెం ఆవేశంగా అడిగాడు సాయిరాం.

"చూడు మిష్టర్ సాయిరాం ! మా విచారణలో ప్రభాకర్ చెప్పిన విషయాలు ఆధారంగా మా పరిశోధన తీవ్రతరం చేసాం. ఆ సమయంలో మేము హతుడు సుమంత్ ఫోన్ కాల్ లిస్ట్ చూసాం. అందులో ఎక్కువ సార్లు నీ నెంబర్ ఉంది. అఫ్ కోర్స్ నిన్న మటుకు నీ దగ్గర నుండి ఎటువంటి కాల్ రాలేదనుకో ! ఎందుకైనా మంచిదని మా ఐడీ పార్టీ వాళ్ళని నీ మీద కూడా ఓ కన్నేసి ఉంచమన్నాం. అప్పుడే నీ గురించి చాలా విషయాలు తెలిసాయి." చెబుతూ ఆగాడు ష్రఘ్వీ.

"సార్! నేనూ, సుమంత్ కలిసి మా బిజినెస్ బ్రహ్మాండంగా డెవలప్ చేసుకున్నాం. అటువంటి వాడిని నేనెందుకు హత్య చేస్తాను ? " అమాయకంగా అడిగాడు సాయిరాం.

"ఎందుకంటే, మీ బిజినెస్ లో ఈమధ్య సుమంత్ దూసుకుపోతున్నాడు. అతనికే ఎక్కువ పేరు వస్తోందన్న ఈర్ష్య నీలో మొదలైంది. అందుకే అతడిని అడ్డు తొలిగించుకొని మీ బావమరిదిని ఆ స్థానంలో ప్రమోట్ చేయాలని చాలా రోజులుగా చూస్తున్నావు. చేతికి మట్టి అంటుకోకుండా అతడిని అడ్డు తొలగించుకొనే అవకాశం నిన్న నీకు లభించింది. అది ఎలాగంటే..." అంటూ జరిగింది పూస గుచ్చినట్లు చెప్పడం మొదలెట్టాడు ఇనస్పెక్టర్.

***** ***** ***** *****

"ఏరా ! మీ మాజీ లవర్ సుమకి, ఆ రియల్ ఎస్టేట్ సుమంత్ తో పెళ్లి అయిపోయింది. ఆమె సంగతులు ఏమైనా తెలుస్తు న్నాయా?" ప్రభాకర్ ని రెచ్చగొట్టేడు అతని స్నేహితుడు విశ్వం, బార్ లో ఓ మూల కూర్చుని మద్యం సేవిస్తూ.

"తప్పురా ! నాది ఒన్ సైడ్ లవ్. తనకు ఇష్టం లేదు. ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఇద్దరూ ఏం సుఖపడతాం ? ఇక ఆ సంగతి ఒదిలేయ్. వాళ్ళిద్దరూ హాయిగా ఉన్నారు. ఈ రోజు సినిమాకు కూడా వెళ్తున్నారుట. పొద్దున్న రేష్మాకు ఫోన్ చేస్తే తను చెప్పింది." అంటూ మొత్తం వివరంగా చెప్పాడు ప్రభాకర్.

"ఒరే సన్నాసీ ! నువ్వు కాబట్టి వదిలేసావ్. అదే నేనైతేనా ఆ ఇద్దరినీ కూడా లేపేసే వాడిని." అంటూ ఆవేశంగా చెప్పాడు విశ్వం.

"నీకు కొంచెం డోస్ ఎక్కువయ్యిందిరోయ్. సరే కానీ ఇంక నడు. బయలదేరదాం." అంటూ స్నేహితుడిని తీసుకుని బయటకు నడిచాడు ప్రభాకర్.

***** ***** ***** *****

"బాగానే వుంది కానీ, ఇవన్నీ నాకెందుకు చెబుతున్నారు ?" ఇనస్పెక్టర్ ష్రఘ్వీ చెప్పడం ఆపగానే అడిగాడు సాయిరాం.

"ఎందుకంటే.. విశ్వం, ప్రభాకర్ మాట్లాడు కున్న ఆ సంభాషణ అంతా పక్క టేబుల్ వద్ద కూర్చుని మద్యం తాగుతున్న నువ్వు విన్నావు. వెంటనే సుమంత్ ని అడ్డు తొలగించుకోవడానికి దీనిని ఓ చక్కటి అవకాశంగా చేసుకున్నావు. ఆ నేరం ప్రభాకర్ మీదకు పోతుంది అనుకొన్నావు. ఒకవేళ అది బెడిసి కొడితే దొంగతనం కేసుగా పోతుంది అని సుమ నగలు తీసుకుని వెళ్ళావు. వెంటనే ఆ పథకం ప్రకారం ఓ నలుగురు సాయం తీసుకుని హత్య చేసావు." అని చెప్పడం ఆపాడు ష్రఘ్వీ.

"ఈ హత్య నేనే చేసాననడానికి సాక్ష్యం ఏమిటి ?" ఎదురు ప్రశ్నించాడు సాయిరాం.

"చూడు మిష్టర్ సాయిరాం ! ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తామనుకున్నావ్? బార్ లో హతుని పక్క టేబుల్ వద్ద నువ్వు కూర్చున్నట్లు అక్కడి సీసీ టీవీల్లో రికార్డు అయ్యింది. అంతే కాక హత్య జరిగిన పరిసరాల్లో ఉన్న సీసీ టీవీల్లో మాస్కులు వేసుకుని మీరంతా ఆ ఆటోలో వెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. ఇక ఆ ఆటో డ్రైవర్ కూడా మాకు లొంగిపోయి, జరిగిన విషయం అంతా చెప్పేసాడు. అలాగే ఆమె వద్ద దొంగిలించిన నగలు, హత్యకు వాడిన ఆయుధాలు కూడా సరెండర్ చేసాడు." అంటూ ముగించాడు ఇనస్పెక్టర్ ష్రఘ్వీ.

ఇక చేసేది లేక, తలవంచుకుని మౌనంగా కటకటాల వైపు నడిచాడు సాయిరాం.

"సారీ, మిష్టర్ ప్రభాకర్, కొంచెం అనుమానం వచ్చి, మిమ్మల్ని అదుపులోకి తీసుకున్నాం. అసలు భూతం నేరం ఒప్పకున్నాడు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాం." అంటూ ప్రభాకర్ ని కటకటాల నుంచి బయటకు తీసుకొచ్చాడు ఇనస్పెక్టర్ ష్రఘ్వీ.

***** **సమాప్తం** *****

(నేను రాసిన ఈ కథ సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం పన్ డే లో 29.11.2020న ప్రచురితమైనది)