ఖైదీ నెంబర్ నూట యాభై

సాక్షి • 25 Oct 2020 • 👁 1 views
*****

*ఖైదీ నెంబర్ నూటఏభై*
================
(క్రైమ్ కధ)

(నేను రాసిన ఈ క్రైమ్ కథ సాక్షి దినపత్రిక
ఆదివారం అనుబంధంలో 25.10.2020న
ప్రచురితమైనది)


రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్

కాకినాడ శివారులో ఉన్న రాజేష్ గార్డెన్స్ లో దాని ఓనర్ హత్యకు గురయ్యాడని తెలుసుకున్న ఎస్సై సంకీర్త్ బృందం అక్కడికి చేరుకున్నారు. అక్కడ కుర్చీలో కూర్చున్నట్టున్న రాజేష్ మృతదేహాన్ని, అక్కడి పరిస్థితులు చూసిన ఎస్సైకి ఎవరో అతన్ని గొంతు కోసి చంపేశారనీ, పెద్దగా పెనుగులాట ఏమీ జరగలేదని, ఎటువంటి వస్తువులు చోరీకి గురికాలేదనీ అర్థమయ్యింది. టేబుల్ మీద సగం తాగి వదిలేసిన లిక్కర్ గ్లాసు, చెదురుముదురుగా పడి ఉన్న చిప్స్, పక్కన కేరీబేగ్ లో ఇంకా విప్పకుండా పడిఉన్న రెండు బిర్యానీ పొట్లాలు అతని దృష్ఠిని ఆకర్షించాయి.

చేయవలసిన ఏర్పాట్లు గురించి తన సిబ్బందికి పురమాయించి, "నువ్వేనా, ఇక్కడి వాచ్ మెన్ వి ? నిన్న రాత్రి ఏం జరిగిందో వివరంగా చెప్పు" అడిగాడు ఎస్సై సంకీర్త్, పక్కనే వున్న వ్యక్తిని.

"అయ్యా! నిన్న సాయంత్రం ఆరు గంటలకు రాజేష్ బాబు గారు వచ్చి, తాను రాత్రికి ఇక్కడే ఉండిపోతాననీ, తినడానికి తాగడానికి టౌన్ నుంచి ఏదైనా తెచ్చి, నన్ను ఇంటికి వెళ్లి పొమ్మనీ చెప్పారు బాబూ! నేను ఆయన చెప్పినట్లు చేసానయ్యా ! పొద్దున్న వచ్చి చూసేటప్పటికి ఇలా చూడవలసి వచ్చింది మారాజుని" ఏడుస్తూ చెప్పాడు వాచ్ మెన్. "సరే కానీ, ఈయనెవరు?" పక్కన ఉన్న వ్యక్తిని ఉద్దేశించి అడిగాడు ఎస్సై. "ఈయన విజయ్. రాజేష్ బాబు గారి స్నేహితుడు. ఈ విషయం చెప్పగానే, పాపం ఈ సారు వెంటనే వచ్చేసారు" చెప్పాడు వీర్రాజు.

"చూడండి విజయ్ ! ఈ రాజేష్ ఏం వ్యాపారాలు చేసేవారు? ఆయన మీకు ఎలా పరిచయం? ఈ హత్య విషయంలో మీరు ఎవరినైనా అనుమానిస్తున్నారా?" అడిగాడు ఎస్సై, విజయ్ ని పక్క గదిలోకి తీసుకుని వెళ్లి.

"సార్, మేమిద్దరం చిన్నప్పటి నుంచి స్నేహితులం. రాజేష్ కి చాలా వ్యాపారాలలో భాగస్వామ్యం ఉంది. మేము ఇద్దరం కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం. పెట్టుబడి మాత్రం వాడిది. మిగతాదంతా నేనే చూస్తాను. నాకు ఓ దోవ చూపెట్టింది ఈ రాజేషే. ఎవడో దుర్మార్గుడు పొట్టన పెట్టుకున్నాడు. ఇక, నాకైతే ఈ వాచ్ మెన్ వీర్రాజు మీద అనుమానం ఉంది. అసలు రాత్రి ఇక్కడ ఉండకుండా ఎందుకు ఇంటికి వెళ్లి పోయాడనీ?, అలాగే షడన్ గా చెన్నై వెళ్లిన వెంకటేష్ అనే రాజేష్ వాళ్ల ఇంకో బిజినెస్ పార్ట్ నర్ మీద కూడా అనుమానం ఉంది సార్! " చెప్పాడు విజయ్.

"సరే, మీరిద్దరూ కూడా నాకు తెలియకుండా ఊరు దాటి వెళ్లవద్దు" అని వాళ్లకు చెప్పి, హతుని రాజేష్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని అక్కడి నుండి బయలుదేరాడు ఎస్సై సంకీర్త్.

***** ***** ***** *****

ఆ రోజు సాయంత్రం, పోస్ట్ మార్టం రిపోర్టు, వేలిముద్రల ప్రాధమిక నివేదికలలో....హత్య రాత్రి ఏడు ఎనిమిది గంటల మధ్య జరిగిందని, గొంతు కోయడం వలన మరణం సంభవించిందనీ, అలాగే అక్కడ వస్తువుల మీద వీర్రాజు, రాజేష్ వేలిముద్రలు తప్ప వేరే ఎవరి వేలిముద్రలు లేవని తెలియడంతో తన పరిశోధన వేగవంతం చేసాడు ఎస్సై. అందులో భాగంగా, రాజేష్ ఇంటికి వెళ్లి ఆతని భార్య రాగిణిని, "నిన్న మీ భర్త ప్రవర్తన ఎలా ఉంది?" అని ప్రశ్నించాడు ఎస్సై.

"నిన్న మధ్యాహ్నం ఫోన్ లో ఎవరితోనో గట్టిగా మాట్లాడడం విన్నాను. మాటల మధ్యలో వెంకటేష్ అనే మాట నాలుగైదు సార్లు విన్నాను. అలాగే సాయంత్రం బయటకు వెళ్తూ, ఓ బిజినెస్ మేటర్ సెటిల్ చేయడానికి మన గెస్ట్ హౌస్ కి వెళ్తున్నాననీ, బహుశా రాత్రికి రాకపోవచ్చనీ మాత్రం చెప్పారు సార్" చున్నీతో కళ్లు తుడుచుకుంటూ చెప్పింది రాగిణి.

***** ***** ***** *****

రాజేష్ ఇంటి నుంచి స్టేషన్ కి వచ్చిన ఎస్సై సంకీర్త్, అప్పటికే తమ సిబ్బంది విచారణ కోసం తీసుకువచ్చిన వాచ్ మెన్ వీర్రాజుతో,
"చూడు వీర్రాజూ! నిజం చెబితే నీకు శిక్ష తగ్గించే ఏర్పాటు చూస్తాం. ఈ హత్య నువ్వు ఒక్కడివే చేసావా ? లేక వెంకటేష్ కూడా సాయం చేసాడా?" అని బెదిరించాడు ఎస్సై.

"సత్తెపెమాణికంగా సెబుతున్నానండయ్యా! నిన్న ఉదయం రాజేష్ బాబుకి ఫోన్ చేసి మా ఆవిడని రాత్రి కాకినాడలో హైదరాబాద్ వెళ్లే రైలు ఎక్కించాలనీ, అందుకే రాత్రి ఉండలేననీ చెప్పా సార్. అది జ్ఞాపకం ఉంది కాబట్టే మారాజు నన్ను రాత్రి ఆ సరుకులు ఇచ్చి ఇంటికి ఎల్లిపొమ్మన్నాడు. నేనే కనక అక్కడుంటే మారాజు పేనాలతో ఉండేవాడేమో?" బాధగా చెప్పాడు వీర్రాజు.

"సరే, మళ్లీ అవసరమైతే పిలుస్తాం. ఊర్లోనే ఉండు" అని చెప్పి పంపించేసాడు.

***** ***** ***** *****

వీర్రాజును పంపిన తరువాత రాజేష్ సెల్ ఓపెన్ చేసిన ఎస్సైకి అందులో నిన్న మధ్యాహ్నం ఉన్న కాల్ లిస్టులో, వెంకటేష్ పేరు కనబడింది. వెంటనే ఆ నెంబరుకు ఫోన్ చేసి, "సీ, మిష్టర్ వెంకటేష్! నీకు తెలుసుగా! మీ బిజినెస్ పార్టనర్ రాజేష్ హత్య గురించి. నువ్వు, రాజేషూ నిన్న మధ్యాహ్నం ఫోన్ లో గొడవపడినట్లు అతని భార్య చెప్పింది. అంతే కాదు, వాచ్ మెన్ వీర్రాజు, నీ సహకారంతో హత్య చేసినట్లు ఒప్పేసుకున్నాడు. నువ్వు వచ్చి స్టేషన్ లో సరెండర్ అవ్వడం మంచిది. లేకపోతే మేమే
వచ్చి అరెస్టు చేయాల్సి ఉంటుంది" చిన్న అబద్ధం ఆడేడు ఎస్సై.

"సార్, నేను చెప్పేది వినండి. నాకు ఉదయమే ఈ విషయం తెలిసింది. ఇక, నేను నిన్న రాజేష్ తో తగదాపడిన మాట నిజం. ఎందుకంటే, నోట్ల రద్దు వలన అన్ని బిజినెస్ లు నష్టం వస్తున్నాయి అనీ, అలాగే నమ్ముకున్న వాళ్లే ద్రోహం చేస్తున్నారు అనీ ఏదేదో మాట్లాడుతూ ఉంటే, అది నన్ను ఉద్దేశించే అనుకొని, నేను కూడా కొంచెం గట్టిగా వాదించేను. అంతే తప్ప ఇలాంటి చిన్న విషయాలకు హత్య చేసేటంత నీచుడను కాను సార్. రెండు రోజుల క్రితం ఓ బిజినెస్ పనిమీద చెన్నై వచ్చి, ఆంధ్రా హొటల్ లో ఉన్నా సార్! ఇంకో రెండు రోజుల్లో కాకినాడ వచ్ఛేస్తాను. అప్పుడు మీకు ఏ వివరాలు కావాలన్నా ఇస్తాను" చెప్పాడు వెంకటేష్.

"సరే, అవసరమైతే చెబుతాం, మీరు అక్కడ స్టేషన్ కి వెళ్లవలసి ఉంటుంది" అని చెప్పి, పక్కనే ఉన్న తన సిబ్బందికి ఈ వీర్రాజు, వెంకటేష్ లు చెప్పింది నిజమో కాదో కనుక్కొనమని చెప్పి మళ్ళీ రాజేష్ ఫోన్ చూడసాగేడు ఎస్సై.

****** ***** ***** *****

మర్నాడు ఉదయం, స్టేషన్ కి వచ్చి, తన సిబ్బంది చెప్పిన వివరాలు విని, అక్కడి నుండి రాజేష్ ఆఫీసుకి వెళ్లిన ఎస్సై, అక్కడ ఉన్న విజయ్ తో, "చూడండి! మొన్న రాత్రి ఏడు గంటలకు రాజేష్ సెల్ కు మీరు ఫోన్ చేసారు. ఏ విషయం గురించి మాట్లాడారు?" సూటిగా అడిగాడు.

"ఓ అదా సార్! మొన్నటి రోజు రాత్రి నేను, రాజేష్ కూర్చుని బిజినెస్ విషయాలు గురించి మాట్లాడుకోవలసి ఉంది. కానీ వెంకటేష్ ఏదో పనిమీద అర్జెంటుగా చెన్నై వెళ్లడంతో, నేను రాజేష్ కి ఫోన్ చేసి, ఆ విషయం చెప్పి, 'మనం ఇద్దరూ కూర్చొని మాట్లాడేది ఏముంది? వెంకటేష్ వచ్చిన తరువాత ఇంకో రోజు కూర్చుందాం' అని చెప్పాను సార్" అన్నాడు విజయ్.

"ఔనా ? అయితే, ఆ సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు?" అడిగాడు ఎస్సై.

"సార్, నేను ఆ టైముకి ఆనంద్ థియేటర్ లో, ఆ రోజే విడుదలైన నా అభిమాన హీరో మొదటి ఆట సినిమా చూస్తున్నా. షడన్ గా నాకు ఈ విషయం జ్ఞాపకం వచ్చి, ఏడు గంటలకు రాజేష్ కి ఫోన్ చేసి పై విషయం చెప్పాను. కావాలంటే ఇదిగో నా ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్" అంటూ ఫోన్ లో ఉన్న టికెట్ చూపించాడు విజయ్. ఆ వివరాలు నోట్ చేసుకుని, "ఓకే! మిస్టర్ విజయ్, మీరు కోపరేట్ చేస్తే, త్వరలోనే హంతకుడిని పట్టుకుంటాం. అంతవరకూ మీరు ఊరు దాటి వెళ్లకూడదు" అని చెప్పి తిరిగి స్టేషన్ కు వచ్చిన ఎస్సై సంకీర్త్ వెంటనే, తన సిబ్బందికి కొన్ని సూచనలు ఇచ్చాడు.

***** ***** ***** *****

అదే రోజు రాత్రి, ఎనిమిది గంటలకు తన బృందంతో విజయ్ ఇంటికి చేరుకున్న ఎస్సై

"మిష్టర్ విజయ్! మొన్న జరిగిన రాజేష్ హత్య కేసులో నిందితుడికి సంబంధించిన కొన్ని ఆధారాలు దొరికేయ్! మీరు సహకరిస్తే అతడిని త్వరలో అరెస్ట్ చేస్తాం" అని చెప్పడం మొదలెట్టాడు.

"మాకు మీ మీద అనుమానం వచ్చి, ఆ థియేటర్ సీసీ టీవీ పుటేజీని పరిశీలించాం. సరిగ్గా ఏడు గంటల ప్రాంతంలో మొహం కనబడకుండా మంకీ కేప్ పెట్టుకుని, ఫేంట్ షర్టుతో ఉన్న ఓ వ్యక్తి సెల్ మాట్లాడుతూ హాల్ నుంచి బయటకు రావడం చూసాం. అనుమానం వచ్చి, అస్పష్టంగా ఉన్న అతని ఫొటో ప్రింట్ తీసుకుని బయటకు వచ్చి ఆటో వాళ్లని ఎంక్వయిరీ చేసాం" చెబుతూ ఆగాడు ఎస్సై.

"ఎవరు సార్, అతను ?" ఆశ్చర్యంగా అడిగాడు విజయ్.

"చెబుతాను. ఒక ఆటో అతను ఆ ఫొటో గుర్తుపట్టి, ఆ ముసుగు మనిషి తన ఆటో ఎక్కాడనీ, మధ్యలో గాలి పెట్టించడం కోసం తన ఆటోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఆపాననీ, ఈ లోగా ఆ ముసుగు మనిషి ఆటో దిగి పక్కనే ఉన్న సూపర్ బజార్ లోకి వెళ్లి, ఓ కూరగాయలు తరుక్కునే ఓ బలమైన కత్తితో తిరిగి వచ్చి, మళ్ళీ ఆటో ఎక్కి రాజేష్ గార్డెన్స్ వద్ద దిగాడనీ చెప్పాడు" అని చెబుతూ, విజయ్ వంక చూసాడు ఎస్సై.

"ఇంతకీ ఎవరు సార్ ఆ ముసుగు మనిషి? వెంకటేష్ పురమాయించిన హంతకుడా ?" అనుమానంగా అడిగాడు విజయ్.

"ఇంక డ్రామాలు ఆపు మిష్టర్ విజయ్. నువ్వనుకున్నట్టు ఆ వెంకటేష్ కూ, వీర్రాజుకూ ఈ హత్యలో ప్రమేయం లేదు. మా విచారణలో హత్య జరిగిన సమయానికి వీర్రాజు కాకినాడ రైల్వే స్టేషన్ లోనూ, వెంకటేష్ చెన్నైలోని ఓ హొటల్ లోనూ ఉన్నట్టుగా అక్కడి సీసీ కెమేరాలలో రికార్డు అయ్యింది. ఆ ముసుగు మనిషి నువ్వే. నువ్వు థియేటర్ లోకి వెళ్లేటప్పుడు, అలాగే సినిమా అయిన తర్వాత వచ్చేటప్పుడు జర్కిన్ వేసుకున్నట్టు సీసీ కెమెరాలో ఉంది. కానీ నువ్వు రాత్రి ఏడు గంటల ప్రాంతంలో, నీ సీట్లో జర్కిన్ వదిలేసి మళ్ళీ ఓ గంట తర్వాత వచ్చావని, ఆన్ లైన్లో టికెట్ బుక్ చేసుకుని నీ పక్క సీట్లో కూర్చున్న ఓ వ్యక్తి, మా విచారణలో చెప్పాడు. ఇక, నువ్వు ఎంతో తెలివిగా మంకీ కేప్ తో పూర్తిగా మొహం కనబడకుండా మేనేజ్ చేసినా, ఆ కత్తి కొనడం కోసం నువ్వు చేసిన ఓ చిన్న పొరపాటు మాత్రం నిన్ను పట్టించింది"

"ఏం పొరపాటు చేసాను సార్?" ఓటమి అంగీకరిస్తున్నట్టు అడిగాడు.

"అది ఏమిటంటే, ఆ కత్తి కొనడానికి నువ్వు నీ క్రెడిట్ కార్డు వాడడమే! అంతేకాదు ఆ కత్తి కూడా గెస్ట్ హౌస్ కు కొంచెం దూరంలో ఉన్న తుప్పల్లో దొరికింది. ఇంకో విషయం.. హత్య జరిగిన రోజు రాత్రి నువ్వు రాజేష్ తో సెల్ లో 'వెంకటేష్ చెన్నై వెళ్లడం గురించి, ప్రోగ్రాం కేన్సిల్ గురించి చెప్పాను సార్' అన్నావు చూడు.. అది పూర్తిగా అవాస్తవం. అసలు నిజమేమిటంటే...నువ్వు, 'ఇప్పుడే బయలుదేరాననీ ఇంకో పది నిమిషాల్లో వస్తాననీ, అక్కడ ఉండేది మనిద్దరమేనా?' అని అడిగావు. దానికి రాజేష్ 'ఔను, వీర్రాజు కూడా లేడు. మనిద్దరమే ఉన్నాం. నీకు కూడా బిరియానీ తెప్పించాననీ' చెప్పాడు. ఇది కరెక్టేనా మిష్టర్ విజయ్ ?" గంభీరంగా అడిగాడు ఎస్సై సంకీర్త్.

"ఇదంతా మీకెవరు చెప్పారు సార్?" అమాయకంగా అడిగాడు విజయ్.

"నీకు తెలియని విషయం ఏమిటంటే... రాజేష్ ఫోన్ లో ఆటో కాల్ రికార్డ్ ఉంది. ఇదంతా రికార్డు అయ్యింది. సరేకానీ, అసలు అంత మంచి వ్యక్తిని ఎలా చంపాలనిపించింది"అడిగాడు ఎస్సై సంకీర్త్.

తల వంచుకొని చెప్పాసాగేడు విజయ్,
"సార్! నేను ఈమధ్య దాయాదుల గొడవలో ఉన్న ఓ భూమిని , డబ్బుకు కక్కూర్తిపడి రాజేష్ చేత కొనిపించాను. ఎందుకంటే, ఆ డీల్ లో నాకు ఆ భూయజమాని ద్వారా ఓ పది లక్షలు ముట్టాయి. నన్ను నమ్మిన రాజేష్ ఆ స్థలం కొన్నాడు. కొన్నాళ్లకు ఈ గొడవ విషయం తెలిసిన రాజేష్, నన్ను ఆ స్థలం యజమానినుంచి ఆ డబ్బులు వాపసు ఇప్పించమని ఒత్తిడి చేయసాగాడు. అయితే, నేను ఆ డబ్బులు ఎప్పటికీ ఇప్పించలేను. అంతే కాదు ఇతను బతికుంటే నాకు ఎప్పటికైనా ప్రమాదం అని భావించి, ఇందాక మీరు చెప్పిన విధంగానే వెళ్లి హత్య చేసి ఏమీ ఎరగనట్లు మళ్లీ థియేటర్ కు వచ్చేసాను. ఈ నేరం వీర్రాజు మీదకు కానీ, వెంకటేష్ మీదకు కానీ పోతుంది అనుకున్నా, కానీ ఇలా బెడిసి కొడుతుంది అనుకోలేదు సార్ !" వంచిన తల ఎత్తకుండా చెప్పాడు విజయ్.

"విజయ్ నువ్వు తప్పించుకోవడానికి ఎలిబీగా చూపించిన ఆ సినిమా టికెట్టే మా పరిశోధనకు మేలు చేసింది. లేకపోతే, ఇంత తొందరగా కేసు తెమలక పోను. ఔనూ, ఇంతకీ నువ్వు వెళ్లిన ఆ సినిమా పేరేమిటి ?" అడిగాడు ఎస్సై సంకీర్త్, అనుమానంగా !

"ఖైదీ నెంబర్ నూటయాభై" చెప్పాడు విజయ్.

***** ** *సమాప్తము* ** *****