*****
*ఫలించని పన్నాగం*
==============
( డిటెక్టివ్ కథ )
(ఈ కథ సాక్షి ఆదివారం అనుబంధం ఫన్ డే
సంచికలో ది. 24.05.2020 న ప్రచురితమైనది)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్.
అంశం :: ఉగ్రవాదం
*1970 జూలై 8* .
అది, ఢిల్లీలోని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలోని, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖర్జీ గారి రహస్య సమావేశ గది.
"రండి, కూర్చోండి, డిటెక్టివ్ సంకీర్త్ గారూ! మిమ్మల్ని ఇక్కడికి పిలిపించడానికి ముఖ్య కారణం ఏమిటంటే, మీ S3 డిటెక్టివ్ ఏజెన్సీ గురించీ, ముఖ్యంగా మీరూ, మీ భాగస్తులు మిస్టర్ ష్రఘ్వీ మరియు మిస్టర్ శక్య ల పనితీరు గురించి తెలిసిన రక్షణ మంత్రి గారు, ఈ కేసును మీకు అప్పచెప్పమన్నారు" చెప్పారు ముఖర్జీ గారు, రివాల్వింగ్ చైర్ లో రిలాక్స్ డ్ గా వెనక్కి వాలి కూర్చుని.
"ధన్యవాదాలు సార్, మా మీద ప్రభుత్వానికి ఉన్న నమ్మకానికి! ఇంతకీ, అసలు కేసు ఏమిటో చెప్పారు కాదు" ముఖర్జీ గారిని ప్రశ్నించాడు డిటెక్టివ్ సంకీర్త్, పక్కనే ఉన్న తన భాగస్వాములకు ప్రతీ విషయమూ నోట్ చేసుకోమని సౌంజ్ఞ చేస్తూ!
"వెల్ మైడియర్ డిటెక్టివ్. ఇది చాలా రహస్యంగా డీల్ చేయవలసిన మేటర్. ఎందుకంటే ఈ కేసు దేశ రక్షణకు సంబందించినది. ఇందులో ఉగ్రవాద కోణం కూడా ఉందేమో అని మా అనుమానం. అసలు జరిగింది ఏమిటంటే, ప్రస్తుతం మన దేశం, పొరుగు దేశాల శత్రువులతో పోరాడుతోంది. ఈ సమయంలో మన శాస్త్రవేత్తలు ఒక జలాంతర్గామి నమూనా రూపొందించారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకుని, ఆ ప్రాజెక్టులో పాల్గొన్న ఒక ప్రొఫెసర్, పది రోజుల క్రితం విశాఖ నుంచి విమానంలో బయలుదేరి ఢిల్లీ వచ్చారు. ఆయనను రిసీవ్ చేసుకోవడానికి మనం పంపిన కారులో బయలుదేరిన ఆయన, ఈ రోజు వరకూ కూడా మన ఆఫీసుకు రాలేదు" బాధతో నిండిన స్వరంతో చెప్పారు ముఖర్జీ.
"అంటే ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని మీ అనుమానమా సార్ ?" కొంచెం ముందుకు వంగి కుతూహలంగా అడిగాడు సంకీర్త్.
"ఎగ్జాక్ట్లీ మిస్టర్ డిటెక్టివ్. ఎందుకంటే ఆ తరువాత రెండు రోజులకి మా ఆఫీసుకు ఒక ఫోన్ వచ్చింది. 'మీకు మీ ప్రొఫెసరూ మరియు ఆ డాక్యుమెంట్లు కావాలంటే ఓ కోటి రూపాయలు ఇవ్వాలనీ లేదా ప్రొఫెసర్ ను చంపి, ఆ డాక్యుమెంట్లు విదేశాలకు అమ్మేస్తామని'!"
"మరి ఆ విధంగా డబ్బులు ఇచ్చేసి వదిలించుకోలేక పోయారా ??"
"అదీ చేసాం, కొంతమంది పోలీసులను రహస్యంగా వెంబడించమని, ఆ ప్రదేశానికి వెళ్ళాము. కానీ, ఆ అగంతకుడు చెప్పిన అడ్రసు తప్పు. అక్కడ ఎవరూ లేరు" బాధగా చెప్పారు ముఖర్జీ.
"అదే సార్, మన వాళ్ళు చేసిన తప్పు. పోలీసులు కూడా మారు వేషాల్లో వస్తున్నారన్న విషయం ఆ కిడ్నాపర్ కి తెలిసి పోయింది. అందుకే అక్కడ నుంచి బిచాణా ఎత్తేసాడు"
"మీరు చెప్పింది నిజమే కావచ్చు, మిష్టర్ సంకీర్త్, అందుకే ఇంక మా ప్రయత్నాలు ఆపేసాం. దీనిని ఇక రహస్యంగానే ఛేదించాలని నిశ్చయించుకున్నాం. మీకు కావలసిన సమాచారం ఇచ్చి సహకరించమని మా ఆఫీసర్లకు ఆర్డర్లు పాస్ చేసా. ఇక మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాతో వాకీటాకీ లో మాట్లాడవచ్చు. అర్జంటుగా ఓ మీటింగ్ కు ఎటెండ్ కావాలి. ఉంటా. బై..ఆల్ ది బెస్ట్" అని డిటెక్టివ్ లు ముగ్గురుకీ విషెస్ చెప్పి హడావుడిగా బయటకు వెళ్ళారు ముఖర్జీ.
***** ***** ***** *****
ఓ వారం రోజుల తర్వాత
*1970 జూలై 15* .
ఢిల్లీలోని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యా లయంలో, పత్రికా విలేఖరుల సమావేశ గది. అందరినీ ఉద్దేశించి ముఖర్జీ గారు చెప్పడం మొదలెట్టారు.
"వెల్ మైడియర్ ఫ్రెండ్స్. మామూలుగా అయితే మేము ఈ ఆపరేషన్ రహస్యంగా చేయాలని నిశ్చయించుకున్నాం. కానీ ఈ కేసు పూర్తిగా ఓ కొలిక్కి వచ్చింది కాబట్టి, దీంట్లో దేశ భద్రతకు వచ్చిన నష్టమేమీ లేదని, ఉగ్రవాద కోణం కూడా ఏమాత్రం లేదని నిశ్చయముగా తెలిసిన తరువాత ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసాం. ముఖ్యంగా ఈ కేసును ఇంత త్వరగా ఓ కొలిక్కి తెచ్చిన డిటెక్టివ్ త్రయానికి కృతజ్ఞతలు తెలుపుతూ, డిటెక్టివ్ సంకీర్త్ గారు ఈ కేసు ఎలా ఛేదించారో మీకు వివరిస్తారు" మైక్ డిటెక్టివ్ సంకీర్త్ కి ఇచ్చి కుర్చీలో కూర్చున్నారు ముఖర్జీ.
మైక్ తీసుకుని చెప్పడం మొదలెట్టాడు డిటెక్టివ్ సంకీర్త్.
"వారం రోజుల క్రితం మాకు ముఖర్జీ గారు ఈ విషయం చెప్పినపుడే ఓ అనుమానం వచ్చింది. అదేమిటంటే, ఎవరైనా రహస్యాలు ఇతర దేశాలకు అమ్ముకునే ఉద్ధేశ్యం ఉంటే, ముందు ఆ విదేశీ వ్యక్తులుతో డీల్ సెట్ చేసుకున్న తర్వాతనే రంగంలోకి దిగుతారు. కానీ, విచిత్రంగా ఈ కేసులో కిడ్నాపర్ ఫోన్ చేసి కోటి రూపాయలు ఇవ్వకపోతే ఆ డాక్యుమెంట్లు విదేశాలకు అమ్మేస్తాననడం"
"కానీ సార్, ఆ విదేశీ వ్యక్తులు, ఆఖరి నిమిషంలో వెనక్కి తగ్గడం వలన వేరే దారి లేక, కిడ్నాపరే ప్రభుత్వాన్ని అలా బెదిరించి సొమ్ము చేసుకోవడానికి ప్లాన్ వేసి ఉండవచ్చు కదా ?" అడిగాడు ఓ విలేఖరి.
"గుడ్ క్వశ్చన్. ఇదే అనుమానం మాకూ వచ్చింది. అప్పుడే మేమూ ఓ నిర్ణయానికి వచ్చి, ఊపిరి పీల్చుకున్నాము, ఇందులో విదేశీ హస్తం లేదని! అయితే ఈ కిడ్నాప్ వ్యవహారంలో ఎవరికి లాభం ? ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించాం. చెప్పకపోవడమేం, మాకైతే మొదటగా ఆ ప్రొఫెసర్ గారి మీదే అనుమానం వచ్చింది. డబ్బులు కోసం ఈ కిడ్నాప్ డ్రామా ఆడేరేమోనని. అయితే మా పార్టనర్ శక్య వైజాగ్ వెళ్ళి ఆయన గురించి జరిపిన దర్యాప్తులో , మాకు తెలిసిన విషయం ఏమిటంటే ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తి అనీ, ఈ కిడ్నాప్ డ్రామాలో ఎటువంటి పాత్ర లేదని" చెప్పడం ఆపి, సాసర్లో ఉన్న కాఫీ కప్పు తీసుకుని తాగుతూ తిరిగి చెప్పసాగాడు.
"ఇక ఈ వ్యవహారంలో ఉన్న రెండవ ప్రత్యక్ష సాక్షి టాక్సీ డ్రైవర్. అతని గురించి వివరాలు సేకరించమని మా భాగస్వామి ష్రఘ్వీని ఆ పని మీద పురమాయించాము. అతను సేకరించిన వివరాలు మీకు చెబుతాడు" అంటూ మైక్ అందించాడు.
"మా బాస్ ఆర్డర్ వేసిన మీదట నేను ఢిల్లీలో హాస్పిటల్ లో ఉన్న ఆ డ్రైవర్ పాల్ ని కలిసి, ఈ కిడ్నాప్ కి సూత్రధారివి నువ్వేనన్న విషయం తెలిసిపోయింది అనీ, ఆ డాక్యుమెంట్లునీ, ఆ ప్రొఫెసర్ నీ ఎక్కడ దాచావో చెప్పమని బెదిరించా. దానికి అతడు తనకు ఏ పాపం తెలియదనీ, జరిగింది మొత్తం అంతా వివరంగా చెపుతానని చెప్పాడు. అతను చెప్పింది ఏమిటంటే...
ఆ రోజు ఉదయం డ్యూటికి వచ్చిన తనకు ఆఫీసు హెడ్ గారు, తనని డిఫెన్స్ వారి వాహనం కాకుండా, అప్పటికే బయటనుండి తెచ్చిన ఒక అద్దె టాక్సీలో సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ ఎయర్ పోర్టుకి వెళ్లి, ఒక ఫొటో ఇచ్చి, ఆ ఫొటోలో ఉన్న వ్యక్తిని కలుసుకుని, అతనికి ఓ కోడ్ వర్డ్ చెప్పమని, వెంటనే, అవతల వ్యక్తి నీ దగ్గర ఉన్న ఫోటో వెనకాల ష్యూర్ అని ఇంగ్లీషు లో రాస్తే, వెంటనే అతడిని ఆఫీసుకు తీసుకునిరమ్మని ఇదంతా చాలా రహస్యంగా జరగాలని చెప్పారుట.
అన్నీ సక్రమంగా జరిగి, ప్రొఫెసర్ గారిని పికప్ చేసుకుని వస్తూంటే, దోవలో ఓ మోటార్ సైకిల్ మీద ఇద్దరు మొహానికి ముసుగు వేసుకుని వచ్చి, బండిని కారుకు అడ్డంగా పెట్టి, డ్రైవర్ ని బయటకు లాగి, తీవ్రంగా గాయపరిచి, ప్రొఫెసర్ ఉన్న టాక్సీని నడుపుతూ ఒకరు, బండి మీద మరోకరు అతడిని నడిరోడ్డు మీద వదిలి వెళ్లి పోయారుట" చెప్పడం కాసేపు ఆపి, గ్లాసులో ఉన్న మంచినీళ్లు తాగసాగేడు ష్రఘ్వీ.
"అర్ధమైంది సార్. కిడ్నాపర్ ఎవరో కాదు. ఆ టాక్సీ ఓనరే" కేసు ఛేదించినంత ఉత్సాహంగా చెప్పాడో ఔత్సాహిక విలేఖరి.
"కంగారు పడకండి సార్. మీలాగే మేము ఆలోచించాము. కానీ డ్రైవర్ పాల్, కిడ్నాప్ గాంగ్ లో ఉన్న ఒక వ్యక్తి గురించి ఇచ్చిన ఒక చిన్న క్లూ ఆధారంగా కిడ్నాపర్ ఎవరో తెలిసిపోయింది. అతను ఎవరో మా బాస్ చెబుతారు" అంటూ మైక్ తిరిగి సంకీర్త్ కి ఇచ్చాడు.
"ఆ ఆధారాలుతో మేము పరిశోధన వేగవంతం చేసాము. చివరికి ఆ వ్యక్తి మన డిఫెన్స్ ఆఫీసుకు, గతంలో కొన్ని సరుకులు సప్లయ్ చేసిన ఓ కాంట్రాక్టరు అని తేలింది. అతనికి రేసుల పిచ్చి. వాటిలో లక్షలు నష్ట పోయాడు. కొంతమంది ద్వారా అతనికి ఈ డాక్యుమెంట్లు విషయం తెలిసింది. డబ్బులు సంపాదించడానికి ఇదే తగిన సమయం అనుకున్నాడు. వెంటనే అతను కిడ్నాప్ పథకానికి కొంతమంది వ్యక్తుల సహాయంతో రూపకల్పన చేసాడు. ఇలా చేయడం వలన తనని ఎవరూ అనుమానించరనీ, అనుమానం అంతా విదేశీ గూఢచారుల మీదకు పోతుందని అనుకున్నాడు. కానీ విధి బలీయమైనది. రెడ్ హాండెడ్ గా దొరికాడు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని మరోసారి ఋజువ య్యింది" చెప్పి కుర్చీలో కూర్చున్నాడు డిటెక్టివ్ సంకీర్త్.
"సార్, మీరు ఆ కిడ్నాపర్ ని ఎలా పట్టు కున్నారో, ప్రొఫెసర్ గారిని ఎలా విడిపిం చారో చెప్పనేలేదు ?" ఆతృతగా అడిగాడు ఓ విలేఖరి.
మైక్ తీసుకున్న శక్య చెప్పడం ప్రారంభిం చేడు.
"మేము ఆ కాంట్రాక్టరు ఇంటి మీద, అతని సన్నిహితులు ఇంటిమీద నిఘా పెట్టేము. ఒకసారి ప్లాన్ విఫలం కావడం, తర్వాత నాలుగు రోజులైనా ప్రభుత్వం నుంచి ఎటువంటి హడావుడి లేకపోవడంతో ఆ కిడ్నాపర్ కి ఏం చేయాలో తోచలేదు.
ఓ అర్ధరాత్రి ఎవరూ చూడకుండా రహస్యంగా తన ఇంటికి వచ్చి వెళ్తున్న అతడిని వెంబడించి, అతని పాడుపడిన గొడౌన్ లోనే ప్రొఫెసర్ ఉన్నారని ఓ అభిప్రాయానికొచ్చాం. తర్వాత జరిగిన విషయం అంతా మీకు తెలిసిందే."
"సరే సార్, నాకో సందేహం, మీరు కిడ్నాపర్ గొడౌన్ మీద దాడి చేసినప్పుడు అతను ఏమీ ప్రతిఘటించలేదా ?" ఆశ్చర్యం ఒలకబోస్తూ అడిగాడు విలేఖరి.
దానికి డిటెక్టివ్ సంకీర్త్ గంభీరంగా చెప్పసాగాడు ఇలా.....
"మీరు అనుకుంటున్నట్టు మేము మూకు మ్మడిగా ఆ గొడౌన్ మీద దాడి చేయలేదు. ఎందుకంటే కిడ్నాపర్ చేతిలో ప్రొఫెసర్ బంధీగా ఉన్నారు. ఆయన ప్రాణం ముఖ్యం. అందుకే నేనొక్కడినే ఆ గొడౌన్ లోకి వెళ్ళేను.
బయట తాళం బద్దలు కొట్టి, షట్టర్ తీసుకుని లోపలికి అడుగు పెట్టా. మళ్లీ షట్టర్ వేసేయగానే అంతా కారు చీకటి.
ఈ లోగా "వెల్కమ్ మైడియర్ డిటెక్టివ్. నువ్వు నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తావని తెలుసు. నీకు నెట్వర్క్ ఉన్నట్టు గానే నాకూ నెట్వర్క్ ఉంది. నువ్వు ఈ కేసు హాండిల్ చేస్తున్నావనీ, ప్రభుత్వం అందుకే నిర్లిప్తంగా ఉందనీ నాకు తెలుసు. ఇకపోతే, నువ్వు వెలుతురు లోంచి వచ్చేవు. కొద్ది సేపు నీకు ఏమీ కనపడదు. నీ కుడి వైపున రెండు అడుగుల దూరంలో ఓ బల్ల ఉంది. మర్యాదగా దానిమీద నీ రివాల్వర్ పెట్టేయ్. పెట్టిన శబ్ధం నాకు వినపడాలి సుమా. పెట్టేసి మళ్ళీ నీ స్థానంలో నిలబడు" అనే మాటలు ఆ చీకట్లో వినపడసాగేయ్.
ఇక గత్యంతరం లేక రివాల్వర్ బల్లమీద పెట్టి, వెనక్కి వచ్చి అతనిని మాటలలో పెట్టసాగేను.
"చూడు మిష్టర్ నేను మధ్యవర్తిత్వం చేస్తా. ఆ ప్రొఫెసర్ ని ఏమీ చేయకు. నీ డిమాండ్లు ఏమిటో చెప్పు. ప్రభుత్వానికి చెప్పి అవి తీర్చేలా ట్రై చేస్తా" అని చెప్పగానే,
ఆ కిడ్నాపర్ "చూడండి, మిష్టర్ డిటెక్టివ్, నన్ను మభ్యపెట్టి, మాటల్లో పెట్టి..." అని చెబుతుండగా, నేను వెంటనే ఆ కిడ్నాపర్ పాదం మీద రివాల్వర్ తో కాల్చా. "అబ్బా.." అని కేక వేస్తూ కిడ్నాపర్ నేలమీద పడిపోయాడు.
ఆ శబ్దం విన్నవెంటనే షట్టర్ ఓపెన్ చేసుకుని బయట ఉన్న నా భాగస్వాములు ఇరువురూ లోపలికి వచ్చి, ప్రొఫెసర్ గారి కళ్ళకు, నోటికి వేసిన కట్లు విప్పి, ఆయనని, కిడ్నాపర్ ని కూడా తీసుకుని వెళ్లి హాస్పిటల్ లో జాయిన్ చేసారు.
ఇదీ మేము కిడ్నాప్ కేసును ఛేదించి, రక్షణశాఖ వారి పత్రాలను, ప్రొఫెసర్ గారిని కాపాడిన విధానం. అయితే ఈ కేసులో కొంతమంది ఇంటి దొంగలు కూడా కిడ్నాపర్ కు అదే ఆ కాంట్రాక్టరుకు సహకరించారు. వారెవరనేది రక్షణశాఖ తేల్చుకోవాల్సిన విషయం. థాంక్యూ టూ ఆల్.." అంటూ ముగించేడు డిటెక్టివ్ సంకీర్త్.
"సార్. సార్. అసలు విషయం చెప్పకుండా అలా ముగించేస్తే ఎలా సార్ ? నాకు ఓ మూడు సందేహాలు ఉన్నాయి . అవి మొదటిది డ్రైవర్ పాల్ కిడ్నాపర్ గురించి ఇచ్చిన క్లూ ఏమిటి ?" అడిగాడు ఓ క్రైమ్ పత్రిక తాలూకు సీనియర్ విలేఖరి.
"ఒహ్..అదా, అది కిడ్నాపర్ లలో ఒకరి కుడి చేతికి ఆరు వేళ్ళు ఉన్నాయి అని. ఆ యాంగిల్ లో దర్యాప్తు చేస్తేనే గతంలో పనిచేసిన ఈ కాంట్రాక్టరు వివరాలు తెలిసాయి"
"వావ్ నైస్ సార్. నా రెండో సందేహం. మరి ఆ పాడుపడిన గొడౌన్ లో మీరు కిడ్నాపర్ చెప్పిన మీదట రివాల్వర్ టేబుల్ మీద పెట్టానన్నారు. మళ్ళీ ఒక నిమిషం తేడాలో పేల్చేనంటున్నారు. ఎలా సాధ్యం.??"
"ఎవరికీ చెప్పకండేం. నా దగ్గర ఎప్పుడూ రెండు రివాల్వర్ లు ఉంటాయ్".
"ఔనా సర్, నా ఆఖరి ప్రశ్న. కటిక చీకటి అంటున్నారు కదా ? మరి ఆ చీకట్లో కిడ్నాపర్ కాలు మీద ఎలా పేల్చగలిగేరు?"
"మీరు నవ్వకుండా ఉంటానంటే అసలు విషయం చెబుతా !.... ఏమిటంటే ఆ కిడ్నాపర్ కర్మకాలి అతను పెట్టుకున్న వాచీది రేడియం డయిల్. ఆ చీకట్లో అది తళతళా మెరిసిపోతోంది. అందుకే నా పని ఈజీ అయిపోయింది" అని చెప్పి, అందరి వద్ద శెలవు తీసుకుని బయటకు నడిచారు ఆ డిటెక్టివ్ త్రయం S3.
***** ******* శుభం ***** *****