*****
*కేశానందం మహాభాగ్యం*
=================
(కామెడీ కథ)
(నేను రాసిన ఈ హాస్య కథ హాస్యానందం మాస పత్రిక నిర్వహించిన ఉగాది కథల పోటీలో వెయ్యి రూపాయలు బహుమతి పొంది మార్చి 2026 లో ప్రచురితమైనది. ఈ పోటీకి 240 కథలు పోటీ పడడం విశేషం)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
*****
"యాండీ! లేవండి. లేచి ఆ గిన్నెలు కడిగి ఇస్తే ఎసట్లో బియ్యం పడేస్తాను" భార్య మహాభాగ్యం కేకలతో ఉలిక్కిపడి లేచిన కేశానందం,
"హూ.. కనీసం ఆదివారం అయినా ఒక అరగంట సేపు ఎక్కువ పడుకునే అవకాశం లేని దిక్కుమాలిన జీవితం అయిపోయిందే భాగ్యం"
"దానికేం భాగ్యం? శుభ్రంగా పిగ్గీ లోనో, సుమోటో లోనో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తే సరి. ఓ పనైపోద్ది!" సలహా పడేసింది మహాభాగ్యం.
"మా తల్లే! ఎంత మంచి చచ్చు సలహా ఇచ్చావో!"
పళ్లు పిండుకుంటూ చెప్పాడు కేశానందం.
"మరి అట్టుంటది మరి మంతోని!" వొత్తైన జుట్టును ముడి పెడుతూ చెప్పింది మహాభాగ్యం.
"ఒహో నీకు అలా అర్థమై చచ్చిందా? సరే కానీ ఆ కొబ్బరి పీచు ఇలా పడేయ్. పళ్లు తోముకుంటాను. సారీ.. సారీ అంట్లు తోముకుంటాను" మంచం మీద నుంచి బద్దకంగా లేస్తూ చెప్పాడు కేశానందం.
***** ***** ***** *****
కాసేపటి తరువాత సోఫాలో సాఫీగా కూర్చుని, తాపీగా కాఫీ జుర్రుతూ, హేపీగా 'బూతి' వారపత్రిక చదువుతున్న కేశానందం, ఒక్క సారిగా కెవ్వున కేక పెట్టి
"పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూసానో ... ఏంటో?, పొద్దున్నే ఇలాంటి వార్త చదివాను" అన్నాడు.
"ఇంకెవరిదీ? నా మొహమే చూసారు. ఇంతకీ ఏమైందండీ? అలా చావు కేక పెట్టారు?" అనుమానంగా అడిగింది మహాభాగ్యం.
"అది చావు కేక కాదే. అది కెవ్వు కేక!"
"సరే, ఏదో దిక్కుమాలిన కేక. సరే ముందు విషయం చెప్పి చావండి!"
"ఏమీ లేదే. ఈ 'బూతి' వారపత్రిక వాళ్ళు నిర్వహించిన 'కామెడీ' కథల పోటీలో నేను పంపిన 'క్రైం' కథకు బహుమతి వచ్చిందిట"
"ఔనా? మీరు రాసిన ఆ కథకు బహుమతి వస్తే, మీరు గోవిందాపురం వచ్చి గుండు కొట్టించుకుంటారని ఆ దేవుడికి మొక్కుకున్నా. మీరు వెంటనే గోవిందాపురం వెళ్లి ఆ పని పూర్తి చేసుకుని రండి"
"నిన్ను తగలెయ్యా! బహుమతి వచ్చింది పది వేల రూపాయలు కాదే. కేవలం పది వేల పైసలు మాత్రమే. ఆ గోవిందాపురం వెళ్లి రావడానికే రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది"
"బహుమతి వచ్చింది వందే అయినా అది లక్కే, అందుకే లక్కు లక్కే, మొక్కు మొక్కే"
"మన పెళ్లి అయిన ఈ ఆరు నెలలలో, ఇది మూడో సారి నాకు నువ్వు గుండు కొట్టించడం. అయినా నా బోడి బుర్ర మీద నీ బోడి పెత్తనం ఏమిటో నాకు అర్థం కాదు? నీ మొక్కులు కాదు కానీ, నాకు నెత్తిన క్రాఫ్ తీసుకునే యోగం లేకుండా చేసావు కదే భాగ్యం! " బావురుమన్నాడు కేశానందం.
"దానికేం భాగ్యం? క్రాఫ్ కావాలంటే హాయిగా ఓ విగ్గు కొనుక్కుని పెట్టుకోండి" ఉచిత సలహా పడేసింది మహాభాగ్యం.
"నేనా? విగ్గు పెట్టుకోవడమా? బాగుండేదేమోనే భాగ్యం?" సిగ్గు పడుతూ చెప్పాడు కేశానందం.
"విగ్గు పెట్టుకోడానికి సిగ్గు పడడం దేనికీ? ఏం నేను పెట్టుకోవడం లేదా హేమిటీ?" అంటూ తన తల మీద నుంచి విగ్గు తీసేసిన మహాభాగ్యం బోడి బుర్రను మొదటి సారిగా చూసిన కేశానందం, కెవ్వున కేక పెట్టి మొదలు నరికిన మానులా మంచం మీద పడిపోయాడు.
***** **శుభం** *****