*****
*ప్రేమకు పరాకాష్ట*
==============
(మినీ కథ)
(నేను రాసిన ఈ హాస్య కథ హాస్యానందం అనే మాసపత్రికలో అక్టోబర్ 2025 లో ప్రచురితమైనది)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్.
*****
"ఇదిగో, తికమకా! ఇక్కడికి వచ్చిన ఈ మూడు సంవత్సరాలలో, నువ్వు ఎన్నో విషయాలు అవగతం చేసుకున్నావు కదా?" యువకుడైన తికమక రావును అడిగాడు ఆ పెద్దాయన.
"ఔను గురువుగారూ! నేను ఇక్కడకు వచ్చిన తరువాత, మీ నేతృత్వంలో చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను, అలాగే మంచి మిత్రులను కూడా సంపాదించుకున్నాను" వినయంగా చెప్పాడు తికమక రావు.
"అయితే, నీకు ఓ విషయం చెప్పాలి. రేపటి నుంచి నీకు ఇక్కడ ఉండే అర్హత లేదు తికమకా!"
చావు కబురు చల్లగా చెప్పాడు పెద్దాయన.
"అలా అనకండి గురువుగారూ! నేను మీ అందరినీ వదలి ఒక్క రోజు కూడా ఉండలేను"
ఆందోళనగా చెప్పాడు తికమక రావు.
"ఒరేయ్, తికమకా! ఏ విషయంలోనూ కూడా ఇంత పిచ్చిప్రేమ ఉండకూడదురా. అయినా పాత నీరు వెళ్తేనే కదా, కొత్త నీరు వచ్చేది" సముదాయించాడు పెద్దాయన.
"ఆవారాలా తిరిగిన నన్ను, ఇక్కడికి తీసుకుని వచ్చి, ఓ మనిషిని చేసారు. అంతే కాదు, అన్ని సౌకర్యాలూ కల్పించి, నాకు ఉచిత శిక్షణ కూడా ఇప్పించారు. అందుకే నాకు ఇక్కడ నుంచి వెళ్లాలని లేదు గురూజీ!" అసలు విషయం బయట పెట్టాడు తికమక రావు.
"వెళ్లక తప్పదు బాబూ! ఇక్కడనే కాదు, ఎక్కడున్నా సరే, ఒక విషయం గుర్తు పెట్టుకో, నువ్వు చెప్పే మాటల్లో, అలాగే చేసే పనుల్లో కొంచెం విచక్షణ ఉండాలి! అలా అయితేనే ఎక్కడైనా బతకగలవు. అర్థమయ్యింది కదా?"
నీతి బోధ చేసాడు పెద్దాయన.
"అవన్నీ సరే కానీ, నేను ఇక్కడే ఉండాలంటే ఏం చేయాలి గురువుగారూ!" అనుమానంగా అడిగాడు తికమక రావు.
"నువ్వు ఏం చేసినా ఇక్కడ ఉండడం కుదరదు తికమకా! కానీ, నీకు ఇష్టం లేకపోయినా సరే, ఓ సారి నేను చెప్పినట్లు చేస్తే మటుకు ...." చెబుతూ మధ్యలో ఆగాడు పెద్దాయన.
"చెప్పండి గురువుగారూ!" ఆనందంగా అడిగాడు తికమక రావు.
"...........…................"
***** ***** ***** *****
రెండు రోజులు తరువాత
"సాక్ష్యాధారాలను పరిశీలించిన పిదప, నిందితుడు అయిన ఈ తికమక, తన గురువుగా భావించే జాలేశ్వరరావు అనే ఈ ప్రభుత్వోద్యోగిని, విధినిర్వహణలో ఉండగా, విచక్షణ మరచి ఆయనపై దాడి చేసినట్టు ఋజువు అయినందున, ఈ తికమకకు మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించడమైనది"
కోర్టులో జడ్జిగారు ఇచ్చిన తీర్పు విని, తమ పాచిక పారినందుకు లోలోపల ఆనందపడుతూ, తిరిగి మళ్లీ జైలుకు బయలుదేరారు జైలర్ జాలేశ్వరరావు మరియు పరమ బద్ధకస్తుడైన లేత దొంగ తికమక రావు.
***** **శుభం** *****