*****
*ఎన్నికల్లో ఎన్ని కళలో?*
==================
(హాస్య కథ)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్.
రాష్ట్రంలో అన్ని పంచాయితీలకూ ఎన్నికలు ప్రకటించడంతో, అనుమానాపురం గ్రామంలో కూడా ఎన్నికల సందడి మొదలైంది. కిందటిసారి ఎన్నికల్లో నెగ్గిన జిత్తుల జంబూకరావు, మళ్లీ ఈసారి కూడా పోటీ చేస్తున్నాడు.
ఊర్లో అందరికీ తలలో నాలుకలా ఉండే వాయసరావును తన కొంపకు పిలిపించుకుని,
"ఇదిగో వాయసా! ఈ సారి కూడా నా అదృష్టం పరీక్షించుకోడానికి ఓ రాయేసా. నీకు తెలుసుగా నాకు నక్క గుర్తు కేటాయించారు. మన ప్రత్యర్థి డాగుల విశ్వాసరావుకి కుక్క గుర్తు కేటాయించారు" చెప్పాడు జిత్తుల జంబూకరావు.
"బాగుంది దొరా! ఇద్దరికీ కూడా సరిపోయే గుర్తులే కేటాయించారు" ఆయాస పడుతూ చెప్పాడు వాయసరావు.
"నిన్ను తగలెయ్యా! నీకు అలా అర్థమయ్యిందా? ఇలాంటి పనికిరాని సలహాలు ఇవ్వడం కాదు, నువ్వు చెయాల్సిన పని వేరే ఉంది!" మందలిస్తూ చెప్పాడు జంబూకరావు.
"ఏంటి దొరా అది?" అడిగాడు వాయసరావు అనుమానంగా.
"ఏం లేదురా, నువ్వు గ్రామంలోని ప్రతీ ఇంటికి వెళ్లి, 'ఆ కుక్క గుర్తుకు ఓటు వేయవద్దని, ఆ కుక్క గుర్తుకు ఓటేస్తే మీ బతుకు కుక్కబతుకే అనీ, నిజమైన కుక్కకు విశ్వాసం ఉంటుంది కానీ, ఈ కుక్కకు ఉండదనీ, పొరపాటున ఈ కుక్క గుర్తుకు ఓటేస్తే మన గ్రామం కుక్కలు చింపిన విస్తరి అవుతుందనీ, కాబట్టి కుక్క గుర్తుకు కాకుండా మన నక్క గుర్తుకే ఓటేయమని' అందరికీ చెప్పాలి అర్థమయ్యిందా?" విషయం చెప్పాడు జంబూకం.
"బెమ్మాండంగా అర్థమయ్యింది దొరా! మరి ఖరుసులకి ఓ లచ్చ రూపాయలు... " నసుగుతూ అడిగాడు వాయసం.
"నేను నెగ్గగానే, కిందటిసారిది, ఈసారిది కలిపి, ఒకేసారి రెండు లక్షలు ఇచ్చేస్తానులేరా!" నవ్వుతూ చెప్పాడు జంబూకం.
"సరే దొరా! అలాగే కానీయండి" జంబూకం ఇచ్చిన పాయసం తింటూ చెప్పాడు వాయసం.
***** ***** ***** *****
కొన్ని రోజులు తరువాత ఎన్నికలు ప్రశాంతంగా జరిగి, ఫలితాలు కూడా వచ్చాయి.
జంబూకరావు కబురు పంపగానే రెక్కలు కట్టుకుని జంబూకం ఇంటి ముందు వాలిన వాయసం,
"ఏంటి దొరా? ఏమయ్యింది?" అడిగాడు అమాయకంగా.
"ఏమవ్వడం ఏమిట్రా? ఇదిగో.. నీలాంటోడితో పెట్టుకున్నాను చూడూ అందుకు నన్ను నేననుకోవాలి. అసలే నీకు పరిజ్ఞానం తక్కువ పరధ్యానం ఎక్కువ. ఔనూ, అసలు నువ్వు గ్రామ ప్రజలకు ఏం చెప్పావురా? అందరూ గంపగుత్తగా ఆ కుక్క గుర్తుకే వేసారు. నాకు ఒక్కడు కూడా వేయలేదు " కోపంగా అడిగాడు జంబూకరావు.
"మీరు చెప్పినట్లే, 'ఆ కుక్క గుర్తుకు ఓటు వేయవద్దని, ఆ కుక్క గుర్తుకు ఓటేస్తే మీ బతుకు కుక్కబతుకే అనీ, నిజమైన కుక్కకు విశ్వాసం ఉంటుంది కానీ, ఈ కుక్కకు ఉండదనీ, పొరపాటున ఈ కుక్క గుర్తుకు ఓటేస్తే మన గ్రామం కుక్కలు చింపిన విస్తరి అవుతుందనీ కాబట్టి కుక్క గుర్తుకు కాకుండా మన నక్క గుర్తుకే ఓటేయమని' చెప్పాను దొరా!" చెప్పాడు వాయసం.
"బాగానే చెప్పావు. మరి ఎక్కడ తేడా కొట్టిందంటావ్?" అనుమానం వ్యక్తపరిచాడు జంబూకరావు.
"ఒహో! ఇప్పుడు నాకు అర్థమైంది దొరా! మనం ఎక్కువగా కుక్క గుర్తు గురించే చెప్పడం వలన, అందరికీ మనసులో అది ఉండిపోయి ఆ కుక్క గుర్తుకే ఓటు వేసేసి ఉంటారు. ఔనూ, మరి మీ ఓటు కూడా మీరు వేసుకోలేదా?" అనుమానంగా అడిగాడు వాయసరావు.
"బహుశా నేను కూడా అదే దృష్టిలో ఉండి ఆ దిక్కుమాలిన కుక్క గుర్తుకే వేసేసి ఉంటానురా!" నిట్టూరుస్తూ చెప్పాడు జంబూకం.
"సరే దొరా! మరి నాకు ఇవ్వవలసిన ఆ డబ్బులు ???" చేతులు నలుముకుంటూ అడిగాడు వాయసరావు.
"అత్త అడుక్కుంటూంటే అల్లుడు మనుగుడుపులుకు వచ్చాట్ట. ఓడిపోయి నేను ఏడుస్తూంటే, నీకు డబ్బులు కావాలా? ఎవడితో చెప్పుకుంటావో, చెప్పుకో. నీకు ఓ పైసా కూడా ఇచ్చేదిలేదు, ముందు బయటకు పో" అంటూ తలుపు మూసేసాడు జంబూకరావు.
"ఇంక ఎవరితోనూ చెప్పుకోనవసరం లేదు జంబూకం. నీ జిత్తుల గురించి నాకు బాగా తెలుసు. కిందటిసారి ఎన్నికల్లో, నువ్వు గెలిచి కూడా నా డబ్బులు ఎగ్గొట్టావు. ఇప్పుడు మాత్రం ఇస్తావని నమ్మకం ఏంటి? విశ్వాసం లేనివాడు ఆ విశ్వాసరావు కాదు. విశ్వాసం లేని కుక్కవి నువ్వే. అందుకే ఆ డాగుల విశ్వాసరావు పంచన చేరి, ఆయన ఇచ్చిన లక్ష తీసుకుని, లక్షణంగా ఇంటింటికి తిరిగి విశ్వాసరావుకు ఓట్లు వేయమని చెప్పాను" మనసులో అనుకుంటూ, ఆనందంగా ఇంటి దోవ పట్టాడు వాయసరావు.
***** **శుభం** *****
(నేను రాసిన ఈ హాస్య కథ హాస్యానందం మాసపత్రిక లో నవంబర్ 2024లో ప్రచురితమైనది)