*****
*ఫైనల్ రిజల్ట్*
=========
(మినీ కథ)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
"డాక్టర్ గారూ! కవర్ లోని ఈ రిపోర్ట్స్ చూడండి"
"చూసానమ్మా! ఇంతకీ ఏమిటి విషయం?'"
"సార్, ఈవిడ కండీషన్ చాలా సీరియస్ కదా?"
"ఔనమ్మా! ఇది సీరియస్ కేసే. అయినా ఎందుకు అలా అడిగారు ?"
"ఊరికే.... తెలుసుకుందామని"
"ఏమైనా ఆస్తి పంపకాలు లాంటివి ఉంటే ఇప్పుడే తేల్చుకోవడం బెటర్ కదా?"
"ఔనమ్మా! కానీ ఎందుకు అలా అడిగారు?"
"ఊరికే.... తెలుసుకుందామని"
"ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి"
"ఇంక ఈవిడకు ఏ మందులూ కూడా పనిచేయవు కదా? డాక్టర్!'
"వాడినా పెద్ద ఉపయోగం ఉండదమ్మా! అయినా దేనికి అడిగారు?"
"ఊరికే.... తెలుసుకుందామని"
"చూడండమ్మా, మీ సందేహాలు తీరాయా?"
"డాక్టర్ గారూ! ఈవిడ ఇంకా ఎన్నాళ్లు బతకవచ్చు అంటారు?"
"ఎందుకు అలా అడిగారు?"
"ఊరికే.... తెలుసుకుందామని"
"పెద్ద వయసు కదా! బహుశా కొన్ని నెలలు, అంతే"
"మంచి విషయం చెప్పారు డాక్టర్ గారూ!"
"ఒహో, ఇప్పుడు అర్ధమయ్యింది, అయితే ఈవిడ మీ అత్తగారామ్మా?"
"ఎందుకు అలా అడిగారు, డాక్టర్?"
"ఊరికే.... తెలుసుకుందామని"
"ఔనండీ.. ఈవిడ మా అత్తగారే!"
"మీ అత్తగారి పేరు పిల్లా ఆదిలక్ష్మి, ఔనా?"
"ఎందుకు అలా అడిగారు, డాక్టర్?"
"ఊరికే.... తెలుసుకుందామని"
"కాదండీ, మా అత్త పేరు పల్లా ఆదిలక్ష్మి"
"మరి, పిల్లా ఆదిలక్ష్మి ఎవరు?"
"ఎందుకు అలా అడిగారు, డాక్టర్?"
"ఊరికే.... తెలుసుకుందామని"
"ఏదైనా విశేషమా డాక్టర్?"
"చూడండమ్మా! ఈ కవర్ మీ అత్తగారిది, లోపలి రిపోర్ట్స్ పిల్లా ఆదిలక్ష్మి గారివి "
***** ***** ***** *****
"ఒరే అన్నయ్యా! పిల్లా ఆదిలక్ష్మి అంటే మన అమ్మేనా?"
"చెల్లాయ్, ఎందుకు అలా అడిగావ్?"
"ఊరికే.... తెలుసుకుందామని"
"ఔను అది అమ్మ పేరే. ఇంతకీ నీ డౌట్ ఏమిటే?"
"చెబుతాను, నువ్వు మన అమ్మని తీసుకుని నిన్న కానీ, ఈ తింగరీ డయగ్నాస్టిక్స్ కి
వచ్చావా?"
"ఔను వచ్చాము. అయినా ఎందుకు అలా అడిగావ్?"
"ఊరికే.... తెలుసుకుందామని"
"ఔనా ? రిపోర్ట్స్ రెడీ అయ్యాయిటే. సాయంత్రం వెళ్లి తీసుకోవాలి....."
"................................"
***** **సమాప్తము** *****
(నేను రాసిన ఈ మినీ హాస్యకథ ఏప్రిల్ 2023 లో హాస్యానందం అనే మాసపత్రికలో వచ్చింది)