*****
*కగాకో....ముగాభా*
==============
(హాస్య కథ)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
వెంకాయమ్మ అక్కడికి వచ్చి అప్పుడే పది రోజులు అవుతోంది. ఎవరూ తెలిసిన వాళ్లూ, అలాగే తెలుగు భాష వచ్చిన వాళ్ళు కనబడక పోవడంతో, పాపం చాలా ఇబ్బందిగా ఉంది ఆమెకు. దానికి తోడు కగాకో కి ఏమైందో? అనే బాధ ఆమెను ఒకచోట నిలబడనీయడం లేదు.
ఆ రోజు ధైర్యం చేసి పక్క గదిలో ఉంటున్న ఒకావిడ వద్దకు వెళ్లి,
"యామ్మోయ్! ఆ కగాకో కి ఎలావుందో నీకేమైనా తెలుసా?" అడిగింది వెంకాయమ్మ, సమాధానం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ.
"యారూ??" అడిగింది ఆవిడ తమిళంలో.
"యారూ, తా...యారూ కాదే తల్లీ! కగాకో.. కగాకో, ఎలా ఉందో నీకేమైనా తెలుసా" విసుక్కుంటూ అడిగింది కోపంగా.
"ఇల్లే, వాయిమూడు" చెప్పింది ఆవిడ అంతే కోపంగా.
"ఏంటి, ఇడ్లీ మూడు వాయలు తింటానా? ఎన్ని వాయలు తింటే నీకెందుకే ముచ్చుమొహందానా ? తెలియకపోతే తెలియదని చెప్పాలి కానీ, ఇలా నా తిండిని దిష్టి కొడతావా?" పెంకులెగిరిపోయేలా అరిచింది వెంకాయమ్మ.
వెంకాయమ్మ అరుపులకు అర్థం తెలియని ఆ అరవపావిడ ఇంక అరవడం మానేసి, అరవిప్పిన కన్నులతో అలా అమాయకంగా చూస్తూ ఉండిపోయింది.
ఆ గొడవ విని అక్కడికి వచ్చిన ఓ గుమస్తా వెంకాయమ్మ ను సముదాయించి, 'రేపు ఉదయం మీ ఊరు నుంచి ఒకరు వస్తున్నారు, కగాకో గురించి వారికేమైనా తెలుసేమో, అడిగి చూడండి' అని ఆవిడ చెవిలో ఓ శుభవార్త పడేసాడు. అంతే ఆ వార్త విన్న వెంకాయమ్మ ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూడసాగింది, తను పంపిన మొదటి కథ పత్రికలో ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూసే కొత్త కథకుడిలా.
***** ***** ***** *****
మర్నాడు ఉదయాన్నే గేటు దగ్గర తిష్టవేసిన వెంకాయమ్మ ను
"అమ్మా! గుమ్మానికి అడ్డంగా ఉండకమ్మా! పెద్ద సారు చూస్తే తిడతాడు" సున్నితంగా హెచ్చరించాడు గేటు కీపరు గవర్రాజు.
"ఉండవయ్యా! హేమిటా జబర్దస్తీ? ఈరోజు నాకు తెలిసిన ఒకరు ఇక్కడికి వస్తున్నారు. కగాకో గురించి వారికి ఏమైనా తెలుసేమో కనుక్కుందామని ఇక్కడ వెయిటింగ్" అని అసలు విషయం చెప్పింది వెంకాయమ్మ.
"అలా అయితే సరే, కానీ కొంచెం పక్కగా కూర్చో అమ్మా" చెప్పాడు టూకీగా గేకీ.
సాయంత్రం వరకూ ఎదురుచూసిన వెంకాయమ్మకు నిరాశే మిగిలింది. ఇంక తిరిగి గదికి వెళ్లిపోదామనుకున్న సమయంలో, లోపలికి వస్తున్న ఒకామెను చూడగానే ఎదురు వెళ్లి, ఆనందంగా
"మాచమ్మక్కా! నువ్వా? పొద్దున్నే వస్తావన్నారు, ఇంత లేటయ్యిందేం?" ఆశ్చర్యంగా అడిగింది వెంకాయమ్మ.
"ఇక్కడికి వచ్చే ముందు టెస్టుల కోసం ఆసుపత్రికి తీసుకుని వెళ్లారే వెంకమ్మక్కా! అక్కడే లేటయ్యింది" చెప్పింది మాచమ్మ.
"సరేకానీ మాచమ్మక్కా! ఆ కగాకోకు ఎలా ఉందో, నీకు ఏదైనా తెలుసా?" కుతూహలంగా అడిగింది.
"ఉండవే, ప్రయాణంలో అలసిపోయాను. అయినా నేను గుమ్మం దిగి రెండు నెలలయింది. ఆ కగాకో గురించి నాకేం తెలుస్తుంది? ఇదిగో నాయనా, నాకు ఏ గది ఇచ్చారు?" గేకీ ని అడగడానికి విసవిసా నడుచుకుంటూ వెళ్లింది మాచమ్మ.
"దీని విస్సాటం మండిపోనూ. తెల్లారిలేస్తే రిపోర్టర్ లా ఊర్లో అందరి విషయాలు సేకరిస్తూనే ఉంటుంది. కగాకో గురించి మాత్రం తెలియదంటోంది. దీని నోట్లో చెవి, నోరు పెట్టకూడదు" మనసులో అనుకుంటూ మౌనంగా అక్కడ నుండి లేచింది వెంకాయమ్మ.
***** ***** ***** *****
కగాకో గురించి ఆలోచిస్తూనే రెండు నెలలు గడిపింది వెంకాయమ్మ.
ఆ రోజు ఉదయం యధాప్రకారం గుమస్తాను కలసిన వెంకాయమ్మ కు 'ఈ సాయంత్రం మీ పక్కఊరు నుంచి ఒకరు వస్తున్నారు' అన్న తీపి కబురు చెప్పడంతో సాయంత్రం గేటు వద్ద మళ్ళీ దీక్ష మొదలెట్టింది వెంకాయమ్మ.
"చూడమ్మా! పెద్ద సారు ఇంటికి వెళ్లే టైమ్ అయ్యింది. గుమ్మానికి అడ్డంగా కూర్చోకు" తన సహజధోరణిలో చెప్పాడు గేకీ.
"ఉండవయ్యా మా కగాకో కి ఏమయ్యిందో తెలియక నేను టెన్షన్ తో చస్తూంటే, మధ్యలో నీ గోల ఏంటి? పెద్ద సారూ లేదు, వేడి చారూ లేదు. గమ్మునుండు" పిడుగులు కురిపిస్తూ గర్జించింది వెంకాయమ్మ.
కాసేపటికి అక్కడికి వచ్చిన వ్యక్తిని చూడగానే,
"నువ్వా? మహదేవుడన్నయ్యా! ఇంకా ఎవరో అనుకున్నా. ప్రయాణం బాగా జరిగిందా? ఔనూ ఆ కగాకో కి ఎలా ఉంది? ఏదైనా తెలిసిందా మహదేవుడన్నయ్యా?" కుతూహలంగా అడిగింది వెంకాయమ్మ.
"కంగారు పడకు. ఆ కగాకో చికాగో లో ఉంది" విసుక్కుంటూ చెప్పాడు మహదేవుడు.
"అలాగా? పోనీలే అన్నయ్యా! మంచి వార్త చెప్పావు. సరేకానీ, నాకో డౌటూ...ఈ విషయం నీకు ఎవరు చెప్పారు మహదేవుడన్నయ్యా?" మళ్ళీ బుర్ర తినేసింది వెంకాయమ్మ.
"నువ్వు గుమ్మం ముందు కూర్చుని, ఈ ప్రశ్న వేసి, వచ్చిన వాళ్ళ బుర్రని గోక్కుని తినేస్తున్నావని ఇదిగో ఇతను చెప్తే, ఎందుకైనా మంచిదని ఈ సమాధానం రెడీ చేసుకున్నా" అని చెబుతూ తనను తీసుకుని వచ్చిన వ్యక్తిని చూపించాడు మహదేవుడు.
"వయసు వచ్చినా కానీ వెటకారం పోలేదు మా మహదేవుడన్నయ్యకి" జబ్బలు చరుచుకుంటూ, జుబ్బా సర్దుకుంటూ జబ్బర్ దస్తీగా లోపలికి పోతున్న ఆ పెద్దాయన వైపు చూస్తూ మనసులో అనుకుంది వెంకాయమ్మ.
***** ***** ***** *****
కగాకో గురించి ఆలోచిస్తూనే, లోచిస్తూనే, చిస్తూనే, స్తూనే, నే ను చూస్తుండగానే రెండు సంవత్సరాలు గడిపేసానా? ఆశ్చర్యంగా అనుకుంది వెంకాయమ్మ.
ఆ రోజు తన బంధువు ఒకరు వస్తున్నారు అని తెలిసిన వెంకాయమ్మ యధావిధిగా గుమ్మం దగ్గర తిష్ట వేసింది.
"అమ్మా! గుమ్మానికి అడ్డంగా ఉండకమ్మా! పెద్ద సారు చూస్తే తిడతాడు" యధాప్రకారం తన గోత్ర ప్రవర వినిపించాడు గవర్రాజు.
"చూడు నాయనా! రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నా. నీ పోస్టుకి ప్రమోషన్ లేదు, నా ప్రశ్నకు సొల్యూషన్ రాదు. ఎందుకు అనవసరంగా ఆయాస పడతావు?" సున్నితంగా మందలించింది వెంకాయమ్మ.
కాసేపటికి లోపలికి వస్తున్న ఆమెను చూసి,
ఆనందంతో..
"సూరమ్మత్తా! నువ్వా? ఎవరో అనుకున్నా. ప్రయాణం బాగా జరిగిందా?" తన సహజ ధోరణిలో అడిగింది వెంకాయమ్మ.
"అత్త ఏమిటే? అత్త? నీకన్నా ఓ ఇరవై ఏళ్లే కదా పెద్ద? ఈ సారి ఆ కూత కూసావంటే పళ్లు రాలగొడతా, భడవకానా!" బోసి దవడలు దబదబలాడాస్తూ, వెంకాయమ్మను దడదడలాడించేసింది సూరమ్మ.
"రాలగొట్టడానికి నీకు లాగే నాకు కూడా అసలు పళ్లే లేవుగా?" బోసినోటితో నవ్వుతూ చెప్పింది వెంకాయమ్మ.
"అవసరమైతే కట్టడు పళ్లు కట్టించి మరీ రాలగొడతా" తెగేసి చెప్పింది సూరమ్మ.
"సరేకానీ సూరక్కా! ఆ కగాకో గురించి ఏమైనా సమాచారం తెలిసిందా?" ఎంతో ఆశతో, నెత్తిమీద కొంగు సవరించుకుంటూ అడిగింది వెంకాయమ్మ.
"ఉండవే, నా ముగాభాకి ఏమయ్యిందో తెలియక నేను ఏడుస్తుంటే, మధ్యలో నీ కగాకో గొడవ ఏమిటే? పానకంలో పుడకలా?" విసుక్కుంటూ చెప్పింది సూరమ్మ.
"ఈ ముగాభా ఎవరు సూరమ్మక్కా?" బుగ్గలు బోసి నోట్లోకి తోస్తూ అడిగింది వెంకాయమ్మ.
"గుమ్మంలో నిలబెట్టి ఏమిటా పిచ్చి ప్రశ్నలు? లోపలికి తగలడు, తీరిగ్గా చెబుతాను" అని చెబుతూ ,
"హేమిటీ అలా ధేభ్యం మొహం వేసుకుని ఇంకా నిలబడి చూస్తున్నావు? నా గది ఎక్కడో చూపించి చావు" అంటూ గేటు కీపరు గవర్రాజుని దబాయించి గబగబా పరుగులు పెట్టించింది సూరమ్మ.
***** ***** ***** *****
ఓ రెండు నెలల తరువాత..
ఆ రోజు ఉదయం
"మా హక్కులు మాకు కావాలి"
"వాటి కోసం ఎంతకైనా పోరాడతాం"
"హక్కులు పరిరక్షణే మా ధ్యేయం"
అంటూ స్లోగన్లతో రెచ్చిపోతున్న వెంకాయమ్మ, సూరమ్మలను చూసిన సెక్యూరిటీ గార్డు సూరపరాజు
"అమ్మా! అమ్మా, అలా ఆ అంచుల చివర వరకూ వెళ్లకండమ్మా! కింద పడిపోతారు. అంతే కాదు నా ఉద్యోగం ఊడిగొట్టిన వాళ్లవుతారు. నా మాట విని వెనక్కి రండమ్మా!" అంటూ వారిని ప్రాధేయపడ్డాడు.
"పోతే పోయింది లేవయ్యా, ఇంతోటి బోడి ఉద్యోగం. ఏదో ఒకటి నేను ఏర్పాటు చేస్తాగా!" చీర కొంగు బిగిస్తూ, సూరపరాజుకు భరోసా ఇచ్చింది సూరమ్మ.
"మా హక్కులు మాకు కావాలి"
"వాటి కోసం ఎంతకైనా పోరాడతాం" అంటూ మళ్ళీ యుగళగీతం అందుకున్నారు.
ఈ లోగా అక్కడికి చేరుకున్న గేటు కీపరు గవర్రాజు
"చూడండి తల్లులూ! మీరు ఇక్కడ ఉండి గొడవ చేయకూడదు. ఆ గుమ్మం వద్దకు రండి. అక్కడ కరుచుకుందురు గాని, అదే... అరుచుకుందురు గాని" అని చెప్పి వారిని బతిమాలి అక్కడికి తీసుకుని వెళ్లాడు.
గుమ్మంలోనే తిష్ట వేసి,
"వాటి కోసం ఎంతకైనా పోరాడతాం"
"హక్కులు పరిరక్షణే మా ధ్యేయం" అంటూ అరుస్తున్న వారిని,
"అమ్మా! గుమ్మానికి అడ్డంగా ఉండకండమ్మా! పెద్ద సారు వచ్చే వేళయ్యింది" ప్రాధేయపడ్డాడు గవర్రాజు.
"లేవే! వెంకాయమ్మా, ఇక్కడుంటే, ఇతను ఇలాగే అంటాడు. ఇక్కడ వద్దు. ఇందాకట్లా ఆ చివరికి పోయే హాయిగా అరుచుకుందాం, పద" అంటూ ఆమెను జబ్బ పట్టుకుని లేవదీయబోయింది సూరమ్మ.
"మీకు రెండు నమస్కారాలు తల్లులూ! అక్కడికి వద్దు. ఇక్కడే ఉండి అరుచుకోండి" చెవులు మూసుకుని చెప్పాడు గవర్రాజు.
"అలా రా దారికి. గట్టి.....గా అరవవే వెంకాయమ్మా! హక్కులు పరిరక్షణే మా ధ్యేయం..........." అంటూ గీతాలాపన మొదలెట్టింది సూరమ్మ.
ఈ లోగా అక్కడికి వచ్చిన పెద్దసారు పైడిరాజు,
"ఇక్కడ ఏం జరుగుతోంది? నాకు తెలియాలి, తెలియాలి, తెలియాలి" అంటూ అరవసాగాడు.
"ఇక్కడ ఉన్నది ఇద్దరు అయితే తెలియాలి, తెలియాలి,తెలియాలి అని మూడు సార్లు అంటావేంటయ్యా? కొంపదీసి లెక్కల్లో వీకా?" చేతి గాజులు పైకి తోసుకుంటూ అడిగింది సూరమ్మ.
సూరమ్మ వైపు భయంభయంగా చూస్తూ, అక్కడ నుంచి మొహం తిప్పుకుని,
"ఏం జరిగిందో చెప్పి చావు" అంటూ కోపంగా గవర్రాజును అడిగాడు పైడిరాజు.
"ఆ బక్కాయన్ని భయపెడితే పాపం ఆయనేం చెబుతాడు, నేను చెబుతాను విను. ఏమయ్యా! మీ బిగ్ బాస్ ఇంతంత బిల్డింగులు కట్టేడు కదా? ఇక్కడికి వృద్ధనారీమణులు వస్తారని తెలుసు కదా? వారికి కూడా ఏదో వినోదం కోసం ఏర్పాట్లు చేయాలి కదా? ఎంతసేపూ మీ వినోదం కోసం ఆలోచిస్తారు కానీ మా గురించి ఆలోచించరా?" కాలర్ పట్టుకుని అడిగినంత సూటిగా ముక్తకంఠంతో అడిగారు వెంకాయమ్మ, సూరమ్మలు, ఆయనతో పాటు లోపలికి వస్తున్న నలుగురు అమ్మాయిల వంక ఈర్ష్యగా చూస్తూ.
ఆమె ప్రశ్నతో బిత్తరపోయి,
"సరేనమ్మా! మీ బాధ అర్థమయ్యింది. మీకు ఏం కావాలో చెప్పండి. మా బిగ్ బాస్ తో చెబుతా" రాజీ ధోరణిలో అడిగాడు పైడిరాజు.
కగాకో, ముగాభా గురించి పూర్తిగా పైడిరాజుకు వివరించారు వెంకాయమ్మ, సూరమ్మలు.
***** ***** ***** *****
ఆ రోజు మధ్యాహ్నం గవర్రాజు, పైడిరాజు, సూరపరాజులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి విషయం సేకరించారు బిగ్ బాస్.
ఆ తర్వాత అనుకోకుండా అక్కడికి వచ్చి, మొత్తం వారి సంభాషణలు విన్న వ్యక్తితో,
"ఇదిగో మూర్తిగారూ! ఈ సారి అటువైపు వెళ్ళినప్పుడు ఓ బుల్లి టీవీ తీసుకొచ్చి ఆ ఇద్దరు ముసలాళ్ల గదిలో ఏర్పాటు చేయండి. లేకపోతే మేసే గాడిదని కూసే గాడిద చెడగొట్టింది అన్నట్లుగా, వీళ్ల వలన మిగతా వాళ్లు కూడా పాడవుతారు. ఔనూ! ఇంతకీ ఆ కగాకో, ముగాభాలు ఎవరూ?" ఆసక్తిగా అడిగారు బిగ్ బాస్.
"అవి తెలుగు టీవీల్లో దశాబ్దాలనుంచి ప్రవహిస్తున్న దినసరి దారుణ దుఃఖపూరిత ధారావాహికలు సార్. ఈ ముసలాళ్లు ఇద్దరూ తమకు ఊహ వచ్చినప్పటి నుంచి చూస్తున్నారు ఆ సీరియల్స్. అవి ఓ కొలిక్కి రాకుండానే వీళ్ళు ఇక్కడకు వచ్చేసారు. వాటి లేటెస్ట్ స్టేటస్ తెలియకపోవడంతో వీళ్లకు పిచ్చెక్కిపోతోంది సార్!" అసలు విషయం చెప్పారు మూర్తి.
"అంటే, వీళ్లకు చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు వయసు వచ్చినా ఆ భ్రమ పోలేదన్నమాట. సరేకానీ, ఇంతకీ ఆ కగాకో, ముగాభాలు అంటే ఏమిటీ?" తెలుసుకోవాలన్న కుతూహలంతో అడిగారు బిగ్ బాస్.
"హహహ..... 'కగాకో' అంటే 'కరణం గారి కోడలు'. అలాగే 'ముగాభా' అంటే 'మునసబు గారి భార్య' సార్" నవ్వుతూ చెప్పారు మూర్తి.
"వార్నీ, ఔనా? బాగుంది. కానీ, నాకైతే వాళ్ళ ఆవేదనలో కూడా కొంచెం న్యాయం ఉందనిపిస్తోంది. మనకైతే ఈ నలుగురు అమ్మాయిల వలన ఏదో కాలక్షేపం అవుతోంది. మరి పాపం ఈ వృద్ధ మహిళామణులకి కూడా ఏదైనా వినోదం ఉండాలి కదా?" రాజీ ధోరణిలో చెప్పారు బిగ్ బాస్.
"ఔను సార్, మీ ఆలోచన మంచిదే" చెప్పారు మూర్తి గారు.
"అన్నట్టు ఇంకో విషయం. ఎందుకైనా మంచిది, ఆ టీవీ ఇక్కడ పెట్టినట్లు మా ఆవిడకు తెలియనీకండే?" కొంచెం భయంభయంగా చెప్పారు బిగ్ బాస్.
"అలాగే సార్" అని చెప్పి, మీ భార్య సచీదేవమ్మకు ఈ అలవాటు సోకితే మన బతుకు బస్టాండే అని నాకు తెలియదా ప్రభూ? అని మనసులో అనుకుంటూ స్వర్గాధిపతి అయిన బిగ్ బాస్ ఇంద్రుని వద్ద శెలవు తీసుకుని,
"మగువా మగువా ఈ సీరియల్స్ కు
సరిహద్దులు కలవా"
అని పాడబోయి, నాలుక కరుచుకుని,
"నారాయణ నారాయణ" అనుకుంటూ పోర్టబుల్ టీవీ కోసం భూలోక బాట పట్టారు నారదమూర్తి ఉరఫ్ నారదమహర్షి.
***** **శుభం** *****
(నేను రాసిన ఈ హాస్య కథ ఫిబ్రవరి 2023 హాస్యానందం మాసపత్రికలో ప్రచురితమైనది. ఎవరి మనోభావాలు కించపరచడానికి రాసింది కాదనీ, సరదాగా తీసుకొమ్మనీ సవినయ మనవి)