*****
(నేను రాసిన కథలలో నాకు చాలా నచ్చిన ఈ కథ ఆగస్టు 2022 హాస్యానందం అనే మాసపత్రికలో ప్రచురితమైంది)
*నేములో నేముంది*
==============
(హాస్య కథ )
రచన. ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
పెంటేష్, పైడుష్క దంపతులకు పెళ్లైన ఆరు సంవత్సరాల తర్వాత పుట్టిన అమ్మాయికి ఆ రోజు నామకరణం వేడుక జరుగుతోంది. బంధుమిత్రుల తాకిడితో ఇల్లంతా కోలాహలంగా ఉంది.
"ఇదిగో పెంటబాబూ, ముహూర్తానికి ఇంకో గంట టైముంది. పిల్లకి ఏం పేరు పెట్టాలో నిశ్చయించుకొన్నారా నాయనా ??" కొంచెం శాంతంగానే అడిగారు బక్కపంతులు గారు.
"ఒక్క పది నిమిషాలు గురువు గారూ, ఒకసారి అందరినీ అడిగి ఫైనల్ చేసేస్తాం !" పంతులు గారికి చెప్పి, ఏవో సాంప్రదాయాలు పేరిట పెద్దలు తమకు పెట్టిన పెంటయ్య, పైడమ్మ పేర్లలాంటి పేర్లు కాకుండా తమ బిడ్డకు ఓ మంచి వెరైటీ పేరు పెట్టాలని మనసులో అనుకుంటూ, బంధువులను తీసుకుని తమ గదిలోకి వెళ్లారు పెంటేష్, పైడుష్క దంపతులు ఉరఫ్ పెంటయ్య, పైడమ్మ.
***** ***** ***** *****
గదిలోకి వెళ్లి, తాము పెట్టదలచుకున్న పేరు ఏమిటో చెబుదామని నోరు తెరవబోతున్న పెంటేష్ తో,
"ఒరే, తమ్ముడూ, ఇంకా ఏ పేరు నిర్ణయం కాకపోతే, ఆడపిల్ల కాబట్టి నాన్న పేరు మాధవరావు కలిసొచ్చేలా "మాధవి" అని పెట్టారా !!" ఉచితంగా ఓ బోడి సలహా పడేసాడు బోడి బుర్ర గోక్కుంటూ పెద్దన్నయ్య.
"అలా కాదు కానీ , నేను చెబుతున్నా విను, అమ్మపేరు ఇంతవరకు ఎవరికీ పెట్టలేదు కాబట్టి "రుక్మిణి" అని పెట్టు ! ఇంకేం మాట్లాడకు" హూంకరిస్తూ చెప్పింది ఫైర్ బ్రాండ్ పెద్దక్క .
"ఒరే తమ్ముడూ, ఇలాగే అందరూ తలో పేరు, నీ తలలో ఎన్ని పేలు ఉన్నాయో అన్ని పేర్లు చెపుతారు కానీ, నా మాట విని, పిల్ల "టిమ్స్" హాస్పిటల్ లో పుట్టింది కాబట్టి ఆ పేరే పెట్టేయ్ " ఎర్ర తువ్వాలు భుజం మీద సవరించుకుటూ చెప్పాడు వామపక్ష భావాలు మెండుగా ఉన్న చిన్న అన్నయ్య.
"తమ్ముడూ, రాత్రి ఓ రెండు మూడు సార్లు పాము నా కలలోకి వచ్చిందిరా,ఎందుకైనా మంచిది ఆ పేరు కలిసేలా "నాగలక్ష్మి" అని పెట్టుకుంటే బావుంటుందేమో ఆలోచించు" పొడవాటి జడను పాములా ఆడిస్తూ చెప్పింది చిన్నక్క.
"మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి, సారీ, ఏం పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి, కానీ మా అమ్మ పేరు "నర్మద" కూడా కలపండి" పైకి పిడుగులు కురిపిస్తూ, లోలోపల ఉడికిపోతూ చెప్పింది పైడుష్క, పెంటేష్ భార్య,
"బావగారూ, నాదో సలహా ! మీరు ఉద్యగం చేస్తున్నది వన సంరక్షణ డిపార్టుమెంటులో కాబట్టి , ఆ పేరు కలిసేలా "వనజ" అని పెట్టండి. భేషుగ్గా ఉంటుంది" కొబ్బరి చెట్టులా అటూఇటూ ఊగుతూ చెప్పాడు, తాటిచెట్టులా ఎదిగిన బావమరిది.
"ఒరే అబ్బాయ్, నా పేరు పెట్టకపోయినా పరవాలేదు కానీ, నా మాట విని పిల్లకి "త్రివేణి" అని పేరు పెట్టారా, ఎందుకంటే క్రిందటేడాది అలహాబాద్ వెళ్లినపుడు ఆ త్రివేణి సంగమంలో స్నానం చేస్తూ త్వరలోనే మీకు సంతానం కలిగేలా అనుగ్రహించాలని మొక్కుకున్నాను "ముక్కు చీదుతూ చెప్పింది తల్లి రుక్మిణి.
"ఒరే పెంటాయ్, పిల్ల జాతకం చూసా. పిల్లది అగస్త్య ముని నక్షత్రం. అందువల్ల ఆయన భార్య "లోపాముద్ర" పేరు పిల్లకు పెట్టుకుంటే జాతకంలో ఏమైనా లోపాలుంటే పోతాయి" ఉచిత సలహా పడేసాడు జాతకాలు మీద బతికే మేనమామ, పంచాగం దుమ్ము దులుపుతూ.
"ఈ గొడవంతా ఎందుకు కానీ, వసంత ఋతువులో పుట్టింది కాబట్టి "వసంత" అని పెట్టయ్, ఏ గొడవ ఉండదు" నేనెందుకు తగ్గాలనట్టు తను కూడా ఓ పేరు తగిలించింది మేనత్త సుతిమెత్తగా.
ఈలోగా, బయటనుండి పంతులు గారు,
"ఏమర్రా, పైడీ పెంటలూ, పిల్లకి పేరు పెట్టడానికి ఇన్ని రోజులా ?? మీ వాటం చూస్తే, మీరు బయటికి వచ్చే సమయానికి పిల్లకి పెళ్లివయసు వచ్చేలా ఉంది" ఆరు ఊర్లకి వినిపెంచేటంత గట్టిగా అరిచారు ఊదితే ఎగిరిపోయేలా ఉండే బక్కపంతులు గారు.
"హమ్మయ్య, బక్కగా ఉన్నా, చక్కగా టైంకి ఆదుకున్నారు, లేకపోతే ఇంకా ఎన్ని పేర్లు వినాల్సివచ్చేదో" అని మనసులో అనుకుంటూ , హీటెక్కెన బుర్రతో గదిలోంచి బయటపడ్డాడు పెంటేష్.
***** ***** ****** *****
"పంతులుగారూ, ఆ చీటీలో ఏం పేరు రాసాడో, గట్టిగా చదివి వినిపించండి" కోరస్ గా అరిచారందరూ .
చీటీ చదివిన పంతులు గారి మొహం , డెంగ్యూ, బ్రెయిన్ ఫీవర్, చికెన్ గున్యా ఒకేసారి తగులుకున్న వాడిలా వాడి పోయి వేలాడిపోయింది.
"చూడు నాయనా ఏం పేరు పెట్టావో చెప్పి పుణ్యం కట్టుకో నాయనా ! అలా చూడు నాయనా, పాపం పంతులు గారి మొహం ఎలా పీక్కు పోయిందో ? ఇంకా ఆయన్ని హింస పెట్టడం సబబు కాదు నాయనా. ఆ పేరేదో నువ్వే చెప్పి తగలడు నాయనా. టెన్షన్ తో పోయేలా ఉన్నా నాయనా !!" గుమ్మడి తరహాలో పెద్దన్నయ్య వేడికోలు.
"అయితే, నేనే చెబుతున్నా జాగ్రత్తగా వినండి. మా అమ్మాయి పేరు 'మారుటినా నవత్రిలోవ' పిల్ల పేరు చల్లగా చెప్పాడు పెంటేష్.
"శభాష్, శభాష్, భలే పేరు పెట్టి నా పేరు నిలబెట్టేవురా తమ్ముడూ" అంటూ కళ్లు, పళ్లు బయటకి తన్నుకొచ్చేలా మొహం పెట్టి, ఎర్ర తువ్వాలుని గట్టిగా దులిపి భుజం మీద వేసుకొని చెప్పాడు చిన్న అన్నయ్య.
" ఏడిసావులే ఎర్రిసచ్చినోడా, అయినా అదేం పేరురా , ఇంకేమీ పేర్లు లేనట్లు ? ఆవిడ మా చిన్నప్పుడు కబాడీయో, గోటీబిల్లో ఆడేది. అయినా ఆ పెద్దావిడ పేరు పెట్టాలని నీకు ఎందుకు అనిపించింది ? అది తేలాలి ముందు. అలా ముంగిలా చూస్తావేం , సమాధానం చెప్పు ముందు" సూర్యకాంతం లెవెల్లో పెద్దక్క.
"నవత్రిలోవ అని కాకుండా, 'తలుపులమ్మ లోవ' అని పెట్టుకోలేక పోయావా, కొంచెం పుణ్యం అయినా వచ్చేది ! " ఛాయాదేవి రేంజు లో చిన్నక్క.
" సైలెన్స్.. కొంచెం సేపు మీరందరూ నిశ్శబ్ధంగా ఉంటారా ?? " అని గట్టిగా అరుస్తూ,
"చూడండి, నేను పెంటేష్ నే కానీ, మీరు అనుకున్నంత శుంఠేషును మాత్రం కాను. మీరనుకుంటున్నట్టు ఆ మారుటినా నవత్రిలోవ గారు ఎవరో నాకు తెలియదు. ఆవిడ అసలు పేరు అదోకాదో కూడా నాకు తెలియదు. మీ అందరినీ బాధ పెట్టడం ఇష్టంలేకే మీరు చెప్పిన విధంగానే పిల్లకి ఆ పేరు పెట్టా !!" వివరణ ఇచ్చాడు పెంటేష్.
"ఎట్టెట్టా, మా మాటకి గౌరవం ఇచ్చి, పిల్లకి ఆ పేరు పెట్టావా, ఎంత దొడ్డ మనసురా అయ్యా నీది ? ఏది ఆ పేరులో మేము సూచించిన ఒక్క పేరు చూపించు !!" రమణారెడ్డి టైపులో మేనమామ.
"అయితే వినండి. మీరు సూచించిన పేర్లు : మాధవి, రుక్మిణి, టిమ్స్, నాగలక్ష్మి, నర్మద, వనజ, త్రివేణి, లోపాముద్ర, వసంత. ఎవరినీ బాధపెట్టడం ఇష్టంలేక, ఆయా పేర్లలో మొదటి అక్షరం తీసుకుని పెడితే వచ్చిన పేరే 'మారుటినా నవత్రిలోవ'. అనుమానం ఉంటే మళ్లీ సరిచూసుకోండి" అంటూ చీటీని వాళ్ల ముందు పెట్టాడు పెంటేష్.
వెంటనే అందరూ పొలో మంటూ ఆ చీటీ మీద పడ్డారు, ఆ నేములో తాము చెప్పిన నేము లోని మొదటి అక్షరం ఉందో లేదో చూసుకోవడానికి.
***** ***** శుభం ***** *****