(నేను రాసిన ఈ హాస్య కథ హాస్యానందం అనే మాసపత్రికలో జూలై 2021 న ప్రచురితమైనది)
*శకునాల శంకర్రావు*
==============
(హాస్య కధ)
రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
సకినాల శంకర్రావు ఇల్లు ఎక్కడ అంటే ఆ ఊర్లో ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ శకునాల శంకర్రావు ఇల్లు అంటే చాలు సునాయాసంగా ఎక్కడో చెప్పేస్తారు.
***** ***** ***** *****
శంకర్రావుకి, ఇంటర్లో చిన్నమొక్కలా మొదలైన ఈ శకునాల సెంటిమెంట్ పిచ్చి, డిగ్రీలోకి వచ్చేటప్పటికి మహావృక్షంలా ఎదిగి పోయింది. ఆ శకునాల పిచ్చికి వాస్తు, మూఢనమ్మకాలు కూడా తోడయ్యాయి.
అవి ఎంతలా ముదిరిపోయాయంటే, అనకూడదు కానీ, వాష్ రూమ్ కి వెళ్ళడానికి వర్జ్యం, దుప్పటి కప్పుకోవడానికి దుర్ముహూర్తం, లైటు ఆర్పడానికి లగ్నం చూసుకొనేటంతగా !
డిగ్రీ రెండవ సంవత్సరం పరీక్షలు రాయడానికి వెళ్తే, పేపర్ మీద పెన్ను పెట్టే సమయానికి ఇన్విజిలేటర్ తుమ్మిందని, పరీక్ష మానేసి వచ్చేటంతగా !!
ఎలాగైతే నేం మొత్తం మీద డిగ్రీ పూర్తి చేసి, అదే ఊరిలో చిన్న ఉద్యోగంలో సెటిలయ్యాడు శంకర్రావు.
***** ***** ***** *****
ఆ రోజు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన కొడుకుతో,
"ఒరే శంకరం! ఈ రోజు నీకు ఓ పెళ్లి సంబంధం వచ్చిందిరా! అమ్మాయి బాగుంది. మన వీధిలోనే వాళ్ళ ఇల్లు. నువ్వు ఊ అంటే ఓ రెండు రోజుల్లో చూడ్డానికి వెళ్దాం" చెప్పింది అతని తల్లి సోదెమ్మ.
"అమ్మా, ఇప్పుడు రాహుకాలం నడుస్తోంది. తర్వాత మాట్లాడుకుందాం" పంచాంగం చూడకుండానే చెప్పాడు శంకర్రావు.
"నడుస్తున్నది రాహుకాలం కాదురా ! నీకు పొయ్యేకాలం. ఈ వయసులో ఈ చాదస్తం ఏమిట్రా ? శకునపక్షీ" అంటూ విసుక్కుంది తల్లి.
రెండు రోజుల తర్వాత ..
"ఏరా శంకరం , అమ్మ చెప్పిన సంబంధం గురించి ఏమాలోచించావు. నేను అన్ని వివరాలు సేకరించా. మనకు అన్ని విధాలా అనుకూలమైన సంబంధం. నువ్వు ఒప్పుకుంటే అమ్మాయిని చూడడానికి వెళ్దాం" కొడుకు శంకరాన్ని బతిమాలాడు తండ్రి నాంచారయ్య.
""సరే నాన్నా ! అలాగే వెళ్దాం. అవునూ! ఆ పెళ్లి వారిల్లు మన ఉంటున్న ఈ ఇంటికి ఏ వైపు ఉంటుంది ?" సందేహం వ్యక్తం చేసాడు శంకర్రావు.
"కుడి వైపు ఉంటుందిరా !" కొడుకు వైపు అనుమానంగా చూస్తూ చెప్పాడు తండ్రి.
"అబ్బే నాకు ఆ సంబంధం కుదరదు నాన్నా! ఎందుకంటే, నా జాతకం ప్రకారం నేను చేసుకోబోయే అమ్మాయి, నేను ఉంటున్న ఇంటికి ఎడమవైపు ఉన్న ఇంటి నుంచి రావాలి. కుడి వైపు నుంచి కాదు" ఏవో కూడికలు,తీసివేతలు వేళ్ళ మీద లెక్కించి చెప్పాడు శంకర్రావు.
కొడుకు ఆఫీసుకి వెళ్ళగానే,
"ఏమిటండీ వీడు ? పెళ్లి చేస్తే బాగుపడతాడు అనుకుంటే వీడిలా మాట్లాడుతున్నాడు?" బాధపడుతూ భర్తను అడిగింది సోదెమ్మ.
"చూద్దాం, కంగారు పడకు. ఏదో మార్గం ఆలోచిద్దాంలే" అంటూ ఆమెను సమాధాన పరిచాడు నాంచారయ్య.
***** ***** ***** *****
ఓ వారం తరువాత, ఎదురుగా ఉన్న ఓ ఖాళీ ఇంట్లోకి మారిపోయింది నాంచారయ్య కుటుంబం.
ఓ పది రోజుల తర్వాత..
"ఏరా శంకరం, మొన్న అమ్మ చెప్పిన సంబంధం గురించి ఏమాలోచించావు ?" కొడుకును అడిగాడు నాంచారయ్య.
"చెప్పాను కదా నాన్నా ! నా జాతకానికి అమ్మాయి ఎడమ వైపు ఉన్న ఇంటి నుంచి రావాలి, కుడి వైపు నుంచి కాదు అని?" అసహనంగా చెప్పాడు శంకర్రావు.
"ఔను నిజమే బాబూ ! కానీ, ఇప్పుడు మనం ఇల్లు మారేం కదా, అందుచేత అమ్మాయి ఎడమ వైపు ఉన్న ఇంటి నుంచే వస్తుంది" చల్లగా చెప్పేడు తండ్రి.
తండ్రి సమాధానంతో ఉక్కిరిబిక్కిరి అయ్యి, కిక్కురుమనకుండా పెళ్లికి సిద్ధమయ్యేడు శంకర్రావు.
***** ***** ***** *****
ఎందుకైనా మంచిదని శంకర్రావు తండ్రి, పెళ్ళి కూతురు రమకి, ఆమె తండ్రికి తన కొడుకు శకునాల పిచ్చి గురించి ముందే చెప్పడంతో, రెండు కుటుంబ పెద్దలు ఓ అంగీకారానికి వచ్చి నష్టనివారణ చర్యలు యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టారు.
పెళ్లిలో ఎవరు తుమ్మినా అది శంకర్రావుకు వినపడకుండా సన్నాయి మేళాన్ని అతని చెవి పక్కనే కూర్చుని వాయించి, అతని కర్ణభేరికి కన్నాలు పడేలా ఏర్పాటు చేసారు.
అంతే కాకుండా, పిల్లులను పట్టుకొనేవాళ్ళను రప్పించి, ఆ వివాహ మండపాన్ని మార్జాల రహిత ప్రదేశంగా తీర్చిదిద్దేరు.
ఆలాగే పంతులు గారు తన ముక్కు పొడెం డబ్బాను మూడు రోజులు పాటు బయటకు తీయకుండా కట్టుదిట్టం చేసారు.
ఇన్ని ఏర్పాట్లు చేయడంతో పెళ్లి బాగానే జరిగినా, శోభనం రోజున మాత్రం గొడవ పెట్టాడు శంకర్రావు.
గదిలోకి పెళ్ళికూతురిని తీసుకుని పేరంటాలు వస్తున్న సమయంలో, పంతులు గారు తన భుజం మీద ఉన్న తువ్వాలుని ఘాట్టిగా ఓ సారి ఝాడించి మళ్ళీ భుజం మీద వేసుకున్నారు.
ఆ ధాటికి ఎన్నో రోజులుగా ఆ తువ్వాలు మీద స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న కొన్ని ముక్కుపొడి రేణువులు వెళ్లి, పెళ్లి కూతురు మేనత్త ముక్కుపుటాలను ఆశ్రయించాయి.
ఆ దెబ్బకి ఆవిడ స్లాబులు కూలిపోయేంత గట్టిగా తుమ్మింది. అంతే! అంతవరకూ మంచం మీద గోతికాడ నక్కలా కూర్చున్న
శంకర్రావు ఒక్క ఉదుటున మంచం మీంచి
దూకి గది బయటకు వచ్చి పడ్డాడు.
"చూడు నాయనా ! మంచి ముహూర్తం. తుమ్ము, ఉమ్ము అంటూ ఈ ముహూర్తం వదులుకోకు" నచ్చచెప్పారు పంతులు గారు.
"చూడండి, పంతులు గారూ, మీరు' సకల శాస్త్ర ప్రవీణులు' అయివుండవచ్చు కానీ నేను :శకున శాస్త్ర ప్రవీణుడిని'. నాకు ఇలాంటి పట్టింపులు ఎక్కువ" అంటూ ఆ రోజును వాయిదా వేసాడు.
మర్నాడు రాత్రి మాత్రం పంతులు గారితో సహా అందరూ తుమ్ములు బయటకు రాకుండా మొహాలకు మాస్కులు కట్టుకుని, ఒకవేళ వచ్చినా, అవి శంకర్రావుకు చేరకుండా అతని చెవిలో (ముక్కులో కాదు) మాంఛి బలంగా దూది కుక్కి, మొత్తం మీద ఆ కార్యక్రమాన్ని మమ అనిపించేరు.
***** ***** ***** *****
పెళ్లి అయ్యి వేరే కాపురం పెట్టిన తర్వాత రమకి పూర్తిగా తెలిసొచ్చింది తన భర్త శంకర్రావు యొక్క శకునపక్షి చేష్టలు.
మొదటి రోజు, ఆఫీసుకి బయలుదేరే ముందు,
"ఇదిగో రమా! ఆ సందు చివర వరకూ వెళ్లి, ఆ పక్క సందుల్లోంచి ఎవరూ ఎదురు రాకుండా చూసి, నాకు ఎదురు రా ! " భార్యకు చెప్పాడు శంకర్రావు.
"ఆ చివర వరకూ ఎందుకండీ ? ఓ పది అడుగులు వెళ్లి, ఎదురు వస్తే సరిపోతుంది కదా?" అమాయకంగా అడిగింది రమ.
"నో నో, నా జాతకం ప్రకారం నాకు కనీసం ఓ వంద అడుగులు దూరంలో చెడు ఎదురు రాకూడదు" కరాకండీగా చెప్పాడు శంకర్రావు.
"అవునూ! అదేమిటండీ ఆ చెవుల్లో అలా రక్తాలు కారేలా గుడ్డలు కుక్కేసుకున్నారు ?" చెవి దగ్గరకు వెళ్లి చూసి, భయం భయంగా అడిగింది రమ.
"ఓ అదా ! ఎవరు తుమ్మినా నాకు వినపడ కుండా చేసుకున్న ఏర్పాట్లు. సరే కానీ, సందు చివరకు వెళ్ళి ఎదురు రా !!" అని చెప్పడంతో గతిలేక ఓ పది నిమిషాలు ట్రాఫిక్ కానిస్టేబుల్ అవతారం ఎత్తి, చివరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
***** ***** ***** *****
చాలా నెలలుగా శంకర్రావు శకునాల పిచ్చితో విసుగెత్తి, దీని నుంచి ఇతడిని ఎలా బయటపడేయాలా అని ఆలోచిస్తున్న రమకు ఓ రోజు చక్కటి అవకాశం వచ్చింది.
ఆ రోజు..
ఉదయం బాత్రూమ్ లో స్నానం చేస్తున్న శంకర్రావు సెల్ కు అతని కొలీగ్ గోపాలం నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ తీసిన రమ,
"హలో, అన్నయ్య గారూ, నేను రమని. ఆయన స్నానం చేస్తున్నారు. ఏమైనా చెప్పాలా ?""
"అవునమ్మా ! మూడు శుభవార్తలు. అవి ఏమిటంటే మీ ఆయనకు జీతం పెరిగింది, రెండవది ప్రమోషన్ వచ్చింది. మూడవది, ముఖ్యంగా మీ ఆయనను వేధిస్తున్న ఆ మేనేజర్ కు బదిలీ అయ్యింది. ఇప్పుడే హెడ్ ఆఫీసు వాళ్ళు నాకు ఫోన్ చేసారు" ఆనందంగా చెబుతున్నాడు గోపాలం.
ఆ మాటలు వింటున్న రమకు వెంటనే ఓ ఆలోచన వచ్చి,
"అన్నయ్య గారూ, నాకు ఓ సహాయం చేయాలి. మీరు ఈ విషయాన్ని మా ఆయనకు అప్పుడే చెప్పకండి. ఆఫీసుకి వచ్చిన ఓ గంట తరువాత చెప్పండి. ఇలా చేయడం వలన నన్ను రక్షించిన వారవుతారు. మిగతా విషయాలు తరువాత చెబుతాను" అంటూ రమ ప్రాధేయ పడడంతో
"ఔనా ? సరే అలాగేనమ్మా" అని ఫోన్ పెట్టేసాడు గోపాలం.
వెంటనే తన మొబైల్ తీసి, మూడిళ్ళు అవతల ఉన్న పార్వతికి ఫోన్ చేసి,
"అక్కా, నేను రమని. చిన్న సహాయం చేయాలి అక్కా ! ఏంటంటే, కొంచెం సేపట్లో మా ఆయన ఆఫీసుకు బయలుదేరే సమయంలో మీ పెంపుడు నల్లపిల్లిని ఆయనకు ఎదురు వచ్చేలా వదిలేయి. ఎందుకు ఏమిటి అనే విషయాలు తరువాత చెబుతాను. మరచిపోకు" అని బతిమాలడంతో ఆమె కూడా "సరే" అని ఫోన్ పెట్టేసింది.
రోజూలాగే ఆఫీసుకు బయలుదేరిన శంకర్రావుకు, రమ కంటే ముందు ఓ నల్లపిల్లి ఎదురొచ్చింది. బిత్తరపోయి చూసి, వెనక్కి రాబోతున్న శంకర్రావుకు, "ఓ సారి ఇంటి నుంచి బయలుదేరిన తరువాత తిరిగి వెనక్కి రాకూడదని శాస్త్రం చెబుతోంది" అని ధైర్యం చెప్పి, ఆఫీసుకు పంపించింది రమ.
***** ***** ***** *****
సాయంత్రం ఇంటికి వచ్చిన శంకర్రావు,
"రమా, ఈ రోజు మూడు శుభవార్తలు..." అంటూ ఆనందంగా చెప్పేడు.
"ఎంత మంచి వార్తలు చదివారండీ..సారీ.. చెప్పారండీ. అవునూ! మీకో విషయం తెలుసా ? ఈ రోజు మీకు శకునం వచ్చింది నేను కాదు. నల్లపిల్లి. అందుకే మంచి జరిగిందేమో ? నా మాట విని ఇప్పటి నుంచైనా ఆ శకునాల పిచ్చి తగ్గించుకోండీ" గారంగా చెప్పింది రమ.
"ఔను రమా, నిజమే సుమా ! నాకూ జ్ఞాపకం వచ్చింది. అయితే ఈ శకునాల గురించి ఇంకో సారి ఆలోచించాల్సిందే" అంటూ ఏదో ఆలోచిస్తూ చెప్పాడు శంకర్రావు.
తన పాచిక పారినందుకు ఆనందపడి పోయింది రమ.
***** ***** ***** *****
మర్నాడు సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చిన శంకర్రావు చంకలో ఉన్న రెండు నల్ల పిల్లులను చూసి బిక్కచచ్చిపోయింది రమ.
భార్య వైపు కృతజ్ఞతగా చూస్తూ,
"నిన్న నువ్వు చెప్పింది నిజమే రమా ! ఆ నల్లపిల్లి శకునం రావడం వలనే నాకు మూడు శుభవార్తలు తెలిసాయి. అందుకే వీటిని కొని తెచ్చా. రేపటి నుండి శకునం నువ్వు వద్దు, ఇవే రావాలి శకునంగా" ఆనందంగా చెప్పాడు శకునపక్షి.
"సరే కానీ, రెండు ఎందుకండీ ?" కొంచెం తేరుకున్న తరువాత అడిగింది రమ, మనసులో రగిలిపోతూ.
"అయ్యో వెర్రి రమా ! నిన్న ఒక పిల్లి శకునం వస్తేనే మూడు శుభవార్తలు విన్నాం. రేపటి నుండి ఈ రెండు పిల్లలు ఎదురొస్తే...ఇక పండగే పండగ..."
ఆనందంగా చెప్పుకుపోతున్న శకునాల శంకర్రావు మాటలు వినే స్థితిలో లేదు పాపం .....రమ.
ఆమె ఆలోచనల్లా మళ్లీ ఏ పథకం వేసి ఇతని శకునాల పిచ్చి మాన్పించాలా అని ?
**** ***** సమాప్తం ***** ****
(నేను రాసిన ఈ హాస్య కథ హాస్యానందం అనే మాసపత్రికలో జూలై 2021 న ప్రచురితమైనది)