సీరియల్ చూపులు

హాస్యానందం • 01 Dec 2020 • 👁 1 views
(నేను రాసిన ఈ హాస్య కథ హాస్యానందం
అనే మాసపత్రికలో డిసెంబర్ 2020 లో ప్రచురితమైనది)


*సీ 'రియల్ చూపులు*
=============
(హాస్యకధ)

రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్

ఆ రోజు పీకపాటి ఏకాంబరం ఇంట్లో అతని ఏకైక కుమార్తె పీకపాటి పావని ఉరఫ్ పీపాకి పెళ్లి చూపులు. దీపంలా చక్కటి రూపంలో ఉండే పావని, ఈ నాలుగేళ్ల నుంచి ఇంటి పట్టునే ఉండి, టీవీల్లో వచ్చే అన్ని సీరియల్సునూ చిరుతిళ్లు తింటూ విసుగూ విరామం లేకుండా చూస్తూ ఉండడం వలన నిజంగా పీపాలాగే తయారయ్యింది.

"ఎందుకు అలా 'సీతమ్మ వాకిట్లో సీమకుక్క' సీరియల్ లోని 'సీతయ్య' లా అటూ ఇటూ తిరుగుతున్నారు. లోపలకి తగలడండి. వచ్చిన పెళ్లి వారు, లోపలికి రాకుండా వెనక్కి పోతారా ఏమిటి?" సున్నితంగా భర్తను కేకలేసింది భార్య పీతాంబరి.

"ఎందుకు అలా 'నోరులేని ఆడది' సీరియల్ లోని 'గయ్యాళిపెళ్లాం' లా అరుస్తావ్? అది సరేకానీ, కనీసం ఈ పెళ్లిచూపులలోనైనా పిల్ల నోరు కొంచెం అదుపులో ఉండేలా చూడవే. నా బాధ అర్థం చెసుకోవే" పీతాంబరి ని బతిమాలాడు ఏకాంబరం.

"ఏమండీ, నేనేమీ 'చెప్పు కాటుకు కుక్క దెబ్బ' సీరియల్ లోని 'జోడమ్మని' ఏమీ కాను, అర్థంకాక పోవడానికి. దీని పెళ్లి చూపుల వ్యవహారం ఎప్పటికీ పూర్తికాని యావజ్జీవ సీరియల్ 'జిడ్డు మూకుడు' లా సాగుతోంది అని నేనూ బాధపడుతున్నాను" ఆందోళనగా చెప్పింది పీతాంబరి.

"ఔనౌను. 'శత శునక సందడి' సీరియల్ లోని 'డాగేశ్వరిలా' 105 సంబంధాలు ఇది తిరస్కరించింది. ఓ రెండు మటుకు దీని సీరియల్స్ పిచ్చి వినలేక పాపం వాళ్ళే వద్దనుకున్నారు. ఔనూ ! ఇంకా ఏం చేస్తోంది ఆ గదిలో? తెమలమను" కోటును సర్దుకుంటూ చెప్పాడు ఏకాంబరం.

"ఏం చేయడమేంటండీ? 'నాకు ఈ మొగుడొద్దు' అనే సీరియల్ చూస్తోంది. అది చూడడం మాట దేవుడు ఎరుగు ఆ పిచ్చి నాకు కూడా అంటించింది. కనీసం ఈ సంభందం అయినా కుదిరితే 108 సార్లు ఆయన చెప్పిన పూజలు చేయిస్తానని ఆ 'దీపం' టీవీలో వచ్చే 'పాపేశ్వర సిద్ధాంతి' గారికి ఫోన్ చేసి మరీ చెప్పానండీ" నేత చీర కుచ్చిళ్ళు సర్దుకుంటూ చెప్పింది పీతాంబరి.

***** ***** ***** *****

ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో పీపాను చూసుకోవడానికి వచ్చారు మగపెళ్లివారు. సన్నగా, గెడకర్రలా ఉండే పెళ్లికొడుకు మూరేళ్ల తరుణ్, తనతో పాటు గట్టిగా గాలి వేస్తే గగనంలోకి ఎగిరిపోయేంత బక్కపలచగాగా ఉన్న తండ్రి బలవర్ధనరావు, అలాగే బాబ్డ్ హెయిర్ తో ఉన్న తల్లి కేశవర్ధిని వెంటరాగా, ముక్కలకు మాస్కులతో, చేతులకు తొడుగులుతో వచ్చారు, అంతరిక్షం నుంచి ఊడిపడ్డ అతిథుల్లా!

శానిటైజర్ తో పరిశుద్ధ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత మొదలైంది పెళ్లి చూపుల తతంగం.

***** ***** ***** *****

పెళ్లికూతురుని తీసుకుని పీత నడకలా సాగుతున్న తెలుగు సీరియల్స్ లా నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది పీతాంబరి.

ఆమె చీరను చూసిన పెళ్లికొడుకు తల్లి,
"ఏమండీ ఒదిన గారూ! మీరు కట్టుకున్న ఆ నీలం చీర 'బక్కమొగుడు' సీరియల్ లో 'గజలక్ష్మి' కట్టినదేనా?" ముక్కు మీద ముసుగు తీసి అడిగింది కేశవర్ధిని.

"లేదు ఒదిన గారూ! ఇది 'అంగోస్త్రం' సీరియల్లో నాగాంబరి కట్టకున్నది. ఇది బొందనా సిస్టర్స్ షాపులో ఉంటే ముచ్చట పడి కొనుక్కున్నాను" మూతి మీద ముసుగు తొలగించి చెప్పింది పీతాంబరి, పెళ్లి కొడుకు తల్లి వరుస కలిపి పలకరించినందుకు మనసులో ఆనందపడుతూ.

"ఒదిన గారూ! నేను కట్టుకున్న ఈ చీర 'ముట్టుకుంటే ముష్టిచీర' ప్రోగ్రాం లో పాల్గొని గెలుచుకున్నది, తెలుసా? " గొప్పగా చెప్పింది కేశవర్ధిని, తన చీరను చూపిస్తూ.

"ఔనా! మా అమ్మాయి పావని కూడా ఇలాగే 'తీసుకుంటే తుండుగుడ్డ' ప్రోగ్రాం లో పాల్గొని ఓ గుడ్డముక్క తెచ్చుకుంది" కూతురు గురించి నోరు జారింది పీతాంబరి.

"అబ్బో, ఇంకేం! అయితే మీ అమ్మాయి టీవీ ప్రోగ్రాములు బాగానే ఫాలో అవుతుందన్న మాట" సందేహాన్ని వ్యక్తం చేసింది కేశవర్ధిని.

"ఔనండీ, నేను ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేవరకూ....."మూతి ముసుగు తీసి చెప్పబోతున్న పావని మూతికి మళ్లీ గుడ్డ బిగించిన ఏకాంబరం, "అమ్మ చెబుతుంది కదా! అ. మ్మ.. చె బు తుం ది" అంటూ కూతురికి సర్ది చెప్పాడు.

"ఔనండీ ఒదిన గారూ! మా పావని టీవీల్లో వచ్చే ఏ సీరియల్ కూడా వదలదు. అంతెందుకు మా బంధువులు ఎవరైనా ఏ సీరియల్ అయినా చూడడం మిస్ అయితే మా అమ్మాయినే అడుగుతారంటే నమ్మండి" కూతురు గుట్టు విప్పేసిన పీతాంబరి వైపు కోపంతో తినేసేలా చూసాడు ఏకాంబరం.

"అబ్బో, అయితే మంచి అభిరుచే మీ అమ్మాయిది. ఔనూ మరి మా అన్నయ్య గారికి లేదా ఈ సీరియల్స్ పిచ్చి?" " ఏకాంబరాన్ని ఉద్దేశించి అడిగింది కేశవర్ధిని.

"ఆయనా, మా అత్తగారు కూడా అసలు టీవీకి ఆమడదూరంలో ఉంటారు ఒదిన గారూ! అందుకే మా పావనికీ ఆయనకూ రోజూ ముష్టీవీ యుద్ధాలే అంటే నమ్మండి. ఔనూ మరి మా అన్నయ్య గారికి ఉందా ఒదిన గారూ! ఈ టీవీ పిచ్చి?" బలవర్ధన రావు ను ఉద్దేశించి అడిగింది పీతాంబరి.

"అయ్యో! లేకేం వదినగారూ, మొన్ననే "అడుక్కుంటే భిక్ష' పోటీలో పాల్గొని పదో బహుమతి అడుక్కొచ్చారు" గర్వంగా చెప్పింది కేశవర్ధిని.

అత్తగారూ, మావగారూ కూడా టీవీ పిచ్చోళ్లు అన్న విషయం తెలియగానే, ఆనందంతో ఉబ్బి రెండింతలైన పీపా,
"మరి మీ అబ్బాయి తరుణ్ టీవీలో ఏ ఏ ప్రోగ్రాంలు చూస్తారు ఆంటీ" అంటూ నాసికావస్త్రాన్ని తొలగించి గట్టిగా అడిగింది పావని.

"అబ్బే! మా తరుణ్ కి సీరియల్స్ చూడడం అంటే మా చెడ్డ చిరాకు" అని కేశవర్ధిని చెప్పిందో లేదో, వెంటనే,

"నో! సీరియల్స్ ని సీరియస్ గా తీసుకోని ఈ పెళ్లి కొడుకు నాకొద్దు" అంటూ మూతికి ఉన్న మాస్కును విసురుగా నేలకేసి కొట్టి, ఒక్క గెంతు గెంతి తన గదిలోకి వచ్చి పడింది పావని. హాలులో ఓ మంచం మీద కూర్చొని ఈ తతంగం చూస్తున్న ఏకాంబరం ముసలి తల్లి 108 వ సారి బుగ్గలు నొక్కకుంది, ఎప్పటిలాగే ఆశ్చర్య పోతూ.

అంతే, వెంటనే యధాప్రకారం కోటు బొత్తాలు తెంపేసుకోవడానికి సమాయత్తం అయ్యాడు ఏకాంబరం భార్య వైపు తినేసేలా చూస్తూ.

ఈలోగా

"ఎందుకు అలా "గెంతితే తంతా" సీరియల్ లో గొంతెమ్మ లా గెంతుతూ వెళ్లపోయింది మీ అమ్మాయి?" హాశ్చర్యపోతూ అడిగింది పెళ్లికొడుకు తల్లి.

"ఎందుకేమిటి తల్లీ! మా అమ్మాయికి టీవీ సీరియల్స్ పిచ్చి. ఆ పిచ్చి లేని వాళ్లని ఇది చేసుకోదుట. దీని పెళ్లి చూపులు సీరీస్ లో మీది 108వ ఎపిసోడ్" ఉడికిపోతూ చెప్పాడు ఏకాంబరం, కోటు బొత్తాలు ఊడదీసుకుంటూ.

"ఓస్. అంతేనా! ఏదో అనుకున్నా! ఇంకేం మరి గంతకు తగ్గ బొంత దొరికింది. మా అబ్బాయికి సీరియల్స్ చూడడం చిరాకు అన్నా కానీ, తీయడం చిరాకు అని చెప్పలేదుగా" అసలు విషయం చెప్పింది కేశవర్ధిని.

అంతే, ఆ మాట విని, ఆనందంతో గోడకు చెవులు ఆనించింది పావని. తను చేస్తున్న పనికి తాత్కాలిక విశ్రాంతి ఇచ్చాడు ఏకాంబరం.

"ఏమిటి ఒదిన గారూ! మీరు అంటున్నది? అబ్బాయి సీరియల్స్ తీస్తాడా? " తరతరాలుగా సాగుతున్న ఓ సీరియల్ ఆ రోజుతో షడన్ గా అయిపోతే ఎంత ఆశ్చర్య పోతారో, అంత ఆశ్చర్యం గానూ అడిగింది పీతాంబరి.

"ఆశ్చర్యపోకండి. మీరు విన్నది నిజమే. మూతశ్రీ పేరుతో సీరియల్స్ నిర్మించేది మా తరుణే. అయితే వాడు తీసిన సీరియల్స్ పేర్లు చెబితే ఎవరూ పిల్లని ఇవ్వడం లేదు. అందుకే మీకు ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డాం" పెళ్లి కొడుకు వంక చూస్తూ చెప్పింది తల్లి.

ఈ విషయం విన్న పావని ఒక్క గెంతులో హాల్లోకి వచ్చి, పెళ్లికొడుకు ఎదురుగా నిలబడి,

"మూత గారూ! మూత గారూ! మీరు తీసిన ఆ సీరియల్స్ పేర్లు చెప్పరా ? ప్లీజ్" అడిగింది గారంగా.

"అవి , మొన్నటి వరకూ "గండం టీవీలో" ప్రసారం అయిన "పెటాకులైన పెళ్లి",
"చావుకొచ్చిన కళ్యాణం" సీరియల్సూ, ప్రస్తుతం "రక్తి టీవీలో" వస్తున్న "పెళ్లాం కంటే దెయ్యం నయం" "విడాకులంటే మోజు" సీరియల్స్ కూడా నేను నిర్మించినవే" గర్వంగా చెప్పాడు తరుణ్.

ఈ సీరియల్స్ పేర్లు విన్న పావని బామ్మ, మూతికి కట్టిన గుడ్డను, తలమీద చీరను సవరదీసుకుంటూ, "శివ శివా" అంటూ గట్టిగా అరిచింది.

"అది డబ్బింగ్ సీరియల్ మామ్మగారూ! నేను తీయలేదు" అంటూ చెప్పాడు పెళ్లి కొడుకు.

వెంటనే బామ్మ ,"ఏం మాట్లాడితే ఏం ప్రమాదమో?" అని మూతికి గుడ్డ బిగించుకుంది.

"నాన్నా! ఇలాంటి పెళ్లి కొడుకు దొరకడం నెవ్వర్ బిఫోరూ ఎవ్వర్ ఆఫ్టరూ. నాకు ఈయన తెగ నచ్చేసారు దేవుడోయ్" అంటూ తరుణ్ మీద పడబోయింది పావని.

వెంటనే తరుణ్ కూడా "నాన్నా! ఈ అమ్మాయి విషయంలో నాదీ సేమ్ డైలాగ్" అంటూ ఆమెను పొదివి పట్టుకున్నాడు.

అప్పుడే రంగప్రవేశం చేసిన పంతులుగారు,
"ఇంకేం 'రూపులు కలిసిన ఋజువేల?' సీరియల్లో లాగా వీళ్ల అభిప్రాయాలు కలిసేయ్. మరెందుకు ఆలశ్యం? ఇవి మంచి ఘడియలు. తాంబూలాలు మార్చేసుకోండి" అన్నారు రెట్టించిన ఉత్సాహంతో.

"ఆగండి" అంటూ ఘర్జించిన పావని అరుపుతో అంతా ఒక్కసారి ఉలిక్కిపడి, మళ్ళీ ఆమె వైపు చూసారు, మళ్లీ ఏం తేడా కొట్టిందిరా భగవంతుడా? అనుకుంటూ.

"కంగారు పడకండి. పెళ్లి ముహూర్తం మటుకు రాత్రి పన్నెండు గంటల తర్వాత ఉండాలి, నా సీరియల్స్ కు ఆటంకం లేకుండా" అంది సీరియస్ గా పావని.

తర్వాత ఎటువంటి ఆటంకాలు లేకుండా పెళ్లి తాంబూలాలు పుచ్చుకున్నారు ఇరు కుటుంబాలు.

"అయ్యా! కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. మరి నాకు సంభావణ ఇప్పిస్తే బయలుదేరుతా, నా ఫేవరేట్ టీవీ సీరియల్ వచ్చే టైం అవుతోంది" అన్నారు పంతులు గారు.

"ఏవిటీ! మీరూ సీరియల్స్ చూస్తారా ? ఏ సీరియల్ చూస్తారు?" ఆశ్చర్యంగా అడిగాడు మూతశ్రీ.

"నేను 'పిండం' టీవీలో వచ్చే 'పెద్దదినం' సీరియల్ మటుకు ప్రతిరోజూ తప్పకుండా చూస్తాను బాబూ!" చెప్పారు ముక్కు పొడి పీలుస్తూ.

"అలాగా! త్వరలో 'తర్పణం' టీవీలో రాబోతున్న నేను తీస్తున్న కొత్త సీరియల్ 'శవయాత్ర' తప్పకుండా చూడండి" రాబోయే సీరియల్ కి అప్పుడే పబ్లిసిటీ మొదలెట్టాడు మూతశ్రీ, కాబోయే భార్య పీపా తన వంక ఆరాధనా భావంతో చూస్తుండగా!

"శుభ కార్యంలో చావు కబుర్లు ఏమిటర్రా?" అంటూ మనసులో సణుక్కుంది బామ్మ, పైకి అంటే ఆ పేరుతో కొత్త అల్లుడు ఎక్కడ ఓ సీరియల్ తీసేస్తాడో అనే భయంతో.

"కొంచెం ఆలశ్యమైనా మా పీపా కి సరైన మూత దొరికింది" అని ఏకాంబరం, పీతాంబరీలు
అలాగే,
"మా మూతకు సరిపడే పీపా దొరికింది" అని కేశవర్ధిని, బలవర్ధన రావులూ ఒకేసారి
అనుకున్నారు మనసులో.

** సమాప్తం **