*****
*మీ మాటే నా నోట*
==============
(హాస్య కథ)
(నేను వ్రాసిన ఈ కథ "హాస్యానందం" మాసపత్రికలో మార్చి 2020 లో ప్రచురితమైనది)
రచన :: బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
"ఏవండీ, లేవండీ ! ఇంకో రెండు మూడు గంటల్లో అమ్మా, నాన్నా వస్తున్నారుట . రాత్రి కారులో బయలుదేరేరుట. ఓ వారం రోజులు ఉండేలా వస్తున్నారుట. పెందరాలే తెమిలి కొంచెం బియ్యం, కూరలు తీసుకురండి" చెప్పాల్సింది బుల్లెట్ ట్రైన్ కంటా వేగంగా చెప్పేసింది లావణ్య వాసవి.
భార్య మాటలను విని, పొద్దున్నే చావు కబురు విన్నవాడిలా మొహం పెట్టాడు జీమూత వాహనుడు. ఏడుపు పైకి కనపడనీయకుండా , భార్యను...
"మరి ఇంతవరకూ నాకెందుకు చెప్పలేదు ?" అడిగాడు జీ.వా.
"మీరు అప్పటికే పడుకున్నారు. రాత్రి పన్నెండు గంటలకి వచ్చింది ఫోన్. ఉదయం చెప్పొచ్చు అని ఊరుకున్నానండీ. అయినా, అమ్మా నాన్న అంటే మీకెందుకండీ అంత కోపం ? సరేకానీ, కొంచెం ఆ మొహానికి నవ్వు రాసుకుని, త్వరగా లేచి మార్కెట్ కి వెళ్ళండి, ప్లీజ్ " గారంగా చెప్పింది లా.వా.
**** ***** ****** *****
"లావా అలా అంటుంది కానీ, నాకు కోపం రాకుండా ఎలా ఉంటుంది ? కిందటేడాది ఇలాగే మా అమ్మా, నాన్న ఓ నాలుగు రోజులు ఉందామని వస్తే , బొగ్గు ఇంజన్ లా మొహం మాడ్చేసుకుంది.
అంతకీ తను చాలా సార్లు చెప్పాడు మీ వాళ్ళు, మా వాళ్ళు అన్న బేధం ఉండకూడదని. అయినా మళ్లీ మాములే !!
ఇప్పుడు వాళ్ల అమ్మా, నాన్న వస్తున్నారనగానే మొహం మెట్రోరైలు లా తళతళ లాడిపోతోంది. క్రితం సారి ఇలాగే ఓ వారం అని చెప్పి వచ్చి ఏకంగా ఓ నెళ్లాళ్ల పాటు పాతుకుపోయారు.
ఈ సారి వారం కాదు కదా, కేవలం నాలుగు రోజుల్లోనే జెండా ఎత్తేసాలా చేస్తా చూడు"
అని మనసులో తిట్టుకుంటూ పాసెంజర్ రైలులా నెమ్మదిగా సైకిల్ తొక్కుకుంటూ మార్కెట్ కు బయలు దేరాడు జీవా.
....****** ******* *******
"ఏమోయ్, అర్జెంటుగా, ఓ కిలో ముదర బెండకాయలు, ఓ కేజీ పుచ్చు వంకాయలు, ఓ కేజీ కుళ్లిపోయిన టమోటాలు ఇవ్వవోయ్" కూరగాయల వాడికి చెప్పేడు జీవా.
"ఏటిబాబూ, అత్తారోళ్లు ఒత్తున్నారా ?" అనుమానంగా అడిగాడు కూ.వా.
"నీ కెందుకొచ్చిందోయ్ ఆ అనుమానం ?" ....అసహనంతో జీవా.
"అబ్బే, మా అత్తారోళ్లు వస్తే నేనిలాగే సేత్తానండీ"...అసలు రహస్యం చెప్పాడు కూవా.
ఓ వెర్రి నవ్వు నవ్వి కూరలు తీసుకుని బయటికి వచ్చేసాడు జీవా.
****** ******* ******
"బాబూ, పురుగులు పట్టిన బియ్యం ఓ ఇరవై కేజీలు ఇవ్వవోయ్" షాపు వాడిని అడిగాడు జీవా.
"ఏంటి సార్, అత్తగారి తరపు బంధువులు ఎవరైనా ఎక్కువ రోజులు తిష్టవేయడానికి వస్తున్నారా ?" అడిగాడు షా.వా.
"అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగేవోయ్ ??" అడిగాడు జీ. వా.
"ఇప్పుడే ఒకాయన ఇదే కారణం చెప్పి ఓ 50 కేజీల బియ్యం పట్టుకెళ్లేడులెండి !!" అసలు విషయం చెప్పాడు షా.వా.
రెండో సారి కూడా ఓ వెర్రి నవ్వే నవ్వి బియ్యం తీసుకున్నాడు జీవా.
సరుకులు సైకిల్ కి కట్టుకుని గూడ్స్ రైలులా భారంగా ఇంటిమొహం పట్టేడు జీవా.
****** ****** ******
సందు మొదలు వరకూ గూడ్స్ రైలు లాగ నెమ్మదిగా వచ్చి, లావా కి అనుమానం రాకుండా, అక్కడి నుంచి ఇంటికి రాజధాని ఎక్సెప్రెస్ లా వేగంగా చేరుకున్న జీవా, ముందు గదిలో సోఫాలో కూర్చుని కాఫీలు తాగుతున్న తన తల్లిదండ్రులు గోపాద వామనరావు, రాగ వాహిణులను చూసి కీచుమంటూ కాళ్లకు సడన్ బ్రేక్ వేసి, "నాన్నా, అమ్మా మీరెప్పుడు వచ్చారు?" కీచు గొంతుకతో అడిగాడు జీవా.
"అదా ? ఆ రేవా గాడు అదేరా ఆ రేవాడ వాసు గాడు నిన్న రాత్రి ఫోన్ చేసి 'అన్నా కారులో నేనొక్కడినే హైదరాబాద్ వెళ్తున్నా, సరదాగా వస్తారా' అని అడిగాడు. నీకు తెలుసుగా మాకు దూర ప్రయాణాలు అంటే ఇష్టమని ! అందుకే వెంటనే బయలుదేరి వచ్చేసాము" వివరంగా చెప్పాడు గోవా.
"అయితే, .....ఓరే 'జీవా' ! రాత్రి నేనూ, 'గోవా ' కలసి 'రేవా' కారులో వస్తున్నామని 'లావా' నీకు చెప్పలేదా ?" అడిగింది 'రావా'.
"చెప్పేను అత్తయ్య గారూ ! మీరొస్తున్నారనే సామానులు తేవడానికి వెళ్లి వస్తున్నారు" కనపడకుండా వినబడే రైలు అనౌన్స్ మెంట్ లా కిచెన్ లోంచి కూసింది లావా.
తిరిగి వేగం పుంజుకున్న రాజధాని ఎక్స్ ప్రెస్ అదే స్పీడ్ తో కిచన్ లోకి వెళ్లి,
" ఏంటి లావా! మీ అమ్మ నాన్న వస్తున్నారన్నావ్ ? తీరా చూస్తే మా వాళ్ళు ???" మాడిపోయిన మొహంతో అడిగాడు జీవా.
"ఏవండీ, అప్పుడే మర్చిపోయారా ? మొన్న మీరేమన్నారు ? అమ్మా నాన్నల విషయంలో నీ, నా బేధాలు ఉండ కూడదని! పొద్దున్న నేనేం చెప్పేను ? అమ్మా నాన్న వస్తున్నారు అన్నా కానీ, మా అమ్మా నాన్నా అని చెప్పలేదు. పాపం మీరే ఏం ఊహించుకున్నారో ? కావాలంటే రివర్స్ గేర్ వేసుకుని పొద్దున్న ఏం చెప్పానో గుర్తు చేసుకోండి" బుస్ మంటూ జీవా మీదకి లావాని వెదజల్లింది లావా.
రివర్స్ గేర్ వేసుకుని చూసి, తప్పు తనదే అని తెలుసుకున్న జీవా,......
"సరే, ఇందాక వెళ్లినప్పుడు మార్కెట్లోకి ఇంకా మంచి సరుకులు రాలేదు , ఓ గంట తరువాత రండి మంచివి వస్తాయి అన్నారు అందుకని మళ్లీ ఓ సారి మార్కెట్ కి వెళ్లి ...." ఏదో చెప్పబోయేడు జీవా.
"అవసరం లేదు. వాళ్లకి ఈ సరుకులు చాలు. ఇలాంటి సరుకులతో వండింది తింటేనే రెండు రోజులు ఉండి వెళ్తారు, లేకపోతే ఇక్కడే తిష్టవేసేస్తారు......" రైలు ఇంజన్ లోని స్టీమ్ అంతా ఒక్క సారి వదిలినట్టు కయ్యి మంటూ మీదపడిపోయిన లావా ని చూసి జావ గారిపోయాడు జీవా.
**** *శుభం* *****