*****
"అతిభద్ర.... మహారౌద్ర"
===============
(హాస్య కథ)
(నేను రాసిన ఈ హాస్య కథ హాస్యానందం మాస పత్రికలో ఫిబ్రవరి 2020లో ప్రచురితమైనది)
రచన :: బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్
"చూడండి కానిస్టేబుల్ మహారౌద్ర గారూ! మీరు ఈ అతిభద్ర గారిని వారి హెల్మెట్ తోనే వారి బుర్ర మీద కొట్టి తీవ్రంగా గాయపరిచారని మీ మీద అభియోగం. ఆ విషయమై మీరేదైనా చెప్పదలచుకున్నారా ??" అడిగారు జడ్జి గారు.
"ఏదో ఆవేశంలో అలా జరిగిపోయింది అంతే సార్ !!" బావురుమన్నాడు మహారౌద్ర.
"అంటే ఆ సమయంలో మీ మానసిక స్థితి బాగాలేక, అంటే ఐ మీన్, ఏదో పిచ్చి ఎక్కినట్లు హెల్మెట్ తో బాదేసారా ??" అనుమానంగా అడిగారు జడ్జి గారు.
"అయ్యయ్యో, అదేం లేదు సార్, ఆరోగ్యం బాగానే వుంది సార్ ఆ టైంలో, ఎటొచ్చీ నా టైమే బాగాలేదు ఆ టైమ్ లో !!"
"అసలు ఆ రోజు ఏం జరిగిందో పూర్తిగా ఈ కోర్టుకు వివరించండి"
"తప్పకుండా సార్..." అంటూ చెప్పడం మొదలెట్టాడు మహారౌద్ర.
***** ***** ***** *****
"సార్, ఆ రోజు పబ్లిక్ గార్డెన్స్ దగ్గర వాహనాలు తణిఖీ చేస్తున్నాం సార్. ఈ లోగా ఈ అతిభద్ర గారు యాక్టివా బండిమీద వస్తున్నారు. వారిని ఆపి, బండికి సంబంధించిన కాగితాలు చూపించమన్నాను. అప్పుడు ఈయన స్కూటర్ పక్కకి తీసి.....
స్కూటర్ ఇంజను ఆపారు సార్..
తలమీంచి హెల్మెట్ తీసారు సార్..
స్కూటర్ స్టాండు వేసారు సార్..
స్కూటర్ నుండి తాళం తీసారు సార్..
ఆ తాళంతో సీటు తెరిచారు సార్...
అందులోంచి లెదర్ బేగ్ తీసారు సార్...
తర్వాత సీటు మూసారు సార్....
తర్వాత లెదర్ బేగ్ తెరిచారు సార్....
అందులోంచి ఓ ప్లాస్టిక్ కవర్ తీసారు సార్ ...
కవర్ కున్న రబ్బరు బాండ్ పీకారు సార్........
....సరే, మీరు కాగితాలు తీసి ఉంచండి, ఈలోగా పక్క బండి కాగితాలు చెక్ చేసి వస్తా" అని ఇంకో బండి వద్దకు వెళ్ళి వాళ్ల కాగితాలు చెక్ చేస్తూ, ఎందుకైనా మంచిదని ఈయన మీద ఓ కన్నేసి ఉంచేను సార్. నేను అలా తిరగ్గానే, ఈ అతిబద్రం గారు..
మళ్లీ ప్లాస్టిక్ కవర్ తీసారు సార్...
దానికి రబ్బరు బాండ్ వేసేరు సార్.....
మళ్లీ లెదర్ బేగ్ తెరిచారు సార్...
అందులో ప్లాస్టిక్ కవర్ పెట్టారు సార్....
సీటు తీసారు సార్....
లెదర్ బేగ్ అందులో పెట్టారు సార్.....
మళ్లీ సీటు మూసేరు సార్......
సీటుకు తాళం వేసేరు సార్....
స్కూటర్ స్టాండ్ తీసేరు సార్.....
తలకు హెల్మెట్ ధరించారు సార్......
స్కూటర్ ఇంజను స్టార్ట్ చేశారు సార్....
వెంటనే, నాకు అనుమానం వచ్చి, ఏయ్, ఎక్కడికి పోతున్నావు ? కాగితాలు తీసి చూపించు లేకపోతే బండిని సీజ్ చేస్తా, అని గదమాయించేను సార్. వెంటనే ఈయన .......
స్కూటర్ ఇంజను ఆపేరు సార్...
తలమీంచి హెల్మెట్ తీసారు సార్.....
స్కూటర్ స్టాండు వేసారు సార్.....
స్కూటర్ నుండి తాళం తీసేరు సార్.....
ఆ తాళంతో సీటు తెరిచారు సార్.....
అందులోంచి లెదర్ బేగ్ తీసారు సార్.....
తర్వాత సీటు మూసారు సార్.....
లెదర్ బేగ్ తెరిచారు సార్....
అందులోంచి ప్లాస్టిక్ కవర్ తీసారు సార్.....
కవర్ కున్న రబ్బరు బాండ్ పీకేరు సార్.....
అందులోంచి కాగితాల కట్ట తీసారు సార్.....
..అన్ని కాగితాలూ నాకు అవసరం లేదు, అర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కాగితాలు తీసిఉంచు ఈలోగా ఇంకో బండి కాగితాలు చెక్ చేసి వస్తా" అని ఇంకో బండి వద్దకు వెళ్ళి వాళ్ల కాగితాలు చెక్ చేస్తూ, ఎందుకైనా మంచిదని ఈయన మీద ఓ కన్నేసి ఉంచేను సార్. నేను అలా తిరగ్గానే, ఈ అతిబద్రం గారు..
మళ్లీ ప్లాస్టిక్ కవర్ తీసారు సార్...
దాంట్లో కాగితాల కట్ట పెట్టారు సార్....
దానికి రబ్బరు బాండ్ వేసేరు సార్....
లెదర్ బేగ్ తెరిచారు సార్....
అందులో ప్లాస్టిక్ కవర్ పెట్టారు సార్....
సీటు తీసారు సార్....
దాంట్లో లెదర్ బేగ్ పెట్టారు సార్....
మళ్లీ సీటు మూసేరు.....
అంటూ చెప్పుకుంటూ పోతున్న మహారౌద్ర తో,
"ఏయ్, ఏమిటయ్యా, చెప్పిందే చెప్పి నాకు పిచ్చెక్కించేస్తున్నావ్" పిచ్చెక్కినట్టు అరిచారు జడ్జి గారు.
"చూసారా సార్, మరి వింటున్న మీకే ఇంత పిచ్చెక్కిపోతే కళ్లారా చూసిన నాకు ఎంత పిచ్చెక్కి ఉండాలి ?? అందుకే సార్, హెల్మెట్ తో బుర్ర మీద రెండు పీకులు పీకేను " శాంతంగా చెప్పాడు మహారౌద్ర.
కోర్టు హాలంతా ఘొళ్లుమన్న నవ్వులతో నిండి పోయింది ఆయన మాటలకు.
"సైలెన్స్... సైలెన్స్...." అంటూ పిచ్చెక్కినట్లు అరుస్తూ ..
చేతిలో ఉన్న సుత్తితో
బల్గ మీద కొట్టబోయి
బుర్ర మీద కొట్టేసుకున్నారు జడ్జి గారు.
ఆ దెబ్బకి
ఆ బుర్ర వాచిపోయింది
ఈ కేసు వీగిపోయింది.
****** శుభం ******